Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు - 2 పేజి 4


    సర్జరీతో గుండెదిటవు అయిన సీయమ్, సీయమ్ గారి ఫ్యామిలీ కాన్ వాయ్ వచ్చింది- పన్నెండున్నరకి. ప్రతిపక్షాలకి అరవడానికి కూడా ఓపిక లేకపోయింది. అంతా నీరసంగా వున్నారు. వీళ్ళెలాగూ అరవట్లేదు గదా అని పోలీసులూ మిన్నకుండి పోయారు.
    ఒంతెనదాటి గవర్నరుపేట రాగానే సీయమ్ భార్య-నేను మా అమ్మవాళ్ళింటికి పోతున్నా- అని ఓ ఆటో ఆపి ఎక్కింది.
    "ఒరే అబ్బీ! నీకు ఆపరేషన్ బాగా జరిగింది కదా! మందులు వేళకు వేసుకో. నేను నాకూతురింటికెళ్ళి కొన్నాళ్ళుంటా" అని సీయమ్ తల్లి వేరే ఆటో ఎక్కింది.
    సీయం జేబులో సెల్ ఫోన్ మోగింది. ఆయన కూతురు "డాడీ! నేనూ మీ అల్లుడుగారూ విడిపోయాం. వేరే ఫ్లాట్స్ లో వుంటున్నాం" అని చెప్పింది.
    సీయం ఒక నిట్టూర్పు వదిలి, కారులోకూర్చున్నాడు. డ్రైవర్ ఎంతసేపటికీ రాడేం! ఎక్కడకెళ్ళాడు!
    "డ్రైవర్ ఇంక రాడటసార్! వేరే చోట సెటిలవడానికి వెడుతున్నానని చెప్పాడు" అని పీయే సీయమ్ కీ సెల్యూట్ చేసి "సార్ నాక్కూడా ఎందుకో మిమ్మల్ని విడిచి వేరే వెళ్ళిపోవాలనిపిస్తోంది సార్! గుడ్ బై" అని వెళ్ళిపోయాడు. సీయమ్ కి అదోలాటి వైరాగ్యం కలిగింది. కారు తనే డ్రైవ్ చేసుకుంటూ తన అధికార నివాసానికి వెళ్ళాడు.
    సీయం ఇంట్లోకి ప్రవేశించగానే అప్పటిదాకా టీవీ చూస్తున్న వంటవాడు, పనిమనిషి చటుక్కున టీవీ ఆఫ్ చేసి భయంభయంగా నుంచున్నారు.
    వాళ్ళని ఫర్వాలేదన్నట్టు సైగచేసి సోఫాలో కూలబడి "ఏంటర్రా అంత ఇంట్రెస్టుగా చూస్తున్నారు!" అన్నాడు సీయమ్.
    "క్రికెట్ టెస్టు సార్" ధైర్యం చేసి వంటవాడు చెప్పాడు. ఎలాగూ సీయమ్ ని ఓ వారంరోజులు విశ్రాంతి తీసుకోమని అక్కడి డాక్టర్లు చెప్పారు.
    "సరే లే... టీవీ ఆన్ చెయ్యి నేనూ చూస్తాను" అన్నాడు సీయమ్.
    అయ్యగారు అలా అనగానే వుత్సాహంగా క్రికెట్ ఛానల్ పెట్టాడు వంటవాడు.
    NZ vs BAN అని కనిపించింది.
    "ఓహో....న్యూజిలాండ్ వర్సస్ బంగ్లాదేషా" అని రిలాక్స్ అయి సోఫాలో వెనక్కి వాలాడు సీయమ్.
    "కాదు సార్! నూజివీడు వర్సస్ బనగానపల్లి" అని చెప్పాడు వంటవాడు వినయంగా.
    
                                                                       * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS