"స్వీటు తీసుకో ఆంటీ! వీక్లీలో నీ నవలను సాధారణ ప్రచురణ అంగీకరించిన జాబితాలో చూశాను..." అంది ఠక్కున.
"ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు? ఏ పెత్తనాలు వెలగబెట్టావు?" గర్జిస్తున్నట్టు అడిగింది.
సాహితి అన్నింటికీ సిద్ధమయినట్టు క్షణం మౌనం వహించింది.
ఆమె నుంచి వెంటనే సమాధానం రాకపోవడంతో బిందుమాధవి ఆమె మీద మరింత విరుచుకుపడింది.
"ఏమే! సమ్రాట్ దగ్గరకు వెళ్ళావు కదూ?"
"అబ్బే! నేను వెళ్ళలేదు ఆంటీ...అయినా అతని దగ్గరకు నేనెందుకు వెళతాను? ఆ ఆలోచన నీకెందుకొచ్చింది?"
"ఇంకా నన్నెందుకు మభ్యపెడతావే? సమ్రాట్ నవలకు మొదటి బహుమతి వచ్చిందని అందరికీ స్వీట్లు పంచుతున్నావు కదూ! వాడొక మహా రచయిత, నువ్వొక గొప్ప అభిమానివి! హూ!" బిందుమాధవి అప్పటిదాకా తిరగేస్తున్న వార పత్రికను ఆవేశంగా నేలకేసి విసిరికొట్టింది.
"నేను నా క్లాస్ మేట్స్ గౌతమి, కళ్యాణితో కలసి సినిమా కెళ్ళాను. వస్తూ దారిలో కొత్త వార పత్రిక చూశాను. అందులో నీ నవల గురించి తెలుసుకొని స్వీట్లు కొనుక్కొచ్చాను తప్పా?.... రుజువు కావాలంటే కళ్యాణితో మాట్లాడు" అంటూ ఫోన్ తీసి డయల్ చేసి రిసీవరును బిందుమాధవి చేతిలో పెట్టింది.
ఆమె మారు మాట్లాడకుండా ఠక్కున రిసీవరు పెట్టేసింది. "పెళ్లి కాని పిల్లవు. ఇంట్లో చెప్పా పెట్టకుండా సినిమాలు, షికార్లు ఏమిటి? ఇకనుంచి ఇలా చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళినా, ఇంటికి ఆలస్యంగా వచ్చినా చదువు మానిపించి పెళ్లి చేసేస్తాను జాగ్రత్త!..." హెచ్చరించింది.
ఇప్పుడు తనేం తప్పుచేసిందని చదువు మానిపిస్తానంటున్నది?
అయినా తన విషయంలో బిందుమాధవి ఎక్కువగా కల్పించుకుంటున్నది. విషయం అందాకా వస్తే ఏం చేయాలో తనలో తాను గొణుక్కుంటూ గదిలోకి వెళ్ళి విసురుగా తలుపు వేసేసుకుంది సాహితి.
* * * *
పసుప్పచ్చని మేని ఛాయలో ఉన్న సాహితికి నీలం రంగు పట్టుచీర మరింత అందాన్ని తెచ్చిపెట్టింది.
పెళ్ళికూతురుకు చేసే అలంకరణలా బుగ్గన చుక్క మినహాయిస్తే దాదాపు అన్నిరకాల ఆభరణాలూ పెట్టుకుంది.
ఎన్నడూ లేనిది ఇవాళ అంత అలంకరణతో కాలేజీకి ఎందుకు వెళుతున్నదో బిందుమాధవికి అర్థంకాలేదు.
కాలేజీ వేళకు పావుగంట ముందు మాత్రమే బయలుదేరే సాహితి ఇవాళ ఇంత ముందుగా ఎందుకు బయలుదేరుతున్నదోనని ఆలోచిస్తున్నది ఆమె.
ఆమె ఆలోచనలను చెదరగొడుతూ "నే వెడుతున్నాను ఆంటీ!" అంది సాహితి.
"అదేమిటే - ఇవాళ ఇంత తొందరగా కాలేజీకి బయలుదేరావు? పేరంటానికిగాని వెళుతున్నావా? ఎందుకంత అలంకారం?" అనుమానంగా అడిగింది.
"అబ్బే అలాంటిదేమీ లేదు ఆంటీ! కాలేజీకే బయలుదేరాను. నిన్న కళ్యాణి ఇంటి దగ్గర రికార్డు మరచిపోయాను. అది తీసుకుని పాస్ పోర్టు ఫోటో తీయించుకుని అటునుంచి అటే కాలేజీకి వెళదామని..." గుక్కతిప్పుకోకుండా ముందుగా వెళుతున్నందుకు సంజాయిషీ ఇచ్చుకుంది సాహితి.
"పాస్ పోర్టు ఫోటో కోసమే అయితే ఎందుకే అంత అలంకరణ? షోకు చేసుకొని తిరిగే రోజులా ఇవి? సాయంత్రం కాలేజీ కాగానే సరాసరి ఇంటికి రావాలి, సినిమాలు, షికార్లు అంటూ ఎక్కడా పెత్తనాలు వెలగబెట్టకు. చెబుతున్నది అర్థమయ్యిందా?..."
"అలాగే! కాలేజీ కాగానే సరాసరి ఇంటికి వచ్చేస్తాలే ఆంటీ!"
సాహితీ హుషారుగా అంటూ బయటపడింది.
ఇంటి మలుపు తిరగ్గానే కొందరు విద్యార్థులు సాహితి కళ్ళబడ్డారు.
వాళ్ళను క్రీగంట చూస్తూనే "టాటా"! అంటూ గాలిలోకి చేయి ఊపింది సాహితి.
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎక్స్ ప్రెస్ రైల్లా కుర్రాళ్ళు హుషారుగా ఈలలు వేస్తూ సైకిళ్ళమీద సాహితిని వెంబడించారు.
సరదాగా తను వాళ్ళకు సైగచేసి వాళ్ళను ఆటపట్టిద్దామనుకుంది. తీరా వాళ్లే తనను ఆటపట్టించేట్టున్నారు. ఇక వాళ్ళు తనను ఒక పట్టాన వదులుతారో, లేదో! ఆలోచిస్తూ వడివడిగా నడవసాగింది సాహితి.
ఆ కుర్రాళ్లు మరింత హుషారుగా ఆమెను వెంబడించారు.
తనకోసమే ఎదురుచూస్తున్న గౌతమిని, కళ్యాణిని చూసి సాహితి గుండె మీద చేయివేసుకుంది.
ముగ్గురూ కలసి పుస్తకాలు అద్దెకు యిచ్చే దుకాణంలోకి వెళ్ళారు.
కుర్రాళ్లు కూడా ఆ షాపు దగ్గరే ఆగారు.
"గురూ! ఇక్కడ ఇంగ్లీషు నవలలు లేనట్టున్నాయిరా!" వాళ్ళలో ఒకడు అన్నాడు.
"ఓరి పిచ్చి మొద్దూ! ఇంగ్లీషువి ఎవరిక్కావాలిరా. ఎదురుగా తెలుగు బ్యూటీలు ఉండగా_ అటు చూడు ఎంత అందంగా ఉన్నాయో!" అంటూ మరొకడు వెకిలిగా నవ్వాడు.
సాహితికి వాళ్ళ భాష అర్థమైంది. వాళ్ళతో వాదం పెట్టుకుని లేని చిక్కులు తెచ్చుకోవడం అనవసరం. వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవడం శ్రేయస్కరం అనుకుంది.
అప్పటికే చేతికి దొరికిన నాలుగు నవలలనూ తీసుకొని కొట్టువానికి అడ్వాన్సు ఇచ్చి మిత్రురాళ్ళతో కలసి బయటకొచ్చింది సాహితి.
వాళ్ళు వెళుతున్న దారిలో జన సంచారం లేకపోవడంతో కుర్రాళ్ళు పేట్రేగి పోయారు.
ఆడపిల్లలను చుట్టుముట్టి అశ్లీలపు మాటలతో, చేష్టలతో అల్లరి పెట్టసాగారు.
ఏం చేయాలో తోచక ఆడపిల్లలు ముగ్గురూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.
"పెద్ద గొప్పగా ఆత్మరక్షణకు అంటూ ఫైట్స్ నేర్చుకున్నావు కదే! కాస్త ఆ విద్య చూపించి, వాళ్ళ నలుగురి ఎముకల్లో సున్నం లేకుండా చేయరాదూ?"
సాహితిని ఉద్దేశించి మిగిలిన ఇద్దరాడపిల్లలూ అన్నారు.
"భలే సలహా ఇచ్చారే! అదంతా అలంకార విద్య. వాళ్ళలో ఒకడు బాక్సింగ్, ఒకడు రెజిలింగ్, మరొకడు జూడో అంటూ మన ఒళ్ళు హోనం చేసేయగలరు జాగ్రత్త! ప్రస్తుతం అలాంటి ఆలోచనలు కట్టిపెట్టి, మనం పరుగెత్తడం మంచిది" అంది సాహితీ వాళ్ళిద్దరికే వినిపించేటట్టుగా.
