కేవలం డబ్బుకోసమే తన అన్న ఈ పెళ్ళి చేశాడు. ఆ డబ్బు కోసమే తను తలవంచి తాళి కట్టించుకుంది.
తన స్వయంకృత అపరాధం వలనే ఈరోజున పంజరంలో చిలకలా... చివరకు కన్న కొడుకు సయితం తనకు దూరంగా ఉండేలా పెంచాడు.
వాడు తల్లిప్రేమ అంటే ఏమిటో తెలియకుండానే పెరిగాడు. కేవలం కన్నతల్లి, అన్న బాధ్యత తప్ప, బంధం ఉన్నట్టు అనిపించడం లేదతనిలో!
రోజులు గడిచేకొద్దీ ఎందుకనో తనలో కసి... పగ... ద్వేషం పెరిగిపోతున్నాయి.
ఎవరిని సాధించాలి?
తనకు ఇప్పుడు శత్రువులు ఎవరు?
ఆమె కంటికి అందరూ శత్రువులవలె కనిపిస్తున్నారు.
తన ఇంటిలో తనే ఒంటరిగా బతుకుతుంది.
యవ్వనంతో తినికిసలాడే సౌందర్యాన్ని నిలువుటద్దంలో చూసుకుని మూగగా రోదిస్తోంది.
మరి ఒక మనిషికి చెప్పుకొనలేని బాధ గుండెలను నలిపేస్తుంది. అమెపడే మానసిక క్షోభ ను జయచంద్ర గమనించినా ఏమీ తెలియనట్టే వుండేవాడు.
ఒంటరిగా వుండడంవలన ఆమెలో అణగారిపోయిన పాత జ్ఞాపకాలు... తీపిగుర్తులు పదేపదే గుర్తుకు రాసాగాయి.
ఏమాత్రం ఖాళీ దొరికినా తన తాహతుకి తగిన వరుడిని పెళ్ళాడి వుంటే ఈ నిరాదరణ వుండేదికాదుకదా అని తనలోతనే మధనపడడం వసుమతికి అలవాటుయి పోయింది.
ఒకరోజు... పరధ్యాన్నంగా వున్న ఆమెనూ... ఎంత పిలిచినా పలకని ఆమె మనోభావాలను జయచంద్ర చూడనే చూశాడు.
"వసుమతీ "
పిలిచినా మూడవ కేకకు ఉలికి పడిందామె.
"ఎన్నిసార్లు పిలిచినా పలకవేం...ఊహల లోకాలలో విహరిస్తున్నట్టు వున్నావు. అవి ఏమిటో చెబితే నేనూ విని సంతోషిస్తానుగా" జయచంద్ర ముగ్గోళాలు చెలరేగిన కోపంతో అదురుతున్నాయి.
వసుమతి నిర్లిప్తంగా నిట్టూర్చింది.
ఏమని అనుకున్నాడో ఏమో... ఆమెను అలాగే ఒంటరిగా వదిలి వేసి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అతను.
అయినా, వసుమతిలో చలనంలేదు...
ఆమె కళ్ళుమాత్రం శూన్యంలోకి చూస్తూనే వున్నాయి.
మనసు పరిపరివిధాల పరుగులు తీస్తూనే వుంది.
* * * *
ఏ సి పి వీరేష్ పోస్టుమార్టం చేసిన డాక్టర్ మాటలను బట్టి చతుర్వేది చంపబడ్డాడే తప్ప అతనిది హఠాన్మరణం కాదని నిర్దారణకు వచ్చాడు.
నారాయణగూడా వద్దనుండి పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ వరకూవున్న ఏరియాలో ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట చతుర్వేదిని తప్పకుండా చూసేవుంటారు... కాకపోతే ఓప్పిగ్గా ఎంక్వయిరీ చేయాలి.
చతుర్వేది యూనిఫారమ్ ఫోటో తేసుకుని బయలు దేరాడు ఇన్ స్పెక్టర్ వీరేష.
కొబ్బరి బోండాలు కొట్టేవాడు ఒకడు ఆ ఫోటోను గుర్తుపట్టాడు.
"సర్... ఆరోజు రాత్రి నా దగ్గర రెండు బొండాలు తాగాడు ఆయన. వందరూపాయల నోటు ఇస్తే అన్నీ చిల్లరనోట్లే యిచ్చాను బాబూ... అందుకే నాకు గుర్తు" అన్నాడతను.
