"నువ్వోరకంగా నేనోరకంగా కుటుంబ బరువు బాధ్యతలు చిన్న వయసునుండే మోస్తున్నవాళ్ళం...ఇవన్నీ పెద్ద గీతముందు చిన్న గీతలవంటి కష్టాలు.
అందుకే భరించగలం. ఇంట్లో చట్టిలో ఒకటే ముద్ద అన్నం ఉన్నప్పుడు... ఆ ముద్దకోసం జబ్బుతో ఉన్న తల్లీ, అక్కయ్య ఏడాది కొడుకూ, నిండుచూలాలు చెల్లీ ఉన్నప్పుడు ముందుగా ఎవరి నోటికి అందించాలా అని పడేవేదన కంటే బాధాకరమైనది కాదుగా ఈ ప్రేమ!" అన్నాడు.
అతని మాటలకి నా మనసు ద్రవించి కంటనీరు తిరిగింది. దారిద్ర్యం ముందు అన్నీ బలాదూర్! కడుపు నిండాకే ఈ ప్రేమలూ...అవీ!
"లేచి తయారవండి, జాతరకెళ్దాం...వైజూ చీర కట్టుకోవూ... చీరలో చూడాలని వుంది!" ఆమె జడ కొసపట్టుకుని లాగుతూ బతిమాలాడు.
"నేనేం కట్టుకోను" కోపంగా అంది.
"ఏవీ కట్టుకోవా? నేకెడ్ గా వచ్చేస్తావా? అమ్మవారు పూనిందని కల్లుముంతలు తాగిస్తారు. ఆ తర్వాత గుడి కట్టేస్తారు. అప్పుడిక ఒకే ఊళ్ళో ఉండచ్చు మనం!"
"ఛీ...పో...నిన్నూ..." అని అతన్ని దిండు పెట్టి కొట్టింది వైజూ. దాంతో పరిస్థితి సరదాగా మారింది.
నేనూ, చిత్రా చుడీదార్స్ వేసుకున్నాం.
వైజయంతి మాత్రం ప్రింటెడ్ బ్లౌజు వేసుకుని, ఉల్లిపాయరంగు ఆర్గండీ చీర కట్టుకుంది. ఏడ్చినకళ్ళు ఉబ్బి అదోలాంటి అందంగా వుంది.
మళ్ళీ బండి వచ్చింది. బండిలో ఎవరికివచ్చిన బండి పాటలు వాళ్ళు పాడారు.
"అదిగో... అదిగో... అదిగో... అదిగో... తెల్లని కొంగలు బారులు... బారులు" ప్రతాప్ పాడ్తున్నాడు.
నా మనసు కూడా బండి కుదుపుకి తూలుతున్నట్లుగా వుంది!
ఈ అన్వేషణ ఫలిస్తుందా!
జనం చాలామందే వచ్చారు. అటూ ఇటూ దుకాణాలూ, బూరలూ, పిడతక్రింద పప్పులు అమ్మేవాళ్లూ, ఊపిరి తీసుకోనివ్వడం లేదు. కొబ్బరి కాయలు, పూలు తీసుకుని లైన్ లో నిలబడ్డాం. పోతరాజులు పెద్ద పెద్ద తాళ్ళతో కొట్టుకుంటూ పరుగులు పెట్టిస్తున్నారు జనాన్ని.
అంతా గొడవ గొడవగా వుంది. మా పక్కనే గొర్రెల్నీ, మేకల్నీ తెచ్చి బలి ఇచ్చేస్తున్నారు. రక్తం చిన్న కాలవలా పార్తోంది. నాకు కళ్ళు బైర్లుకమ్మాయి.
అతి కష్టం మీద ముందుకి కదుల్తున్నాం. లోపల తలవంచి చూస్తే చిన్నగుడీ, గుడిలో కళ్ళుమాత్రమే పసుపుముద్ద మీద కనిపిస్తూ అమ్మవారూ ఉన్నారు. నేను భక్తిగా కళ్ళు మూసుకుని 'చంద్ర నాకు కనిపించాలి' అని ప్రార్థించాను.
అందరం బైటికి వచ్చేశాకా -
"ఇక్కడ ఏం కోరుకున్నా తప్పకుండా కోరిక తీరుతుందిట. ఇంతకి ఏం కోరుకున్నారూ?" అడిగాడు ప్రతాప్.
"ముందు నువ్వు చెప్పు" అంది చిత్ర.
అతను నవ్వేశాడు.
"మా అందరికీ మనసుల్లో ఏం వున్నాయో విప్పి చెప్పుకొంటూనే వున్నాం... నువ్వు మాత్రం చెప్పలేదు!" నిష్టూరంగా అంది చిత్ర.
ప్రతాప్ నవ్వి వైజూ వైపు చూశాడు.
ఆమె కళ్ళల్లో ఆతృత దాగడం లేదు.
అతను ఆమె నుదుట కుంకుమ అద్ది "వైజూ ఏం కోరుకుందో అది జరగాలని కోరుకున్నాను" అన్నాడు.
అందరం ఒక్కసారిగా ఊపిరి పీల్చి వదిలాం.
వైజూ మాత్రం ఏడ్చేసింది. అతను ఆమెని దగ్గరగా తీసుకుని "పిచ్చిపిల్లా!" అన్నాడు.
నాకు ఆదృశ్యం మనోహరంగా అనిపించింది! జనమంతా మధ్యలో ఆగి నవ్వుతున్న మమ్మల్ని తోసుకుంటూ, వింతగా చూసుకుంటూ పోతున్నారు.
"అంతలో తప్పుకోండి... ఉరకండి... దున్న... దున్న..." అన్న కేకలు వినిపించాయి.
మేము కంగారుగా చూసేసరికే ఒక దున్నపోతు ఆవేశంగా తలవంచి రయ్యిన మావైపే దూసుకువస్తోంది. 'కె...వ్వు'మని అరుస్తూ మేము పరుగుపెట్టాం.
"ప్రతాప్" అని అరుస్తూ చీర కుచ్చిళ్ళు కాళ్ళకి అడ్డుపడి వైజూ క్రింద పడిపోయింది.
దున్నపోతు దగ్గరకొచ్చేస్తోంది. పరిగెడుతున్న ప్రతాప్ ఆగి వెనక్కి తిరిగి చూశాడు.
వైజూ లేచేలోగాదున్నపోతు ఆమె మీదకి వచ్చేస్తోంది.
"హే..." అని బిగ్గరగా అరుస్తూ వెళ్ళి ప్రతాప్ వైజూ ముందుకు దూకాడు. మరు నిమిషం దున్నపోతు కొమ్ముల మీదుగా ఎగిరి క్రిందపడ్డాడు.
* * *
వైజయంతి కొంగు నోట్లో కుక్కుకుని వెక్కివెక్కి ఏడుస్తోంది.
చిత్ర లోపల "డాక్టర్ ఏడి? ఎప్పుడొస్తాడు?" అంటూ నర్స్ తో ఘర్షణ పడ్తోంది.
ప్రతాప్ తలకి కట్టిన పట్టీలోంచి రక్తం టేబుల్ అంతా పరుచుకుంటోంది.
"నిజామాబాద్ తీస్కుపోండి... లేట్ అయితే పానానికి గ్యారంటీ లేదు!" చెప్పేసింది నర్స్.
వైజూ ఏడుపు స్థాయి పెంచేసింది.
"చిత్రా...నువ్వెళ్ళి టాక్సీ ఏదైనా దొరుకుతుందేమో చూడు!" అని నర్స్ ని "ఫోన్ ఎక్కడ?" అడిగాను.
"ఆడ..." చూపించింది.
చిత్ర బైటికి పరుగెత్తింది. చీకటిగా వుంది. టైం చూశాను. పన్నెండు "హల్లో...లిల్లీ...అర్జెంటుగా ఫోన్ విక్కి కియ్యి...టైంలేదు...ప్లీజ్..." కంగారుగా అన్నాను.
