Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 54



    ఆమె కళ్లనించి కన్నీరు స్రవిస్తోంది.

    ఒక్కసారి కళ్లు మూసుకొంది.

     కాళ్లకింద వున్న బల్లని పక్కకి తన్నేసింది కామినీ.

                 28

    బస్తీలో కామినీ ఆత్మహత్య విషయం గుప్పుమంది.

    ఆ సాయంత్రం ప్రశాంత్ ఆ ఇంటికి రావడం చూసిన  వారున్నారు. కారుని వీధి చివర ఆపి ఆ ఇంటికి నడిచి

వచ్చినట్లుగా చెప్పుకొంటున్నారు.

    కామినీ తల్లి బసవ పున్నమ్మ గుండె తెగిపడేలా ఏడుస్తోంది.
 
    కామినీ మామూలుగా చనిపోలేదు.

     ఆమెపైన అత్యాచారం జరిగినట్టుగా ఆమె వంటిపైన దుస్తులు, శరీరంపైన చిన్న చిన్న గాయాలు

తెలుపుతున్నాయి.

     తనపైన జరిగిన అత్యాచారానికి ఆమె తట్టుకోలేక వురి పోసుకుని చచ్చిపోయినట్టుగా చెప్పుకొంటున్నారు.

     ప్రశాంత్ అంత నీచానికీ, దారుణానికీ, ఒడిగట్టాడంటే బసవ  పున్నమ్మ నమ్మడం లేదు.

     అత నెప్పుడూ కామినీని కన్నెత్తి కూడా చూసేవాడు కాదు.

     ఆ విషయం ఆ వృద్దురాలికి బాగా తెలుసు.

     అయితే ప్రశాంత్ కాకుండా ఆ ఇంటిలోకి ఇంకెవరైనా జొరబడి  ఆ సాహసం చేశారా!

     కానీ ఇంటికి వచ్చింది ప్రశాంత్ అని ఖచ్చితంగా చెప్పుకొంటున్నారు.

     అతను వస్తుంటాడు.

     పోతుంటాడు.

     కామినీ అన్న సూరిబాబు ఏమైపోయాడో బస్తీలో చాలామందికి తెలీదు.

     బసవపున్నమ్మ కూడా అతని గురించి అడిగితే ముభావంగా వూరుకుంటుంది.

    ప్రశాంత్ అనబడే సూరిబాబు స్నేహితుడు అడపా దడపా వాళ్ళింటికి వస్తూపోతూ వుండటం బస్తీలో

అందరికీతెలుసు.

     అతనే ఆర్దిక సహాయం చేస్తుంటాడని కూడాతెలుసు.

     కావాలంటే కామినీని అతను ఉంపుడుకత్తెగా చేసుకోవడానికి అవకాశాలెన్నో వున్నాయి.

     అలాంటి అవకాసంగల అతను ఇంత నీచానికి దారుణానికి దిగజారాడంటే నమ్మేందుకు వీలులేకుండా వుంది.

     అసలతను కామినీ కోసమే వస్తాడని, ఆమెని వుంచుకొన్నాడని కొందరు గుసగుసలు ఆడుకోవడం కూడా

అక్కడ వినవస్తోంది.

     ఏది ఏమైనా ఓ ఆడపిల్ల నిండుప్రాణం పోయింది.

      దానికి బస్తీలో వారంతా బాధపడుతున్నారు. బసవపుననమ్మని ఓదారుస్తున్నారు.

     కొడుకన్నా దగ్గర వుంటే ఇలాంటి సమయంలో ఆమెకి కొంతైనా ధైర్యం వుండేది.

      ఒక పక్క వెల్లువలా దుఃఖం కట్టలు తెంచుకొంటుంటే  పోలీసులు వచ్చి పడ్డారు.

     ఇంటి ముందు జనం పోగయ్యారు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకొంటున్నారు.

     ఇన్స్ పెక్టర్ బసవపున్నమ్మని సమీపించాడు.
 
     "చూడమ్మా! మీకు కలిగిన నష్టం తీర్చలేనిది. వయసొచ్చిన  కూతుర్ని పోగొట్టుకున్న మీకు సానుభూతి

మాటలు చెప్పి ఓదార్చడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు.

     ఇబ్బంది అనిపించినా మిమ్మల్ని నేనుకొన్ని ప్రశ్నలు అడుగుతాను.

     మీరు నిజం చెప్పండి.

     నేరస్థుడిని పట్టుకుని శిక్షపడేలా చేస్తాను" అన్నాడు ఇన్స్ పెక్టర్ రాజు.

     ఆ తల్లి ఆ మాటలు వింటూనే బోరుమంది.

    "ఏడవకండమ్మా!

    మీ అమ్మాయి కామినీ ఎలాంటిది?"

     ఇన్స్ పెక్టర్ కేసి రోషంగా చూసింది ఆముసలితల్లి.

     "నా బిడ్డ నిప్పులాంటిది. అందుకనే కదా ప్రాణం తీసుకొంది!"

    "మీకెవరిమీదన్నా అనుమానం వుందా?"

    "లేదు. కానీ ఏ చచ్చినోడు నా బిడ్డ బతుకుని నాశనం చేశాడు. "

    "ప్రశాంత్ మీకు బంధువా?"

    "కాదు."

    "అతను మీకెలా తెలుసు."

    "నా కొడుకు సూరిబాబుకి స్నేహితుడు."

    ఆమె ఏడుస్తూనే సమాధానం చెప్పింది.

     "మీకు కొడుకు వున్నాడన్నమాట?"

    "అవును."

    "అతనేం చేస్తున్నాడు"

    "తెలీదు."

    "ఎక్కడున్నాడు?"

    "తెలీదు."

    ఇన్స్ పెక్టర్ విస్మయంగా చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS