Previous Page Next Page 
మౌనం పేజి 6

    ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టేడియం  అది.

    కారణం....

    అమెరికన్  ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్స్  అక్కడే జరుగుతాయి.

    ఆమెతోపాటు అరవై  రెండుమంది  ఆర్కెస్ట్రా  వున్నారు.వాళ్ళందరూ  వుదయమే  ఫ్లైట్ లో ఇండియాకు  వెళ్ళిపోయారు. ఆమె పర్సనల్ సెక్రటరీతో  సహా. న్యూయార్క్ లోని ఏషియన్లు, ముఖ్యంగా ఇండియన్స్  ఆమెను కొద్దిగంటలైనా  వాళ్ళతో  గడపమని  రిక్వెస్ట్  చేయటంతో  కొద్దిగంటలు  ఆమెకు  అక్కడ  వుండక తప్పలేదు.

    అందుకే  ఇప్పుడామె  ఒంటరిగా  బయలుదేరింది.

    కారు ఫిఫ్త్ ఎవెన్యూ  బ్రిడ్జ్  మీద నుండి  వెళుతోంది.

    అంటే మరి నాలుగైదు  నిమిషాల్లో  జాన్ .ఎఫ్. కెనడీ  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వస్తుంది.

    ఇక్కడి నుండి  హైదరాబాదుకు  ఇరవై  గంటలపాటు  ప్రయాణం చేయాల్సి  వుంటుంది.

    కారు జె ఎఫ్ కె ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా  ఆఫీస్  దగ్గర ఆగింది. కారులోంచి  దిగిందామె.

    ఎయిర్ ఇండియాకి  ప్రక్కనే పాక్  ఎయిర్ లైన్స్  ఆఫీసు  కనిపిస్తోంది. మిగిలిన వాళ్ళు కూడా కారులోంచి  దిగారు.

    అప్పుడు  టైమ్  సరిగ్గా  ఏడూ  పది అయ్యింది.

    ఎనిమిదీ ముప్పై  ఫ్లైట్ బయలుదేరుతుంది.

    ఆమె తన బ్యాగేజ్ తీసుకుని  ఎయిర్ పోర్ట్ లాంజ్  వైపు నడిచింది.

    గేటు  దగ్గర  తన టిక్కెట్ చూపించి  లాంజ్ లోకి  ప్రవేశించిందామె. ఆ లాంజ్ లోకి  ప్రయాణీకుల్ని  తప్ప  మరెవరినీ  రానివ్వరు.

    ఎవరైనా  సెండాఫ్  ఇవ్వాలనుకుంటే  వాళ్ళు  మరొక దారి ద్వారా ఆఫ్ స్టెయిర్స్ కి రావాలి.

    అక్కడ మళ్ళీ  ప్రయాణీకులతో  కలిసి  మాట్లాడవచ్చు.   

    ఆమె తన లగేజ్ బరువు చూపించి, చెక్ చేయించుకుంది.

    ఆమె బ్యాగేజ్ వివరాలు  అన్నీ నోట్ చేసిన  కార్డ్  ఒకటి  ఆమె టిక్కెట్ తో పాటు   పిన్ చేసి యిచ్చాడు  అక్కడి ఇన్ ఛార్జ్.

    ఇప్పుడామె  తన వ్యానిటీ  బ్యాగ్ తో  మిగిలింది.

    అక్కడి  నుండి  ఆమె ఎయిర్ పోర్ట్ టాక్స్  కౌంటరు  వైపు కదిలింది.

    అక్కడి  నుండి  వెళ్ళే  ప్రతి వ్యక్తి  ఇరవై   డాలర్లు  ఎయిర్ పోర్ట్ టాక్స్ కట్టాల్సి వుంటుంది.

    కౌంటర్ లో ఇరవై  డాలర్లు  ఉంచి  రసీదు  తీసుకుని ఇటువైపు  తిరిగిన ఆమె దృష్టి ఓ వ్యక్తిమీద  నిలిచిపోయింది.

    అదే వ్యక్తి....

    లిఫ్ట్ లోకి  పరిగెత్తుకుంటూ  వచ్చి  ఎక్కిన వ్యక్తి.

    నీగ్రోలాంటి వ్యక్తి.

    రెప్పవాల్చకుండా  ఆమెనే చూస్తున్నాడు.

    ఆ వ్యక్తి  ఇక్కడికి ఎందుకు  వచ్చాడు?

    అతను  కూడా ప్రయాణికుడా!

    అంతే అయి  వుండాలి.

    కేవలం  ప్రయాణీకులకి  మాత్రమే  అక్కడికి  అనుమతి  వుంది. అది ఎయిర్ ఇండియాలాంజ్  కాబట్టి, అతను కూడా ఇండియా  వస్తున్నాడేమో!

    నిర్మొహమాటంగా  రెప్పవాల్చకుండా  ఆమెనే  చూస్తున్నాడతను.

    తల తిప్పుకుని  'ఐ_94' కార్డ్  రిటర్న్ చేసే  వైపు  కదిలింది. అక్కడ దిగిన ప్రతివ్యక్తికి 'ఐ_94 అనే  కార్డు  ఇస్తారు. దానిని  భద్రంగా తమతో  వుంచుకోవాలి. తిరిగి  ఆ దేశం విడిచి  వెళ్ళేటప్పుడు  ఎయిర్ పోర్ట్ అధికారులకు  తిరిగి ఇవ్వాలి. ఆ పద్ధతి  ప్రకారమే  ఆ కార్డ్ వాళ్ళకి తిరిగి ఇచ్చివేసింది.

    ఆమె ఫ్లైట్  నెంబరు  ఎఐ. 112.    
   
    ఆ ఫ్లైట్ కు వెళ్ళే  పాసింజర్స్   గేట్  నెంబరు  28 దగ్గరకి వెళ్ళమని  అనౌన్స్ మెంట్  వినిపించింది.

    ఫ్లైట్ బయలుదేరటానికి  ఇంకా  అరగంట  టైమ్ వుంది. ఫార్మాలిటీస్  అన్ని పూర్తయిపోయాయి.

    ఆమె ఎస్కలేటర్స్  మీదుగా  ఫస్ట్ ఫ్లోర్ ను చేరింది.

    మరోదారి  ద్వారా  ఆ ప్రదేశాన్ని చేరిన  ఎనిమిమందీ  ఆమె కోసం ఎదురుచూస్తున్నారు.

    ఆ ఎనిమిదిమందిలో  ముగ్గురు  ఇండియన్స్, ఒక నేపాలీ, ఇద్దరు మలేషియన్లు, మరో ఇద్దరు  మారిషయన్లు  వున్నారు.

    "మీ అభిమానానికి  చాలా కృతజ్ఞతలు" హృదయపూర్వకంగా  అంది. వారి సంభాషణ  ఇంగ్లీషులో  సాగుతోంది.

    తన పర్సనల్  లైఫ్ గురించి  ఏవేవో  ప్రశ్నలు  అడుగుతున్నారు.

    వాళ్ళకి సమాధానాలు  చెబుతున్న  ఆమె తన ప్రక్కగా  ఎవరో భుజాలు రాసుకుని  వెళుతున్నట్లు  అనిపించి తల తిప్పి  చూసింది.

    అదే వ్యక్తి....

    క్రింద  లాంజ్ లో కనిపించిన  వ్యక్తి.

    తనని  చూసి  అదోలా  నవ్వాడు.

    ఆ నవ్వులో కౄరత్వం  కనిపించింది.

    ఎవరితను....? ఎందుకిలా  ఫాలో  అవుతున్నాడు....?

    ఆమెకు  ఒకింత  భయంగా  అనిపించింది.

    వాళ్ళు అడిగే ప్రశ్నలకి  ఆమె సమాధానాలు  చెబుతోందే  కాని ఆమె ఆలోచన  ఆ వ్యక్తి  మీదే వుంది.

    పాసింజర్స్ ని ఫ్లైట్ లోకి ఎక్కమంటూ  అనౌన్స్ మెంట్  వినిపించింది.

    వాళ్ళ దగ్గర  సెలవు  తీసుకుందామె.

    ఆ కొద్ది గంటల్లోనే  వాళ్ళు  ఆమెకెంతో  సన్నిహితులయ్యారు.

    ఆమె అప్పుడే  వెళ్ళిపోతోందే  అన్న  బాధ  వాళ్ళ కళ్ళలో  కదిలింది.

    సంజు వాళ్ళకి  దూరంగా  నడిచింది.

    ఆమె కనుమరుగయ్యే  వరకు  వాళ్ళు  చేతులు  వూపుతూనే  వున్నారు.

    ఫ్లైట్ కి  ఎటాచ్  అయి వున్న  వెస్టిబ్యూల్ లో  గుండా  ఆమె నడవసాగింది.

    ఎవడో ఆమె భుజాన్ని  ఢీకొట్టి  ముందుకు వెళ్ళిపోయాడు.

    ముందుకు  తూలబోయి  సర్దుకొని  చూసింది.

    అతనే....ఆ వ్యక్తే.

    ఆమెలో  భయం  అధికమైంది.

    ఆమె ఫ్లైట్ లోకి వెళ్ళి  ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో  తన సీట్లో  కూర్చుంటూ  కలయ జూసింది.

    ఆ వ్యక్తి  ఎక్కడా కనపడలేదు.

    అంటే, అతను  డొమెస్టిక్  క్లాస్ లో  ఎక్కి వుండాలి  అనుకుంది.

    ఆమె కళ్ళకు  అతని  ముఖం  కనపడకపోవటం  గొప్ప  రిలీఫ్ గా అనిపించింది.

    సీట్లో  కూర్చుని  కళ్ళు  మూసుకుందామె.

    అంతవరకు ఆనందంగా  గడిచిన ఆమెకు ఆ వ్యక్తిని చూసిన  దగ్గర నుంచి  ఒక విధమైన  కలత  మొదలయింది.

    ఏ ఉద్దేశంతో  తనను  వెంటాడుతున్నాడు?

    ఏం కావాలతనికి?

    సమయం....ఎనిమిది  ముప్పయి....

    చెవులు  చిల్లులు  పడేలా  రొద చేస్తూ  టేకాఫ్ అయింది  ఫ్లైట్.


                       *    *    *    *

    "గుడ్ ఈవెనింగ్  సార్" జంటిల్ గా విష్  చేసి  స్వామినాధన్ రూమ్ లోకి  ఎంటర్ అయ్యాడు  విజయరామ్.

    తల వంచి  ఏదో ఫైల్స్ చూసుకుంటున్న  స్వామినాధన్ విజయరామ్ గొంతు  వినిపించడంతో  తల ఎత్తి  చూశాడు.

    "ఆ....కమాన్ విజయ రామ్....నీ గురించే  ఎదురు చూస్తున్నాను. అలా కూర్చో"చైర్ చూపించాడు.
   
    అతను కూర్చున్నాడు.

    కాలింగ్ బెల్  నొక్కాడు  స్వామినాధన్.

    కొద్ది  క్షణాల  తర్వాత  ప్యూన్  వచ్చాడు.

    "క్లెయింట్  రిలేషన్స్ ఆఫీసర్  రామకృష్ణని  యిలా  రమ్మని  చెప్పు."

    తల వూపి  వెళ్ళిపోయాడతను.

    "నీకు  తోడుగా  రామకృష్ణని  కూడా పంపుతాను. బోత్  ఆఫ్ యు డీల్ విత్ దిస్."

    "అలాగే సార్."

    అదే సమయంలో  డోరు  తీసుకుని  లోపలికి  వచ్చి  విష్ చేసి  నిలబడ్డాడు  రామకృష్ణ.

    "ప్లీజ్  బి సీటెడ్" అతనికి  కూడా చైర్ చూపించాడు  స్వామినాధన్.

    టేబుల్ మీద ఉన్న ఫైల్స్ ని ప్రక్కకు  జరిపి  ఆ ఖాళీ  ప్రదేశంలో మోచేతులు  ఆన్చి  మాట్లాడటం  మొదలుపెట్టాడు  స్వామినాధన్.

    "సంజు  రేపు  హైద్రాబాద్  వస్తోంది. ఉదయం  పదిన్నరకు  ఫ్లైట్ లాండ్ అవుతుంది. ఆ టైముకి  మీరిద్దరూ  ఎయిర్ పోర్ట్ కి వెళ్ళండి. ఆమెకు  వెల్ కం చెప్పండి."

    "సర్.... బట్....ఆమెను  రిసీవ్  చేసుకోవటానికి  ఆ మ్యూజిక్ ప్రోగ్రాం  ఆర్గనైజర్స్ వున్నారు. ఆమెకు  కృష్ణా ఒబెరాయ్  హోటల్ లో సూట్ బుక్ చేశారు. అందువల్ల  మనం  ఆమెను  రిసీవ్ చేసుకునే ఛాన్స్ ఎక్కడ వుంటుంది?" 
 
    "నో నో....మిమ్మల్ని  రిసీవ్ చేసుకోమని  చెప్పటంలేదు. జస్ట్ విష్ చేసి రండి. ఆ తర్వాత  హోటల్ కి వెళ్ళి  ఆమెతో  వివరంగా  మాట్లాడవచ్చు."

    "ఆమె మమ్మల్ని గుర్తు  పట్టటం ఎలా? మేమెవరో  ఆమెకు  తెలియదు కదా!" అని రామకృష్ణ  అడిగిన  ప్రశ్నకు  ఒకింత  విసురుగా  ముఖం  పెట్టాడు  స్వామినాధన్.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS