Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 5

 

    "టీవియా! ఓ గాడ్! గుర్తుకొచ్చేసింది. వర్షంలో తడుస్తూ కూల్ డ్రింక్ యాడ్ లో కనిపించింది మోనికాయే కదూ?"
    "కాదు -- వీళ్ళ గ్రాండ్ మదర్-"
    "కమాన్ రాకేష్ - త్వరగా లంచ్ ఆర్డర్ చేసేయ్! నేను గంటలో షూటింగ్ కెళ్ళాలి!" అంది మోనికా వాచ్ చూసుకుంటూ.
    "ఓ ష్యూర్" అంటూ బెరర్ని పిలిచి అతనితో బెస్ట్ లంచ్ గురించి డిస్కషన్ ప్రారంభించాడు రాకేష్ -
    "యూ యూనో శీరిషా! నా లైఫ్ లో ఒకే ఒక్కతనికి నేను హెట్ చేశాను -"
    పక్కటేబుల్ స్కూటర్ రాణి ఫ్రెండ్ తో అంటోంది. భవానీశంకర్ చెవులు రిక్కించి ఆమె మాటలు వింటున్నాడు -
    "రియల్లీ? ఎవరతను" పక్కనున్నమ్మాయ్ అడుగుతోంది -
    "భవానీశంకర్ అనే ఇడియట్ - రోగ్ - క్రూక్ -- " స్కూటర్ రాణీ ఆవేశంగా తిడుతుంటే భవానీశంకర్ సీట్లో నుంచి త్రీ ఇంచెస్ యెగిరిపడ్డాడు.
    అంటే ఇంకో భవానీ శంకరా? అనుమానం లేదు - ఖచ్చితంగా ఇంకేడేవడో అయుండాలి !
    అయినా తనసలు ఈ స్కూటర్ రాణీని చూసింది ఈవాళే కదా! ఇంతకూ ఆ భవానీ శంకర్ అనే వాడు ఈ దేవత అంతాగా హెట్ చేసే వెధవ పని ఏం చేసి వుంటాడు?"
    "వాడేం చేశాడు?" అడిగింది శిరిషా.
    భవానీశంకర్ రిప్లయ్ వినడానికి మెడ వీలయినంత లెంగ్త్ కి సాగదీశాడు.
    "ఏం చేశాడా? సంవత్సరం క్రితం నేను మయూరి టీవీ చానెల్ వాళ్ళు కండక్ట్ చేసిన "అడవే మయూరీ" అనే డాన్స్ పోటీలో పార్టిసిపేట్ చేశా! లాస్ట్ రౌండ్ వరకూ అందర్నీ ఎలిమినేట్ చేసుకుంటూ, వెళ్ళిపోయా! ఫైనల్ రౌండ్ లో కొచ్చేసరికి "క్లౌడ్ నైన్' అనే గ్రూప్ ని జడ్జీలుగా పెట్టారు. ఆ గ్రూప్ లీడర్ భవానీశంకర్- అన్న వాడే నన్ను ఎలిమినేట్ చేసేశాడు. ఇడియట్ - రోగ్ - వాడసలు పెద్ద ఫ్రాడ్ అని తర్వాత తెలిసింది నాకు - నాతొ పోటీ పడ్డ సుప్రియ దగ్గర యాభై వేలు లంచం తీసుకుని ఆమెని విన్నర్ గా డిక్లేర్ చేశాడు. ఆరోజు నుంచీ నేను మళ్ళీ డాన్స్ ల జోలికెళ్తే వట్టు -- " భవానీశంకర్ ఉలిక్కిపడ్డాడు - అనుమానం లేదు - ఆ భవానీ శంకర్ ఇంకెవడో కాదు -తనే - అతని కళ్ళముందు వెంటనే జరిగిన ఫ్లాష్ బాకంతా స్పీడ్ గా పరుగెత్తింది -
    కాలేజ్ నుంచి బయట పడగానే -- తనూ, రాకేష్, సిద్దార్ద్ ముగ్గురూ కలసి "క్లౌడ్ నైన్' అనే పేరుతొ రెండు మ్యూజిక్ ఆల్బమ్స్ ల రిలీజ్ చేశారు. అమెరికాలో సాప్ట్ వేర్ కంపెనీలు నడుపుతున్న రాకేష్ వాళ్ళ డాడీ బాగా డబ్బు ఖర్చుపెట్టి - టీవీ ఛానెల్ వాళ్ళనీ, న్యూస్ పెర్ వాళ్ళని కొనేసి - తమ అల్బమ్స్ కి విపరీతంగా పబ్లిసిటీ చేయించాడు. దాంతో ఆల్బమ్స్ చెత్తగా ఉన్నాయని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నా, ఆ పబ్లిసిటీ చూసి ఆ ఆల్బమ్స్ సూపర్ హిట్ అయాయని జనమంతా అనుకున్నారు. ఆ హైప్ ఎక్కువగా ఉన్న సమయంలోనే  మయూరీ టీవీ చానెల్ వాళ్ళకు డబ్బిచ్చి తమ "క్లౌడ్ నైన్" మ్యూజిక్ గ్రూప్ ని డాన్స్ పోటీలకు జడ్జిలుగా పెట్టించాడు - రాకేష్ వాళ్ళ డాడీ! మ్యూజిక్ పోటీల్లో -- నిజానికి తను స్కూటర్ రాణీనే విన్నర్ గా రికమెండ్ చేశాడు గానీ -- చానెల్ హెడ్ ఇంకెవరి దగ్గరో డబ్బు తీసుకుని రెండో అమ్మాయిని విన్నర్ గా ఎనౌన్స్ చేశాడు.
    దాంతో వళ్ళుమండి తనూ, కార్తిక్, సిద్దార్ద్  లు మందు కొట్టి అర్ధరాత్రి ఆ చానెల్ ఓనర్ ఇంటికెళ్ళి ఎటాక్ చేశాం. ఆఫ్ కోర్స్ వాడు తమ గ్రూప్ ని జైల్లో పెట్టించడం రాకేష్  తండ్రి విడిపించడం -- అది వేరే స్టోరీ - అయితే ఆ ఫైనలిస్ట్ అమ్మాయే స్కూటర్  రాణీయా? ఎంతమార్పు ?తనే గుర్తుపట్టలేకపోయాడు.
    ఆ ఇన్సిడెంట్స్ అన్నీ తనేప్పుడో మర్చిపోయాడు గానీ ఆస్కూటర్ రాణీ మాత్రం గుర్తు పెట్టుకుందన్నమాట!
    అయితే తనకా అమ్మాయి పేరు కూడా గుర్తుంది - ఆ అమ్మాయి పేరు ఆ స్కూటర్ రాణీ పేరు ---- మల్లిక - యా మల్లిక-"
    మల్లిక ఇంకా ఆవేశంగా మాట్లాడుతూనే ఉంది.
    "క్లౌడ్ నైన్' అని పేరు పెట్టుకుని డబ్బుంది గదాని చెత్త ఆల్బమ్స్ తయారు చేసిన ఆ చిల్లర వెధవకి నన్ను జడ్జ్ చేసేంత సీనుందా? వాడిని కలుసుకుని చెంప పగలగోట్టాలని నెలరోజులు సీరియస్ గా ట్రై చేశాను గానీ -- వాడి కసలు అడ్రసే లేదనీ, కేరాఫ్ ఉస్మానియా యూనివర్సీటీ మెస్ అనీ తెలిసీ వదిలేశాను -"
    శిరీష నవ్వింది.
    "ఇటీజ్ అల్ ఇన్ ది గెమ్ యార్ - అలాంటివి మనం సీరియస్ గా తీసుకోకూడదు -" అంది ఓదారుస్తూ -
    భవానీశంకర్ కి శిరీషను ఒక్కసారి అభినందించాలనిపించింది.   
    "మోస్ట్ రీజనబుల్ గాళ్" అనుకున్నాడు.
    "నీకు తెలీదు శిరీషా! ఒకసారి నన్నేవరయినా ఏమైనా అంటే జీవితాంతం గుర్తుంచుకుంటా! రివెంజ్ తీసుకుని తీర్తా-"
    "చూడు మల్లికా- ఏనుగు వెళ్తుంటే కుక్కలనేకం మొరుగుతాయ్ - అంత మాత్రాన ఆ కుక్కల్ని ఏనుగు ఏమయినా అంటుందా?"
    ఆ డైలాగ్ భవానీశంకర్ ముఖం మీద కొట్టినట్లు తగిలింది.
    "ఆ ఫిలాసఫీ వేరు -- నా ఫీలాసఫీ వేరు - ఆ వెధవ వల్ల నా మెంటల్ మార్చుకోలేను కదా! అసలు ఆ పేరు గలాడేవడు కనిపించినా నా మూడ్ పాడయి పోతుంది . ఓకె -- ఆ చిల్లర మేటర్ ఇప్పుడెందుగ్గానీ - ఇంతకూ నీ మార్కెటింగ్ కెరియర్ ఎలా వుంది ?"
    "ఇప్పుడు టెలిమార్కెటింగ్ లో ఉన్నా! ముక్కూ మొఖం తెలీనోళ్ళకు ఫోన్  చేయటం, వాళ్ళతో సెకండ్ సెటప్ మాట్లాడినంత క్లోజ్ గా మాట్లాడి బిజినెస్ చేసుకోవటం -- లేదా సాయంత్రం నా రూమ్ కొస్తావా / బిజినెస్ మాట్లాడదాం అనే వాళ్ళుంటే ఫోన్లోనే కడుపు నిండా పెట్టటం - కొంచెం డీసెంట్ -- కొంచెం న్యూసెన్స్  అనుకో -"
    "నీ మొఖానికి మార్కెటింగ్ ఒకటే తక్కువయింది -- " అనుకున్నాడు భవానీ చిరాకుగా.
    భవానీశంకర్ వీపు మళ్ళీ విమానం మోతమోగింది.
    "అమ్మో"
    "లేకపోతే ఏంట్రా ఆ పరధ్యానం? లంచ్ వచ్చేసింది - కమాన్ - ఎటాక్ -" అరిచాడు రాకేష్.
    సడెన్ గా సైడ్ కున్న ఆకలి విజ్రుంభించింది భవానీ శంకర్ లో.
    "సారీ బ్రదర్! ఒక మేటర్ గురించి ఇంకేదో విషయం ఆలోచిస్తుంటే అసలు మేటర్ మర్చిపోయి ఇంకో విషయంలోకి డైవర్ట్ అయి ఈలోగా అసలు మేటర్ గుర్తుకొచ్చి విషయం తాలూకూ మరో మేటర్ ఆలోచిస్తూ ......."
    ఆ తరువాత తనేం మాట్లాడుతున్నాడో , మర్చిపోయి అప్పటికే ఆకలి వేగం పెరిగిపోవడం వల్ల ఎదురుగ్గా పొగలు కక్కుతున్న వంటకాల మీద పెద్ద ఎత్తున ఎటాక్ చేశాడు. అయిదు నిమిషాల్లో ప్లేట్లన్నీ ఖాళీ అయిపోయినాయ్-
    మల్లికా, శిరీషా కూడా భోజనం చేయటం ముగించారు.
    భవానీశంకర్ మనసు కొంచెం చిరాగ్గా ఉంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS