"నువ్వు కలిసేదాకా ఎలా బ్రతికానో తెలీదు కానీ... ఇప్పుడు మాత్రం నీతో కలిసి తప్ప విడిగా బ్రతకలేను! అని చెప్పెయ్యి" అన్నాను.
"మార్వలెస్! ఏదీ మళ్ళీ చెప్పు..." చిన్నపిల్లలా సంబరపడిపోతూ అడిగింది.
నేను ఓపిగ్గా మళ్ళీ చెప్పాను.
"నువ్వు బ్రతికేదాకా కలిశాను. కానీ..." అంటున్న ఆమె చెవి మెలిపెట్టి -
"మొద్దూ... సరిగ్గా విను..." అన్నాను.
"అలాకాదు ముక్తా... కాయితం మీద రాసుకుంటా!" అంది.
"రాసుకుని గడగడా పాఠం అప్పజెప్పినట్లు చదువుతావా?" అడిగాను.
"త్రీ హండ్రెడ్ వేస్ టూ ఎక్స్ ప్రెస్ లవ్... లాంటి బుక్స్ ఉన్నాయా?"
"ఉహూ! ఒకటే వేలో ప్రపంచం అంతా చెప్పుకుంటారు" అన్నాను.
"ఎలా?" అడిగింది లిల్లీ.
"ఇలా..." అని చటుక్కున ఆమెని దగ్గరకి లాక్కుని ముద్దు పెట్టుకున్నాను.
"ఏయ్...అల్లరిపిల్లా" అంటూ నవ్వింది లిల్లీ.
"ఏకైక ప్రపంచ భాష అది!"
"ముద్దు పెట్టుకోవాలంటే ముందు అతని గెడ్డం తీయించెయ్యాలి" ఆలోచనగా అంది.
"అయితే నువ్వు ఓ పని చెయ్యి...ఒక రేజర్ ప్రెజెంట్ చెయ్యి! ఎందుకూ అని అడగగానే గెడ్డం అడ్డంకదా అను" అన్నాను.
"కరెక్ట్... చూశావా నాతో తిరిగి నువ్వు బ్రిలియెంట్ అయిపోతున్నావు" అని నవ్వింది లిల్లీ.
వర్షాకాలంలో కొండవాగులా గలగల పరిగెడ్తోంది లిల్లీ! ప్రేమ అద్భుతాలు చేస్తుంది. ఈ పొగరుబోతు పిల్ల కూడా నాగస్వరం విన్న పాము పిల్లలా ఎలా మెలికలు తిరుగుతోంది! అనుకున్నాను.
"ముక్తా...నీకు పాటలంటే ఇష్టం కదా! రవీంద్రభారతిలో అనూప్ జలోటా నైట్ ఉంటే రెండు టిక్కెట్లు తెప్పించాను. అవి వేస్టు అవకుండా నువ్వూ విక్కీ వెళ్ళండి... మిస్ చేయొద్దు" అంది.
"వద్దు లిల్లీ!" అన్నాను.
"ఏం? మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారుగా, అక్కడ నీతో ఏమైనా మిస్ బిహేవ్ చేశాడా?" అడిగింది.
"ఛ"! అన్నాను.
"మరింకేం... వెళ్ళిరండి విక్కీకి కూడా చెప్పాను. అతను నిన్ను పికప్ చేసుకుంటాడు" అంది.
ఏవిటో తెలియని ఇబ్బంది. ఈలోగా విక్కీ గదిలోంచి బయటికి రావడం, లిల్లీ టికెట్లు ఇచ్చి అతనికి సంగతి చెప్పడం జరిగిపోయాయి.
విక్కీ నావైపు చూశాడు.
ఆ కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు! ఏం జవాబు చెప్పను?
అందరూ కాళ్లు తుడుచుకుని, తుడుచుకుని పీచు రేగిపోయిన పట్టాలా ఉంది నామనసు!
గట్టిగా ఆలోచించాలంటే సిగ్గు! తియ్యగా పండాల్సిన తలపులన్నీ పులుపు కాయలుగానే రాలిపోయాయి! మనసుని ఆహ్లాదపరిచే వర్షంలాకాక వర్షం తరువాత మిగిలే చిత్తడిలా చిరాగ్గా మారింది మనసు!
నేను వచ్చేస్తుంటే "రేపు సాయంత్రం ఏడు గంటలకి..." లిల్లీ జ్ఞాపకం చేసింది.
తల ఊపి "బెస్ట్ ఆఫ్ లక్ లిల్లీ" అన్నాను.
"థాంక్యూ డియర్" సంతోషంగా అంది.
ఆప్తమిత్రురాలు జీవితంలో స్థిరపడబోతోంది. ఇంతకన్నా సంతోషకరమైన సంగతేం ఉంటుంది! అనుకుంటూ తృప్తిగా ఇల్లు చేరాను.
* * *
ఇల్లంతా సందడిగా ఉంది. పెద్దక్క వచ్చింది. అమ్మ మంచం మీద కాకుండా వంటింట్లో ఉందంటే మనవలు వచ్చినట్లు లెఖ్క!
నన్ను చూడగానే "ముక్తా... శ్యాం నిన్ను చూసుకోవడానికి వస్తానన్నాడు. అసలు పెళ్ళిచూపులే వద్దన్నవాడు నీపేరు విని తలాడించాడు. భావుకత్వంలాంటివి ఎక్కువలే... అస్తమానం పద్యాలవీ వ్రాస్తుంటాడు..." కాస్త విసుగ్గా అంది చివరిమాట.
"శ్యాం ఎవరు?" అడిగాను.
"అదేనే... మా పిన్నత్తగారి కూతురు తోడి కోడలి" అని చెప్పబోతూవుంటే ఆపి -
"పెళ్ళికొడుకా?" అడిగాను.
"ఆ...ఫొటోలు తీయించుకున్నావా?" అడిగింది.
"అక్కా...ముందు నన్ను డిగ్రీ పరీక్షలు రాయనీ...పరీక్ష తప్పితే అప్పుడు చూడవచ్చు సంబంధాలు" అన్నాను.
"తప్పుతావా?" అడిగింది.
"తప్పను" చెప్పాను.
"అంటే? పెళ్ళిచేసుకోవా?"
"ఇప్పుడు చేసుకోను"
"తలంతా నెరిసి, ఈ అందం కాస్తాపోయాక ఎవడు చేసుకుంటాడు నిన్ను?" కోపంగా అడిగింది.
"ఎవడో నాలాగే తల మాసినవాడు" అన్నాను.
"నీ తల తిక్కచూస్తే నాకు మంట" అరిచింది.
"మరి నా తలకి తిక్కరాకుండా చూడచ్చుగా" అని గదిలోకి వెళ్ళిపోయాను.
అమ్మతో నా గురించి అక్క మాట్లాడటం, ఆవిడ సన్నగా ఏడవడం వినిపిస్తోంది. అమ్మ నన్నో బరువుగా అనుకుంటోంది. తన నెత్తిమీదున్న బస్తా ఎవడి నెత్తిమీదకో మార్చేస్తే తను నిశ్చింతగా ఉండచ్చు అన్నది ఆమె ఆశ! నిజమే... ముసలి తల్లిదండ్రులకి మిగిలిన బాధ్యత నేనే!
