Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 78


    "దానివలన ఒరిగేదేమిటి?"
    
    "మధ్యతరగతి మనుషులు దేనికి కలవరపాడేదీ నాకు అనుభవమే శౌరీ! ఆదిత్య అయితే మొండితనం ప్రదర్శించే అవకాశముంది. కానీ అదే అతడి చెల్లెలయితే ఏడ్చి మొత్తుకునయినా అన్నయ్యకి నచ్చచెబుతుంది."
    
    "కాని..." సాలోచనగా వుండిపోయాడు శౌరి.
    
    "ఓసారి ప్రయత్నించి చూడు శౌరీ ఫలితం నీకే తెలుస్తుందిగా."
    
    "సరే" క్షణం తర్వాత అన్నాడు శౌరి "ఈ రోజే ఆదిత్య చెల్లెల్ని కలుస్తాను. ఆమెను నలుగురి మధ్యా బట్టలు వూడదీసి నడిపించకూడదూ అంటే ఆదిత్య పోటీనుంచి విరమించాలని హెచ్చరిస్తాను"
    
    "పోటీనుంచి విరమించమని కాదు."
    
    "మరి?"
    
    "ప్రబంధతో కలిసి పోటీకీ కూర్చోవాలని."    

    "ఆంటీ!" అప్రతిభుడై అన్నాడు శౌరి.
    
    "ఈ కథ అద్భుతమైన మలుపు తిరగాలీ అంటే అడగాల్సింది ప్రబంధతో కలిసి పోటీలో పార్టిసిపేట్ చేయాలని"
    
    "కానీ దానివలన మన కొరిగేదేమిటి?"
    
    "నువ్వు హెచ్చరించిన ఆదిత్య చెల్లెలు ఆనక ఆ విషయం తన అన్నయ్యకి చెబుతుంది"
    
    "ఔను"
    
    "దానితో ఆదిత్య ఇదంతా చేయించింది ప్రబంధే అనుకుంటాడు"
    
    "అయితే?"
    
    "అది చాలు శౌరి! ప్రణయని మాత్రమే ఇష్టపడే ఆదిత్య ప్రబంధతో కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీకి సిద్దపడను అని తేల్చి చెబుతాడు. అంటే ప్రబంధపైన ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటాడు. పూర్తిగా మనస్సు విరిగిన ప్రబంధ ఆదిత్య జ్ఞాపకాన్ని శాశ్వతంగా తుడిచేసుకుంటుంది"
    
    "అమోఘం ఆంటీ!" ఉత్సాహంగా చప్పట్లు కొట్టాడు శౌరి.
    
    సౌదామిని ఆలోచనాశక్తిపైన అమితంగా గౌరవం పెరిగిన శౌరి సుధీర్ తోపాటు బయటికి నడిచాడు.
    
    సాయంకాలందాకా బార్ లో తాగి ఆ నిషాలో హాస్పిటల్లో అడుగుపెట్టాడు అనితని హెచ్చరించాలని.
    
    అప్పుడు సమయం రాత్రి ఎనిమిది కావస్తోంది.
    
    భోంచేసిన బామ్మ బడలికగా వుండి పావుగంట క్రితమే నిద్రపోవటంతో అనిత ఓ మేగజైన్ చదువుకుంటూ కూర్చుంది.
    
    విజిటర్స్ వెళ్ళిపోవడంతో వార్డులో అలికిడి లేదు.
    
    సుధీర్ దూరంనుంచే చూపించాడు అనితని. తను తాగి ఉన్నానన్న విషయం తెలియకుండా జాగ్రత్తపడుతూ అనిత దగ్గరికెళ్ళాడు శౌరి.
    
    అనిత విస్మయంగా చూస్తుండగానే అన్నాడు శౌరి "నా పేరు శౌరి! ముఖ్యమంత్రి కొడుకుని."
    
    మర్యాదగా పైకి లేచిన అనిత కంగారుగా స్టూల్ ని చూపించింది.
    
    "నేను కూర్చోడానికి రాలేదు."
    
    మరి ఎందుకొచ్చారో అర్ధంకాక వినయంగా అంది "ప్రబంధగారు ఇందాకే కేరియర్ పంపారు"
    
    "అలాగా!" దీర్ఘం తీశాడు శౌరి.
    
    "అనవసరంగా శ్రమెందుకని చెబుతూనే వున్నాను" అంతకన్నా ఏం మాట్లాడాలో తెలీని అనిత కృతజ్ఞతగా అంది "ప్రబంధగారు ఈవేళ వస్తారనుకున్నాను బహుశా..."
    
    "రాకపోయినా కేరియర్ పంపిందిగా!"
    
    తలూపింది అనిత అవునన్నట్లుగా.
    
    "మరి అంత సహాయం చేస్తున్న అమ్మాయి విషయంలో మీ అన్న ఎంత అణకువగా వుండాలి?"
    
    ఈ చర్చ దేనికి ఉపోద్ఘాతమో అర్ధంకాలేదు అనితకి "ఏమైంది?" అంది ఆందోళన్ని అదిమిపెట్టుకుంటూ.
    
    "నీపేరు?" ఇన్వెస్టిగేషన్ లా అడిగాడు అదోలా చూస్తూ.
    
    "అనిత"
    
    "చూడు అనితా....! మీ అన్నయ్య ఆదిత్యకి నా గురించి కొద్దిగా తెలుసు కాని నీకస్సలు తెలీదు"
    
    జవాబు చెప్పలేదామె.
    
    "ప్రబంధని మీ అన్నయ్య తెలివిగా ట్రాప్ చేశాడు. చాలా మొండి పిల్లయినా ఆదిత్య విషయంలో ఎందుకో చాలా అణకువని ప్రదర్శిస్తూంది."
    
    "అసలు సంగతేమిటో చెప్పండి?"
    
    "మరేం లేదు" సూటిగా పాయింట్ కి వచ్చేశాడు. "మా చెల్లి విషయంలో అనవసరమయిన పైత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు మీ అన్న."
    
    శౌరి వచ్చింది బెదిరించడానికి బోధపడిపోయింది ఆమెకు.
    
    "ప్లీజ్! ఇలా రండి" బామ్మ నిద్రలేస్తుందేమో అన్న భయంతో వార్డు బయటకి నడిచింది. శౌరి అనుసరించాడు. కారిడార్ లోకి రాగానే అడిగింది. "ఏం జరిగిందో చెప్పండి?"
    
    "మీ అన్నయ్య మా ప్రబంధతో కలిసి క్విజ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయనని మొండికేస్తున్నాడట."
    
    "ఎందుకు?"
    
    "ఆ విషయం ఆరా తీయాల్సింది నువ్వు."
    
    "నేనెందుకు అడగాలి?"
    
    "వయసులో ఉన్న చెల్లివిగా!"
    
    "చురుక్కుమన్నా నిభాయించుకుంది. "సరే....అడుగుతాను."
    
    "అడగడమే కాదు ఒప్పించాలి"
    
    "ఎందుకు కాదన్నాడో తెలుసుకోవాలిగా?"
    
    "పొగరెక్కువై."
    
    "ఎందుకు ఎక్కువైందో కనుక్కుంటాను..." ఆవేశంగా లోనికి నడవబోయిన అనిత కెవ్వుమంది శౌరి ఉక్రోషంగా జుట్టు పట్టుకోవడంతో.
    
    ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు తాగిన మైకంలో అయినా ఇంత దురుసుగా ప్రవర్తించగలడని తెలీని అనిత కళ్ళనుంచి జలజలా నీళ్ళు రాలుతున్నాయి.
    
    అసలు ఇలాంటి స్థితిని ఆమె ఊహించి వుంటే వార్డు బయటికి వచ్చేది కాదు. "వదులు.... లేకపోతే కేకలు పెడతాను..." అంది బాధగా విలవిల్లాడిపోతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS