వాళ్ళు తాగగా మిగిలిన బాటిల్ ఎత్తి గొంతులో పోసుకున్నాడు. రా విస్కీ ఒక్కసారిగా గొంతు దిగడంతో ఇప్పుడు అతని మెదడు పూర్తిగా మొద్దుబారిపోయింది.
* * * *
ఎదురు చూస్తున్న జనరల్ ఎలక్షన్లు రానే వచ్చాయి.
జయచంద్ర అధికారపార్టీ అభ్యర్దిగా రంగంలోకి దిగాడు. ఈ సారి అతనికి పోటీగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్దిగా పారిశ్రామికవేత్త ఆనందరావు నిలబడ్డాడు.
విజయం ఎవర్ని వరిస్తుందో చెప్పలేని అనిశ్చితస్థితి... ప్రధాన అభ్యర్దులు ఇరువరి మధ్యపోటీ తీవ్రంగా వుంది.
అంగబలం, ధనబలంతోపాటు రాజకీయ బలం వున్నవారు ఒకరయితే రెండవ వ్యక్తి అతనికేమాత్రం తీసిపోని ప్రముఖ బిజినెస్ ఎగ్జిక్యూటివ్
ఎలక్షన్ లలో డబ్బు, అధికారం జోరుగా పనిచేస్తున్నాయి. వాటి ముందు వ్యక్తి ప్రాధాన్యతకు విలువ తగ్గిపోయింది.
ఈ నగ్నసత్యాన్ని జీర్ణించుకుని వున్న జయచంద్ర ముందు వున్నాడు.
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది.
ప్రధాన అభ్యర్ధులు ఇరువరి తరుపున వాళ్ళ కొడుకులు కూడా ప్రచారం చేస్తున్నందువల్ల రెండు కొదమసింహాల మధ్య ప్రచ్చన్న యుద్దం ప్రారంభం అయినట్టుంది.
ఆ నియోజక వర్గంలో జయచంద్రను మించిన రాజీకీయ ప్రజ్ఞాశాలి మరొకరు లేరు. అందుకే తన గెలుపు ఖాయం అనే ధీమాతో ఉన్నాడాయన.
విద్యావేత్తలు, మేధావుల దృష్టిలో మంచి వ్యక్తిగా, సేవాతత్పరుడిగా పేరుప్రఖ్యాతలు వున్న వ్యక్తి ఆనందరావు.
ప్రత్యర్ది ఎలాంటి అవకాశ రాజకీయవాదో అందరికీ తెల్సుకాబట్టి ఈ సారి తప్పకుండా విజయం తనకే లభిస్తుందనే నమ్మకం అతనిది.
ప్రచారం ముమ్మరంగా సాగుతుంది.
ఎలక్షన్ ల రణగొణ ధ్వనులతో హోరెత్తిపోతుంది రాజధాని నగరం!
జర్నలిస్ట్ ధీరజ అన్ని రాజకీయ పార్టీలవారినీ కలుసుకుని ఇంటర్వ్యూ చేస్తుంది.... ప్రజల నాడిని తెలుసుకొనటానికి సర్వే నిర్వహిస్తుంది.... ఫోటోలను తీస్తుంది.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు కమ్ పోటోగ్రాఫర్ గా కూడా పని చేసే ఆమెని చూస్తే ప్రతి రాజకీయ నాయుకునికీ హడల్... ఏమాట అంటే ఏ కొంపమునుగుతుందోననే భయం...
సమాజంలో జరిగే అనేక ఘోరాలు.... నేరాల వెనక దాగి వున్న నగ్నసత్యాలను వెలికితీయడంలో ధీరజ ఎప్పుడూ ముందు ఉంటుంది.
జయచంద్రకు గెలుపుఖాయం అని కొందరు అంటుంటే ఆనందరావు అత్యధిక మెజార్టితో విజయం సాధిస్తాడని మరికొందరి నమ్మకము.
పత్రికలన్నీ దాదాపుగా ప్రతిపక్షాల అభ్యర్దిని సపోర్టు చేస్తుండడంతో జయచంద్ర ఖంగుతిన్నాడు. ఆ నిజాన్ని తను భరించలేక పోయాడు.
ఏది ఏమైనా సరే తను గెలిచి తీరాలనే పట్టుదల మీద ఉన్నాడు అతను.
పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది!
ప్రత్యర్ది గెలుపు ఖాయం అని రోజురోజుకీ మారిపోతూ వున్న రాజకీయ వార్తలు తెలియచెబుతున్న కొద్దీ జయచంద్రకు మనశ్శాంతి కరువయింది.
ఆనందరావు నిజంగానే గెలుస్తాడా? లేక ఓటర్లను తికమక పెట్టటానికి ఆ విధంగా ప్రచారం చేసుకుంటున్నాడా?
అతనిపై కోపం, ఈర్ష్య, అసూయ క్షణక్షణానికి పెరుగిపోతున్నాయి!
జయచంద్ర ఆ మానిసిక ఒత్తిడికి తట్టుకోలేక పూర్తిగా మత్తులో మునిగి తేలుతున్నాడు.
"ఆనందరావు గెలిచే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు! అతను గెలవకూడదు అంతే" అంటూ లాయర్ సత్యమోహన్ వేపు చూశాడాయన.
అదే విషయాన్ని గూర్చి సుదీర్ఘంగా అలోచిస్తున్నాడతను!
చివరకు ఓ నిర్ణయానికి వచ్చి, తన మనసులో రూపుదిద్దుకున్న ఆలోచనకు జయచంద్రకు చెప్పాడు.
"మరి ఒకసారి ఆలోచించు..."
"ఇది ఒక్కటే మార్గం కనిపిస్తుంది"
జయచంద్ర మౌనం వహించాడు.
"ఈ విషయం మూడో కంటికి తెలియకుండా వుండాలి"
అప్పటికీ జయచంద్ర మాట్లాడలేదు.
"ఏమిటీ..మౌనంగా వుండిపోయావు"
జయచంద్ర వున్నట్టుండి నవ్వాడు.
"నా గురించి నీకు బాగా తెల్సు! ఇలాంటి ఎత్తుగడలు నాకు కొత్తకాదు. అనుకున్న ఓటమికన్నా ఊహించని గెలుపుమీదే కేంద్రీకరించివుంది నా ఆలోచన అంతా"
క్రిమినల్ లాయరు సత్యమోహన్ అతని మనో ధైర్యానికి ఆశ్చర్యపోయాడు.
"నీ రాజికీయపు ఆలోచనలు ఒక్కొక్కసారి నాకు అంతుబట్టకుండా వుంటాయి బావా?"
"సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. ముందు పధకాన్ని అమలు జరపడం గురించి ఆలోచించు... లేదంటే మన రాజకీయ భవిష్యత్ మంట గలిసిపోతుంది"
ఫోన్ ముందుకు లాక్కుని ఏదో నంబర్ డయల్ చేయడంలో మునిగిపోయాడు క్రిమినల్ లాయర్ సత్యమోహన్!
* * * *
జయచంద్ర ఉన్నతిని చూసి విరక్తిగా నవ్వుకుంది వసుమతి!
మీటింగ్ లు, మహాసభలు... గౌరవ సన్మానాలు, చీకటి వ్యాపారం అతనికి జీవిత భాగస్వాములయ్యాయి తప్ప భార్య ధ్యాసేలేదు.
అతను కావాలనే తనను ఒంటరిదాన్ని చేస్తున్నాడు!
ఆస్థి... అంతస్థు....హోదా!
అన్ని సుఖాలను ఆమె అందుబాటులో వుంచాడు_ ఒక్క సంసార సుఖం తప్ప!
తన జీవితం ఇలా మోడుబారి పోతుందని తను కలలో కూడా అనుకోలేదు.
ఎందుకిలా జరిగింది?
ఎవరు దీనికి బాధ్యులు?
తన అన్నయ్య సత్యమోహనా? లేక కన్నతల్లి అనారోగ్యమా? వీటిన్నిటికీ మూలం పేదరికం....
తను పేదరికంలో పుట్టడం వలనే ఇన్ని కష్టాలు వచ్చాయి.
ఇష్టం లేకపోయినా అతనని పెళ్ళి చేసుకోవలసి వచ్చింది.