"తర్వాత ఎటు వెళ్ళారో నువ్వు చూశావా?"
"చూశానుబాబూ... ఈ రోడ్ వెంట వెళ్ళారు."
"ఏ సి పి వీరేష్ ఆశ్చర్యంతో తల మునకలై పోయాడు.
"నిజంగా... ఇటే వెళ్ళాడా?"
"అవును సర్...
ఆ రోడ్ వెంట వెళ్ళడం నిజమయితే ఆ రోడ్ పేరేడ్ గ్రౌండ్స్ ను వెళ్ళదు... మరి గ్రౌండ్స్ దగ్గర అతని శవం ఎలా ప్రత్యక్షమైంది?
అంటే... ఇంకేదో జరిగింది.
అది ఏమిటో తెలియాలంటే ఈ రోడ్ వెంట వెళ్ళిన చతుర్వేదికి ఏం జరిగిందో తను తెలుసుకొనడం ముఖ్యం...
సరాసరి ఒక కాలనీలోకి వెళ్ళింది ఆ రోడ్.
అందరూ ఖరీదయిన వ్యక్తులు నివసించే ఏరియా అది...
రోడ్ వెంట వెళుతూనే కనిపించిన ప్రతిచోటా ఎంక్వయిరీ చేసుకుంటూ వెళ్ళాడు ఏ సి పి వీరేష్. ఒక ఫోటో స్టూడియో అతను ఆ ఫోటో చూసి ఖంగారుపడి పోయాడు తప్ప ఏమీ చెప్పలేదు.
వీరేష్ అదీ గమనించి అతని పీక పట్టుకున్నాడు.
భయపడుతూ తనకు తెలిసింది చెప్పాడు అతను.
"నాకేం తెలియదుసార్... ఇక్కడే తన జిప్సీ ఆపి చాలాసేపు ఎవరికోసమో ఎదురు చూశారు. తీరా ఎవరో ఆ పాడుపడిన స్టూడియోలోకి వెళ్ళాక వాళ్ల వెనుకనే వెళ్ళాడు. తర్వాత నేను షాపు కట్టివేసి వెళ్ళిపోయాను. ఏం జరిగిందో నాకు తెలియదు. మరుసటిరోజు పేపరులో అయన ఇంకెక్కడో చంపబడ్డట్టు చూశాను. అందుకే భయపడిపోయాను తప్ప నాకే పాపం తెలియదు..." కాళ్ళనీళ్ళతో చెప్పాడతను.
"వాళ్ళు ఎవరో నువ్వు గుర్తుపట్టగలవా?"
"లేదుసార్... చూడలేదు... తెల్ల అంబాసిడర్ కారులో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ స్టూడియో పాతబడిపోవడంవల్ల ఎవరూ వాడడంలేదు అందుకే నేను ఆశ్చర్యంగా చూడడంవల్ల అదయినా తెలిసింది. లేకపోతే ఆ కాలనీలో, ఆ భవంతి లో ఏదో జరిగిందనే అనుమానమే రాదు...."
"అది జరిగిన తర్వాత మళ్ళీ ఇంతవరకూ ఆ కారుకానీ, ఆ వ్యక్తి కానీ లేదా ఇంకా ఎవరయినా ఆ స్టూడియోలోకి వెళ్ళడం చూశావా?"
"లేదుసార్... మీరుతప్ప ఇంతవరకూ ఎవరూ రాలేదు."
"ఆ స్టూడియోలోనే ఏదో జరిగిందన్న అనుమానం ఏ సి పి వీరేష్ కు అర్దమయింది. లోపల ఏమయింది అన్న విషయం తెలియాలంటే తను లోపలకు వెళ్ళక తప్పదు... అందుకే రివాల్వర్ ను కుడిచేతిలో స్టిఫ్ గా పట్టుకుని ఆ స్టూడియో మెయిన్ గేట్ వైపు నడిచాడు.
అదేసమయంలో హడావిడిగా తాళాలువేసి బ్రతుకుజీవుడా అనుకుంటూ పారిపోతున్న ఫోటో స్టూడియో యజమానిని గమనించే స్థితిలో లేడు ఏ సి పి వీరేష్.
* * * *
