Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 57


    
    కోరిక, సాధన, అనుభవం అనేవి విడివిడి విషయాలని తెలీని ప్రబంధ ప్రేమ పరుగుపందెంలో 'కోచ్' లా వ్యవహరిస్తున్న సౌదామిని ముందు తన ప్రాక్టీసు వ్యర్ధమైందని ఆందోళన చెందుతూంది.
    
    ఇంకా రెచ్చగొట్టేదే సౌదామిని కాని అలా చేయలేదు. ప్రబంధలాంటి అమ్మాయిని నియంత్రించాల్సింది సరిగ్గా ఇలాంటిచోటనే ఏ మాత్రం ప్రోత్సహించినా మొత్తం బెడిసికొట్టేస్తుంది.
    
    "ఇప్పుడు నేనేం చేయాలి?" పళ్ళు నూరింది ప్రబంధ.
    
    "ఏం లేదు.... నిశ్శబ్దంగా వుండాలి."
    
    "అదికాదు"
    
    "పిచ్చిపిల్లని అసలు నువ్వు నిజంగా ఆదిత్యని ప్రేమించావా?"
    
    ప్రబంధ సీరియస్ గా చూసింది హర్టయినట్టుగా.
    
    "ప్రేమించివుంటే ఇలా అలజడి చెందేదానివి కాదు బహుశా ప్రేమిస్తున్నానన్న ఆలోచనను ప్రేమిస్తున్నావనుకుంటాను."
    
    ఆ స్టేట్ మెంటూ అర్ధం కాలేదు.
    
    "ప్రేమంటే ఇవ్వడమూ, తీసుకోవడం మాత్రమే కాదు ప్రబంధా! నమ్మకంగా పరిశీలించడం కూడా"
    
    సౌదామిని చెప్పే ప్రతి విషయమూ వినాలనిపించేట్టుగా వుంటుంది.

    "ప్రబంధా! హఠాత్తుగా నువ్వు ఆదిత్య మనసులో కల్లోలం రేపి వుంటావు. అందుకే..." రెండు రోజులుగా ఆదిత్య కాలేజీకి రావడంలేదని నిన్న సాయంకాలమే చెప్పింది ప్రబంధ. ఇప్పుడు అదే విషయాన్ని అందంగా విశ్లేషిస్తూంది సౌదామిని. "రెండు రోజులపాటు పిచ్చివాడిలా ఆలోచించి వుంటాడు.... ఏమిటి? ఇంత తెలివైన అమ్మాయి, అసాధారణమైన అందం, అంతస్తు వున్న ప్రబంధ నాలాంటివాడిని ప్రేమించడం నిజమేనా అని నిద్రాహారాలు మాని ఆలోచించి వుంటాడు. ఆదిత్యే కాదు ప్రబంధా! ఆ స్థానంలో ఏ అబ్బాయి వున్నా అలాగే అనుకుంటాడు. అలా అతడున్న స్థితిలో నువ్వు సరాసరి ఇంటికే వెళ్ళావు. షాక్ తినుంటాడు....సరిగ్గా ఆ క్షణంలోనే ప్రబంధే లేనినాడు నా జన్మవృధా అని కూడా అనుకుని వుంటాడు. అందుకే సూటిగా నీకళ్ళల్లోకి చూడలేక..."
    
    "నిజమే ఆంటీ....! సరిగ్గా అలాగే ప్రవర్తించాడు" తను కారియర్ పంపిస్తానంటే ఎలా నలిబిలి అయ్యాడో చెప్పింది ప్రబంధ.
    
    "ఎస్! మనసు ఇవ్వడంతోనే సరిపెట్టక తనవాళ్ళకి సేవ చేస్తానని నువ్వనేసరికి కాదని మొరాయించి వుంటాడు. కారణం ఒక్కటే... ప్రబంధ సామాన్యురాలు కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు. కావాలీ అనుకుంటే ఓ కలెక్టరుని భర్తగా తెచ్చుకోగల అమ్మాయి."
    
    మంత్రించి వదిలిపెడుతున్న ప్రతి వాక్యమూ ప్రబంధకి చాలా ఉల్లాసాన్ని కలిగిస్తూంది.
    
    "అలాంటి నువ్వు... అంత అమితంగా అతడి ప్రేమను పొందిన అమ్మాయివి. పాపం...! చాలారోజులుగా తనకు కనిపించని ఆదిత్యతో మాట్లాడాలని ప్రణయ క్షణంపాటు పిలిచిందే అనుకో, ఎందుకంత గగ్గోలు పెట్టాలి? వదిలేయాలి ప్రబంధా! ఇవన్నీ చిన్న విషయాలు ఇందాక అన్నానే ఇవ్వటమూ, తీసుకోవటమూ మాత్రమే కాదు, క్షుణ్ణంగా పరిశీలించాలి కూడా అని... అది ఇక్కడ అప్లయ్ చేసి ఆలోచించాలి."
    
    పూర్తిగా చల్లబడిపోయింది ప్రబంధ.
    
    "ప్రబంధా! నువ్వుంటే ఇష్టమే వుండకపోతే నువ్వు చెప్పిన పజిల్ విన్నాక, ఆ పజిల్ అర్ధమైందని అన్నాక మళ్ళీ నీతో మాట్లాడేవాడా? సారీ చెప్పేసేవాడు, చెప్పలేదూ అంటే నీతోనే తన జీవితం అనుకున్నాడు....బహుశా ఇందాక పిలిచిన ప్రణయతో ఈరోజు సాయంకాలంలోగా అదే చెప్పేస్తాడేమో కూడా."
    
    అంతా బాగుంది. ఆమె విశ్లేషణా నచ్చింది. కాని, ఆ ప్రోగ్రాం ఏమిటి? అదే అడిగింది ప్రబంధ.
    
    ప్రతి సన్నివేశాన్ని తన ఆలోచనలకి అనుకూలంగా మలుచుకుని మాట్లాడగలిగే సౌదామిని, ప్రబంధలో సుతిమెత్తని పొరల్ని తాకి ఉన్మాదిగా మార్చుకోవటానికి ఇక్కడ అద్భుతమయిన అవకాశం తీసుకుంది.
    
    "ప్రోగ్రాం అంటే బహుశా మరేదో అని అనుమానిస్తున్నావా? అంది 'మరేదో' ని వత్తిపలుకుతూ.
    
    ప్రబంధ అలా అనుకోలేదు కాని, ఇప్పుడు సౌదామిని చెప్పాక ఎందుకో అలా అనుకోవాలనిపించింది.
    
    "ఆదిత్య అంత దూకుడు గలవాడని నేననుకోను."
    
    ప్రణయ చొరవ తీసుకోవచ్చుగా?"
    
    "అంతమాత్రంచేత ఆదిత్య లొంగిపోతాడంటావా....? వట్టి అమాయకురాలివమ్మా! అలాంటి మొనగాడే అయితే ఆ రోజు నిన్ను ముద్దుపెట్టుకోకుండా వదిలిపెట్టేవాడా...? పైగా ప్రణయకన్నా వేయిరెట్లు అందగత్తెవే!"
    
    ఎందరో వాసుదేవరావుల్ని, మరెందరో ప్రబంధల్ని చూసిన ఓ రోషనారీలాంటి సౌదామిని చివరి అస్త్రాన్నీ సంధించింది ఇక్కడ.
    
    "అంతెందుకు? ఈ రోజు నువ్వు ఒంటరిగా ఇంటికి వెళ్ళావుగా? ఇంట్లో ఒక్కడే వున్నాడుగా! పైగా నీ పజిల్ ద్వారా తెలుసుకున్న ముద్దు గురించి ఆలోచిస్తూ రెండ్రోజులు గడిపాడుగా ఒకవేళ కారెక్టరు లేనివాడే అయితే ఏం చేసేవాడు?"
    
    భ్రాంతిలోకి జారిపోయింది ప్రబంధ.
    
    "స్తంభంచాటున నిలబడ్డ నిన్ను రెక్కపట్టుకుని దగ్గరకు తీసుకునేవాడు. నువ్వు సుతిమెత్తగా వారిస్తున్నా వినకుండా పెదవులమీద గాఢంగా  చుంబించేవాడు. తొలిసారి మగస్పర్శ, పైగా నీ మనసంతా ఆక్రమించిన వాడు. నువ్వు సన్నగా కంపిస్తూ కాదంతూనే చేతులతో బలంగాచుట్టేదానివి. ఆ తరువాత అతడి కోర్కెల వాగుకి గండి పడేది. నిన్నలాగే బెడ్ రూమ్ లోకి లాక్కుపోయేవాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే స్థితికాదు నీది. అతను నిన్నేంచేసినా స్వర్గంలో విహరిస్తున్న ఆ క్షణాలని స్మృతిగా మిగుల్చు కోవాలను కునేదానివి తప్ప కాదనేదానివా? ఒకసారి కాదు.... మరోసారి...."
    
    "వద్దు!" ప్రబంధ కంపించిపోతూంది నిజంగానే. ఆమె మాటలు వింటూంటే ఆనందంలాంటి భయం, భయంలాంటి అలజడి.... "వద్దు ఆంటీ! చాలిక."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS