పెళ్ళి పందిట్లో వరాహశాస్త్రి మిత్రులు, ఓ పక్కగా చాపమీద కూచుని వున్నారు. శ్రీపతి, రామ్మూర్తి. నిరంజనరావు, ప్రసాద్, మోహన్ రెడ్డి మరికొందరు.
రామ్మూర్తి వచ్చినప్పుడు అతని భార్య నిర్మలని, ప్రసాద్ వచ్చినప్పుడు అతని భార్య విమలని అటుపక్కకి ఆడవాళ్ళ వైపుకి తీసుకెళ్ళి వాళ్ళమ్మకీ మరో యిద్దరికీ పరిచయం చేసి వచ్చాడు వరాహశాస్త్రి.
నిర్మల కొడుకుని ఎత్తుకొచ్చింది. విమల కూతుర్ని యింట్లోనే వదిలి వచ్చింది. "గాయత్రిగారు రాలేదేం మోహన్?" అని వరాహశాస్త్రి అడిగితే, "నాట్ ఫీలింగ్ వెల్" అని చెప్పాడు మోహన్ రెడ్డి.
పెళ్ళితంతు మహా శాస్త్రోక్తంగా జరుగుతోంది.
"యీ లెక్కని క్రతువు మూడు గంటలైనా పడుతుంది. తొమ్మిది దాటుతుంది" అన్నాడు నిరంజనరావు.
"యేదొక పద్ధతిన జరగాలిగా. శాస్త్రోక్తంగా చేస్తున్నప్పుడు అంతా అట్లాగే జరగాలి. అందునా బ్రాహ్మలు" అన్నాడు ప్రసాద్.
"గౌరీపతిశర్మ రాలేదు?" అన్నాడు మోహన్ రెడ్డి.
"యీ మధ్య యేవో పర్మిట్ల ఆలోచనల్లో తిరుగుతున్నాడు. ఫొటోగ్రఫీ ధ్యాస తగ్గించి" అన్నాడు శ్రీపతి.
"రావటానికి స్థాయి చాలి వుండదు గీరపతికి" అన్నాడు నిరంజనరావు.
"చాపే కుర్చీలు. చాపే సోఫాలు" అంటూ వచ్చి, "నేల అయినా చదునుగా వుందని తలుస్తాను" అన్నాడు వరాహశాస్త్రి.
"మేం కులాసాగా విశ్రమించాం. నీ పనులు చూసుకోవయ్యా వరాహ మిత్రమా" అన్నాడు శ్రీపతి.
"విజయ్ కుమార్, అంకినీడు యింకా మిత్రులు__"
"అంకినీడు మద్రాసులో వున్నాడు. అతని సినిమా పూర్తి కావస్తోంది. విజయ్ కుమార్ ఢిల్లీలో వున్నట్లు తెలిసింది" అన్నాడు వరాహశాస్త్రి.
"విజయ్ కుమార్ కళత్ర వియోగ దుఃఖంలో వున్నట్లున్నాడు" అన్నాడు నిరంజనరావు.
"కళత్ర వియోగదుఃఖమూ లేదు వాడి కాష్టం దుఃఖమూ లేదు. వ్యాపారం పనులు చూసుకుంటున్నాడు అక్కడ" అన్నాడు శ్రీపతి.
"ఆవిడ సడన్ గా పోయిందట" అన్నాడు నిరంజనరావు. ఆమె మరణం గురించి నలుగురూ చర్చించాలన్న వుద్దేశంతో.
"పోయిందో పోగొట్టారో యెవరికి తెలుసు? సహజ మరణం అయితే అంత అర్జంటుగా ఐనవాళ్ళెవరూ రాకుండా దహనం చెయ్యటం దేనికి?" అన్నాడు ప్రసాద్.
"ఆమె తరపు బంధువులతో ఇటీవల నాకు పరిచయం అయింది. ఆమె త్రేతాయుగపు ప్రాణిట. మంగళసూత్రాలూ, పతిదేవుడి పాదాలూ భూదేవి ఓర్పూ__ కానీ భూదేవి ఛస్తే ఓర్చుకోదు_ భూకంపమయ్యో, అగ్నిపర్వతమయ్యో మరొకటయ్యో చెలరేగుతుంది. మనవాడు మనందరికీ తెలుసుగా. మీ అందరికీ తెలిసిన దానికంటే నాకు మరికొంత తెలుసు. స్త్రీని యెంత క్రూర స్వభావంతో హింసించే తత్వమో! యేదో జరిగి వుంటుంది. సహజ మరణం కాకనూపోవచ్చు. మాటవరసకి ఇలా అన్నావని మనలో యెవరన్నా వాడికి పితూరీ చెప్పనూ వచ్చు" అని నిరంజనరావు వైపు ఒక క్షణం చూసి, "ప్రసాద్, యిదంతా నా అంచనా. నిజం కావాలనే లేదు" అన్నాడు శ్రీపతి.
అంతలో స్వప్నరాగలీన వచ్చింది. వరాహశాస్త్రి వడివడిగా డొల్లుకుంటూ వెళ్ళి ఆమెని అటు తీసికెళ్ళాడు.
పెళ్ళి తంతు జరుగుతూంది.
"రాఘవులు రాలేదు. శాస్త్రి పిలవలేదేమో" అన్నాడు నిరంజనరావు.
"మన వరాహ మిత్రుడు అలాంటివాడు కాడు" అన్నాడు శ్రీపతి.
"పిలవటానికి సిటీలో వుంటేగా! అటు కర్నూలు ప్రాంతంలో వుద్యోగం వెలిగిస్తున్నాడు. ఆర్డీవో అధికారి కదా, పెళ్ళి కూడా అయింది_"
"యెవరితో?" అన్నాడు నిరంజనరావు.
"యెవరితో ఏమిటి ఓ మాతంగ కన్యారత్నంతో. ఆ డీ.డీ. దానం తాలూకు పిల్ల. జనాన్ని కాల్చుకు తింటున్నాడంట. నెల జీతం, పాకెట్ మనీలాగా వుందంట అతగాడి పరిస్థితి" అన్నాడు ప్రసాద్.
తలంబ్రాలు పంచుతున్నారు.
వరాహశాస్త్రి హడావుడిగా తిరుగుతున్నాడు పందిరంతా.
ఒకాయన అటూ యిటూ తిరుగుతూ వరాహశాస్త్రిని కలుసుకుని, "ఒక్క నిమిషం" అని ఆపి, "బాబూ నేను మీ నాన్నగారి సహోద్యోగిని. మాకు తెలిసిన కుర్రవాడు వున్నాడు. మొన్ననే ఐ.ఏ.ఎస్.కి సెలక్టయ్యేడు. అందగాడు. వాళ్ళ తండ్రి ఆర్టీసీలో పెద్ద వుద్యోగి. బాగా ఆస్థిపరులు. ఆ పిల్ల__అక్కడ కూచుని వుంది చూడు. ఇందాక నువ్వు తీసుకెళ్ళి కూచోబెట్టావు_ గచ్చకాయరంగు చీరలో_ ఏమి సిరీ ఏమి కళా ఏమి అందం_ యెవరో కాస్త చెబితివా అంటే మావాళ్ళకి తెలియపరుస్తాను" అన్నాడు.
"వాళ్ళు మన బ్రాహ్మలు కాదు." అన్నాడు వరాహశాస్త్రి.
"అడ్రసు యేమిటి?"
"వర్ణ సంకరం అడ్రసు ఏం చేసుకుంటారు? కాగా కొన్ని లక్షల కట్నం ఇస్తారు. పుచ్చుకోగల స్థోమత కూడా వుండాలి. వుద్యోగం మాత్రమే అయితే యేపాటి?" అని తప్పుకున్నాడు వరాహశాస్త్రి.
మాంగల్యం తంతునాం
బాజాభజంత్రీల హోరు.
"అమ్మయ్య" అని శ్వాస విడిచాడు ప్రసాద్.
ఆ తరవాత చదివింపులు మొదలయ్యాయి. సిటీలో వున్న భానుమూర్తి స్నేహితులు, వాళ్ళ బంధువులు వూళ్ళ నుంచి వచ్చిన బంధువులు. పెళ్ళి బ్రాహ్మడు పేరుపేరునా చదివి వినిపిస్తున్నాడు. పౌంటెన్ పెన్ను మిల్క్ బాయ్ లర్ మొదలుకుని ప్రెజర్ కుక్కర్ వరకు.
"యివన్నీ లిస్టు రాసి తీర్చవలసిన బాకీలు" అన్నాడు శ్రీపతి.
అందరూ లేచారు. జంబుఖానాలూ అవీ తీసేసి, భోజనాల చాపలు పరుస్తున్నారు. వచ్చిన అందరూ ఒకేసారి కూర్చునేందుకు సరిపడా స్థలం వుంది.
విస్తళ్ళు పరుస్తున్నారు.
శ్రీపతికి ఒక ప్రక్కన నిరంజనరావు, రెండో ప్రక్కన ప్రసాద్.
మగవాళ్ళతోపాటు ఆడవాళ్ళకి కూడా భోజనాల యేర్పాట్లు చేశారు.
