మాధవ్ గురుదేవ్ కళ్ళల్లో భయం రెపరెపలాడింది. చేయిజాపి కుర్చీ చూపిస్తూ "కూర్చోండి." అన్నాడు.
పరంజ్యోతి కుర్చీలో కూర్చుంటూ వీళ్ళిద్దరూ వున్నారే అన్నట్లు కనుసైగ చేశాడు.
"దేవీ! నేను కొద్దిసేపు మాట్లాడాలి. కాసేపు ఈగదిలోకి ఎవరూ రాకండి. వెళ్ళి చల్లటి పానీయం పంపించు." అన్నాడు మాధవ్ గురుదేవ్.
సతీదేవి వెళ్ళిపోయింది.
"ఏమిటి అలా మాట్లాడుతున్నావు!" పరంజ్యోతి అడిగాడు.
మాధవ్ గురుదేవ్ నోరుతెరచి చూపించాడు. నాలుక ఉబ్బిఉంది. పళ్ళగాట్లు కనపడుతూ నాలుక ఎర్రగా నిగనిగలాడుతున్నది.
"మోటార్ బైక్ ని చాలా స్పీడ్ గ నడపటం వల్ల గుంతలో పడేముందు చాలా విసురుగా పడ్డాను. బుగ్గ నొక్కుకుపోయింది. దంతాలు నాలుగు కదిలి పోయాయి. నాలుక పళ్ళకింద పడింది." అతి కష్టం మీద మాట పెగుల్చుకుని నంగినంగిగ చెప్పాడు మాధవ్ గురుదేవ్.
తలకున్నగాయం పరీక్ష చేసేనెపంతో మాధవ్ గురుదేవ్ ముఖం మీదకి కాస్తవంగి "ఆ ముసలాడిని ఇక్కడ నుంచి పంపు." అన్నాడు పరంజ్యోతి.
"ఇంతవరకూ మనం వాడిన మందువల్ల ముసలాడికి చూపుబాగా తగ్గింది. చెవులు వినిపించటం మానేశాయి. నోరు తెరుచుకు ఎలానిద్ర పోతున్నాడో చూశారుగా, మనం మాట్లాడుకోటం ప్రమాదం లేదు." మాధవ్ గురుదేవ్ చెపుతుండగానే దాసీది చల్లని పానీయం తీసుకొచ్చి యిచ్చింది. "తలుపు దగ్గరగ వేసి వెళ్ళు నేను బెల్ కొట్టి పిలిచిందాకా ఎవరూలోపలికి రావద్దు." అన్నాడు.
దాసీది తల వూపి వెళ్ళింది.
పరంజ్యోతి పానీయం తాగాడు. ఖాలీగ్లాసు పక్కన వుంచుతూ అన్నాడు. "నీప్రవర్తన బాగుండలేదు."
తప్పుచేసిన వాడిలా బెదిరినట్లు ముఖంపెట్టాడు మాధవ్ గురుదేవ్.
"ఇక్కడ మనమాటలు ఎవరూ వినరుగా!" పరంజ్యోతి తగ్గు స్వరంతో అడిగాడు.
"ఊహూ అందుకే నేను ధైర్యంగా వున్నాను."
'మంచిది నీ ప్రవర్తన బాగుండలేదు అన్నదానికి నీసంజాయిషీ ఏమిటి?"
"నా ప్రవర్తన బాగుండక పోవటమా!" బుకాయింపుగ అన్నాడు మాధవ్ గురుదేవ్ కాని ఆ అన్న తీరులో జంకువుంది.
నువ్వేమీ చెప్పవద్దు. నాదగ్గర సాక్ష్యాలు వున్నాయి. డబ్బు చేతికందటం లేదు అన్నావ్. మరి చేజిక్కించుకున్న లక్షల నేం చేశావ్! ఎవరితో పనిబడి అర్దరాత్రి ఆదుర్దాగా బైలుదేరి బ్రీఫ్ కేసుతో వెళ్ళావ్!"
"ఇది...ఇది...మీకెలా... ...అదే మీకెవరు కట్టుకధ చెప్పారు!"
"విలియం! మన నిబంధనలు తెలిసి నాకే ఏదో చెప్పబోవటం హాస్యాస్పదం. యిచ్చటికి వచ్చిన వారం తర్వాత నీవోకోరిక కోరావు గుర్తుందా!"
మాధవ్ గురుదేవ్ కళ్ళు వాల్చుకుని "గుర్తుంది" అన్నాడు. పరంజ్యోతి తల తిప్పిచూశాడు. ముసలాయన అలాగే పడకుర్చీని అంటి పెట్టుకుని నోరు తెరచుకుని నిద్ర పోతున్నాడు.
పరంజ్యోతి చుట్టూచూశాడు. అనుమానించ తగ్గవి ఏమీ కనిపించలేదు.
"విలియం! ఇంకనేను చెప్పవలసింది ఏమీలేదు. నీవు శాస్వితంగ యిక్కడ వుండినా మనపని విర్వహిస్తూనే వుంటానన్నావ్. అదీ మంచిదేనని ఈ విషయంలో నీవు కోరినట్లు సర్వహక్కులు ఇచ్చాము. కాని యింతవరకూ బాస్ కి శ్రమ, కర్చు, రిస్క్, తప్ప కించిత్ ప్రయోజనం నీవల్ల కలగలేదు. యిదంతా అనవసరం. బాస్ నీతో ఓ మాట స్వయంగ చెప్పి రమ్మని పంపించారు. అదిచెప్పటానికి వచ్చి గతాన్ని తిరగతోడు తున్నాను......
"నా ప్రయత్నం నేను చేస్తూన్నాను. యింతలో," మాధవ్ గురుదేవ్ మధ్యలో అడ్డుతగిలి అన్నాడు.
"వద్దు విలియం. నీవేమి చెప్పవద్దు. బాస్ ఏవోకొన్ని సాక్ష్యాధారాలు సేకరించాడు. అవేవోనాకు తెలియదు. నీశరీరమంతా గాయాలు తగిలాయి కాబట్టి నేను సొంతంగ రిస్క్ తీసుకుని పదిరోజులు నీకు టైము యిస్తూన్నాను, వచ్చి బాస్ ని కల్సిమాట్లాడు. నీవు ఏంచెప్పదల్చుకున్నావో చెప్పు, నీసంజాయిషీ వినిపించు."
"బాస్ ఏంచెప్పారు!"
"రేపు రాత్రికి వచ్చి కల్సుకోమన్నారు. నీతోపాటు అయిదు లక్షలు తెమ్మన్నారు."
"అయిదు లక్షలు! ఇంకా నాచేతికి.......
"ఇష్, నాతోకాదు చెప్పాల్సింది, బాస్ తో యాక్సిడెంట్ లో నీకెన్ని గాయాలయాయో చూసి ఈకబురు అందించి రమ్మని నాతో చెప్పారు. కాని నిన్ను నీ కట్టు స్వయంగ నేను చూడటం వల్ల నేను పది రోజులు టైము యిచ్చాను. ఒకటి మాత్రం నిజం, బాస్ నమ్మక ద్రోహం సహించడు. రెండు, అర్దరాత్రి హడావిడి ప్రయాణం బరువుగ వున్న బ్రీఫ్ కేసు, తొమ్మిది లక్షలు, ఇలాంటి దేదో బాస్ నోటీసుకి వచ్చింది."
"ఇదెలా తెలిసింది!" గబుక్కున అని తప్పుచేసి దొరికిపోయినట్లుగ నాలుక కొరుక్కున్నాడు మాధవ్ గురుదేవ్.
