"పోనీ రహస్యంగా పోలీసులకి చెబితే!" సాలోచనగా అన్నాడు మధుమూర్తి.
"ఉహు విషయం తెలియకుండా అంతదూరం మనం పోకూడదు. వారికీ తెలిస్తే బాధపడతారు. వంటరిగా ఆలోచించ లేక మీ సలహా కోసం చెప్పాను. వారేమైనా చిక్కుల్లో ఇరుక్కున్నారేమో అన్న భయం నన్ను వేధిస్తున్నది."
"నిజమే ఈ మధ్య వారిలో మార్పు నేనూకనిపెట్టాను. ఏదో చిక్కుల్లో యిరుక్కున్నట్లే వున్నారు. ఈనెలలో అయిదు సార్లు మొత్తం తొమ్మిది లక్షలు డబ్బు తీశారు. ఆ డబ్బు దేనికి వుపయోగించిందీ నాకు లెక్కలు యివ్వలేదు కర్చుకింద రాసుకోమన్నారు. ఈ లెక్కన బహుశా ఎవరో అయ్యగారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారనేఅనుకోవాలి." మధుమూర్తి చెప్పాడు.
ఆ తర్వాత మరో పదినిమిషాలు మధుమూర్తి సతీదేవి మాట్లాడుకుని లేచారు.
కిటికీ అవతల వున్న ఆనందమూర్తి నిమ్మదిగ తప్పుకున్నాడు.
ఆనందమూర్తిని చాటుగ వుండి గమనిస్తున్న కీర్తి నవ్వుకుంది.
35
పధకంలో భాగంగ నాలుగు వైపులా వుచ్చుముడులు వేసి రెడీగ పెట్టింది కీర్తి.
రెండు ముడులు పూర్తిగ బిగించటం యిప్పటికిపూర్తి అయింది.
ఇంకో వుచ్చుముడి రెడీగ వుంది. అది బిగిసుకుంటే చాలు నాలుగో ముడి ఆటోమెటిక్ గ బిగుసుకుంటుంది. బస్ యింక పని పూర్తిఅయినట్లే.
మాధవ్ గురుదేవు అతను ఎక్కి వెళ్ళిన మోటార్ బైకు ఊరిచివర కొండ మలుపు దగ్గర గోతిలో పడివుంటే ఎవరో చూసి యింటికి తీసుకువచ్చారు.
మాధవ్ గురుదేవ్ తలకి, వంటికి బాగా గాయాలు అయ్యాయి. డాక్టరు వచ్చి పెద్దపెద్ద కట్లు కట్టాడు.
మాధవగురుదేవు మోటారు బైకు చావు తప్పికన్ను లొట్టపోయిన చందంగ యింటికి చేరటం జరిగింది. అతనుతీసుకెళ్ళిన బ్రీఫ్ కేసు పక్కనలేదు.
మాధవగురుదేవు చెప్పటం రాత్రిపూట చీకట్లో తిరిగి వస్తుంటే పక్కనే వున్న పెద్ద గోతిని చూసుకోలేదు, పడ్డాను. ఆ తర్వాత నాకు తెలివి తప్పిపోయింది అని.....అంతే గాని బ్రీఫ్ కేసు మాట ఎత్తలేదు.
మాధవ్ గురుదేవ్ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ నుంచి వస్తుంటే ప్రమాదం జరిగింది అన్నది ఎవరికీ తెలియదు. ఆయన చెప్పలేదు.
ఆనందమూర్తి, సంగయ్య, మరో నౌకరు శంభుమిత్ర ఏదోఒక సమయంలో మాధవగురుదేవుతో మాట్లాడ ప్రయత్నించారు. కాని కుదరలేదు వక్క క్షణంకూడా భర్తని వదలకుండా సతీదేవి పక్కనే వుంది. పైగా కొడుక్కి ప్రమాదకర మైన దెబ్బలు తగిలాయని తెలిసి రంగ మార్తాండగారు నౌకరు సాయంతో ఆయన గది వదలి యిక్కడే పడక కుర్చీలో పడుకున్నారు.
మరో నాలుగు రోజులు గడిచి పోయాయి.
ఆ రోజు.
రాత్రి పదిగంటలకి.
లాంగ్ కోటు, నెత్తిన హ్యాటు, నోట్లో సిగారు, కళ్ళకి పెద్ద సైజు గాగుల్స్, పాదాలకి మిలటరీ బూటు, చేతిలో ఖరీదైన బ్రీఫు కేసుతో బారీగ వున్న ఒకతను ఆ యింటికి వచ్చాడు. మాట గంభీరంగా వుంది.
"ఎవరు కావాలి?" నౌకరు అడిగాడు.
"మాధవ్ గురుదేవ్ కావాలి." అతను చెప్పాడు.
వచ్చినతను ఏకవచనప్రయోగం చేయటం నౌకరు గమనించాడు.
ఎవరోవ్యక్తి ఎప్పుడూ ఆ యింటికి రానివ్యక్తి వచ్చినట్లు అందరికీ తెలిసింది.
"అయ్యగారికి చాలా పెద్ద ప్రమాదం జరిగింది. మంచం మీదనుంచి యింకా కిందకి దిగటం లేదు."నౌకరు చెప్పాడు.
"మాట్లాడుతున్నాడు కదా!" ఆ వ్యక్తి అడిగాడు.
"ఊ..."
"పరంజ్యోతి వచ్చాడని చెప్పు." ఆ వ్యక్తి గంభీరంగ చెప్పాడు.
మళ్ళీ నౌకరు యింట్లోకి వెళ్ళాడు. విసిరేస్తే గోడకి తగిలి ఎదురువచ్చినబంతి అంత వేగంగా నౌకరు తిరిగి వచ్చాడు. ఇప్పుడు నౌకరు ముఖంలో వినయ విధేయతలు కనపడుతున్నాయి. "మీ పేరు మొదటే చెప్పాల్సింది అయ్యా!" వినయంగా అని "రండి, అయ్యగారు మిమ్మల్ని వెంట పెట్టుకురమ్మన్నారు." అని చెప్పాడు.
పరంజ్యోతి పెదవుల మీద వక్రరేఖ మెదిలింది.
నౌకరు అది గ్రహించాడు.
ముందు నౌకరు వెనుక పరంజ్యోతి నడుస్తూ మాధవ్ గురుదేవ్ గదిలోకి వెళ్ళారు.
