"వద్దురా. అయిదు చాలు" అంటూ ఆ నోటు మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు.
విజయ్ అది తీసుకొని అయిదు రూపాయల నోటిచ్చాడు. ప్రసాదరావు బయటికెళ్ళిపోయాడు.
ప్రసాదరావు ఇన్ కమ్ టాక్స్ ఇన్ స్పెక్టర్ చేసి, నిరుడే రిటైరయ్యాడు. ఆయనకొచ్చే పెన్షన్ తో రెండొందలు సొంత ఖర్చులకుంచుకుని మిగతాదంతా యింటి ఖర్చుల కోసమని కొడుక్కిచ్చేస్తాడు. వొద్దన్నా వినడు. "ఈ డబ్బు నా దగ్గిరుంచుకుని ఏం చేస్తానురా. ఇంటి అవసరాల కోసమని నీ దగ్గరే వుంచు" అంటాడు. మధ్యలో అయిదూ, పది అవసరమైతే కొడుకుని అడిగి తీసుకొంటూ ఉంటాడు. ఆయనకదో సరదా.
* * * *
ఆదివారం.
ఉదయం ఎనిమిది గంటలకు విజయ్ ముందు గదిలో కూర్చుని పేపరు చదువుకుంటున్నాడు.
"నమస్కారమండి" అని గొంతు విని తలెత్తి చూశాడు. గుమ్మంలో ఓ ముప్ఫ అయిదేళ్ళ వ్యక్తి నిలబడి వున్నాడు.
ఎప్పుడో చూశాననిపించింది.
"నా పేరు సుబ్బారావండీ. ఈ ప్రక్క భాగంలో ఉంటున్నాను" అని ఆ మనిషి పరిచయం చేసుకున్నాడు.
"లోపలకు రండి" అన్నాడు విజయ్ మర్యాదగా.
సుబ్బారావొచ్చి అతనికెదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు.
"రిప్రజెంటేటివ్ ఉద్యోగం కదండీ. ఎప్పుడూ టూర్ ప్రోగ్రాంలో ఉంటాను. అందుకని మీరీ యింట్లోకొచ్చి పదిహేనురోజులయినా పరిచయం చేసుకోలేకపోయాను. ఏమీ అనుకోకండి" అన్నాడు.
"ఫర్వాలేదులెండి" అన్నాడు విజయ్.
"మీరు...ఎందులో పనిచేస్తున్నారు?" అనడిగాడు సుబ్బారావు. అతని ధోరణి ఇంటర్వ్యూ చేస్తోన్న పద్ధతిలో ఉంది.
"విజయ్ చెప్పాడు"
భేష్ బావుంది. మీ డిపార్టుమెంటులో జీతాలు కూడా బావుంటాయనుకుంటాను.
విజయ్ మాట్లాడలేదు.
"అయినా జీతాలదేముందులెండి. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అంటే అబ్బో! చెప్పనవసరం లేదు. చేసుకో రంగయ్యా" అంటూ చేసుకోవటమే. ఎట్లా లేదన్నా...నెలకు పది పదిహేను వేలరూపాయలు, మూడునాలుగేళ్ళు ఆగితే ఇలాంటి బిల్డింగులు రెండు మూడు లేపేయొచ్చు, ఏమంటారు?"
అతని ధోరణి విజయ్ కు నచ్చలేదు. కాని అతన్లో బలహీనతల్లా ఏమిటంటే అతని వ్యక్తి ప్రవర్తనగాని ధోరణి గాని తనకు నచ్చకపోయినా, ముఖంలో విముఖం వ్యక్తం చెయ్యడానికి మొహమాట పడతాడు. ఈ మొహమాటాల వల్లే జీవితంలో అర్థంలేని చిక్కులు అప్పుడప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాడు.
"నాకలాంటి అలవాట్లు లేవండి" అన్నాడు.
"లేవా? భలే వారే" అని అదో పెద్ద జోకయినట్లు పెద్ద పెట్టున నవ్వాడు.
