Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 6


    
    "వ్వాట్?" ఉలిక్కిపడ్డాడు ఆదిత్య. "నేనా?"
    
    "ఎస్....నువ్వే...! ఆక్కడ నీ పేరు ముందే ప్రపోజ్ చేశాను ఆదిత్యా!"
    
    ఇప్పటికి అర్ధమైంది ఆదిత్యకి. వస్తూనే తన సహాయాన్ని కోరడంలో ఉద్దేశం ఇప్పటికి తెలిసినా అంగీకరించలేకపోయాడు. "వద్దు నా మాట విను."
    
    "మాట ఇవ్వడం జరిగింది."
    
    "నేనైనా గెలవగలనని నమ్మకం లేదు."
    
    "నాకుంది."
    
    "సూరి ప్లీజ్!"
    
    "ఆదిత్యా!" సూరిలో ఇప్పుడు ఉద్విగ్నత లేదు. యధాలాపంగా అన్నాడు- "తెగిన తీగల్ని కొనవేళ్ళకు చుట్టుకుని రుద్రవీణని శృతి చేసి నిన్ను విశ్వ విజేతగా నిలబెట్టాలని నేను కోరుకోవడం లేదు. సమస్యల సాలభంజికల్ని నీ పైకి మళ్ళించి నువ్వు నిబ్బరంగా నిలబడగలిగే విక్రమాదిత్యుడివో, కాదో తెలుసుకోవాలని నేను ఉబలాటపడటం లేదు ఆదిత్యా! కేవలం నాకు మాత్రమే తెలిసిన నీ మేధతో నువ్వు గెలిచి, నన్ను గెలిపించమంటున్నాను."
    
    "నేను అంత సమర్దుడిని కాదు."
    
    "అయినా అప్పుడు శిక్ష అనుభవించేది నేను... నువ్వు కాదు!"
    
    "అలాంటి శిక్షకి నువ్వు సిద్దపడేకన్నా పందెం నుంచి పక్కకు జరగడం బెటర్."
    
    "జరిగే ప్రసక్తి లేదు. కారుడ్రైవరుగా ఉండటానికి సిద్దపడతాను."
    
    "ఎందుకీ మొండితనం?" బాధగా అన్నాడు ఆదిత్య. "నా మాట విను సూరీ!"
    
    "ఈ ప్రపంచంలో నాకు మిగిలిన ఒకే ఒక్క ఆత్మీయుడిగా నిన్ను నేను తొలిసారి కోరింది ఇది మాత్రమే ఆదిత్యా! కేవలం ఆ భావంతోనే నీ అనుమతి లేకుండా నీ పేరు నేను ప్రపోజ్ చేశాను. నీ కోసం నేనెందుకు రొంపిలోకి దిగాలి అని నువ్వడిగితె జవాబు ఒక్కటే- నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కాదని ఒక్కమాట అను. నిశ్శబ్దంగా నీకు దూరంగా వెళ్ళిపోతాను."
    
    ఆదిత్య నుదుట స్వేదం పేరుకుంటోంది. తానొక ఏకాంత సౌందర్యాన్ని రచించుకునే స్వాప్నికుడు. ఎవరికీ తెలీని తన హృదయద్వారాన్ని తెరిచి బ్రతుకు పుటల్ని చదివే అవకాశమిచ్చి, తానేమిటో చెప్పకుండానే తెలియచెప్పి, ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత ఆత్మీయతని రుచి చూశాక సూరిని ఎలా దూరం చేసుకోగలడు? ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి?
    
    ఆలోచనల నిలువుటద్దంపైన పగులులా ఓ ప్రశ్నని రగిల్చి సూరి వెళ్ళిపోయాడప్పటికే.
    
                                                               * * *
    
    సాయంత్రం అయిదు గంటల వేళ....
    
    ఆంధ్రా యూనివర్శిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్ స్టూడెంట్సుతో కిక్కిరిసి పోయింది.
    
    అప్పటికే శౌరి తన బృందంతో ముందువరుసలో కూర్చుని ఒక అసాధారణమైన గెలుపుకోసం ఎదురుచూస్తున్నాడు. తన తాహతుకి తగ్గట్టు బుట్టలతో పూలదండల్ని తెప్పించిన శౌరి, స్టూడెంట్ యూనియన్ లీడర్ హోదాలో అమ్మాయిలు ఎవరెవరు పూలదండలు వేయాలో ఆదేశించాడు ముందే.
    
    ఆర్ట్స్, సైన్స్ స్టూడెంట్సు ఓ మూల ఆస్కత్య్గా కూర్చుంటే ఇంజనీరింగ్ విద్యార్ధులంతా అక్కడ కనిపించని ఆదిత్యకోసం ఎదురుచూస్తున్నారు.
    
    అది ఉత్కంఠ కూడా కాదు. ప్రొఫెషనల్ కోర్సుకి చెందిన విద్యార్దులలో సహజంగా ఉండే ఆధిక్య భావం.
    
    బాహాటంగా చాలామంది ప్రబంధ విజయాన్నే కోరుకుంటున్నా, అంతర్గతంగా ఆదిత్య గెలుపుకోసం ఎదురుచూస్తున్నారు.
    
    అలా అనుకోవటానికి కారణం ప్రబంధ పైన ద్వేషంకాదు. శౌరికున్న అహం పట్ల అయిష్టత అంతకుమించి ఆదిత్య వ్యక్తిత్వం.
    
    ఆదిత్యకు తెలిసిన చాలామంది అతని "ఐడియల్ స్టూడెంట్ గా భావిస్తూంటారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో రేంక్ స్టూడెంటుగానే తప్ప మరే ఏక్టివిటీలోనూ ఇంతదాకా అతన్నెవరూ చూడలేదు. పలకరిస్తే ముభావంగా మాట్లాడ్డం-అదీ అవసరమైనంత మేరకే మాట్లాడి క్లాసురూం లోనో, లైబ్రరీలోనో ఎక్కువగా గడపడమే తెలిసిన విద్యార్ధులు, ఆదిత్య ఇక్కడ ఇలాంటి టెస్ట్ లో పార్టిసిపేట్ చేయటాన్ని వూహించలేకపోతున్నారు.
    
    అయినా ఆదిత్య ఎక్కడ? గ్రేస్ టైం మిగిలింది మరో రెండు నిమిషాలు మాత్రమే.
    
    డయాస్ పైన కూర్చున్న అయిదుగురు ప్రొఫెసర్స్ ఓ పక్కన టేబుల్ ముందున్న ప్రబంధనీ, స్టూడెంట్స్ నీ కలియచూస్తూ- "ఉయ్ థింక్ ఇట్స్ టైమ్ టు డ్రాప్" అనుకున్నారు.
    
    ఆదిత్య రాడని తెలిసిపోయిందేమో, ఎక్కడో ద్వారం దగ్గరే అంతసేపూ నిలబడ్డ సూరి నెమ్మదిగా లోపలికి నడుచుకు వచ్చాడు.
    
    రాత్రి ఎంతో టెన్షన్ తో గడిపిన సూచనగా అతడి నేత్రాలు రక్తం ఓడినట్టు ఎరుపెక్కి వున్నాయి.
    
    ఆదిత్య పైన కోపం రావడంలేదు. సహజంగా అంతర్ముఖుడిలా వుండే ఆదిత్యని గోదాలోకి రమ్మనడం, అదీ అతనితో మాటమాత్రం ముందే చెప్పకుండా వలయంలోకి నెట్టడం తప్పే అనిపించడంతో శౌరి కూర్చున్న దిక్కుకి నడిచాడు.
    
    అందరూ కాదు... శౌరి మిత్రబృందమంతా కేకలు, విజిల్స్ తో పైకి లేచారు.
    
    "మిగిలింది మరో నిమిషం..." శౌరి పిడికిలి బిగించి ఉత్సాహంగా అన్నాడు. "ప్రబంధ పోరాడాకుండానే గెలిచింది!"
    
    సూరిలో చలనం లేదు.
    
    "ప్రబంధని ఎదుర్కోలేని నీ స్నేహితుడు ఎక్కడో దాక్కున్నట్టున్నాడు."
    
    "ఇట్స్ నాట్ ఈజీ టు విన్ మిస్ ప్రబంధ..."
    
    "ఎక్సెప్ట్ ది డిఫీట్..."
    
    కరతాళ ధ్వనులతో హోరెత్తిపోయింది.
    
    మిగిలింది అర నిముషం.
    
    ఒక స్టూడెంటుని హింసించే మరో స్టూడెంటుకి కాని, "ఈవ్ టీజింగ్" లాంటి చేష్టలు చేసే విద్యార్ధులకు కాని ఎదురునిలిచి అరుదైన వ్యక్తిగా, మొండివాడుగా అందరి మనసుల్లోనూ అంతకాలం నిలిచిపోయిన సూరి ప్రత్యేకతకి సమాధి కట్టడానికి మిగిలింది మరో ఇరవై అయిదు క్షణాలు..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS