రేవతి అవతలివైపు ఇరిటేట్ అయిపోయి తిట్టి పెట్టేసింది. అన్యాయంగా రేవతిని సతాయిస్తున్నందుకు నాకు బాధగానే ఉంది. కానీ తన సొమ్ము తింటూ తన మొగుడు బయట తన గురించి చెడుగా చెప్తూ, అమాయకమైన ఆడపిల్లల్ని బుట్టలో వేస్తున్నాడని ఆమెకి తెలియాలిగా! అందుకే ఈ చేదుమందు ఆమెకి ఇవ్వక తప్పదు. గుటకేస్తుందో, కక్కేస్తుందో ఆమె ఇష్టం!
షాప్ వదిలే టైంకి లేచి నిలబడి "నేను వెళ్తాను" అన్నాను.
"నేను డ్రాప్ చేస్తాను ఉండు" అని లిల్లీ లేచింది.
"హలో..." అంటూ ఓ యువకుడు లోపలికి వచ్చాడు. చూడగానే విలక్షణంగా ఉన్నాడు. తెల్లని కనుపాపలూ, సూదంటురాయిలా ఆకర్షించే చూపూ...తెల్లగా, పొడవుగా ఉన్నాడు. చెవికి ఒక పోగు వేళ్ళాడ్తోంది.
"హాయ్ విక్కీ...షీ ఈజ్ ఆముక్తా. నా చిన్నప్పటి ఫ్రెండ్" పరిచయం చేసింది లిల్లీ.
నేను నమస్కారం పెట్టాను. అతను "హా..య్" అని నిర్లక్ష్యంగా గదిలోకి వెళ్ళిపోయాడు.
"పద..." అంది లిల్లీ.
"అతనెవరు?" లిఫ్ట్ లో అడిగాను.
"విక్రం. నా ఫ్రెండ్" చెప్పింది.
లిల్లీ నన్ను ఇంటిదగ్గర డ్రాప్ చేసి తిరిగి వెళ్ళిపోయింది. దార్లో సిద్దార్థ గురించే మాట్లాడింది.
నేను విక్రం లిల్లీ బోయ్ ఫ్రెండ్ అని నిర్ధారించుకుని పడుకున్నాను.
* * *
నాకు అరచేతుల్లో చెమట్లు పడ్తున్నాయి. కాళ్ళు తడబడ్తున్నాయి. అయినా ధైర్యం కూడగట్టుకుని ఆ ఇంటి మెట్లెక్కాను. డోర్ బెల్ నొక్కుతూ వెనక్కి తిరిగి చూశాను. దూరంగా లిల్లీ కార్లో కూర్చుని బొటనవేలెత్తి చూపించింది.
నేను రెండవసారి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాకా, డోర్ తెరుచుకుంది. సిద్దార్థ తలుపు తీశాడు.
నన్ను చూడగానే ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి.
"సిద్దార్థా, రమ్మన్నావుగా...వచ్చేశాను" అన్నాను.
అతను భయంగా వెనక్కి తిరిగి చూసి "నీకు బుద్దుందా అసలు? ఇంటికి వచ్చేస్తావా?" అని గొంతు తగ్గించి కోపంగా అడిగాడు.
"ఏం నువ్వు మొదటిసారి మా ఇంటికే రాలేదూ!" అన్నాను.
"అది వేరు... సరే... నువ్వు వెళ్ళు, నేను బయటికి వచ్చి మాట్లాడ్తాను"
"ఇప్పుడే మాట్లాడు. నేను ఇంట్లోంచి వచ్చేశాను!" అన్నాను.
"ఆ! నీకు మతిపోయిందా?" అరిచినట్లుగా అన్నాడు.
"ఏవిటీ? ఎవరితో మాట్లాడుతున్నావు?" నైటీలో ఉన్న ఆవిడ హాల్లోకి వస్తూ అడిగింది.
