చాపలు దొరికిన రోజున వేరే పొయ్యి పెట్టి వొండుకుంటాడు. కాని తరవాత వాసన! నా కడుపులో వికారం పెట్టేది. అది చూసి క్రమంగా చాపలు తినటం మానేశాడు. కాని ఆధ్యాత్మిక ప్రేమగల నా భర్త, ఎన్నిసార్లు నేను యేడ్చినా, ఆ ముక్కు పొడుం మాత్రం మానలేదు. 'చాపల వాసన అమీర్, నా దగ్గిరికి రావొద్దు' అంటే ఆ రాత్రంతా దూరంగా కూచుని నన్ను చూస్తూ తృప్తిపడేవాడు. నేనే వుండలేక అతన్ని లాక్కుని వికారపడి కక్కేసేదాన్ని పశుకామం! ఏం చెయ్యం?
మధ్యాహ్నం గాలం యేట్లో వేసుకుని, గానుక చెట్టు నీడలో కూచుని కునికిపాట్లు పడడం యెంత హాయిగా వుంటుందని! ఎండ మచ్చలతో పోట్లాడే నీటి కెరటాలనీ, తొరగా కొట్టుకువచ్చే చెత్తనీ, నురుగునీ, అవతలవేపు నీళ్ళలో వొంగుతూ లేస్తున్న తుంగనీ, దూరపు కొండల మారే రంగుల్నీ, అట్లా సోమరిగా చూస్తూ కళ్ళు సగం మూసుకుని, నా జుట్టు అమీర్ మెడమీద యెగురుతోంటే, అట్లానే యేమీ ఆలోచనలన్నా లేకుండా, యింకా కావాలనే కోర్కె, ఆధారాలు ఏమీ లేకుండా పడుకోడం, సుఖాలు వొదిలి పరమాత్మలో యేకమయే ఆనందమంటారే- అలాంటిదేగావు ననిపిస్తుంది.
ఇంక రాత్రులు. యేం రాత్రులని? మాకు వెన్నెల వొచ్చినా సంతోషమే, చీకటిగా వున్నా సంతోషమే. మబ్బుపట్టినా సరే అన్నిట్లోనూ ఆనందం కనపడేది. కూచోడం కష్టమైనట్టు కాళ్ళూ, చేతులూ ఆడబోతాయి. ఏదో ఆనందం, యేమిటో చెయ్యమని పురిగొల్పుతుంది. కూచుని వూరికేనా లేక నవ్వుతో పరిగెత్తడం, తప్పించుకోవడం, దాక్కోడం, అందినా అందుకోనట్టూ అందనట్టూ నటించడం, అంతా అనుభవం కలిగినా, ఇష్టంలేనట్టూ, కొత్తవారైనట్టు నటించడం, అలిసి కిందపడగానే రెండోవారు కూడా అక్కడే పడి.... మనుషుల కుండే బద్ధకాలూ, చికాకులూ మర్యాదలూ పోయి అందమైన మృగాలమల్లే, పిల్లి పిల్లలవలె ఆడుకునే వాళ్ళం.
మొదట నా సౌందర్య బాధని పొందినవాడు అమీర్. ప్రపంచమంతా వెతికి నన్నేరుకున్నట్టున్నాడు. ఆనాటి ఉదయం ఆఫీసు గదిలో నా వీపు చూడగానే నేనే తనకి కావాలని, నేను తప్ప ఎవ్వరు అక్కర్లేదనిపించిందని చెప్పాడు.
ఆ రాత్రులు ఈ భూమి మీదేనా, యే ఇంద్రజాల లోకాలలో నన్నాననా, అదంతా కలా, భ్రాంతా, ఈ ప్రపంచమే యింత అందంగా వుండగలదా అనిపించేది నాకు. కాని అమీర్ మాత్రం అమితమైన బాధపడేవాడు. ఒక్కొక్కప్పుడు జాలి వేసేది. భయమేసేది. కాని ఆ బాధే తన ఆనందమంటాడు. ఏమిటంటే- ఆనందం చూసి వెర్రెత్తిపోతాడు అతడు. ఒక్క నిమిషం నా వొంటిమీద బట్టని నిలవనియ్యడు. నా రెవికలన్నీ ఒక్క పదిరోజులలో చించేశాడు. మళ్ళీ కుట్టుకోలేదు. ఏం లాభం? చీరెలు చిరిగిపోయినాయి. కాని ఏమైతేనేం? చీరెలు చూస్తాడా అమీర్. నా వొంటిని చూస్తాడు గాని, అక్కడ పేరంటాలా భోజనాలా? చీరెల విలువనిబట్టి మనుషుల విలువ నిర్ణయిస్తారా, మీ వూళ్ళల్లో మల్లే!"
