వరాహశాస్త్రి అటుగా రావటం చూసి స్వప్నరాగలీన లేచి నిలుచుంది. యెందరో ఆడవాళ్ళ చూపులు ఆమెమీద వాలాయి. ఆమెని గమనించి వరాహశాస్త్రి వడివడిగా వెళ్ళాడు.
"నేను వెళతానండి శాస్త్రిగారూ. అమ్మగారిని పిలుస్తారూ?" అంది.
"అయ్యో భోజనం చెయ్యకుండానే, అదెలా?" అంటూంటే, "నాకు నిన్నటి నుంచి కొద్దిగా జ్వరం. ఆ భోజనం, పాలు, బ్రెడ్డు. అదీ మందులతో పాటు" అంది.
అటుగా వెళుతున్న వాళ్ళమ్మ దగ్గిరికి వెళ్ళి యేదో చెప్పి, తిరిగివచ్చి, "మీరు వస్తారనుకోలేదు_ మనస్పూర్తిగా రావాలనే పిలిచాం గానీ...." అన్నాడు.
"అదేమిటండీ నేనేం పాపం చేశాను రాకుండా వుండటానికి!" అని చిన్నగా నవ్వింది.
"యీ ఆడవాళ్ళంతా చూపులతో గుచ్చుతున్నారు. దిష్టి తగులుతుందేమో" అనుకుని, "యిలా రండి" అని పెళ్ళిమంటపం స్తంభం ప్రక్కకి తీసుకెళ్ళాడు.
అంతలో అతని తల్లి వచ్చింది చారుమతిని వెంటబెట్టుకుని.
"అంతా ఓల్డ్ ఫ్యాషన్డ్ గా జరుగుతోంది మా వారిని పరిచయం చేసే వీలు లేదిప్పుడు" అని వాళ్ళమ్మతో, "నేను చెప్పానే స్వప్నగారని" అంది చారుమతి.
"యిందాక చూస్తూనే అనుకున్నాను. నువ్వు చెప్పినదాన్ని బట్టి ఈమె ఆమే ఐవుంటుందని." అని కూతురితో అని, "చాలా సంతోషమమ్మా శ్రమ అనుకోకుండా యెంతో అభిమానంతో వచ్చారు. జ్వరం గదా__ యేమీ తినకూడదటగదా_ అది మా దురదృష్టం" అంది.
ఒక అడుగు అవతలకి వేసి వంగి, నేలమీద వున్న ప్యాకెట్ తీసి చారుమతికి అందిస్తూ, "సంగీతలక్ష్మి కదా_ మీ వీణా, ఇతరుల సంగీతం రికార్డు చేసుకుంటూ వుంటారని_" అని వరాహశాస్త్రి వైపు చూసి, "మీ గానం కూడా." అంది స్వప్నరాగలీన.
"వాడి సంగీతమే చెయ్యాలీ!" అని నవ్వి, మాకు మీరు యెన్నో చేస్తున్నారు. యెంతో అభిమానం చూపుతున్నారు. మేము మీకు యేమీ కాదు" అంది చారుమతి.
టేప్ కమ్ ట్రాన్సిస్టరు. రెండు డజన్ల క్యాసెట్ల ప్యాకెట్ అది.
"యెవరైనా ఇవ్వగలిగేదీ పుచ్చుకోగలిగేదీ ప్రేమాభిమానాలేగా. మీరిరువురూ పరస్పర అవగాహనతో అన్యోన్యంగా జీవిస్తారని ఆకాంక్షిస్తూ తలుస్తూ_ మరి వెళ్ళొస్తాను చారూ_" అంది స్వప్నరాగలీన.
చారుమతి కళ్ళలో సంతోషానికి పల్చటి నీటిపొర కమ్మింది.
వరాహశాస్త్రి కూడా నడిచాడు.
కారులో కూచుని, "శాస్త్రిగారూ యీసారి మీ పెళ్ళికి వస్తాను" అంది స్వప్నరాగలీన. ఆ మాటలు ఇంజన్ రెయిజ్ చేసిన మోతలో కలిసిపోయాయి.
వరాహశాస్త్రి లోనకి వచ్చి మిత్రుల వైపుకి వెళ్ళాడు వడ్డన చూడటానికి.
"యేదో వున్నంతలో జరుపుతున్నాం. సర్దుకుపోవాలి అన్నీ అందుతున్నట్లేనా? యేం ప్రసాదుగారూ అప్పుడే ముగించేసినట్లున్నారు?" అన్నాడు వరాహశాస్త్రి.
"శాస్త్రీ కాస్త నేచుక్క పంపించుతావూ?" అన్నాడు నిరంజనరావు.
అప్పటి నుంచి శ్రీపతి ఆశ్చర్యంగా చూస్తున్నాడు నిరంజనరావు వంక తను తినటం మర్చిపోయి. మొదటి ముద్ద కలిసినప్పుడు ఒక చేరెడు నెయ్యి వంచుకున్నాడు. మళ్ళీ నేతి చెంబుతో మరొకరు కనిపిస్తే పిలిచి మరో చేరెడు వంపించుకున్నాడు. బాగా యింత పప్పు అన్నంలో కలుసుకున్నాడు. సగం పప్పు సుద్ధచేసి పక్కన పెట్టుకున్నాడు. కూరలు కలుపుకుని తింటూ నేతిలో వూరబెట్టిన ఆ పప్పు నంజుతున్నాడు.
భోజనాలు ముగించి లేచారు. చేతులు కడుక్కోటానికి వెళుతున్నారు.
"మోహన్, గాయత్రి రాలేదు" అన్నాడు శ్రీపతి.
"మామూలే. యింకా ఆ యిదిలో నుండి బయటపడలే" అన్నాడు మోహన్ రెడ్డి. అతని ముఖం దిగులుగా అనిపించింది.
తాంబూలాలు నముల్తూ మాట్లాడుతూ నిలుచున్నారు.
"మన రామ్మూర్తి సంసార మౌనంలో పడినట్లున్నాడు" అనుకున్నాడు శ్రీపతి.
విమల నిర్మల వస్తే__ ప్రసాదూ రామ్మూర్తీ వెళ్ళిపోయారు.
"పార్లమెంట్ కాలపరిమితి ఐపోతున్నది. అమ్మ పని ఐతదని అనుకుంటూ వుంటే_ మంత్రి గోఖలే ప్రకటించినాడుగా_ పార్లమెంటును యేడాది పొడిగిస్తున్నట్లు. యేడాదేమి ఖర్మ ఒక దశాబ్దం పొడిగించినా పొడిగించగలదు!" అన్నాడు మోహన్ రెడ్డి.
"రాజ్యాంగానికి ఆ నలభయ్ నాలుగో సవరణతో ప్రాథమిక హక్కులు ఎగరగొట్టేసెయ్యగా లేనిది యిదో లెక్కా" అన్నాడు శ్రీపతి.
"కదిల్తే మెదిల్తే మీసాకింద అరెస్టులు" అన్నాడు వొకతను.
"మోహన్ యింటి దగ్గర పనుందనుకుంటాను వెళ్ళు" అన్నాడు శ్రీపతి.
శ్రీపతి వంక అభిమానంగా చూసి వెళ్ళిపోయాడు మోహన్ రెడ్డి.
"మనం కూడా పోదాం హాస్టల్ కి బస్సు వస్తే" అని, "సెకండ్ షో టైం కూడా ఐపోయింది దేనికన్నా వెళ్దామంటే" అన్నాడు వొకతను.
"ఎంటర్ ది డ్రాగన్ థర్డ్ షో వున్నది. పదకొండు అయింది. రైట్ టైం" అన్నాడు నిరంజనరావు_ యెవరన్నా సిద్ధమైతే వెళ్ళాలని.
గత మూడు నెలల్లో ఆ సినిమాకి వెళుతున్న యెవరో ఒకరి వెంటపడి ఇప్పటికి నాలుగుసార్లు చూశాడు. షోలే ఐదుసార్లు చూశాడు అదేరకంగా.
అంతలో సికిందరాబాద్ స్టేషన్ దాకా వెళ్ళే మూడో నంబరు బస్సు వచ్చింది. అందరూ ఎక్కేశారు.
శ్రీపతి ఒక్కడూ మిగిలిపోయాడు.
_గాయత్రిని అరెస్టు చేస్తారేమో_ ఆ మొన్న గవర్నర్ భండారేనీ ఐజీ నారాయణరావునీ సి.ఎం. వెంగళ్రావునీ చెడామడా తిడుతూ నుంచుందిట_ యెవడో ఎస్సై అటకాయించితే. యిప్పుడు అరెస్టయితే యింక అంతే సంగతులు_ మీసా మీసా_ మీసా అంటే మర్డర్స్ బై.... సీక్రెట్ ఏజన్సీ_ పోయి నీ మొగుడు ఐజీకి చెప్పుకో పో_ అని వాయించిందట ఆ ఎస్సైని. ఆ ఎస్సై యెవడో_ గాయత్రిమీద ప్రత్యేక కక్ష దేనికో_ విజయ్ కుమార్ మిత్రుడని అన్నారు. మీసా అరెస్టు అతి సులభం.
మీసం తనకెలాగూ లేదు. తన పార్టీలో మీసం వున్న మగాడు ఒక్కడూ లేడు_ అందుకని ప్రతిపక్ష నాయకుల మీసం గొరగటం__
ఎక్కడున్నాడు వెంకటేష్__ జైల్లో జైళ్ళలో యెవర్ని యేం చేస్తున్నారో_ ఆఫీసుల్లో అధికారుల జులుం_ పోలీసుల అఘాయిత్యాలు_ బ్రెయిన్ వాష్, బాడీ వాష్_ వేడినీళ్ళతో డెటాల్ తో యాసిడ్ తో _ మనుషులు మనసులు_ అంతా స్టెరిలైజ్డ్_ ఆపరేషన్ థియేటర్ లాగా _ యూనివర్శిటీల్లాగా_ అంతా జాగ్రత్తగా స్టెరిలైజ్డ్ _ స్టెరిలైజ్డ్ బాడీస్, స్టెరిలైజ్డ్ మైన్స్ _ స్టెరిలైజ్డ్ కంట్రీ _ దేశంలో యెక్కడా యేమీ మొలవకూడదు_ యీ పవిత్ర మీసావనిలో ఆఖరికి పిసరంత ఆలోచన కూడా మొలవకూడదు. బాలభానుడు నాటించే చెట్లు తప్ప. దేశంలో యిన్ని ఘాతుకాలు జరుగుతూంటే వీటన్నిటినీ లోన యెలా దాచుకుంటుందో__
