"నాన్నమ్మా!" మంచం మీద దగ్గరగా కూర్చుంటూ అడిగాడు- "ఈ మధ్య నీకు ఒంట్లో బాగోటంలేదా?"
"నాకేంరా! ఉక్కు శరీరం" నీరసంగా నవ్వింది.
అది నిజంకాదని ఆదిత్యకి తెలుసు కానీ నిజం కాకపోయినా ఏం చేయాలో మాత్రం తెలియదు.
"మరో ఆరు నెలల్లో నా ఇంజనీరింగ్ పూర్తయిపోతుందే" ఆమె తల నిమురుతూ అన్నాడు. "ఆ తర్వాత ఇక నువ్వు శ్రమపడాల్సిన ఆగత్యం లేదు."
ఆ మాత్రం ఆప్యాయతాకే ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "శ్రమాలేదు, చట్టుబండలూ లేదు కానీ నువ్వు బుద్దిగా చదువుకోరోయ్."
బడలికగా కళ్ళు మూసుకున్న ఆ వృద్దురాలిని చూస్తుంటే గుండె ద్రవించిపోతోంది. రెండు నిమిషాల నిశ్శబ్దంలో కళ్ళలో నీళ్ళను సుడులు త్రిప్పుతుంటే నెమ్మదిగా పైకి లేచాడు.
కృతజ్ఞత కాదు ఆరాధనను సైతం వ్యక్తం చేయటానికి చాలని వయసు కావడంవల్లనేమో సన్నని ప్రకంపనతో బయటికి నడిచాడు.
* * *
"మళ్ళీ తాగొచ్చావుగా అన్నయ్యా?"
ద్వారం తెరిచిన అనిత సూరిని నిలదీసింది.
తల వంచుకున్నాడు సూరి. మామూలుగా అయితే పకాలున నవ్వి ఓ జోక్ చెప్పి ప్రసక్తిని మళ్ళించే సూరి ఇప్పుడు అలాంటి ప్రయత్నం చేయడంలేదు.
"మాట్లాడన్నయ్యా!"
ఆదిత్యకి ఉన్న ఒకే ఒక్క ఆత్మీయుడిగా సూరి గురించి తెలిసిన అనిత అతన్ని పెద్దన్నయ్యలా నిలదీస్తుంది. తాగిన ప్రతిసారీ పెద్దరికంతో ప్రశ్నిస్తుంది.
"నేను..." తల మరెటో తిప్పుకున్నాడు సూరి- "నేను తీరుబాటుగా మాట్లాడ్దానికి రాలేదు."
"చెప్పు."
క్షణం నిశ్శబ్దం...
"మాట్లాడవేంరా...?" బలవంతాన తనవైపు తిప్పుకున్న ఆదిత్య సూరికళ్ళలో నీళ్ళను చూసి ఉలిక్కిపడ్డాడు. "ఏమైంది?"
చాలా ఉక్రోషంగా వుంది సూరికి "నువ్వు నాకో సాయం చేయాలి. నీకు సాధ్యమయ్యేదే!"
"అదేమిటో చెప్పు."
"నువ్వు సరేనని మాటివ్వాలి."
సూరి చేతినందుకున్నాడు ఆదిత్య.
అది అభయం కాదు- దేవుడి సన్నిధిలో చేసే ప్రమాణంలా వుంది. అన్నలా ఎన్నోసార్లు ఆర్ధికంగా సైతం ఆదుకున్న సూరితో అన్నాడు "నేను నీకు సయం చేయగల స్థితిలో వున్నానూ అంటే నిజంగా అదృష్టమే! చెప్పు."
హఠాత్తుగా అక్కడ గాలి గడ్డకట్టుకుపోయింది.
"ఆదిత్యా!" తనను తాను నిభాయించుకోవడానికి సూరి చాలా శ్రమ పడుతున్నాడు. "జీవితంలో నేను ఓడింది ఒక్కసారి అంతే! ఆ ఓటమిని జీర్ణించుకోలేక తాగుబోతునయ్యాను. మరోసారి ఓడి నిలబడగలిగే శక్తి నాకు లేదు."
సూరి ఏ విషయంలో ఇంతగా మధనపడుతున్నదీ అర్ధంకావడం లేదు. ఆ క్షణంలో ఆదిత్యకి బోధపడిందొక్కటే! ఎప్పుడూ తనతో జోవియల్ గా మాత్రమే వుండే సూరి ఇలా మాట్లాడుతున్నాడూ అంటే ఎక్కడో దారుణంగా గాయపడ్డాడు.
"అసలు విషయమేమిటో చెప్పు."
"శౌరి నీకు తెలుసు కదూ?"
తల పంకించాడు ఆదిత్య.
"అతని చెల్లెలు ప్రబంధ మన యూనివర్శిటీ స్టూడెంట్..." ఒక్క సూరితో తప్ప మరెవరితోనూ స్నేహంగా వుండని ఆదిత్యకి వెంటనే ప్రబంధ గుర్తుకురాలేదూ అంటే అది అతని తప్పుకాదు. ఇంజనీరింగ్ స్టూడెంట్ గా అతను ఆసక్తిని ప్రదర్శించేది చదువు మీద మాత్రమే!
"ఈరోజు శౌరి ఓ పార్టీ ఇచ్చాడు" క్లుప్తంగా జరిగింది చెప్పాడు సూరి. "ఒక చిన్నమాట పట్టింపుతో ఛాలెంజ్ విసిరిన ప్రబంధని కాదు ఆదిత్యా! ఆమె అహాన్ని ఓడించాలి. లేనినాడు జీవితాంతం నేను ఆమె దగ్గర కారు డ్రైవర్ గా పనిచేయాలి."
కేవలం వాగ్యుద్దంలా మొదలైన అక్కడి చర్చలో సూరి ఓడినా, ఆమె శరతుకి అంగీకరించితీరాలని రూలేం లేదు కాని సూరి దానికీ వెనుకాడడు. ఆ విషయం చాలామందికన్నా ఆదిత్యకే ఎక్కువగా తెలుసు. ఉన్నత కుటుంబానికి చెందకపోయినా బ్రతకడానికి ఏ లోటూ లేని కుటుంబంలో పుట్టిన సూరి ఆత్మాభిమానం వున్నవాడు.
అందుకే చాలాసార్లు కేవలం మాటపట్టింపుతో ప్రొఫెసర్లకు ఎదురుతిరిగి చదువుని మధ్యలో ఆపేయాలని ప్రయత్నించడం ఆదిత్యకి గుర్తే.
"శౌరిని నేను రిక్వెస్ట్ చేస్తాను..." ఆదిత్య నచ్చచెప్పబోయాడు "నీకూ స్నేహితుడే కాబట్టి..."
"ఆదిత్యా..." ఉద్వేగంగా అన్నాడు సూరి. "నేను అవహేళనను కొంత అంగీకరించగలను గాని నిస్సహాయతని అసలు అంగీకరించలేను."
"కాని..." ఇబ్బందిగా కదిలాడు ఆదిత్య. "నువ్వు ఆమెతో ఐ.క్యూ. టెస్ట్ కి సిద్దపడటం నాకిష్టంలేదు."