వెన్నెల వొచ్చిందంటే ఆ బయలంతా క్షీరసముద్రమూ, స్వర్గమూ, ఆకాశమూ అయిపోయేది. అమీరంత గొప్ప హృదయం కలవాడు, సౌందర్య పిపాస గలవాడు, అన్నాళ్ళు మా ఊళ్ళో పని లేకుండా ఊరికే ఎలా పడివున్నాడా అని ఆశ్చర్యం వేస్తుంది ...... కొంతసేపు తాకితే నలిగిపోతానేమో, మల్లెపువ్వునో వెన్నెల రేఖనో అన్నట్టు పెదవుల చివర్లతో, గాలిమల్లేనూ, మల్లెపువ్వుల మల్లేనూ, వేళ్ళకొనలతో నీటి, అలల వలెనూ, కుక్కపిల్లలవలెనూ తాకి ఒళ్ళంతా తిమ్మరింతలు పరిగెత్తిస్తాడు. ఊరికే యెదురుగా నుంచుని నన్ను చూసి, వెర్రెత్తిన వాడివలె నా పేరు పిలుస్తూ కూచుంటాడు. చేతులతో నా తలని రెండువేపులా పట్టుకుని నన్నేదో ప్రశ్నిస్తున్నట్టు నా కళ్ళలోకి చూస్తూ అరగంట నుంచుంటాడు. వున్నట్టుండి నా చీరెనీ ఒక్క ఊపుతో లాగేసి నిర్జీవమైన మైదానం మధ్య నుంచోపెట్టి, చేతులు పైకెత్తించి నా చేతుల్ని, నా రొమ్ముని, అన్నివేపుల్నించీ అలా రెప్పవేయక చూస్తూ నుంచుని నన్ను పక్కలకి వొంచి నా నడుం దగ్గర సాగే వొంపుల్ని తాకి, వెనకనుంచి నన్ను తనకేసి వొంచుకుని, నా గడ్డం కింద వేళ్ళు కదిలిస్తూ, మెడ నున్నతనానికి మురిసి ఆనందించేవాడు. నా భుజాల వెనక చూస్తే నల్లని మబ్బుల్లోని నీటిభారం తోస్తుందిట. నా నడుం వొంపుల్ని చూస్తే మా యేరు చప్పున వొంగి తిరిగినచోట కలవరపడే ప్రవాహపు నునుపు తోస్తుందిట. నా మెడమీద రేఖలు చూస్తే సోమరి అలలమీద మెత్తని యెండ ప్రతిఫలించి మెల్లిగా పైకి ప్రాకే కాంతి గీతలు కనపడతాయట.
అలా అంటూ అంటూ చప్పున గోదావరి మీద లేచే ఎండాకాలపు తుఫానువలె విజృంభించి నన్ను కావలించుకుని, వూయించి, తిప్పేసి అలవ కొడతాడు. ఒక్కక్కప్పుడు అతను నన్ను విరిచేస్తాడేమో, తినేస్తాడేమో అన్నంత భయమేసేది. నా మొహాన్ని ఆ వెన్నెట్లో ముద్దు పెట్టుకున్నాడంటే, నా వూపిరి ఆగి, కళ్ళు తిరిగి చెమటలు పోసేవి. నన్ను అదుముకుని, యింకా అదుముకుని, ఇంకా తనలో నన్ను కలిపేసుకోవాలని అతను పడే బాధని చూస్తే నేను బతకడమే ఇతనికి ఇష్టంలేదా? ఆ కళ్ళలో వెలిగేది ద్వేషం కాదా అనిపించేది. తన పెదవులతో తన చేతులతో నా నున్నటి శరీరాన్ని వొత్తెయ్యడం, నలిపెయ్యడం, తన కాళ్ళతో నా కాళ్ళని మెలిపెట్టి విరిచెయ్యడం చూస్తే, యితనికి సౌందర్యం విరోధమా, దాన్ని ధ్వంసం చెయ్యాలని చూస్తున్నాడా అని అనుమానపడతాను.
ఇలా ఒక్క నిమిషం వ్యవధి లేకుండా బాధపడి అలిసిపోయి నిరాశ చెంది, నా పాదాల మీద పడి 'ఎలా? యేంచెయ్యను? యెంతసేపు?' అని యేడుస్తాడు. నిజంగా యేడుస్తాడు. మళ్ళీ చప్పున పళ్ళు పటపట కొరికి, దడిసి వెనక్కి తగ్గే నన్ను యీడ్చి కావలించుకొని, లాక్కుని, పర్వతపు గుహల్లో వీచే సముద్రపు తుఫాను గాలివలె వూపిరి పీలుస్తూ నన్ను భుజం మీద, చంపలమీద యెక్కడపడితే అక్కడ, సున్నితమైన స్థలాల కొరికి చంపేస్తాడు. అతని బరువును భరించలేక కిందపడి పోతాననుకుంటాను. నేను బాధతో అరిచిన కొద్దీ నా పెదిమల రక్తం అలా పీల్చి చంపేసే రాక్షసి కాదుకదా! అని వొణుకుతాను.
సగం చచ్చి పడుకున్న నాకు యెడంగా పడుకుని చేతిమీద తల నానుకుని నా వంక చూస్తూ వుంటాడు. నాకు సిగ్గయి అతని చెంపలమీద చేతులు వేసి, 'ఏమిటి అలా చూస్తావు?' అని అడిగితే యేమీ మాటాడడు. నేనట్లా నిద్రపోయి యే మూడు జాములకో లేచి చూస్తే, ఇంకా అట్లా చూస్తూనే పడుకొని వుంటాడు. దుప్పటికిందనుంచి గుండ్రంగా యెత్తుకున్న నా రొమ్ము గర్వాన్నీ, నా భుజాల దగ్గరనించి పిరుదల కిందకి తిరిగే విల్లువొంపునీ, నా చేతుల సన్నతనపు జారునీ, నా వొంటిమీద పాకే నా జుట్టుని, దోసెళ్ళలో వుంచుకొని, వేళ్ళలో నుంచి జారుస్తూ భుజాలమీదా. మొహం మీదా కప్పుకుంటూ గడిపాడు నాలుగు గంటలసేపు. ఏటిలో రోజూ కడిగి నూనె నెరగని జుట్టు నా మెడమీద అల్లరిగా పడడం అతనికెంతో యిష్టం. నా జుట్టు అతనికి కొత్తగా కోసిన వరిగడ్డి వాసనా, అరేబియా గుర్రపు శుభ్రమయిన పరిమళమూ తలపింప జేస్తుందట.