"ఎవరో సేల్స్ గర్ల్...సోప్స్ కావాలా అంటోంది. మాకు అక్కర్లేదు" అంటూ డోర్ వేసెయ్యబోయాడు.
"సిద్దార్థా...తల తిరుగుతోందా? పనిమనిషిని అనీ, సేల్స్ గర్ల్ ని అనీ నోటికొచ్చినట్టల్లా చెప్తే పడటానికి నీ భార్యననుకున్నావా?" డోర్ వెయ్యనియ్యకుండా పట్టుకుని బిగ్గరగా అరిచాను.
అంతే! సిద్దార్థ పిచ్చి కోపంతో "షట్ అప్ అండ్ గెట్ లాస్ట్" అని అరిచాడు.
రేవతి గబగబా ముందుకొచ్చి, "ఏవిటి గలాటా? ఎవరు నువ్వు?" అని అడిగింది.
"నేచెప్తా రేవతీ. మా షాప్ లో కొన్నాళ్ళు పనిచేసింది" సిద్దార్థ కంగారుగా అన్నాడు.
"ఏంకాదండీ...ఈయన నన్ను ప్రేమించానంటూ వెంట పడుతున్నాడు. నా కోసం ఇల్లు కూడా చూసి పెడ్తానన్నాడు. ఏం అనలేదూ?" అడిగాను.
"అన్నావా?" రేవతి సిద్దార్థ కాలర్ పట్టుకుని అడిగింది.
"ఛీ! అంతా అబద్ధం. యూ బిచ్...గెట్ అవుట్" నామీదకొస్తూ కోపంగా అరిచాడు.
"ఏవిటి అబద్ధం? నీ కొడుకుని పిలిచి తలమీద చెయ్యిపెట్టి ప్రమాణం చేసి చెప్పు నువ్వు అనలేదని" నేను తగ్గకుండా అరిచాను.
"ఎందుకు ప్రమాణం చెయ్యాలి....నా ఇంటికొచ్చి గొడవచేస్తున్నావని పోలీస్ రిపోర్ట్ ఇస్తాను" అరిచాడు.
"నువ్వు నిజంగా అన్నావు గనుకే ప్రమాణం చెయ్యడంలేదు. ధైర్యం లేనివాడివి నా వెంటపడి ఎందుకు వేధిస్తున్నావు? అన్నాను.
"నిజం చెప్పు...ఆ అమ్మాయితో నీకు ఎన్నాళ్ళనుండీ సంబంధం?" రేవతి అతని రెక్కపట్టుకుని అడిగింది.
"ఏం లేదు. కావాలంటే బాబీమీద ఒట్టు" అన్నాడు.
"ఛీ నోర్ముయ్! నీచుడా, నా కొడుకుమీద ఒట్టుపెడ్తే చంపేస్తాను. నువ్వు ఎలాంటివాడివో నీకోసం వస్తున్న ఫోన్స్ చెప్తున్నాయి. మాలా, షీలా, గీతా...ఇలా రకరకాల అమ్మాయిలు!
నా డబ్బుమీద ఆధారపడి బ్రతుకుతూ సిగ్గులేకుండా బయట ఇన్ని రంకులు వెలగబెడ్తున్నావా? "ఈ సాక్ష్యం చాలు, నీకు విడాకులియ్యడానికి. ఇప్పుడే మా లాయర్ కి ఫోన్ చేస్తాను" అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది రేవతి.
"రేవతీ...రేవతీ..." అని సిద్దార్థ ఆమె వెనకెళ్తుంటే.
"నా సంగతేం చేస్తావు?" నేను అడిగాను.
"గెట్ అవుట్...చేసింది చాలు! నీ మొహం నాకు చూపించకు" పళ్ళు కొరుకుతూ అరిచాడు.
"ఇంకోసారి నా దగ్గరకి రా, అప్పుడు చెప్పుతో కొట్టి నేనుకూడా ఇదే మాట అంటాను" అని అరిచి నేను వెనక్కి తిరిగి వచ్చేసాను.
