Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 60


    ఇది ఆదిత్యకిచ్చిన వెసులుబాటుగా ఆదిత్య సైతం గుర్తించలేదు.
    
    ఇక్కడ తనను ఆదిత్యగాని, ప్రణయగాని అపార్ధం చేసుకోకూడదని రోహిత్ చేసిన తెలివైన ప్రయత్నం సామాన్యంగా అందరూ చెప్పగలిగే లెక్కని అడగడం.
    
    "మైలు పొడవులో అంగుళాలు ఎక్కువ ఉన్నాయా, లేక వెయ్యి సంవత్సరాల కాలంలో ఆదివారాలెక్కువా?"
    
    కష్టమైన ప్రశ్నకాదు. కాని ఆదిత్యకి ఒక నిమిషం వ్యవధి చాలలేదు.
    
    రోహిత్ చెప్పాడు "మైలులో అంగుళాలే ఎక్కువ అంటే 63,360 ఆదివారాలు 52,000 మాత్రమే."
    
    "ప్లీజ్! ప్రొసీడ్!" అలసటగా అన్నాడు ఆదిత్య.
    
    "వారంలో సెకెండ్స్ ఎక్కువా, లేక వంద మైళ్ళలో అడుగులు ఎక్కువా?"
        
    ఇదీ పెద్ద లెక్క కాదు అయినా గడువులో చెప్పలేకపోయాడు ఆదిత్య.
    
    "వారంలో సెకెండ్స్ 6,04,800. అదే మైళ్ళలో అడుగులు 25,28,000 సో... సెకెండ్స్ ఎక్కువ."
    
    ఆదిత్య ఫాలభాగం పైన స్వేదం పేరుకుపోయింది.
    
    రోహిత్ ఉత్సాహంగా అడిగాడు. "ఎనమండుగురు పదహారు బావుల్ని ముఫ్ఫైరెండు రోజుల్లో తవ్వితే, అదే సైజు బావుల్ని ఎనిమిది తవ్వటానికి నలుగురు వ్యక్తులు ఎంతకాలం తీసుకుంటారు?"
    
    వ్యవధి చాల్లేదు ఇక్కడ కూడా.
    
    "మిస్టర్ ఆదిత్యా! ముఫ్ఫై రోజులు అన్నది ఆన్సర్."
    
    టెక్నిక్ తెలిసిపోయిన రోహిత్ ఉద్విగ్నంగా అడిగాడు మరో ప్రశ్న.
    
    "వెనిజులా దేశానికి చెందిన మాతృభాష స్పానిష్. ఆ దేశానికి చెందిన జాతీయగీతం తొలి చరణాన్ని ఇంగ్లీషులో చెప్పాలి."
    
    చెప్పలేకపోయాడు ఆదిత్య ఇదికూడా.
    
    నవ్వాడు రోహిత్. "గ్లోరీ టు ది బ్రేవ్ నేషన్ అనే భావం వచ్చే మొదటి వాక్యం వెనిజులా జాతీయ గీతంలా వుంటుంది."
    
    "ఓవర్" ప్రణయ జోక్యం చేసుకుంది.
    
    అయినా ఇప్పుడామె మొహంలో టెన్షన్ లేదు. ప్రశాంతత నటిస్తుందో, నిజంగా ప్రశాంతంగానే వుందో బోధపడటంలేదు ఆదిత్యకి.
    
    "అరగంటలో మొత్తం రోహిత్ అడిగిన ప్రశ్నలు 27 ఆదిత్య చెప్పలేకపోయినవి ఏడు జవాబులు అంటే....ఫెయిల్యూర్ 25.92 శాతం."
    
    మరోసారి చెప్పింది. "ఇరవై అయిదు పాయింట్ తొమ్మిది రెండు శాతం ఆదిత్య ఫెయిల్యూర్ ఇప్పుడు రెండవ అరగంట పోటీ మొదలుకావాలి."
    
    స్వేదాన్ని తుడుచుకున్నాడు ఆదిత్య.
    
    "సరిగ్గా ఇప్పుడు ఆరు గంటల అయిదు నిమిషాలు కావస్తూంది. అంటే ఆరూ ముఫ్ఫైదాకా ఆదిత్య కంటిన్యూ చేయాలి."
    
    హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది అక్కడ.
    
    జీవితంలో తొలిసారి ఆదిత్య అలాంటి సన్నివేశంలో చిక్కుకోవడం.
    
    ఒట్టి ఓటమి మాత్రమే అయితే అంత బాధపడేవాడుకాదు. కాని ఇది మనసుకీ, జీవితానికీ సంబంధించిన సమస్య.
    
    ప్రణయను తను ప్రేమించడమే నిజమైతే ఇక్కడ ఓటమి తననే కాదు, ప్రణయనీ బాధిస్తుంది.....బహుశా ఓ జీవితకాలం....
    
    రోహిత్ చాలా తెలివిగా తనను నిస్సహాయ స్థితిలోకి నెట్టి ఇబ్బంది పెట్టాడని క్రమంగా అర్ధమవుతూంటే ప్రశ్నలడగటం ప్రారంభించాడు ఆదిత్య.
    
    "స్త్రీలు ఉపయోగించే సౌందర్య సాధనాల గురించి రాయబడిన తొలి గ్రంథాన్ని రాసిందెవరు?"
    
    "రోమన్ కవి ఓవిడ్. క్రీస్తుశకం పదవ సంవత్సరంలో రాశాడు" టక్కున జవాబు చెప్పాడు రోహిత్.
    
    "ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కువ ఖర్చుపెట్టి తీసిన సినిమా?"
    
    "రష్యన్ డైరెక్టర్ సెర్గీ దర్శకత్వం వహించిన చిత్రం... వార్ అండ్ పీస్"
    
    "ఎలక్ట్రికల్ హాట్రిక్ అంటే?"
    
    "పందొమ్మిదవ శతాబ్దంలో మైకేల్ ఫేరడే అనే బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు ఒక ఏడాదిలో డైనమోని, ట్రాన్స్ ఫార్మర్ ని, డైరెక్ట్ కరెంట్ మోటార్ ని కనిపెట్టాడు. ఇప్పటి ప్రపంచానికి ఉపయోగపడుతున్న ఆ మూడింటిని ఒకే వ్యక్తి ఒకే ఏడాది కనిపెట్టడాన్ని ఎలక్ట్రికల్ హాట్రిక్ అంటారు"
    
    "ఒక యువకుడి శరీరంలో సగటున వుండే నీరు?"
    
    "సుమారు నలభై అయిదు లీటర్లు అంటే అతడి మొత్తం బరువులో అరవై అయిదు శాతం."
    
    "పన్నెండు వాల్యూమ్స్ గల అక్స్ ఫర్డ్ డిక్షనరీలో మొత్తం ఎన్ని పదాలున్నాయి?"
    
    "నాలుగు లక్షల పధ్నాలుగు వేల ఎనిమిదివందల ఇరవైఅయిదు."
        
    "మొదటి ప్రపంచ యుద్దంలో చనిపోయిన డెవిస్ కప్ వింబుల్డన్ ప్రఖ్యాత టెన్నిస్ ప్లేయర్ ఎవరు?"
    
    "న్యూజిలాండ్ కి చెందిన ఆంథోనీ వైల్దింగ్"
    
    "ది ఫెదర్ ఆఫ్ ది డాన్ కవయిత్రి ఎవరు?"
    
    "సరోజినీనాయుడు."
        
    "కౌబోయ్స్ మాట్లాడుకునే మాండలికంలో 'జయ' అనే ఓ తెలుగుపదం లాంటిది వాడతారు. దాని అర్ధం?"
    
    "కాఫీ"
    
    "ఆంధ్రాలో మొదటి రైలుమార్గం ఎక్కడనుంచి ఎక్కడిదాకా వేయబడింది?"
    
    "1862లో పుత్తూరునుంచి రేణిగుంటదాకా."
    
    "బొబ్బిలి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?"
    
    వెంటనే జవాబు చెప్పలేదు రోహిత్... క్షణం తర్వాత అన్నాడు.
    
    "1757లో"
    
    "రైట్...!" రోహిత్ ను అభినందిస్తూ క్షణమాగాడు ఆదిత్య.
    
    రోహిత్ ను అంతర్జాతీయ సంఘటనలకి సంబంధించి నెగ్గటం కష్టమని బోధపడిపోయింది ముందే.
    
    కాని భారతదేశానికి సంబంధించిన రెండు మూడు ప్రశ్నలకి జవాబు చెబుతూ రోహిత్ కాస్త తొట్రుపడటం స్పష్టంగా అనిపించడంతో ఏ మార్గంలో క్విజ్ కొనసాగించాల్సిందీ నిర్ణయించుకున్నాడు ఆదిత్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS