Previous Page Next Page 
ఆలింగనం పేజి 56


    నేను గిల్టీగా తలవంచుకున్నాను "ఇక రెండో రకం... టైగర్! ఆకలి లేకపోయినా వేటాడటం, వేటాడిన ఎరని ఎవరూ ముట్టుకోకుండా కాపు కాయడం వాళ్ళ జాతి లక్షణం. ఆడపిల్లల్ని వీళ్ళు మాటలద్వారా ఆకర్షిస్తారు. అవసరమైతే ఎన్ని నాటకాలన్నా ఆడతారు. అబద్దాలు అనర్గళంగా చెప్తుంటారు. ఆ అమ్మాయి వాళ్ళ నుంచి దూరం అయితే వీళ్ళు వదలకుండా వెంటాడ్తారు. బ్లాక్ మెయిలింగ్ లాంటివి కూడా చేస్తారు. ఏ స్థాయికైనా దిగజారి కోరినది పొందాలనుకుంటారు.

 

    "ఔను!" ఎర్రనైన ముఖంతో అన్నాను.

 

    "ఇంక మూడోరకం ఉల్ఫ్...మనచుట్టూ వున్న ఇంటి ఓనర్ లూ, ఎదురింటి బాబాయ్ గార్లూ టైప్ అన్నమాట. మనం అస్సలు వీళ్ళని అనుమానించం. చాలా మనసుపిప్పి ఆత్మీయంగా మాట చెప్పుకుంటాం. ఏదో ఒకనాడు మన వీక్ పాయింట్స్ ని కాష్ చేసుకుని కబళిస్తారు. తోడేళ్ళలా ఒక్కసారిగా అదాటుగా ఉన్నప్పుడు మీదపడ్తారు! వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టం! సాధారణంగా ఆడపిల్లలు ఎరయ్యేది వీళ్ళకే...

 

    ఇంక నాలుగోరకం జాకాల్! గుంటనక్కల్లా ఓపిగ్గా ఛాన్స్ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తుంటారు. నక్క వినయాలుపోతూ స్వచ్చమైన స్నేహం... నిర్మలమైన హృదయం' లాంటి భాషాజాలం వాడ్తుంటారు. అమ్మాయి వీళ్ళని పూర్తిగా నమ్మి తనంతట తను యీల్డ్ అయిపోయే పరిస్థితులు తీసుకొస్తారు. జాలితోనో, కృతజ్ఞతతోనో అమ్మాయిలు వీళ్ళకి వశమౌతారు.

 

    "వాళ్ళు ఏదీ నోళ్ళు తెరిచి అడగడం కానీ శాసించడం కానీ ఉండదు. మనసు కరిగిపోయి స్త్రీ అతనికష్టాలు వినలేక త్యాగాలు చేసేస్తుంటుంది. ఆ త్యాగాలిచ్చే సౌఖ్యాలని అతను కష్టాలు చెప్పుకుంటూ, కడుపులో చల్ల కదలకుందా అనుభవిస్తూంటాడు!"

 

    నేను మంత్ర ముగ్దలా వింటుండిపోయాను.

 

    "చెప్పు...నీకు లయన్, టైగర్, ఉల్ఫ్, జాకాల్ కాక ఐదో రకం మగాడెవరైనా ఎదురుపడ్డాడా?" అంది.

 

    ఆ క్షణంలో నాకు చిన్నక్క డైరీలో వ్రాసిన - చంద్ర గుర్తొచ్చాడు. ఆడపిల్ల ఆకర్షింపబడి తన చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకుండా ఇతరులపై తను కన్నీటి చుక్కగా అయి జారైనా వాళ్ళ హృదయభారాన్ని తగ్గించదలచిన అలాంటి అపురూపమూర్తి లోకంలో ఉన్నాడుగా! ఎందుకుండడూ?

 

    మనకి వాళ్ళు తగలనంత మాత్రాన లోకమంతా ఇలాంటి మగాళ్ళే ఉంటారనుకోకూడదు! ఆ సమయంలో నాకు నాన్నగారు గుర్తొచ్చారు. చైతన్య గుర్తొచ్చాడు.

 

    వూపుకి తావివలె స్త్రీకి ఒక మగతోడు అవసరం.

 

    "లిల్లీ...మగాళ్ళంటే ఎందుకింత అసహ్యం నీకు?"

 

    "మగవాళ్ళంటే నాకు అసహ్యంలేదు. అమాయకత్వం నటిస్తూ మోసపోయి ఆ తర్వాత గోలచేసే ఆడవాళ్ళమీదే నా కోపమంతా" ఆవేశంగా అంది.

 

    నేనేం మాట్లాడలేదు. అమాయకత్వం జన్మతహా వస్తుంది! వదిలించుకోవాలంటే దెబ్బలుతిని రాటుదేలిపోవాలి! అని ఆమెతో వాదించే ఓపిక నాలోలేదు.

 

    "నేను ఒంటరిగా ఉంటున్నానంటే నువ్వు ఎందుకంత ఆశ్చర్యపోయావు?" అడిగింది.

 

    "ఆడపిల్లవి కాబట్టి" అన్నాను.

 

    "ఈ శతాబ్దంలో కూడా ఆడపిల్ల ఒంటరిగా జీవించకూడదు అనే ఆలోచనతో ఉన్నావా?" నిలదీసింది.

 

    "అమ్మా, నాన్నా, అక్కా, తమ్ముడూ అనే సాలెగూడు లాంటి కుటుంబాలలో ఉంటేనే రక్షణలేదు! ఇంక ఇలా ఒంటరిగా ఉన్నానని తెలిస్తే... వలలు విసిరే వాళ్ళు తక్కువా?" అన్నాను.

 

    "లుక్! నేను అమాయకమైన చేపను కాను వలలో పడడానికి" అంది.

 

    నేనింక తర్కించలేదు.

 

    "ఇందాకా నేను అడిగిన ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పలేదు. లయన్, టైగర్, ఉల్ఫ్, జాకాల్ కాక...ఇంకో రకం మగాడు ఎదురు పడ్డాడా?" అడిగింది.

 

    "ఇంకా లేదు. అతనికోసమే ఈ అన్వేషణ!" అన్నాను.

 

    "ఉన్నాడని ఖచ్చితంగా తెలుసా?"

 

    "తెలుసు!"

 

    "ఎలా?"

 

    నేను మౌనం వహించాను. నా మనసులో అప్పటికే చంద్ర ఆచూకీ గురించిన ఆలోచనలు కందిరీగల్లా ముసిరిపోతున్నాయి. ఎక్కడున్నాడో...ఎలా ఉన్నాడో...ఎలా పట్టుకోవడం?

 

    "పర్సనల్ అయితే చెప్పద్దులే!" అంది.

 

    "లిల్లీ నువ్వు ఎవర్నీ ప్రేమించలేదా?" అడిగాను.

 

    "నేనా?" ఆశ్చర్యంగా చూసి, అంతలోనే పకపకా నవ్వి "చాలా మందిని ప్రేమించాను డియర్! కానీ దగ్గరికి వెళ్ళేసరికి వాడిలోంచి లయనో, ఉల్ఫో తొంగి చూసి దూరంగా వచ్చేశాను. నువ్వు వెతుకుతున్న హీరోలాంటి వాడు మాత్రం ఇంకా తారసపడలేదు!" అంది.

 

    నేను టైం చూసి "ఇంక నేను బయల్దేరనా?" అన్నాను.

 

    "నో...నో... వంట చేస్తాను. భోంచేసే వెళ్ళాలి" అంది.

 

    "ఇంకోసారి వస్తాను. ఇప్పుడు కాలేజ్ కి టైం అయిపోతోంది" అన్నాను.

 

    "ఏం? నిన్న నేను మీ ఇంట్లో అన్నమాట తిరిగి చెప్తున్నావా?" అంది.

 

    "అదేంకాదు. నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడ్తానా"

 

    "సరే ఒప్పుకుంటున్నాను" అంది.

 

    నేను బయటికి వస్తూ ఉంటే, తలుపుదాకా వచ్చి -

 

    "ఆముక్తా... ఒక్కమాట!" అంది.

 

    నేను వెనక్కి తిరిగి "ఏవిటీ?" అన్నాను.

 

    "నిన్ననే చెప్దామనుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు వయసు వచ్చాకా చాలా అందంగా ఉన్నావు. దగ్గరగా ఉంటే నాకే మతిపోతోంది!" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS