Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు - 2 పేజి 5

                                
    
    దేవదాసు, పార్వతి ఒకరినొకరు చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెళ్ళిపీటల మీదున్నారు. పార్వతి తల్లి చాలా ఆడంబరంగా హడావుడిగా తిరుగుతోంది. తండ్రి అయితే చెప్పనే అక్కర్లేదు. "మీకేమండీ! జమీందారీ అల్లుడిని పొందారు" అని పొగిడే అతిథుల్ని రిసీవ్ చేసుకుంటూ హడావుడి చేస్తున్నాడు.
    మనోరమ వాళ్ళ నాన్న - కొంచెం చనువు గాబట్టి "ఏమిటీ! పెళ్ళికొడుకు తల్లిగానీ, తండ్రిగానీ వచ్చినట్లు లేదే?" అనడిగాడు.
    పార్వతి తండ్రి నవ్వుతూ "ఇవన్నీ ప్రథమ అలకలు. ఇప్పుడు కోపంగా వున్నా, త్వరలోనే అంతా సర్దుకుంటుంది లెండి. ఎంతైనా కన్నకొడుకు.....పైగా ముద్దుల కొడుకు. ఈ రోజుల్లో కోపాలు ఎంతసేపు, సయోధ్య ఎంతసేపు?" అన్నాడు.
    "అంతే లెండి...." అని లోపలికి వెళ్ళిపోయాడాయన. పార్వతి జడను సర్దుతూ, చెవిలో ఏదో చెప్పి నవ్విస్తోంది మనోరమ.
    ముహూర్తానికి జీలకర్ర, బెల్లంతోపాటు అల్లం, మిరియాలు, కొంచెం గసగసాలు, దాల్చినచెక్క, రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు పార్వతి నెత్తిమీద పెట్టాడు దేవదాసు. పార్వతి నేనేమీ తక్కువ తినలేదన్నట్టు మనోరమ చెవిలో ఏదో చెప్పి, ఆ సరంజామాతో పాటు కొంచెం కొరివికారం కూడా కలిపి దేవదాసు నెత్తిన పెట్టింది.
    'చిలిపి దంపతులు' అనుకున్నారంతా.
    
                                      * * *
    ఆ రోజు పార్వతి అర్దరాత్రి ప్యాలెస్ లోకి వచ్చి 'నీ పాదాల దగ్గర కాస్త చోటివ్వు దేవదా' అని అడిగినప్పుడు దేవదాసు వాళ్ళ నాన్న గంభీరంగా 'మీ కులమేమిటి? మా కులమేమిటి? మీరెక్కడా? మేమెక్కడా?' అని అవమానం చేశాడు. దాంతో ఖిన్నురాలై వెళ్ళిపోయింది పార్వతి.
    ఆ మర్నాడే దేవదాసు వాళ్ళ నాన్నతో పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. అది వేడెక్కి "నువ్వు గనక పార్వతిని పెళ్ళిచేసుకుంటే నీకు ఈ ఆస్తిలో దమ్మిడీ రాదు. కట్టుబట్టలతో వెళ్ళిపో" అన్నాడాయన.
    దేవదాసుకి రోషం వచ్చింది. అలాగే కట్టుబట్టలతోనే వెళ్ళిపోయాడు. "మంచిపని చేశావు" అని పార్వతితో సహా అంతా అభినందించారు.
    పార్వతి తల్లిదండ్రులు మాత్రం 'ఈ పంతాలూ పట్టింపులూ ఎన్నాళ్ళో ఉండవు' అనుకున్నారు.
    
                                      * * *
    
    ఆరునెలలయింది.
    ఓ రోజు పార్వతి "మీరిక్కడ సంవత్సరాల తరబడి వుంటుంటే బైట అందరూ మిమ్మల్ని ఇల్లరికపుటల్లుడు అంటున్నారు. ఇక మా అమ్మానాన్నా అయితే...."
    దేవదాసుకి అప్పటికే రోషం తన్నుకు వస్తోంది "ఊఁ .. మీ అమ్మానాన్నా అయితే?"
    ఒక్క క్షణం మౌనంగా ఉండి చెప్పింది "నన్ను కాపురానికి తీసుకెళ్ళే వుద్దేశం వుందా లేదా అని పరోక్షంగా అడుగుతున్నారు."
    దేవదాసుకి అప్పటికి పూర్తిగా అర్ధం అయింది. పక్కనే తన సొంత బంగ్లా పెట్టుకుని అత్తమామల ఇంట్లో ఉండటం అసహజంగా ఉందని.
    "మనం త్వరలో పట్నం వెళ్ళి మన బతుకులు మనం బతుకుదాం. అప్పుడే మన గురించి గౌరవంగా చెప్పుకుంటారు" అని పార్వతి దేవదాసుని ఒప్పించింది.
    
                                       * * *
    
    అంతవరకూ చెప్పి ఆగాడు రైటర్.
    "ఇంకో గుక్క పుచ్చుకో" అన్నాడు ఆసామీ వెంటనే ఆసామీ బామ్మర్ది రైటర్ గ్లాసు నింపాడు.
    "సార్! చిన్న సందేశం. ఎన్నో కొత్త కధలున్నాయని చెప్పినా - పాత కథలే కావాలి, వాటినే మార్పులు చేసి సినిమా తీద్దాం అని ఎందుకు పట్టుపట్టారు సార్?" అడిగాడు రైటరు.
    "మన జనాలకి చెప్పిందే చెప్పటం, చేసిందే చెయ్యటం, చూసిందే చూడటం అలవాటయ్యా. అవి జీవితాలుగానీ, రాజకీయాలు గానీ, సినిమాలు గానీ..... కథలు కొత్తగా చెప్పాలి గానీ కొత్తవి చెప్పకూడదు. ఓ పట్టాన ఆరిగించుకోలేరు. అయినా దేవదాసు ఇప్పటికి ఓ 36 సార్లు తీసుంటారు. మనకే మూడు దేవదాసులున్నై, ఏఎన్నార్ దేవదాసు, కృష్ణ దేవదాసు, దాసరి దేవదాసు మళ్ళీ పుట్టాడు - అన్నీ బాగానే ఆడాయి కదా! అందుకని హిట్ ఫార్ములానే తీస్తే మన బొమ్మకి గ్యారంటీ వుంటుంది - సర్లే .... కథ చెప్పు" అన్నాడు ప్రొడ్యూసరు ఆసామీ. రైటరు చెప్పటం కంటిన్యూ చేశాడు.
    
                                        * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS