Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 56


    ప్రబంధ పైన మరో భావం వుంటే ఆ ప్రసక్తిని పొడిగించేవాడే కాలేజీకి వెళ్ళరూ?" అన్నాడు ప్రసక్తి మార్చుతూ.
    
    "మీరో?"
    
    వద్దంటే మానేసేట్టుంది.
    
    "హాస్పిటల్ కి వెళ్ళాలి."
    
    "నేనూ వస్తాను."
    
    "ఫస్టవర్ ఎగ్గొడతాను."
    
    "సరే, రండి."
    
    కాదనలేకపోయాడు. ఎందుకో అతడి మనసు చివుక్కుమంటూంది. ముందు తనకు తెలిసిన ప్రబంధలాగే ఆమె ప్రవర్తిస్తే బాగున్ననుకుంటూ కారియర్ అందుకున్నాడు.
    
    "ఇదేమిటి?"
    
    "మా చెల్లికి బ్రేక్ ఫాస్ట్, లంచ్ వగైరా..."
    
    విస్మయంగా చూసింది "మీరే చేశారా?"
    
    మాట్లాడలేదు. ప్రబంధ కారు డ్రయివ్ చేస్తుంటే నిశ్శబ్దంగా పరిసరాల్ని చూస్తున్నాడు.
    
    "మీరేం అనుకోనంటే...." అర్దోక్తిగా ఆగిపోయింది.
    
    "చెప్పండి."
    
    "హాస్పిటల్ కి భోజనం పంపే ఏర్పాటు చేస్తాను."
    
    స్నేహపూర్వకంగా నవ్వాడు "మీ కెందుకా శ్రమ?"
    
    "పంపేది మీవాళ్ళ కోసమే అయితే నాకు శ్రమెలా అవుతుంది?"
    
    జవాబు చెప్పలేకపోయాడు ఆదిత్య తన ప్రతి కదలికనీ తన కనుకూలంగా అన్వయించుకుని మాట్లాడుతూంది ప్రబంధ. ఎలా ఈమెను వారించడం?
    
    "కోపమొచ్చిందా?" అంది హాస్పిటల్ లో కారు దిగుతూ.
    
    "దేనికి?"
    
    "నేను చనువు తీసుకున్నందుకు."
    
    "ఛఛ....అదేం కాదు.?"
    
    అది అంగీకారంగా భావించిన ప్రబంధ ఆ తరువాత చాలా ఉత్సాహంగా వార్డ్ లోకి నడిచింది. ఆప్యాయంగా ప్రబంధని ఆహ్వానించిన అనితని చూడగానే భోధపడింది తను ఎలా భావిస్తున్నా కాని అనిత ఆమె రాకని ఇష్టపడుతూందని.
    
    "ఇకనుంచి మీకు మీల్స్ ఏర్పాటు నేను చేస్తే నీకు అభ్యంతరంలేదుగా అనితా?"
    
    అన్నయ్య మొహంకేసి చూసింది. "మీరింత అభిమానం చూపిస్తానంటే ఎలా కాదనగలను? పైగా కాదంటే... కొంప మునగదూ చిలిపితనంగా అంది అనిత."
    
    "అదేమిటి?"
    
    "హాస్పిటల్ నుంచి తరిమేస్తారని భయం అంతే.....!"
    
    పసిపిల్లలా నవ్వేసింది అనితతో బాటు ప్రబంధ కూడా వారి చర్చలో జోక్యం చేసుకోవడం ఇష్టంలేని ఆదిత్య కాలేజీ టైం అవుతుంటే బయలుదేరాడు.
    
    ప్రబంధతోపాటు కారులో రావడం కాదు ఆదిత్య చేసిన తప్పు.....యూనివర్శిటీ కాంపస్ లో అడుగుపెట్టగానే ప్రణయ కారు ప్రబంధకి కనిపించడం.
    
    తన ఉక్రోషాన్నో, గెలుపునో ప్రదర్శించటానికి అంతకంటే అవకాశం రాదనుకుందేమో, ప్రణయ కారుని ఓవర్ టెక్ చేసిన ప్రబంధ స్టూడెంట్సు ఎక్కువగా నిలబడ్డ రిజిస్ట్రార్ ఆఫీసు ముందు ఆపింది.
    
