Previous Page Next Page 
ఆలింగనం పేజి 75


    "మహా అయితే రెండో మూడో ఏళ్ళు అంతేనా?" అడిగింది వైజయంతి.

 

    "కాదు...ఇంటర్ లో ఉన్న నా తమ్ముడు మెడిసిన్ పూర్తి చేసేదాకా ఆగాలి. సుమారు ఆరేళ్ళు! వాడు ఎలాగు రేంక్ హోల్డర్ కాబట్టి సీటు వస్తుంది" అన్నాడు.

 

    "ఆగకుండా నేను వేరే పెళ్ళి చేసేసుకుంటే నీకు ఇష్టమేనా?" ఉక్రోషంగా అడిగింది.

 

    "నీ ఇష్టం!" అన్నాడు ప్రతాప్.

 

    "నేను అడిగేది నీ ఇష్టం గురించి" రెట్టించింది.

 

    "మన ఇష్టాల గురించి అవతలివాళ్ళని నిర్భంధించడం ప్రేమ అనిపించుకోదు!" అన్నాడు.

 

    "నువ్వూ...వేరే అమ్మాయిని పెళ్ళి చేసేసుకుంటావా?" ఏడుపు ఆపుకుంటూ అడిగింది.

 

    "ఉహూ! చెలియలేదూ... చెలిమిలేదూ... వెలుతురే లేదూ... అని పాడుతూ దేవదాసు అయిపోతా?" కొంటెగా నవ్వుతూ అన్నాడు ప్రతాప్.

 

    "సీరియస్ గా మాట్లాడు" విసుగ్గా అంది.

 

    ప్రతి విషయాన్నీ సీరియస్ గా తీసుకుంటే లోకంలో బ్రతకలేము వైజూ!" సిన్సియర్ గా అన్నాడు.

 

    "ఏం?" అన్నది వైజయంతి.

 

    "ఒక ప్రపంచ ప్రసిద్ధి పొందిన నటుడు, ఓ నర్తకీమణి, ఓ గాయని - ఇలా చాలామంది ప్రపంచం అంతా వాళ్ళ కాళ్ళకి నీరాజనాలు పడుతుంటే వాళ్ళు ఎవర్నో ప్రేమించి, భంగపడి, ప్రపంచానికి దూరంగా చీకట్లో మగ్గి, ప్రేమలో కృశించి ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే...కీర్తి, డబ్బు, కళ... ఇవేవీ వాళ్ళకి ప్రేమకన్నా ఎక్కువ అనిపించలేదు! అన్ని ఆనందాలనీ అధిగమించే బాధని బహుమానంగా ఇస్తుంది ఈ ప్రేమ. స్నేహం త్యాగాన్ని బోధిస్తుంది. ప్రేమ ఈర్ష్యని ప్రేరేపిస్తుంది! అటువంటి బాధలు మనకెందుకు వైజూ!" అన్నాడు.

 

    వైజూ కళ్ళు సజలాలయ్యాయి. "నిజంగా నన్ను ప్రేమించడం లేదా?" అడిగింది.

 

    "ఒద్దు వైజూ...హాయిగా స్నేహంగా ఉందాం. ఆ బాధలన్నీ పడే ఓపికలేదు. తమ్ముడ్ని చదివించాలి. ఇంటిని నడపాలి. పొలాన్ని అప్పుల వాళ్ళనించి విడిపించుకోవాలి. గరీబుగాళ్ళకి ప్రేమేంటి?" అన్నాడు.

 

    "అవేం మాటలు ప్రతాప్? అది అంతగా ఏడుస్తుంటే?" అన్నాను.

 

    "ఏడుస్తోందని ఓదార్చడానికి జాతరలో లక్కపిడతలు కొనిపెట్టినట్టు నన్ను కొని పెడతావా మీ ఫ్రెండ్ కి!" నవ్వుతూనే అడిగాడు ప్రతాప్.

 

    "నాకు అదంతా తెలీదు. నేను నిన్నే పెళ్ళి చేసుకుంటాను" ఏడుస్తూనే చెప్పేసింది వైజూ.

 

    "అమ్మా, నాన్నా అడిగినవన్నీ ఇస్తూ వుంటే ఇట్లాగే ఉంటుంది మరి! నీతో సీరియస్ గా మాట్లాడదామన్నా నీకా వయసురాలేదు" చిరాకు పడ్డాడు.

 

    "నీకు వైజూ అంటే ఇష్టంలేదా?" అని నేను అడిగాను.

 

    "ఉంది" వెంటనే చెప్పాడు.

 

    "అది ప్రేమ కాదా?" అడిగాను.

 

    "ప్రేమే. రామచిలుక అంటే ఇష్టం అని కొందరుతెచ్చి పంజరంలో బంధించి ముద్దు చేస్తారు. నేను అలా బంధించే టైప్ కాదు! ఆమె ప్రేమ అనే భ్రమలో ఉంది కదా అని... నాకోసం ఆరేళ్ళు ఆగు అని కండీషన్లు పెట్టి ఒక అగ్రిమెంట్ చేయించలేను!

 

    ఇంకో రెండేళ్ళకి ఆమె ఆలోచనాపరిధిలో...అభిప్రాయాల్లో, జీవనశైలిలో మార్పులొచ్చి 'అప్పుడెంత ఫూలిష్ గా ఆలోచించాను' అనిపించవచ్చు.

 

    ఏం ముక్తా? సందీప్ తో ప్రేమలో పడ్డప్పుడు నువ్వు అతను లేకుండా ఎలా బ్రతుకుతాను... చచ్చిపోవాలి అనుకోలేదూ! ఆ తర్వాత సిద్ధార్థని ప్రేమించాననుకున్నావు. ఇప్పుడు ఆ ఇద్దర్నీ మరిచిపోయావు. అయినా ఇంకా మనుషుల అభిప్రాయాలు మారవూ, ప్రేమ స్థిరమైనది అని నమ్మమంటావా?" సూటిగా అడిగాడు.

 

    "సంవత్సరాలకి పైగా ప్రేమించిన వాళ్ళకోసం కళ్ళు కాయలుకాచేలా నిరీక్షించే వాళ్ళు ఉండరంటావా?" అడిగాను.

 

    "జైల్లో వుంటే సంభవమేమో! బయట ఇన్ని ఇన్ని ఆకర్షణల మధ్య ఉంటే మాత్రం కుదరదు" ఠకీమని చెప్పాడు.

 

    అసలు విషయాన్ని ఎంత కరెక్టుగా చెప్పాడూ? ఈ సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేసుకోలేకనా ఆ ప్రేమికులంతా ఆత్మహత్యలు చేసుకున్నదీ!

 

    వైజూ మోకాళ్ళ మధ్యలో తలవాల్చుకుని సన్నగా ఏడుస్తోంది.

 

    "ఇప్పుడేం జరిగిపోయిందని ఆ ఏడుపు? నువ్వంటే ప్రతాప్ కి ప్రేమలేదు అనలేదుగా!" అంటూ ఓదార్చాను.

 

    ఎన్ని ఏళ్ళయినా ఎదురుచూసేటంత ప్రేమ లేదన్నాడుగా" ఉక్రోషంగా ముక్కులు ఎగబీలుస్తూ అంది.

 

    "నీకుంటే నువ్వు ఎదురుచూడు! నేను చూడు అసలు ముక్కూ మొహం తెలియని వ్యక్తికోసం ఎంత ఓపిగ్గా ఎదురుచూస్తున్నానో!" అన్నాను.

 

    "అతనెవరూ?" అని ప్రతాప్ అడిగాడు.

 

    నేను చంద్ర గురించి మొత్తం వివరించాను. అంతా విని "నీకు బాగా కావలసినవాడన్నమాట!" అన్నాడు.

 

    "ఆ..ఏ దిక్కూ లేకుంటే అక్క మొగుడే దిక్కు! అంటారుగా" అని నవ్వాను.

 

    "నీలో మార్పు కనిపిస్తోంది ముక్తా...అన్నింటికీ ఇదివరకులా కన్నీళ్ళు పెట్టుకోకుండా చక్కగా స్పోర్టివ్ గా తీసుకుంటున్నావు... వైజూకి కూడా అలా ఉండటం నేర్పించకూడదూ!" అన్నాడు.

 

    "అలా తయారవ్వడానికి ముందు కవ్వంతో మజ్జిగ చిలికినట్లు ఈ మనసుని ఎంత మధనం చేయాల్సొచ్చిందో నీకు తెలీదు" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS