"ఏనుగు గర్భం ధరించాక ప్రసవానికై ఇరవై రెండు నెలల కాలాన్ని తీసుకుంటుంది"
"సముద్రంలో సుమారు మూడువేల మైళ్ళు ప్రయాణంచేసి ఆతరువాత గుడ్లు పెట్టి అక్కడ బ్రతుకుపై రోతపుట్టి కావాలని చనిపోయే చేప పేరు?"
"పసిఫిక్ సాల్మన్."
ఆగిపోయాడు రోహిత్. ఆదిత్య సామాన్యుడు కాడని బోధపడిపోయింది. ఇక మిగిలింది ఇరవైరెండు నిమిషాలు. చాలా సునాయాసంగా దూసుకుపోతున్నాడు.
"ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువకాలం బ్రతికే ప్రాణి?"
"తాబేలు"
"ఒలింపిక్స్ లో ఇచ్చే బంగారు పతకాల్లో వుండే బంగారంశాతం?"
"5.2 శాతం"
రోహిత్ లో సహనం నశించిపోతూంది "మెక్సికో ఒలింపిక్స్ లో వండర్ గర్ల్ గా ఖ్యాతి పొంది, ఆ తరువాత క్యాన్సర్ తో చనిపోయిన యువతి?"
"ఇంగ్లండ్ కి చెందిన లిలియన్ బోర్డ్."
"డామిట్!" అనుకున్నాడు రోహిత్. "దూరదర్శన్ ద్వారా తొలిసారి టెలికాస్ట్ చేయబడిన ఒలింపిక్స్ జరిగిందెక్కడ?"
"1948 లండన్ లో."
"1895లో ఏథెన్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో పాల్గొన్న కాంపిటీటర్స్ ఎంతమంది?"
"ఐ థింక్..." అనుమానంగా అన్నాడు ఆదిత్య. "పదకొండు వందలమంది."
"రాంగ్" టక్కున చెప్పాడు రోహిత్. "కేవలం మూడువందల పదకొండు మంది మాత్రమే పాల్గొన్నారు."
"ఓ.కే." మరో జవాబు చెప్పడంలో విఫలమయిన ఆదిత్య టైమ్ చూసుకున్నాడు. ఇంకా మిగిలింది పంతొమ్మిది నిమిషాలు."
"ఆర్నీథాలజీ అంటే?"
"పక్షుల గురించి తెలియచేసే సైన్స్"
"భారతదేశం స్వాతంత్ర్య సమరంలో పోరాటం సాగించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి అద్యక్షురాలయిన తొలి మహిళ?"
"ఐర్లేండ్ కి చెందిన డాక్టర్ అనిబిసెంట్."
"పిల్లుల్ని గురించి భయపడే మానసిక రుగ్మత నేమంటారు?"
"గేటోఫోభియా."
"జపాన్ కి చెందిన దీవి పేరు?"
"హూన్షు"
"ప్రపంచంలో అన్ని అడవులకంటే పెద్ద అడవి ఎక్కడుంది?"
"రష్యాకి చెందిన కోనీ ఫెరాస్ పారెస్ట్."
"ఫిలాసఫీ అనే పదం ఏ భాషనుంచి పుట్టింది? ఆ భాషలో దాని అర్ధం."
"గ్రీకు భాషనుంచి పుట్టిన ఫిలాసఫీకి అర్ధం 'లవ్ ఆఫ్ విజ్ డం.'"
"ఒలింపిక్స్ హాకి మాచ్ లో ఇంతవరకూ ఎక్కువ గోల్స్ చేసిన వ్యక్తి?"
"భారతదేశానికి చెందిన రూప్ సింగ్. 1932 ఒలింపిక్స్ లో పన్నెండు గోల్స్ చేశాడు."
"భూమి కొలతని నిర్ధారించాలని ప్రయత్నించిన తొలి శాస్త్రజ్ఞుడు?"
"పైథాగరస్."
"డబ్బుని కాగితం రూపంలో ప్రవేశపెట్టిన మొదటి దేశం?"
"చైనా."
"ప్రముఖ కవి లార్డ్ టెన్నిసన్ మాటల్లో లవ్స్ కర్స్ అంటే?"
"అసూయ"
విసిగిపోతున్నాడు రోహిత్. తను ఎదుర్కొంటున్నది సామాన్యుడిని కాదని బోధపడిపోవటమే కాదు బలంగా అర్ధమైపోయింది.
ఇక మిగిలింది పది నిమిషాలు. సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు రోహిత్.
తను గెలిచి తీరాలి. తన అహాన్ని చల్లార్చుకోవటానికి మాత్రమే కాదు ప్రణయని శాశ్వతంగా తనదానిగా మార్చుకోవటానిక్కూడా.
జవాబు ఆలోచించుకోడానికి తాను ఇచ్చిన గడువు ఒక్క నిమిషం అంటే అరవై సెకండ్లు.
అప్పటికి తోచింది తనెలాంటి ప్రశ్నల్ని అడగాలీ అన్న విషయం.
"నౌ" ప్రసన్నంగా చూశాడు ఆదిత్యవేపు. "ఇక మిగిలింది తొమ్మిది నిమిషాలు. ఆ నంబర్నే ఉపయోగిస్తూ ఓ ప్రశ్న అడుగుతాను. తొమ్మిదిని మూడుసార్లు ఉపయోగించి కావాలనుకుంటే 'మైనస్' గుర్తుని కూడా వాడుకుంటూ ఒకటి వచ్చేట్టు చేయగలగాలి ఎలా?"
ఆదిత్య ఓ ధ్యానంలా కళ్ళు మూసుకున్నాడు. తొమ్మిది.... తొమ్మిది....నైస్ టు ది పవరాఫ్ నైన్. సరైన మార్గంలోనే ఆలోచిస్తున్నాడు కాని ఒక్క నిమిషం గడువు పూర్తయిపోయింది.
"టైమ్ దాటిపోయింది ఆదిత్యా! జవాబు నేను చెబుతాను" గర్వంగా అన్నాడు రోహిత్. "నైన్ టు ది పవరాఫ్ నైన్ మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ టూ నైన్ టుది పవరాఫ్ జీరో అంటే ఒకటి..."
"రైట్!" అంగీకరించాడు ఆదిత్య.
మేథమేటిక్స్ లో అంతగా పరిజ్ఞానం లేని ప్రణయ టెన్షన్ గా చూస్తూంది ఆదిత్యనే.
పోటీలో ఏదో అపశృతి మొదలైనట్టు అర్ధమైంది కాని, అదేమిటో ఖచ్చితంగా ఆమెకు బోధపడలేదు.
"ఎలాగూ మనం పేపరూ, పెన్సిలూ వాడే అవకాశం, నియమం లేదు కాబట్టి వెంటనే చెప్పండి. ఒకటి నుంచి రెండు వందలదాకా మొత్తం నెంబర్లని కలిపితే సంఖ్యెంత?"
"సింపుల్ మిస్టర్ రోహిత్ ! 20, 100."
"ఎలా చెప్పగలిగారు?"
"మొదటి నంబరుని ఆఖరి నంబరునీ కలిపి వందచేత గుణిస్తే వస్తుంది. అంటే ఒకటిప్లస్ రెండు వందలు అంటే 201 దాన్ని వందచేత గుణిస్తే 20, 100"
