"ఒక్కొక్కసారి నీ ఆలోచన ఎక్కడ వుంటుందో అర్ధంకాదు మిస్టర్ రామకృష్ణా. విజయరామ్ బ్యాంకాక్ వెళ్ళి ఆమెని కలుసుకుని విషయాలు అన్నీ మాట్లాడి వచ్చాడు. ఆమెకు ఇరవై లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా పే చేశాడు. అంటే విజయరామ్ ని కూడా గుర్తుపట్టదంటావా?"
అతని మాటలో అసహనం స్పష్టంగా కనిపించింది.
నాలిక కరుచుకున్నాడు రామకృష్ణ.
పైకి ఏ మాత్రం కనపడకుందా తనలో తాను నవ్వుకున్నాడు విజయరామ్. రామకృష్ణకి మతిమరుపు ఎక్కువ. ప్రతి విషయాన్ని చాలా త్వరగా మర్చిపోతుంటాడు.
"ఆ.... అవును....అవును" సర్దుకున్నాడు రామకృష్ణ.
"ఆల్ రైట్! రేపు ఆఫీస్ కారు తీసుకువెళ్ళండి. ఒక మంచి ఫ్లవర్ బొకే తీసుకువెళ్ళండి. అక్కడ మీరు ఏ పని చేసినా మన కంపెనీ ఇమేజ్ ప్రాజెక్ట్ అయ్యేలా చేయండి. ఆ తరువాతే ఆఫీసుకి రండి."
సరే అన్నట్లుగా తల వూపారు ఇద్దరూ.
"ప్లీజ్ గో ఎ హెడ్."
ఇద్దరూ చైర్స్ లోంచి లేచారు.
"అన్నట్లు అర్చన రాలేదా ఈ రోజు?" అడిగాడు స్వామినాధన్.
"లేదు" అన్నట్టుగా తల అడ్డంగా వూపాడు విజయరామ్.
"ఎందుకు?"
"ఆమెకు హెల్త్ బాగోలేదట."
"అంటే....జ్వరమా?"
"తెలియదు సార్....ప్రొద్దున్న ఫోను చేసి ఈ రోజు ఆఫీసుకు రావట్లేదు. ఒంట్లో బాగోలేదు అని చెప్పిందట."
"ఇట్సాల్ రైట్....యు కెన్ గో."
స్వామినాధన్ మాట విన్నాక కదిలారు యిద్దరూ.
"ఏమయి వుంటుందబ్బా....సాధారణంగా ఆమె ఎప్పుడూ ఆఫీసుకు రాకుండా వుండదు. హెల్త్ అంతగా బాగోలేదా! తెలుసుకుందాం' అనుకొని ఫోను లిఫ్టు చేసి ఆమె ఇంటి నెంబరు డయిల్ చేశాడు.
నాలుగు నిమిషాలుపాటు ఫోను రింగయింది.
కానీ....ఆ ఫోను ఎవరూ ఎత్తటం లేదు.
* * * *
ఫ్లైట్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఎగురుతోంది.
సుమారు ఏడు గంటల ప్రయాణం తరువాత ఫ్లైట్ ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్ట్ లో ఆగుతుంది.
అక్కడ అందరూ ఫ్లైట్ దిగాలి.
ఫ్లైట్ మొత్తం క్లీన్ చేస్తారు!
సుమారు రెండు గంటల వ్యవధిపాటు అక్కడ ఆగుతుంది.
ఆ సమయంలో ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న రెస్టారెంట్స్ లో తనచ్చు, డ్యూటీ ఫ్రీ షాప్స్ లో షాపింగ్ చేయవచ్చు.
ఫ్లైట్ ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్ట్ ని సమీపిస్తోంది.
డొమెస్టిక్ క్లాస్ లో ప్రయాణిస్తున్న ఆ వ్యక్తి ముఖంలో అసహనము కదలాడుతోంది.
రిస్ట్ వాచ్ లో టైం చూసుకున్నాడు.
ఒకసారి ఇటూ అటూ చూశాడు.
కొందరు నిద్రపోతున్నారు. కొందరు మ్యాగజైన్లు చదువుకుంటున్నారు.
సీట్లోంచి లేచాడతను.
అతని చెయ్యి కుడి జేబులోకి వెళ్ళింది.
* * * * *
బేగంపేట ఎయిర్ పోర్ట్....
సమయం ఉదయం తొమ్మిదీ యాభై....
మూడు, నాలుగు వందలమంది పోలీస్ డిపార్ట్ మెంట్ మనుషులు హడావుడిగా తిరుగుతున్నారు.
నలభైకి పైగా పోలీసు వాహనాలు అక్కడే పార్క్ చేసి వున్నాయి.
త్రీనాట్ త్రీ రైఫిల్ నుంచి హెవీ మెషిన్ గన్ వరకు, రకరకాల ఆయుధాలు పట్టుకుని అప్రమత్తంగా వున్నారు ఆ పోలీసులు.
జనాలనెవరినీ ఎయిర్ పోర్ట్ బిల్డింగ్ దరిదాపులకి కూడా రానివ్వటం లేదు వాళ్ళు.
మెయిన్ రోడ్ నుండి ఎయిర్ పోర్ట్ బిల్డింగ్ వరకు వున్న రోడ్డుకి ఇటూ అటూ కూడా ఎవరినీ అడుగుపెట్టనివ్వటం లేదు.
అదే సమయంలో....చెవులు చిల్లులు పడేలా రొద చేస్తూ ఎయిర్ పోర్ట్ బిల్డింగ్ వైపు దూసుకువచ్చింది పైలట్ వ్యాన్.
ఒక్కసారిగా ఎలర్ట్ అయింది అక్కడి పోలీస్ డిపార్ట్ మెంట్.
నిమిషం తరువాత వరుసగా దూసుకువచ్చాయి పదమూడు కార్లు....రెండు మారుతీ బిప్సీ వ్యానులు.
రెండు అబాసిడర్ కార్లలోంచి దూకినట్లుగా దిగారు ఎనిమిది మంది బ్లాక్ క్యాట్ కమాండోలు.
మధ్యలో ఉన్న మరో అంబాసిడర్ కారు చుట్టూ అటెన్షన్ లో బిలబడ్డారు....
వారి చేతుల్లోని ఎ.కె. 56 గన్స్ నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తున్నాయి.
కారు డోరు తెరుచుకోగానే బయటకు అడుగుపెట్టాడు సెంట్రల్ హోంమినిస్టర్.
ఆయన కారు దిగగానే అటెన్షన్ లో నిలబడి శాల్యూట్ చేశారు అక్కడి పోలీసులు.
ఎయిర్ పోర్ట్ బిల్డింగ్ వైపు నడక సాగించాడు హోం మినిస్టర్.
లాంజ్ బయట నిలబడి రెప్పవాల్చకుండా పరిసరాలని స్కాన్ చేస్తున్నాడు కౌశిక్.
హోం మినిస్టర్ స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళే వరకు ఎయిర్ పోర్ట్ దగ్గర సెక్యూరిటీ చూడవలసిన బాధ్యత అతనిదే. అప్పటికి మూడు రోజులుగా ఆ చుట్టుప్రక్కలే వుండాల్సి వస్తోంది.
హోంమినిస్టర్ టూర్ ప్రోగ్రాం పేపర్లలో ఇవ్వగానే అజ్ఞాత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ రావటం మొదలు అయ్యాయి "హోంమినిస్టర్ని బ్రతకనివ్వం...." అంటూ.
ఆయన మీద ఎటమ్ట్ చేయటానికి టెర్రరిస్ట్ లు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా వున్నాయి.
ఏ మాత్రం ఏమరుపాటుగా వున్నా....అంతే!
ఇంక కొద్ది నిమిషాలు....
ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళిపోతారు.
ఆయన ఫ్లైట్ టేకాఫ్ అయిపోయిందంటే రిలీఫ్....
ఎయిర్ పోర్ట్ లాంజ్ ని సమీపిస్తున్నాడు హోంమినిస్టర్....
* * * *
"కాళ్ళు నెప్పులుగా వున్నాయి గురూ!" ముందుకు వంగి రెండు చేతులతో మోకాళ్ళు పట్టుకుంటూ అన్నాడు విజయరామ్.
"ఈ హోంమినిస్టర్ ఈ రోజే రావాలా! మనం వచ్చి గంటన్నర అయింది. ఎయిర్ పోర్టు చుట్టుపక్కలకి అడుగు పెట్టనివ్వటం లేదు. మనం ఎయిర్ పోర్టుకి అరకిలోమీటరు ఇవతల వున్నాం. ఈలోపుగా ఆ సింగర్ వున్న ఫ్లైట్ వచ్చేస్తే....ఆమెని మనం కలవలేము కదా! మనం చూడకుండానే ఆమె వెళ్ళిపోతుంది" సమాధానం చెప్పాడు రామకృష్ణ.
"నీ తలకాయ. ఆ హోంమినిస్టర్ వెళ్ళిందాకా ఏ విమానాలూ ఇక్కడ దిగవు. అంతేకాదు! ఒక టాక్సీ డ్రైవరునికానీ, ఆటో డ్రైవరుని కానీ ఎవ్వరినీ ఈ చుట్టుపక్కల లేకుండా తరిమేశారు. నువ్వు అన్నట్లుగా ఒకవేళ విమానం దిగినా అందులోనుండి దిగిన పాసింజర్లు చచ్చినట్లు ఇక్కడి వరకు నడుచుకుంటూ రావాల్సిందే" కసురుకుని కొంచెం దూరంగా స్టాండ్ వేసి వున్న సుజుకి మోటార్ బైక్ మీద కూర్చున్నాడు.
ఆఫీసు కారుని అక్కడికి మూడు ఫర్లాంగుల అవతల పార్క్ చేసి రావాల్సి వచ్చింది వాళ్ళకి.
విజయరామ్ చెప్పింది నిజమే అనిపించింది రామకృష్ణకి.
కాబట్టి నిశ్చింతగా అక్కడే వుండి ఆమె కోసం ఎదురుచూడొచ్చు.
కానీ....ఆమె ఫ్లైట్ ఎప్పుడొస్తుంది? ఎంతసేపు ఎదురుచూడాలి?
* * * *
శరవేగంతో దూసుకుపోతున్నాయి మోటార్ బైక్స్.
ప్రాణాలకు తెగించిన రేస్ అది.
చూసే వాళ్ళ ఒళ్ళు గగుర్పు చెందుతోంది.
గంటకు నూటయాభై కిలోమీటర్ల పైగా వేగంగా దూసుకుపోతున్నారు రైడర్స్.
రెప్పవాల్చకుండా టి.వి. వైపే చూస్తోంది అర్చన.
గ్రాండ్ ప్రిక్స్ మోటార్ రేస్ లైన్ టెలికాస్ట్, ప్రైమ్ స్పోర్ట్ ఛానల్ లో వస్తోంది అది.
సరిగ్గా అదే సమయంలో....
కరెంట్ పోయింది.
"డామిట్" అసహనంగా అనుకుంది ఆమె.
"ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది. కరెంటు అయినా పోతుంది. టెలికాస్ట్ లో అయినా అంతరాయం జరుగుతుంది" అనుకుంటూ ఈజీ చైర్ లో వెనక్కి వాలింది ఆమె.
అప్పటికి రెండు రోజులుగా ఆమె ఆఫీసుకు వెళ్ళటం లేదు.
కారణం....ఆమె మానసిక స్థితి సరిగా లేదు.
చనిపోయిన ఆమె కొడుకు రూపంలో ఒక పిల్లవాడు కనిపించాడు. ఆ తరువాత ఆమె కొడుకు వుండే గదిలో 'నేను చావలేదు' అన్న అక్షరాలు రాసి వున్న కాయితం ఒకటి దొరికింది. అది తన కొడుకు చేతివ్రాత లాగే వుంది.
అదెలా సాధ్యం?
తన కొడుకు చనిపోయి సంవత్సరం అవుతోంది.
గత మూడు నాలుగు రోజులుగా ఆమెకు తన కొడుకు చావలేదేమో అని అనిపిస్తోంది.
