Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 77


    సౌదామిని చాలా ఆనందంగా వుంది. ఒకనాడు తనూ యిలాంటి సందిగ్ధస్థితిలోనే చిక్కుకుని నిద్రలేని రాత్రులు గడిపింది. ఇప్పుడు తన జీవితం ఇలా కావడానికి కారణమైన వాసుదేవరావూ అదే స్థితిలో కలవరపడుతున్నాడు.
    
    మగనారిలా మారాలని కలలుకంటున్న వేళ, పీడకలలా మలినమైన దేహపు సెగలే గుర్తుకొస్తున్నాయో, లేక ప్రబంధ కాలేని తన బ్రతుకునిశ్శబ్దం కుమ్మరించిన కన్నీటి చారల జ్ఞాపకాలే ఆమెను మండించాయో, మృదుత్వాన్ని నటిస్తూ అడిగింది శౌరిని "ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు?"
    
    "డాడీ అనుమతిచ్చారు."
    
    "దేనికి?"
    
    "అవసరమైతే ఆదిత్య కథ ముగించటానికి."
    
    ఆమె గుండె ఝల్లుమంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుక్కి ఆదిత్యలాంటి వాడిని కడతేర్చటం ఓ సమస్యకాదు.
    
    "దానితో సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే ప్రబంధ సులభంగా గుర్తిస్తుంది కాబట్టి."
    
    "గుర్తించనీ."
    
    "నిజమే శౌరీ! గుర్తించినా నీకు ఇబ్బంది కాదు. ఆ తర్వాత ప్రబంధ పెళ్ళికి అంగీకరించదు"
    
    ఆలోచనలో పడిపోయాడు శౌరి. నిజమే! ఆదిత్యని దారినుంచి తప్పించినా ప్రబంధ తమ దారిలోకి వస్తుందన్న గ్యారంటీ లేదు. "మరేం చేయాలి?" అడిగాడు అసహనంగా.
    
    క్షణం ఆగి అంది. "ఒక మామూలు సమస్యని ఇంత సీరియస్ గా తీసుకుని మీ డాడీకెందుకు చెప్పావు?"
    
    చెప్పడం కాదు ఆమెకు అభ్యంతరం శౌరి నుంచి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంది అంతే!
    
    "నీకు తెలీదు ఆంటీ! రేస్ నుంచి ప్రణయని తప్పించిన ప్రబంధ ఇప్పుడు ఆదిత్యతో కలిసి కాంపిటిషన్ కి కూర్చోవాలనుకుంటోంది"
    
    ఇంతవరకూ సౌదామినికీ తెలుసు.
    
    "అంతమాత్రంచేత అదో సమస్య కాదే?"
    
    "అదికాదు ఆంటీ! ప్రబంధ ఆదిత్య కోసం ఎంత తపించిపోతున్నదీ దాని మాటలను బట్టి అర్ధమైపోతోంది"
    
    "మరి ఆదిత్య కూడా ప్రబంధ కోసం అంతగా ఆరాటపడుతున్నాడా?"
    
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
    
    "ఆ విషయాన్ని ఎంక్వయిరీ చేశావా?" అడిగింది మళ్ళీ.
    
    "ఎలా? ప్రబంధ నా చెల్లెలు కాబట్టి గ్రహించగలను కాని సిగ్గులేకుండా ఆదిత్యని ఆ విషయం ఎలా అడగ్గలను?"
    
    "శౌరి!" ఆప్యాయంగా శౌరి తల నిమిరింది. "మొన్నెప్పుడో ప్రబంధ ఆదిత్య ఇంటికి వెళ్ళడంగాని, నిద్రలో సైతం ప్రణయగురించి ప్రబంధ కలవరించడంగాని మననం చేసుకుంటే..."
    
    అవాక్కయి చూశాడు శౌరి.
    
    "ఔను శౌరీ! ప్రణయ విషయంలో ప్రబంధ ఎక్కువ కలవరపడటం నాకు తెలుస్తూనే వుంది. అంటే ప్రబంధ దృష్టిలో ప్రణయ ఓ అవాంతరమైంది. ఇంకా స్పష్టంగా చెప్పాలీ అంటే తనకు దక్కాల్సిన ఆదిత్య ప్రణయ అనే అమ్మాయి మూలంగా తనకు దూరమైపోతున్నాడు. అందుకే ముందుగా రేస్ నుంచి ప్రణయని తప్పించింది."
    
    శౌరికి ఈ విశ్లేషణ నచ్చింది. "కావచ్చు"
    
    "అంటే ఇప్పటికీ ఆదిత్య ప్రణయ మనిషే"
    
    అర్ధంకానట్టు చూశాడు.
    
    "అదలా ఉంచి ఇప్పుడు చెప్పు ఆదిత్యకి హాని జరక్కుండా ఈ సమస్యని ఎలా పరిష్కరించాలనుకుంటున్నావో?"
    
    "అసలు ఈ పోటీ లేకుండా చేస్తాను"
    
    "ప్చ్!" తల అడ్డంగా ఊపింది సౌదామిని. "లాభంలేదు"
    
    "ప్రణయని పోటీనుంచి తప్పుకోవద్దని రిక్వెస్ట్ చేస్తాను."
    
    "దానివలనా ప్రయోజనం వుండదు."
    
    "ఆదిత్యని బెదిరిస్తాను"
    
    "ఆ విషయం ప్రబంధకి తెలుస్తుంది."
    
    "మరేం చేయాలి?"
    
    "ఆలు ఆదిత్య ఈ పోటీలో ప్రబంధతో కలిసి పోటీ చేయాలనుకుంటున్నాడో, లేదో తెలుసుకో,"
    
    చేయకూడదనుకుంటున్నాడని నిన్నరాత్రే ప్రబంధ తనతో బాధపడుతూ చెప్పడం ఆమెకు గుర్తుంది.
    
    "నిజానికి ఆదిత్యకి ఇష్టంలేదు" ఈ మాట అన్నది శౌరి కాదు, శౌరి పక్కనే నిలబడున్న సుధీర్.
    
    శౌరి విస్మయంగా చూస్తూంటే సౌదామిని విస్మయాన్ని అభినయిస్తోంది.
    
    "ఔను శౌరి! ఇందాక నేను సూరి ఆదిత్యని అడుగుతుండగా విన్నాను. "నా పేరును తన పేరుతో జతచేసి చెప్పటానికి ప్రబంధ ఎవరు?" అంటున్నాడు ఆదిత్య.
    
    మృదువుగా నవ్వింది సౌదామిని. "అర్ధమయింది కదూ? నాకు తెల్సు శౌరీ! ఆదిత్య ఇష్టపడుతున్నది ప్రణయని, ప్రబంధని కాదు. ఈ విషయం తనకీ తెలిసినా ప్రబంధ వూరుకోవడంలేదు. ఆదిత్యని గెలుచుకోవాలనే పోరాటంలో ప్రణయని ఎదుర్కొంది. ఎలా సాధించినాగానీ ప్రణయని తను పక్కకు జరిపింది. ఇప్పుడు ప్రబంధ ఎంత మొండిగా ఆలోచిస్తోందీ అంటే ప్రపంచంలో ఏశక్తి ఆదిత్యను తననుంచి దూరం చేయలేదనుకుంటోంది. అందుకు నువ్వు చేయాల్సింది ఒక్కటే!"
    
    "ఏమిటి?"
    
    "అదిత్యకి ఓ చెల్లెలు వుందనుకుంటాను. ప్రబంధ చెప్పింది."
    
    "అవును" సుధీర్ అన్నాడు.
    
    "చెల్లంటే ఆదిత్యకి చాలా యిష్టమనుకుంటాను కూడా."
    
    "ఆవిడ్ని కిడ్నాప్ చేసేదా?" టక్కున అడిగాడు శౌరి.
    
    "ఆవేశపడకయ్యా!" శౌరి అహం ఆమెకు కోపాన్ని తెప్పిస్తున్నా ప్రసన్నంగా అంది "సరాసరి ఆదిత్యని బెదిరించడంకన్నా అతడికి సెంటిమెంటల్ ఏంకర్ గా ఉన్న అతడి చెల్లెల్ని బెదిరించు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS