"ఏ...క్యా బోల్తాతూ...
ఏ...క్యామై బోలూ..."
అనే పాట వినిపిస్తోంది. విక్కీ నావైపు చూసి నవ్వాడు. అతని కళ్ళల్లో అరసెకనుపాటు ఏదో వింతభావం మెరిసి మాయం అయింది. ఆ భావాన్ని పట్టుకోవడం ఆడపిల్లకి వెన్నతో పెట్టిన విద్య! నా గుండె గుభేలుమంది!
మళ్ళీ ఓ కొత్త కథకి శ్రీకారం చుట్టే ఓపిక నాలోలేదు! ఇతను ఈ చనువునీ, నాకు చేసిన ఈ ఉపకారాన్నీ వేరోరకంగా క్యాష్ చేసుకోవాలనుకోవడంలేదుకదా! పువ్వుమీద తుమ్మెద వాలడం చాలా సహజం! సృష్టిలో ఆపోజిట్ సెక్స్ చేత ఆకర్షింపబడడం అంతే సహజం. ఏ ఫార్ములా అక్కర్లేని కెమికల్ రియాక్షన్! కేటలిస్టులుగా ఉపయోగపడడానికి బోలెడు పరిస్థితులు!
నలిగిన షర్ట్ తో, జీన్స్ ప్యాంట్ లో నిర్లక్ష్యంగా కనిపించే ఈ యువకుడిలో 'నా దేశం...నా ప్రజలూ...' లాంటి పేట్రియోటిజమ్, సేవాతత్పరతా ఉన్నాయి అంటే ఎవరైనా నమ్మగలరా? కానీ ఇప్పుడు నేను నమ్ముతాము. పైకి చూసేదంతా నిజం కాదు... ఏదైనా ముట్టుకుని పరీక్షిస్తే కానీ తెలీదు. అతను మాటల మనిషికాదు... చేతల మనిషే! నీ స్నేహితులని బట్టి నిన్ను అంచనా వేయచ్చు అనేమాట ఎంతైనా నిజం! లేకపోతే లిల్లీలాంటి అమ్మాయి ఎందుకు స్నేహం చేస్తుంది?
కాని నాకు పరిచయం అవడం యాధృచ్చికం!
నేను పరిచయం పెంచుకోవాలనుకోలేదు. పరిస్థితులు అలా వచ్చాయి అంతే! నాకు ఎదురైనా అనుభవాలవల్ల ఇప్పట్నుంచీ అయినా ప్రతి అడుగూ ఆచీతూచీ వెయ్యాలనుకుంటున్నాను.
ఎత్తైన కొండ శిఖరం మీద నిలబడి లోతుగా కనిపిస్తున్న దృశ్యాల్ని చూస్తుంటే భయం వేసినట్లు, భయంగా వుంది గతాన్ని తలచుకుంటే!
తల తిరిగేటప్పుడు అగాధాలలోకి చూడ్డం ఎందుకూ? తల పైకెత్తి చూస్తే అనంతమైన ఆకాశం మినుక్కుమంటూ మెరిసే తారలతో ఆశా సౌధాలు నిర్మించుకుందువుగాని...రా... అని పిలుస్తోంది.
"ఏవిటీ ఆకాశంవైపు అలా దీక్షగా చూస్తున్నారూ?" అడిగాడు విక్కీ.
"అక్కడ దానికేమైనా ఆకాశాన్నంటిన ధరలు కన్పిస్తున్నాయేమో!" అంది చిత్ర.
"ఇరవయ్యో శతాబ్దంలో ధరలు అందుబాటులోకి వస్తాయట... ఎలాగో చెప్పగలరా?" అడిగాడు.
"ప్రభుత్వానికి పాతాల భైరవిలాంటి శక్తి దొరుకుతుందా?" వ్యంగ్యంగా అడిగాను.
"కాదు...మనిషి ఆకాశంలో మేడలుకట్టే టెక్నాలజీ నేర్చుకుంటాడు కాబట్టి!" అన్నాడు.
అందరం ఫక్కున నవ్వాం. అలుపులేకుండా అతను అదేపనిగా కబుర్లు చెప్తూనే వున్నాడు.
నాకు ఎప్పుడు నిద్ర ముంచుకువచ్చిందో నాకు తెలియనేలేదు. కళ్ళు తెరిచేటప్పటికి అతని భుజంమీద వాలివున్నాను. నేను కళ్ళు తెరవగానే అతను "హాయ్" అని నవ్వాడు. ఏవిటో అంత హాయి?
* * *
లిల్లీ జరిగినదంతా శ్రద్ధగా వింది.
"విక్కీ...నువ్వు నర్సింగ్ హోమ్ అలాంటి ఊర్లోనే కట్టు... ఈ సిటీలో నీలాంటి డాక్టర్లు డబ్బు పారేస్తే కోకొల్లలు. వందమందిలో ఒకడిగా పంక్తి చివర్న కూర్చుని పంచభక్షపరమాన్నాలు తినడంకంటే... మనం ఒక్కళ్ళే అతిధులుగా వెళ్ళి ప్రేమతో ఇచ్చిన అంబలి తాగడం ఎక్కువ తృప్తి!" అంది.
"అవును" అతను ఒప్పుకున్నాడు.
లిల్లీ మునుపటికంటే చాలా హుషారుగా ఉంది. పార్లర్ కి వెళ్ళొచ్చినట్లుగా ఉంది. మెరిసిపోతోంది.
"ఈ మెరూన్ కలర్ చీరమీదకి ఈ చోలీ బావుందా?" అని అద్దాలు కుట్టిన ఓ చోలీ చూపించింది.
"చాలా బావుంది! కానీ ఏవిటీహడావుడీ? ఎక్కడికైనా ప్రయాణమా?" అడిగాను.
"ముంబై వెళుతున్నాను. అఫీషియల్ ట్రిప్!" అంది.
నాకు అర్థమైపోయింది.
"బోస్ దగ్గరకా?" నవ్వుతూ అడిగాను.
"అతడు నాకు బాస్!" సరిదిద్దింది.
"అందుకేనా... ఈ అద్దాల జాకెట్లూ, అందమైన సిగ్గులూ" రొమేంటిక్ గా అడిగాను.
నా చెంపమీద సుతారంగా తట్టి నవ్వింది.
"ఎప్పుడు తిరిగి రావడం?" అడిగాను.
"సోమవారం"
"ఊ..." నిట్టూర్చాను.
"ఏం? అంత నిట్టూర్పూ?" అడిగింది.
"వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అనీ మళ్ళీ మన కర్నూలు ప్రయాణం వాయిదా పడినందుకు!" అన్నాను.
"సారీ...ముక్తా!" అంది.
"సో సారీ...బి హేపీ" నవ్వాను.
"బట్ వన్ థింగ్... ఈసారి మాత్రం నీ మనసులోని మాట చెప్పకుండా రావద్దు" అన్నాను.
"అతను ఎక్కువగా మాట్లాడడు ముక్తా. నేను వస్తున్నట్లుగా ఫోన్ చేశాను. చాలా క్లుప్తంగా 'ఓ.కే. సీ.యూ' అని పెట్టేశాడు తెలుసా!" బాధగా అంది.
"బహుశా...అది చూసే ఇష్టపడి వుంటావు" అన్నాను.
మనం ఒకవ్యక్తిలో ఏంచూసి ఇష్టపడ్డామో ఆ గుణాన్నే విమర్శిస్తూ సంతోషపడుతుంటాం. మానవనైజం!
లిల్లీ సాలోచనగా "మళ్ళీ కెనడా వెళ్తే మూడు నెలలు రాడు... ఎలాగైనా చెప్పేస్తా!" అంది.
