Previous Page Next Page 
ఆలింగనం పేజి 55


    నాకు విజిటింగ్ కార్డ్ యిచ్చి "రేపు ప్రొద్దుట నా ఫ్లాట్ కి రా, చాలా సంగతులు మాట్లాడుకుందాం" అంది.

 

    "ఎవరెవరుంటారూ?" అడిగాను.

 

    "నేను ఒక్కదాన్నే!" అంది.

 

    "ఒక్క దానివేనా!" అన్నాను.

 

    "ఔను. రేపు రా, గుడ్ నైట్!" అని వెళ్ళిపోయింది లిల్లీ.


                                                          *  *  *


    నేను ప్రొద్దుట లిల్లీ దగ్గరకి బయల్దేరబోతూవుంటే మాధవ్ వచ్చాడు.

 

    "ఉద్యోగం ఎలా వుందమ్మా?" అడిగాడు.

 

    "బానే వుంది" అన్నాను.

 

    "నాకు ఎప్పుడైనా ఫోన్ చెయ్యొచ్చుగా!" అడిగాడు.

 

    "ఏం సంగతులున్నాయనీ?" అన్నాను.

 

    "నీ గురించి నేనే వర్రీ అవుతుంటానుగా, ఒక్కమాట, అంతా బాగానే వుంది అని చెప్పవచ్చుగా!" అన్నాడు.

 

    అతనికి మాయందున్న బాధ్యతకి కృతజ్ఞతగా అనిపించి "సరే చేస్తాను" అన్నాను.

 

    అతను లేచి నా తలమీద చెయ్యి వేసి "నా గురించి ఏ అనుమానాలు వద్దు. నాది స్వచ్చమైన స్నేహం! ఒక మంచి ఫ్రెండ్ అనుకుని నాతో మాట్లాడ్తుండు" అన్నాడు.

 

    నేను కాస్త దూరం జరిగాను.

 

    అతను వెళ్ళిపోయాక అమ్మ నాన్నతో "మాధవ్ కి ఆముక్త అంటే ఇష్టమే అనుకుంట. ఎటూ వాళ్ళ అమ్మగారికి కూడా మన కాళిందిని కోడలిగా చేసుకోవాలని వుండేది. ఒకసారి ఆముక్త గురించి ఆవిడ్ని కదిపి చూడండి!" అంది.

 

    నాన్న నవ్వి "పిచ్చిదానా! వేలు సంపాదించే డాక్టర్ పిల్ల కోడలవుతుందని ఆశపడింది కానీ డిగ్రీ చదువుతున్న ఈ పేదింటిపిల్లని కోడలుగా చేసుకోవాలని అనుకుంటుందా?" అన్నాడు.

 

    "అబ్బా...అడిగి చూడండీ!" అంది.

 

    "అది ఒప్పుకుంటే అసలు చైతన్యకన్నా తగ్గవరుడెవరు?" అన్నాడు. నేను ఆ సంభాషణ వింటూనే తయారయి లిల్లీని కలుసుకోవడానికి వెళ్ళిపోయాను.


                                  *  *  *


    లిల్లీ అపార్ట్ మెంట్ ముందు నిలబడి బెల్ నొక్కిన ఓ నిమిషానికి తలుపు తెరుచుకుంది.

 

    నైటీలో వున్న లిల్లీ "హాయ్ కమిన్!" అని అరిచింది.

 

    విశాలమైన త్రీ బెడ్ రూం ఫ్లాట్ అది.

 

    హాల్లో ఇంటీరియర్ డెకరేషన్ ఆమె టేస్ట్ ని పట్టిస్తూ రిచ్ గా వుంది. వాల్ పేపర్స్, వాల్ టూ వాల్ కార్పెట్స్ అధునాతనంగా వున్నాయి.

 

    లిల్లీ ఫ్రిజ్ తెరుస్తూ "కూల్ డ్రింక్ తాగుతావా? లేకపోతే కాఫీ కలుపుకుందామా?" అంది.

 

    "ఏదైనా సరే!" అన్నాను. లిల్లీ లిమ్కా అందించింది.

 

    అది కూల్ గా నా గొంతులోకి జార్తోంది.

 

    "ఇప్పుడు చెప్పు నీకు తగిలిన మగజాతుల గురించి!" అంది నా ఎదురుగా కూర్చుంటూ.

 

    "మగ జాతులా?" అన్నాను.

 

    లిల్లీ నవ్వి "స్త్రీలలో నాలుగు జాతులు అని చెప్తారు తెలుసా?" అంది.

 

    నేను ఉత్సాహంగా "తెలుసు. పద్మిని, హస్తినీ, శంఖినీ, చిత్రిణీ" అన్నాను.

 

    "వెరీగుడ్! మీ తెలుగు టీచర్ గట్టివాడే. మరి మగవాళ్ళలో నాలుగు జాతుల పేరు చెప్పు!" అంది.

 

    "నేను ఎప్పుడూ వినలేదే!" అన్నాను.

 

    "వెరీబాడ్! ఇంట్లో నిఘంటువుకానీ పెద్దబాలశిక్ష కానీ లేదా? ఇప్పుడు తెలుసుకో...పురుషుల్లో నాలుగు జాతులని పెద్దవాళ్ళు వర్గీకరించారు. వాళ్ళు భద్రుడూ, దత్తుడూ, కూచిమరుడూ, పాంచాలుడూ!" అంది.

 

    "అమెరికాలో కూర్చుని ఈ విషయాలన్నీ నేర్చుకుని వచ్చావా!" ఆశ్చర్యంగా అడిగాను.

 

    "నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కదా! ఇప్పుడు వాళ్ళ లక్షణాలు తెలుసుకుందాం. మొదటివాడు తెలివిగా కనిపించే తెలివిలేనివాడు! రెండవవాడు తెలివిలేనట్లుగానే కనిపించే తెలివిలేనివాడు! మూడోవాడు తెలివిలేనట్లుగా కనిపించే తెలివైనవాడు! నాలుగోవాడు తెలివిగా కనిపించే తెలివైనవాడు!" అంది.

 

    నేను నవ్వు ఆపుకోలేక పడీపడీ నవ్వుతూ "మళ్ళీ చెప్పు...వింటాను" అన్నాను.

 

    ఆమె మళ్ళీ చెప్పింది. కానీ సీరియస్ గా! "అవన్నీ పాతవాళ్ళ క్లాసిఫికేషన్స్. నేను ఆధునికంగా వాళ్లని నాలుగు రకాలుగా విభజించాను. జాగ్రత్తగా విని నీకు తగిలినవాళ్ళు ఏ రకమో నాకు తర్వాత చెప్పు" అంది.

 

    నేను ఆసక్తిగా ముందుకు వంగి ఆమె చెప్పేది శ్రద్ధగా వినసాగాను.

 

    "లయన్, టైగర్, ఫుల్ప్, జాకాల్! మొదటగా లయన్ గురించి...ఈ టైపు మగవాడు వేట అవసరానికి చేస్తాడు. చాలా ఆకర్షణీయంగా, సమ్మోహనంగా ఉంటాడు. స్త్రీ ఇతనికి ఇట్టే వశం అవుతుంది. అట్టే అబద్దాలాడడు. తన అవసరం తీరిపోయాక ఆమె గురించి పట్టించుకోడు. ఇంకో వేటలో ఉంటాడు. పాత పరిచయాలు గుర్తు చేసుకోవాలంటే విసుగుపడ్తాడు.

 

    ఇతనివల్ల ఆ స్త్రీకి కూడా పెద్ద చిక్కు ఉండదు. ప్రేమిస్తే తప్ప! సాధారణంగా ఇటువంటి పురుషులని ఆడవాళ్ళు ఠకీమని ప్రేమించి, భంగపడ్డామంటూ విషాదంలో కూరుకుపోతుంటారు. అతని గురించి అన్నీ తెలిసినా ఇష్టంగా మోసపోతుంటారు. "ప్రేమ... ప్రేమ... అంటూ దేబిరిస్తుంటారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS