"స్సాలే... ఎవడ్రా నువ్వు..." బండబూతులు తిడుతూ లేచి, పరుగు, పరుగున, ముందుకొచ్చి, బలంగా మెడపట్టుకుని, విసురుగా బైటకు లక్కొచ్చి రోడ్డుమీదకు తోసేసాడు.
ఆ బలమైన తోపుడికి, హీరోహోండాని రాసుకుని కిందపడిపోయాడు ఆ వ్యక్తి.
"కబడ్ధార్......వెర్రిమొర్రి వేషాలేసావంటే....కాల్చి పారేస్తాను....జాగ్రత్త" రైఫిల్ ని ఎత్తిపట్టుకుని అరుస్తున్నాడు కానిస్టేబుల్.
కిందపడిన ఆ వ్యక్తిలో అంతవరకూ ఉన్న సహనం చచ్చిపోయింది. అతన్లో ఆలోచన పూర్తిగా మృగ్యమైపోయింది.
విసురుగా లేచి, పెనుబలంతో ముందుకొచ్చి, కానిస్టేబుల్ మీద పడ్డాడు. తన మీద కొస్తున్న ఆ వ్యక్తిని, అడ్డుకోడానికి కానిస్టేబుల్ రైఫిల్ ని అడ్డంగా పెట్టాడు.
రైఫిల్ మీద చెయ్యేసి, కానిస్టేబుల్ షర్టుని పట్టుకుని, బర, బరా ముందుకు లాక్కొచ్చి, బంతిని తిప్పినట్టు, గిర గిరా తిప్పాడు.... ఆ విసురుకి కానిస్టేబుల్ నడిరోడ్డుమీద కొచ్చి పడ్డాడు.
"ఎవడనుకున్నావ్....రా....బోసడికే....తోలు తీసేస్తాను..." కానిస్టేబుల్ వేపు చూసి, గర్జించి అరిచి-
"ఎవడ్రా...స్టేషన్లో ఉన్నది" అనుకుంటూ, ముందుకెళ్ళబోతున్న ఆ వ్యక్తి, పోలీస్ కానిస్టేబుల్ అరుపుకి, తలతిప్పి వెనక్కి చూసాడు.
"ఒరేయ్... ఆగరా.... నువ్వు స్టేషన్.... లోపలికి ఒక్కడుగు వేసావో....కాల్చేస్తాను! ఒరేయ్....ఆగరా" భీకరంగా అరుస్తూ రైఫిల్ ని ఆ వ్యక్తి గుండెకు, ఎయిమ్ చేసి, ముందుకొస్తున్నాడు కానిస్టేబుల్ అంతవరకూ ఓ వింతను చూస్తున్నట్టుగా చూస్తున్న జనం, ఈ సంఘటనతో బెంబేలెత్తిపోయారు.
అదే సమయంలో కోపంగా ఆ వ్యక్తి ముందుకు అడుగేయడం, కానిస్టేబుల్ చేతిలోని రైఫిల్ పేలడం, ఆ శబ్దానికి జనం పరుగులు తీయడం....అంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది.
స్టేషన్లోంచి, బైటకొచ్చిన పోలీస్ సిబ్బందికి, ఏం జరుగుతోందో అర్ధంకాలేదు.
అదే సమయంలో ఆ వ్యక్తి-
మెట్లమీంచి ఎగిరి, పోలీస్ కానిస్టేబుల్ మీద పడ్డాడు. పోలీస్ కానిస్టేబుల్ చేతిలోని రైఫిల్ ఎగిరి, దూరంగా పడిపోయింది...పరుగు, పరుగున వెళ్ళి ఆ రైఫిల్ ని అందుకున్నాడు కానిస్టేబుల్.
తన మీదకు దూసుకొస్తున్న, ఆ వ్యక్తి వేపు గురి చూస్తూ కాల్చడం ప్రారంభించాడు.
రైఫిల్ లోంచి దూసుకొస్తున్న తూటాల శబ్దంతో, అబిడ్స్ జంక్షన్ హోరెత్తిపోయింది.
ప్రాణభయంతో... జనం... ఎటు చూస్తే అటు, పరుగులు తీయడం ప్రారంభించారు...
ఎక్కడ వాహనాలు... అక్కడ ఆగిపోయాయి.
ఎవరికీ ఏమీ అర్ధంకాని పరిస్థితి....అయిదు నిమిషాల్లో....అబిడ్స్ జంక్షన్ నిర్మానుష్యమైపోయింది.
సరిగ్గా అదే సమయంలో-
పెను వేగంతో వచ్చి ఆగింది ఓ పోలీస్ జీప్ ఆ జీపుని దూరం నుంచి చూడగానే కానిస్టేబుల్ తగ్గిపోయాడు.
ఐలాండ్ దగ్గర పోలీస్ జీప్ ఆగడం, అందులోంచి ముందు ఏ,సి.పి. ఆ వెనుక సబ్ ఇన్ స్పెక్టర్, సర్కిల్ ఇన్ స్పెక్టర్ దిగడం....కొంతమంది పోలీసులు కానిస్టేబుల్ని పట్టుకుని, అతని చేతిలోని రైఫిల్ ని తీసుకోవడం-
మరి కొంతమంది, ఆ వ్యక్తిని చుట్టుముట్టడం-
అంతా ఎమోషన్.... అంతా గందరగోళం.
"వాట్... హేపెండ్.... వాట్ హేపెండ్..." అరుస్తున్నాడు ఎ.సి.పి.
"వాడెవడో.... స్టేషన్ మీదకి దాడి చేస్తుంటే.... ఎటాకిచ్చాను సర్..." కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ దూరంగా పోలీసుల మధ్య నున్న ఆ వ్యక్తిని చూపిస్తూ అన్నాడు కానిస్టేబుల్.
"ఎవడ్రా... వాడు....ఇలా తీసుకురండి..." ఎ.సి.పి. కోపంగా ముందుకు రాబోతూ-
పక్కకి తప్పుకున్న పోలీసుల మధ్యలో కన్పించిన వ్యక్తిని చూసి, ఆశ్చర్యపోయాడు.
"సూర్యవంశీ.... నువ్వా... ఏంటయ్యా... ఇది...." ఏ.సి.పి గొంతులో, అయోమయం, ఆతృత....సంశయం... చికాకు అన్నీ ఏకకాలంలో ధ్వనించాయి.
ఎ.సి.పి. నిరంజనరావు వేపు చూసి నవ్వాడు సూర్యవంశి.
అరగంట గడిచింది.
జరిగిందంతా విని, ఎ.సి.పి. నిరంజనరావు, ఫెళ్ళున నవ్వాడు....నిరంజనరావు ఎదుట సూర్యవంశి, ఆ పక్కన ఎస్.ఐ, సి.ఐ.లు....దూరంగా హెడ్ కానిస్టేబుల్, అతని పక్కన తలవంచుకుని, సూర్యవంశీ మీద దాడి చేసిన కానిస్టేబుల్ ఏడుకొండలు ఉన్నారు.
"చూడు సూర్యవంశీ....నువ్వెవరో, ఏమిటో తెలీక....మా ఏడుకొండలు చేసిన రాద్దాంతం ఇది-మూడ్రోజులైంది కరీంనగర్ నుంచి వచ్చి - ఎవరో, ఏమిటో తెలీక పోవడం వాళ్ళ జరిగిన తప్పు...." ఏడుకొండలు వేపు చూస్తూ అన్నాడు నిరంజనరావు.
"తప్పు.... నాది కూడా వుంది...." మరేమనాలో తెలీక అన్నాడు సూర్యవంశీ.
"ఏడు కొండలూ...." ఏ.సి.పి. పిలుపుకి ముందుకొచ్చి నిలబడ్డాడు ఏడుకొండలు వినయంగా.
"సూర్యవంశీ ఎవరో తెలుసా.... గ్రేట్ క్రైమ్ రిపోర్టర్.... పోలీస్ డిపార్ట్ మెంట్లో, ఎస్.ఐ.....పోస్టుని వదులుకుని, జర్నలిజం లోకెళ్ళినవాడు ఒక రకంగా మన డిపార్ట్ మెంట్ మనిషే మన పోలీస్ డిపార్ట్ మెంట్ చేతకాక వదిలేసిన ఎన్నో కేసుల్ని - తనొక్కడే - సాల్వ్ చేసిన వ్యక్తి-" ఏభైఏళ్ళ నిరంజనరావు చెప్పుకుపోతున్నాడు.
"సారీ....సర్." అప్రయత్నంగా అన్నాడు ఏడుకొండలు.
"సారీ చెప్పినంత మాత్రాన, రైఫిల్ ని మిస్ యూజ్ చేసినందుకు శిక్ష ఉండదనుకున్నావా..... రేపు గోషా మహల్లో, టెన్ టైమ్స్ రౌండ్స్ కొట్టు"
ఎ.సి.పి నిరంజనరావు మాటలకి తలెత్తి ఏడు కొండల వేపు చూసాడు సూర్యవంశీ.
"ఆ రౌండ్స్ ఏవో నేను కొడతాను లెండి..." నవ్వుతూ అన్నాడతను. ఏడుకొండలు కళ్ళల్లో, పశ్చాత్తాపం కన్పించింది-సూర్యవంశీ వేపు స్నేహంగా చూసాడు.
మరో పది నిమిషాల తర్వాత-
"మా గురుగుగారి మర్డర్ కేస్.... డిటైల్స్...ఏవైనా.....తెలిసాయా సర్...."
సరిగ్గా వారంరోజుల క్రితం, తను ఊళ్ళోలేని సమయంలో జరిగిన జగన్నాయకులు దారుణమైన మర్డర్ ను గుర్తుకు తెచ్చుకుంటూ అడిగాడు సూర్యవంశీ.