విజయ్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు.
సుబ్బారావు జేబులోంచి ఓ సిగరెట్ ప్యాకెట్ తీశాడు. "మీరొకటి తీసుకోండి" అన్నట్టు చేతిని విజయ్ వైపు జాపాడు.
"నాకలవాటు లేదండి"
"అలవాటు లేదా? బలేవారే" అని అటూ యిటూ చూస్తున్నాడు.
"ఏం కావాలి?" అనడిగాడు విజయ్.
"యాష్ ట్రే"
"మా యింట్లో ఎవరికీ సిగరెట్లు అలవాటు లేదండి. అందుకని యాష్ ట్రేలు కూడా ఉంచలేదు."
"అదేమిటి? మీకలవాటు లేకపోతే వచ్చే గెస్టులు తాగొచ్చుగా అంటూ సిగరెట్ కాలుస్తూ వచ్చే యాష్ కిటికీలోంచి బయట దులుపుతున్నాడు.
"ఆఁ అన్నట్టు మీరు సెలవు రోజుల్లో, ఆదివారాలూ, అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారు?" అన్నాడు సుబ్బారావు కొంచమాగి.
"ఇంట్లోనే ఉంటాను. పుస్తకాలు చదువుకోవడమో, లేకపోతే యింట్లో మిగతా సభ్యులతో మాట్లాడుతూ గడపడమో చేస్తాను. ఎప్పుడన్నా ఓసారి సినిమాకి వెళతాము.
"ఫ్రెండ్స్ తోటేనా అదీ..."
"అలవాటు లేదండి"
"లేదా? భలేవారే" అంటూండగా సుజాత లోపల్నుంచి కాఫీ కప్పు తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయింది.
ఆమె అందం చూసి సుబ్బారావు విభ్రాంతుడయ్యాడు. తనకి భార్యని పరిచయం చేస్తాడేమోననుకున్నాడు. చెయ్యకపోయేసరికి విసుక్కున్నాడు.
"కాఫీ తీసుకోండి" అన్నాడు విజయ్.
"మీరు?"
"నేనప్పుడే రెండుసార్లు తాగేశాను. యింక తాగను."
"మీకన్నీ క్రమశిక్షణతో కూడిన అలవాట్లున్నాయే. నాకయితే...రోజుకి ఇరవైసార్లు తాగినా అభ్యంతరం ఉండదు. అఫ్ కోర్స్ కాఫీ ఒక్కటే కాదనుకోండి" అంటూ హహహహ నవ్వాడు.
"కాసేపు కూర్చుని సుబ్బారావు వెళ్ళిపోయాడు.
* * * *
"వదినా" అంటూ లోపలికొచ్చాడు వినోద్.
"పేపర్ చదువుతున్నదల్లా తలెత్తి అతని ముఖంలోకి చూసింది.
"వదినా" అన్నాడు మళ్ళీ.
"చెప్పు వినోద్"
అతనికి వదిన దగ్గర చాలా చనువు, గారాబం.
"ఒక వందరూపాయలు కావాలి?"
"దేనికి?"
"ఈ ఊళ్ళో కొత్తగా ఓ గార్ మెంట్స్ షాపు పెట్టారు. అందులో మంచి మంచి టీ షర్టులు పెట్టారు. చాలా స్టయిల్ గా ఉన్నాయి! రెండు కొనుక్కుంటా వదినా?"
సుజాత లేచి బీరువాలోంచి వందరూపాయలు తీసి అతనికిచ్చింది.
"వదినా? నిన్నిబ్బంది పెట్టానా?"
"లేదు"
"ఒట్టు?"
"ఈ ఒట్లూ అవీ నాకు రుచించవు. నీకెక్కువ ఒట్టులు లేవని నాకు తెలుసు. మీ అన్నయ్యతో చెప్పి వీలు చూసుకుని, రెండు మూడు పెయిర్స్ కుట్టిద్దామని నేనే చూస్తున్నాను."