    అందరూ చూస్తుంటే ఇబ్బందిగా వుంది. అయినా కారు దిగాడు. తల వంచుకుని వెళ్ళబోతుంటే పిలిచినట్టయింది.
    
    ప్రబంధ కాదు.... అతడికి సమీపంలో ప్రణయ నిలబడి వుంది.
    
    "మీకు గుర్తుందో, లేదో చెప్పాలని పిలిచాను. ఈ రోజు సాయంకాలం మా ఇంట్లో ప్రోగ్రాం"
    
    గుర్తొచ్చింది.... రోహిత్ తో పోటీకి సిద్దపడేది ఆ సాయంకాలమే.
    
    తన ఉనికినే పట్టించుకోనట్టు ఆదిత్య ఆమెతో మాట్లాడటం బాధని పించిందో, లేక తనముందే మరేదో ప్రోగ్రాం గురించి ప్రణయ అతడికి గుర్తుచేయడం ఎగతాళిగా అనిపించిందో స్థాణువులా నిలబడిపోయింది ప్రబంధ తను సృష్టించుకునే ప్రపంచంలోకి మరెవరూ చొచ్చుకురావటం అంగీకరించని అమ్మాయామె!
    
    "ఆంటీ...!"
    
    గదిలోకి దూసుకువచ్చిన ప్రబంధని చూస్తూ అదిరిపడింది సౌదామిని. "కాలేజీకి సెలవా?" అడిగింది ప్రబంధ ముఖకవళికల్ని గమనిస్తూ "ఏమైందమ్మా...?"
    
    ప్రబంధ కళ్ళనుంచి నీళ్ళు రాలుతున్నాయి. బహుశా ప్రబంధలాంటి అమ్మాయి ఏడవగలదని సౌదామిని సైతం ఊహించి ఉండదు.
    
    అవసరమనిపిస్తే ఓడించడం, ఏడిపించడం తప్ప మరోటి తెలీని ప్రబంధ కేమైంది?
    
    "ప్రణయ నన్ను ఇన్సల్ట్ చేసింది"
    
    "అంటే...?" చీర చెరగుతో ప్రబంధ కళ్ళొత్తుతూ అడిగింది సౌదామిని....."నిన్నేమన్నా అందా?"
    
    "అంటే అక్కడే జవాబు చెప్పేదాన్ని చాలా నిశ్శబ్దంగా నన్ను దెబ్బతీసే ప్రయత్నం చేసింది" చెప్పింది జరిగిందేమిటో.
    
    నవ్వుకుంది సౌదామిని. చాలా చిన్న కారణం ప్రబంధ చెబుతున్నది. నిజానికి అంతగా రియాక్ట్ కావాల్సిన ఆగత్యం లేదు.
    
    తన తెలివిమీద కాని, తన ప్రేమమీదకాని, తనకు నమ్మకం ఉంటె కాజువల్ గా తీసుకునేది ఈ విషయాన్ని ఎంత ప్రేమించినవాడైనా మరో అమ్మాయితో మాట్లాడ్డమన్నది పెద్ద నేరం కాదు, అంతమాత్రంచేత తనేదో ఓడిపోయినట్టూ, శాశ్వతంగా ఆదిత్య తనకి దూరమైనట్టూ బాధపడాల్సిన అవసరం లేనేలేదు.
    
    కాని ప్రబంధకి ప్రేమంటే అవగాహన లేదు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే అమాయకంగా వున్న ప్రబంధ అనే అమ్మాయిని ప్రేమ అనే వలయంలోకి సౌదామినే నెట్టింది.
    
    జీవితంలో ప్రతిదీ గెలవడం నీకు సాధ్యమే అంటూ సౌదామిని సృష్టించిన మిధ్యాప్రపంచంలో అడుగుపెట్టి అక్కడా గెలుపుకోసమే ప్రయత్నిస్తున్న ప్రబంధ లోలోపల ప్రణయ విషయంలో చాలా బాధపడుతూంది. దాని పర్యవసానమే ఇది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS