ఇంక భోజనం భోజనమంటే, ఒకరికెదురుగా ఒకరం కూచునీ, ఒకరి నొకరం కళ్ళతో తాగెయ్యడమన్నమాట. మెతుకులమీద బతికామా, ఆనందంమీద కాని....రుషులు వాయుభక్షణ చేసి జీవించినట్టు! మొదట్లో నేనే వేరే తినేదాన్ని. కాని తన యెంగిలి మూతితో నన్ను ముద్దు పెట్టుకుంటూ వుంటే,ఏం లాభం మడిగా వేరే మూకుట్లో తిని? నాకు చేతకాలేదు' వేశ్యల ఎంగిలి రుచులు చవిచూసి కూడా కులం నిలుపుకునే నేర్పరితనం మీ శ్రోతీయులకి మాత్రమే చాతనవును. ఏం తిన్నానో, యెలా తిన్నానో ఆ భోజనం యెలా సయించిందో నాకు జ్ఞాపకం లేదు; అర్థంకాదు. ఈనాడు మళ్ళీ మా ఆయన యింట్లో నేను వుండడమే తటస్థిస్తే మళ్ళీ నెయ్యీ, పప్పూ, పులుసూ వుంటేగాని ముద్ద దిగదు. కాని అమీర్ చూపుల కలవరంలో నా మనసు నిండి, అతని పెదవుల రుచి నా నోటిని కరిగిస్తూ వుంటే ఏం తింటున్నానో స్ఫురణకి వస్తుందా?
మధ్యాహ్నమంతా గొంగళి వేసుకుని చింతచెట్టు కింద పడుకుంటాము. మన దొడ్లల్లో చింతచెట్లున్నాయి. కాని చింత చిగురుకీ కాయలకీ తప్ప యెన్నడన్నా వాటివంక చూస్తామా? ధైర్యముంటే, యింటికి వెళ్ళగానే, నువ్వు మధ్యాహ్నం దానికింద గొంగళి వేసుకొని వెల్లకిలా పడుకుని ఆకాశంవంక చూడు. ఆ సన్నని ఆకులు కట్టే ఆకుపచ్చ అద్దాల మెడలోంచి ఆకాశ నీలపు నిగ్గుల కప్పులమీద తెల్లమేఘాలు తేలిపోతూ వుంటే....కాని లాభంలేదు. ఆ అందం కనబడ్డానికీ, కారణంలేని ఆ ఆనందం గుండెల్లో పొంగి, ఆ రంగుల బాధని స్ఫురింప జెయ్యడానికీ, అమీర్ చెయ్యి నీ నడుంమీద వుండాలి! నీ వేళ్ళు అతని మెత్తని జుట్టులో ఆడుకుంటూ వుండాలి. కాంతి పల్చని ఆకుల్లో పడితే పెద్ద మందిరాల్లో కిటికీల్లోనుంచీ, తలుపుల్లో నుంచీ లోపలికి పాకి, తివాసీలు, అద్దాలు, పటాల మీదనించి, అందాన్ని పొందే విచిత్రమైన మెత్తనికాంతి వుంటుందే, అలా కనపడేది ఆ చెట్ల కొమ్మల మధ్య వెలుతురు ఒక్కటే. తమాషా రంగుల పిట్టలు వచ్చి కూచుని, తొంగిచూసి, చిన్న చిన్న పలుకులూ, యీలలూ ఆ ఆకుల గుహల్లోంచి పలికేవి. ప్రేమ చూపుకునేవి, నిశ్చలలైన మధ్యాహ్నం కునుకుపట్టే వేళ ఆప్టిలు పలుకుతో పాడుతో వుంటే మనుషులదికాని గొప్ప సంతోషం కలిగి దాన్ని భరించలేక అమీర్ని కావలించుకుంటాను....చూడు అర్ధరాత్రి చిన్న వాయువులమీద నువ్వెన్నడూ వినని కొత్తపాట చెవిని తాకితే, యేటి నీటిలోంచి నువ్వెన్నడూ యెరుగని యేదో కొండ గడ్డివేళ్ళ వాసన వస్తే, యెలాగో యేదో మరచిపోయిన సుందరానుభవాలు మనసుకి తట్టవా? అలా స్ఫురించేది ఆశ్చర్యంగా, ఆ పక్షి రెక్కల్లోంచి చిన్న యీకె గాలిలో సోమరిగా తేలుతూ వచ్చి వాలేది నామీద. దాని పాటలతోకూడా ఎక్కడో, ఎప్పుడో, ఏ జన్మలోనో అనుభవించి, అధికానందం పొందిన విషయాలు అలా బాధపెడతాయి గావును మనసుని! ఆ పిట్టలన్నీ నాకు గుర్తు. ప్రతి మధ్యాహ్నమూ యెదురు చూసేదాన్ని. ఏదో బంధుత్వం నాకూ వాటికీ వున్నట్లే తోచేది.
అన్ని దిక్కులా రాత్రి కమ్ముకున్నప్పుడు, యీదురు గాలిలో నిప్పు ముట్టించి మళ్ళీ బియ్యం వండేదాన్ని. అంత చీకట్లోనూ, గాలిలో వూగే- వొకటే మంట వెలిగించడం యెంతో గంభీరంగా వుంటుంది. ఇద్దరి మొహాలమీదా వెలుగు చీకట్లు వుయ్యాల లూగుతూ, ఆ పొయ్యి దగ్గర కూచుని వుడికే అన్నపు సంగీతానికి ఆకలితో వుడికే పొట్టలు గంతులేస్తో.... వొంటరిగా లోకానికంతా చక్రవర్తులవలె కూచుంటాము. ఎందుకో విశాలమైన మైదానంలో రాత్రులు ఆకాశంకింద మంట, యేవో యెరగని భావాల్ని కలిగిస్తుంది.
ఒక్కొక్కరోజు అమీర్ మధ్యాహ్నమప్పుడు యేట్లో చాపలు పడతాడు. ఆ చాప బైట గిల గిల కొట్టుకోవడమూ, దాని ముక్కులోంచి నెత్తురు రావడమూ చూస్తే నేను భరించలేను. అతని పక్కన భుజంమీద చెయ్యేసుకుని, బెండు కదిలే సమయానికి అతని తలని లాక్కుని వొదలక గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకునేదాన్ని. ఉత్తగాలం అతను పైకి లాగినప్పుడు సంతోషిస్తాను. కాని చాలాసార్లు వెర్రిచాప దాన్ని కరుచుకొనే వుండేది. ఒకసారి నాలుగు చాపల్ని అతను చూడకుండా నీళ్ళలో వొదిలి పెట్టాను. ఏవి అని అతను అడిగితే పొదలోకి పారిపోయాయి అన్నాను. ఎట్లా నవ్వాము౧ మేము స్నానం చేసేటప్పుడు ఆ చాపలు మమ్మల్ని నీటి అడుగున తాకితే, దూడలూ, కుక్కపిల్లలూ అనేదాన్ని. స్వచ్చమైన నీళ్ళల్లో ఆడే వాటి తోకల్ని చూసి, నేను పరిగెత్తేప్పటి నా పిరుదుల కదలికలాగా వుంటుందని ముచ్చటపడేవాడు అమీర్. అన్నం పడేస్తే అన్నీ వచ్చి మూగేవి. పిచ్చి మూతులు చాచుకుని, వాటి నెట్లా గాలంతో చంపేవాడో!
'వాటిని చంపడం పాపం కదూ!'
'పాపమేమిటి? దేముడే చంపుతున్నాడు ప్రతి నిమిషమూ లోకాన్ని!'
'అయితే మనుషుల్ని కూడా తిను.'
'కొందరు మనుషుల్ని తప్పకుండా తింటారు. ముఖ్యంగా బొర్ర ప్లీడర్లు బహురుచిగా వుంటారు.'
