Previous Page Next Page 
ఆలింగనం పేజి 58


    "స్కౌండ్రల్. మంచివాడిలా కనిపిస్తాడు" కోపంగా అంది వైజూ.

 

    'మంచివాడిలా కనిపించడం' అంటే స్టయిల్ గా స్మార్ట్ గా కనిపించడమా అని నవ్వుకున్నాను.

 

    "ప్రతాప్ ఉత్తరం రాశాడు" అంది వైజూ.

 

    నేను దాని బుగ్గల్లో అరుణిమని చూస్తున్నాను.

 

    "సమ్మర్ హాలిడేస్ లో మనని వాళ్ళ ఊరు రమ్మని రాశాడు" అంది.

 

    "మననా-నిన్నా" ఉడికించాను.

 

    "అందర్నీ...కావలిస్తే ఉత్తరం తెచ్చి చూపిస్తాను" బుంగమూతి పెట్టింది వైజూ.

 

    "ఆహ్వానం మాదాకా రాలేదులే. అందుకూ!"

 

    "ప్రతాప్ కి నేను ఉత్తరం రాశాను. మరి మీరు రాయలేదుగా!" అంది.

 

    "అమ్మ దొంగా...అదా విషయం. ఏం రాశావే?" ఆసక్తిగా అడిగింది చిత్ర.

 

    "నిరాసక్తంగా తిప్పివేయబడుతున్న మా జీవిత పుటల్లో అందమైన అక్షరాలు నింపమని రాశాను" అంది.

 

    నేను మౌనంగా మారి ఆలోచించాను.

 

    తెలిసీ తెలియని వయసులోనే అలజడిగా, నా మనసు దడి తోసుకొచ్చేసిన ప్రేమ ఎన్ని అనుభూతుల్ని కాలితో నేలరాసేసిందీ!

 

    తీరా మనసు ప్రేమించే హృదయానికై పరుగులిడుతున్నప్పుడు... ఒక్క మధురస్మృతి తిరిగి రావడంలేదు! స్వయంకృతాపరాధమా?

 

    "ఎలాగో పెళ్ళి పిలుపులు పిలవాలి. ప్రతాప్ వాళ్ళ ఊరు వెళ్దాం" అంది చిత్ర.

 

    వైజూ మొహంలో వెలుగొచ్చింది.

 

    "ఏం ముక్తా... వస్తావా?" అడిగింది వైజూ.

 

    "సరే కాని ముందు సాయంత్రం షాప్ కి వెళ్ళాలా వద్దా అన్నది తెలియడం లేదు" అన్నాను.

 

    "లీవిట్! నేను చూసుకుంటాగా. వాడి సంగతి నా మీద వదిలిపెట్టు" అంది చిత్ర.

 

    సిద్దార్థని నేను వదిలిపెద్దదలుచుకోలేదు.

 

    అవసరం అయితే పోలీస్ రిపోర్టు కూడా ఇస్తాను అనుకున్నాను.

 

    సాయంత్రం షాప్ కి వెళ్ళలేదు. లిల్లీ దగ్గరికి వెళ్ళాను. లిల్లీ అప్పుడే ఆఫీసు నుండి వచ్చినట్లుంది. చాలా అలసటగా కనిపిస్తోంది.

 

    "ఏమిటి వర్రీడ్ గా కనిపిస్తున్నావు?" అంది ఫ్రిజ్ లోంచి కోక్ తీస్తూ.

 

    నేను సిద్దార్థ సంగతి చెప్తూ 'నన్ను నమ్మించాడు. మోసం చెయ్యాలనుకున్నాడు. ఎలాగో బయటపడి నా దారిన నేను బతుకుతుంటే, వెంటపడి అదే పనిగా వేధిస్తున్నాడు. అతని మీద నాకు చాలా ద్వేషంగా వుంది. ఇలాంటి పని మళ్ళీ చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి" అన్నాను.

 

    "శభాష్! భయంపోయి ద్వేషం ఏర్పడిందన్నమాట" అంది లిల్లీ.

 

    "పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే ఎదురుతిరుగుతుందిగా!"

 

    "ఇప్పుడు పులైపోయావా?" అని నవ్వింది.

 

    "జోక్ కాదు. మళ్ళీ కోలుకోకుండా వాడిని ఏడిపించాలి. ఏదైనా మార్గం చెప్పు" అన్నాను.

 

    "రెసిడెన్స్ నెంబర్ ఉందా?" అడిగింది లిల్లీ.

 

    "ఉంది" తీసి ఇచ్చాను.

 

    ఫోన్ దగ్గరికి లాక్కుని నెంబర్ డయల్ చేసింది.

 

    "హలో...సిద్దార్థగారున్నారా? లేరా? అరే...రాత్రి ఈ టైంలో దొరుకుతానని చెప్పాడే...సరే... మాల ఫోన్ చేసింది అని చెప్పండి" అని పెట్టేసింది.

 

    ఆ తర్వాత నాతో "ఇంకో పది నిమిషాలు పోయాకా నువ్వు చెయ్యి. వాళ్ళ ఆవిడే లిఫ్ట్ చేస్తుంది. వేరే పేరు చెప్పు. వరుసగా వారం రోజులు అర్థరాత్రుళ్ళు కూడా వదలకుండా సతాయిస్తాను. ఈ గొడవతో వాడి పెళ్ళాం వాడిని తన్ని తగిలెయ్యడమో, తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడమో చేస్తుంది!" అంది.  

 

    ఎలాగైనా లిల్లీ చాలా తెలివైనది. ఎన్నాళ్ళు గడిచినా నాకు ఇలాంటి ఆలోచనలే రావు!

 

    "ఎర్రచీమ మనకి ఆదర్శం. తన దారికి ఎవరైనా అడ్డొస్తే ఠకీమని కుడ్తుంది" అంది.

 

    ఓ పది నిమిషాలు పోయాకా నేను ఫోన్ చేశాను.

 

    "హలో..." ఆ గొంతు రేవతిదే. నేను గుర్తుపట్టాను.

 

    "నా పేరు గీత. సిద్దార్థగారు కావాలి. నువ్వు వాళ్ళింట్లో పనిమనిషివా?" అని అడిగాను.

 

    "నేను పనిమనిషినికాదు ఆ సిద్దార్థ భార్యని. ముందు నువ్వెవరో చెప్పు?" కోపంగా అడిగింది.

 

    "ఆయనకీ పెళ్ళైందా? ఎంత మోసం! ఆరునెలల్లో ఒక్కసారి కూడా చెప్పలేదే..." బాధ నటించాను.

 

    "ఆరు నెలలా? నీకు ఆయన ఎలా పరిచయం?"

 

    సన్నగా వెక్కిళ్ళు పెడ్తూ "నాకు ఇప్పుడు మూడో నెల... ఆయన వస్తే గీత ఫోన్ చేసిందని చెప్పండి."

 

    లిల్లీ అభినందిస్తున్నట్లుగా చప్పట్లుకొడ్తూ "అమోఘం! నన్నే మించిపోయావే?" అంది.

 

    నేను కసిగా పెదవి కొరుక్కున్నాను.

 

    'ఒరేయ్ సిద్దార్థా... ఇంకే పరాయి ఆడపిల్లనీ కన్నెత్తి చూడడానికి భయపడేలా చేస్తారా!' అనుకున్నాను.

 

    మళ్ళీ ఓ అరగంట పోయాకా లిల్లీ ఫోన్ చేసి "మే ఐ స్పీక్ టూ సిద్దూ" అని అడిగింది.

 

    "సిద్దూ ఎవరు?" కర్కశంగా అడిగింది రేవతి.

 

    "సిద్దూ డియర్...అదే సిద్దార్థ. ముద్దుగా అలానే పిలుస్తాను. వెళ్ళి పిలుచుకురా" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS