హనుమంతుడు: సీతమ్మ తల్లీ మహేంద్ర పర్వతము అదిగో. అలంకాపురి యందలి నీ జాడను రూడిగా తెలిసికొని వచ్చుటకు నూరు యామడల సముద్ర లంఘనమును ఆ గిరి శిఖరము నుండియే చేసినాను.
విభీషణుడు:(సరమతో) దేవీ రామప్రభువు వానరభల్లూక సేనతో విడిసియున్న తీరమదిగో? నేను ణా నల్వురు మంత్రులతోనూ లంకాపురిని వదలి వచ్చిన రామప్రభువు శరణుజొచ్చిన దచ్చటనే.
సుగ్రీవుడు: ఇప్పుడు విమానము బుష్యమూక పర్వతముపై నుండి పోవుచున్నది. శ్రీ రామునితో ణా మైత్రి అగ్నిసాక్షిగా ఈ గిరి మీదనే పోసగినది.
లక్ష్మణుడు: వానరాధిపా నీ రాజధాని కిష్కింధను చేరినాము.
సీత: ప్లవంగ పుంగవా, విమానమును అంతఃపురప్రాంగణమున ఆపించి రుమాదేవినీ తారాదేవినీ తీసికొనిరమ్ము.
పుష్పకము క్రిందునకు దిగివచ్చి అంతఃపురమునకు ముందు ఆగినది. సుగ్రీవుడునూ అతని వెనుక కిష్కింధ వాసులగు వానర యోదులునూ విమానము నుండి వెలువడినారు.
సీతా: మీరేల పోవుచున్నారు? మాతో అయోధ్యకు వచ్చుటలేదా?
సుగ్రీవుడు: అమ్మాలంకాపురి ముట్టడి నిమిత్తము వీరు కిష్కింధను వదలి దినములు గడచినవి. విమానము కిష్కింధ మీదుగా పోవుచున్నది కనుక వీరిచ్చట దిగి తమ సతీసుతుల కుశలమును తెలిసికొని విమానమును తిరిగి ప్రవేశించెదరు.
శ్రీరాముడు: వానర సార్వభౌమా నా తరపున ఈ కపివరుల సతీసుతులను కూడ అయోధ్య కాహ్వానించి విమానమున తీసికొనిరమ్ము.
నాడు కిష్కింధ వానర యోధుల పత్నులకు రెండు విధములుగ ఆనందము కలిగినది: తమ పతులు రణరంగము నుండి క్షేమముగ తిరిగివచ్చినారు. వారితో ఇప్పుడు తామునూ అయోధ్యకు పోయి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును తిలకించనున్నారు.
వారందరును సర్వాలంకార భూషితలై తారాదేవినీ రమాదేవినీ అనుసరించి పోయి పుష్పకమును ప్రవేశించినారు.
విమానము ఆకసమున కెగయుటతోనే అత్యంత వేగమును సంతరించుకొని ఉత్తరాభి ముఖముగా పోయి ఆర్యావర్తమును ప్రవేశించినది.
శ్రీరాముడు: (విభీషణ, సుగ్రీవునితో) మిత్రులారా 'త్రిపథగామిని'యని పేరుపొందిన గంగానదిని వీక్షించుడు. గంగా స్రవంతితో కలియుచున్న యమునా పగను (ఆపగ = నది) దర్శించుడు. గంగా యమునల సంగమ స్థానమే ప్రయాగక్షేత్రము. ఆ పుణ్యక్షేత్రముననే భరద్వాజ మునీంద్రుని ఆశ్రమం మున్నది. మనము ముందుగా ఆ మునీంద్రునీ సందర్శించి పిమ్మట నంది గ్రామమునకు పోవుదము. పుష్పకము నింగి నుండి నేలకు దిగివచ్చి భరద్వాజాశ్రమ ప్రాంగణమున నిలిచినది. మహర్షి శిష్య సమేతముగ ఆశ్రమము నుండి ఎదురువచ్చి విమానమున వరోహించిన వారికి స్వాగతమును పలికినాడు.
భరద్వాజుడు: శ్రీరామచంద్రా, పదునాలుగేండ్ల క్రితము సీతా సౌమిత్రులతో నీవు నా యాశ్రమము నకేతించి "నేను నా జనకుడు దశరథ మహారాజు మాటను చెల్లించు నిమిత్తము వనవాసమునకు పోవుచున్నాను. వాసయోగ్యమగు వనమును సూచించుడు" అని కోరినావు. నేను 'చిత్రకూటము అనువగు అరణ్యము" అని చెప్పగా నీవు నీవారితో అచ్చటకు సంతోషముగా పోయినావు! నేను మాత్రము విచారించినాను: "ఈ తడయోధ్య సింహాసనము నధిష్ఠించి జనరంజకముగ పాలించవలసినవాడు! సమర్ధుడును ధార్మికుడును అగు ఇతడు అడవులను ఇడుమలు పడవలసివచ్చినదేమి?"... ఆనాడట్లనుకొంటిని కాని, నీవ కారణ జన్ముడవనియూ నీ వనవాసము సాధుహింసకులగు దుష్ట దైత్యులనందఱను సంహరించి లోకమునకు మేలొనరించుట కొరకె అనియూ పిమ్మట తెలిసికొన్నాను.
శ్రీరాముడు: మునీంద్రా నంది గ్రామమున నా అనుజులు భారత శత్రుఘ్నులు కుశలమె కద? అయోధ్య యందలి మా తల్లులు కౌసల్యాదేవియూ, సుమిత్రా దేవియూ కైకేయ దేవియూ క్షేమమని తలచుచున్నాను.
భరద్వాజుడు: వారందఱును క్షేమము. నేడు మీరు నా ఆతిథ్యమును స్వీకరించి విశ్రమించుడు. రేపు పోయి చూడవచ్చును.
శ్రీరాముడు: మునీంద్రా అట్లే చేసెదము.
పిమ్మట శ్రీరాముడు హనుమంతునితో ఇట్లు చెప్పెను: "వాయుపుత్రా, ఇచ్చటకు సమీపముననె గంగ యొడ్డున శృంగిబేరము అను పురమున్నది. దానిని నా బాల్యమిత్రుడు 'గుహుడు' అను నిషాదాధిపతి (బోయ రాజు) ఏలుచున్నాడు. అతనికి నేను వనవాసానంతరాము జానకితోనూ లక్ష్మణునితోనూ తిరిగివచ్చి ఇప్పుడీ యాశ్రమమున నున్నానను వార్తను తెలుపుము. అనంతరము అచ్చట కనతి దూరముననె కళ అయోధ్యా నగరమునకు పోయి నా తల్లులు కౌసల్య సుమిత్ర కైకేయి రాణులు మువ్వురకును చెప్పుము. అయోధ్యకు క్రోసు దూరమున నంది గ్రామమున్నది. భరతుడు నంది గ్రామమున సింహాసనమున నా పాదుకల నుంచి సేవించుచు కోసల రాజ్యమును పాలించుచున్నాడు. అతనికి మా మువ్వురి యాగమన వార్తను తెలియజేయుటయె కాక మా పదునాలుగు వత్సరముల వనవాస కాలమున ఎప్పుడెచ్చట ఏమి జరిగినదో వివరించుము... ఇంగితజ్ఞుడవగు నీవు భరతునితో భాషించునపుడొక విషయమును గమనించవలెను. పదునాలుగు వత్సరముల కృతమాతనికి రాజ్య పాలనముపై అభిలాష లేదు. పరిపాలనమును చేపట్టిన పిదప వైముఖ్యము తొలగి ఆసక్తి జనించి యుండవచ్చును. రాజ్యరమ ఆకర్షణ అట్టిది. భరతుడు రాజుగా కొనసాగదలచినచో నేనునూ అదియే కోరుదును. అప్పుడు కైకేయి కోరుకొన్న మొదటి వరము కూడ పూర్తిగా అమలు జరుగును.
హనుమంతుడు మానవ రూపమును ధరించి పోయి శృంగిబేర పురమున గుహునకునూ, అయోధ్య యందు మువ్వురు మాతలకునూ సీతారామ లక్ష్మణుల పునరాగమన వార్తను తెలిపి పిమ్మట నంది గ్రామమునకు పోయినాడు. సీతారామ లక్ష్మణులు అంత దగ్గరలోనే భరద్వాజాశ్రమమున నున్నారని తెలిసి భరతుడు సంభ్రమముతో 'తమ్ముడా శత్రుఘ్నా, మనమిపుడే పోయి అన్ని మర్యాదలతోనూ వారినిక్కడకు తీసికొని రావలెను. చతురంగ బలమునూ మంగళ వాయిద్య మేళమునూ సిద్దము చేయుము. ఈ పదునాలుగేండ్ల దీర్ఘకాలమునూ ఎట్లు గడిపినారో వారి నుండి తెలిసికొన కుతూహలముగా నున్నది" అన్నాడు.
హనుమంతుడు: శ్రీ రామానుజా, సీతారామ లక్ష్మణులీనాడు భారధ్వాజాశ్రముననె ఆగదలచినారు. కనుక నీవు రేపు పోవచ్చును. వారి పదునాలుగేండ్ల జీవిత చరిత్రమును నేను నీకు వివరించెదను, వినుము.
విద్వాంసుడునూ వాగ్మియు ఐన మారుతిచే ప్రవచించబడిన చరితము నవరస భరితమై భరతునికి శ్రవణపేయమైనది.
భరతుడు: మహాత్మా నీవెవరవో నాకు తెలియదు. నా వారిని గూర్చి తెలిపి సంతోషమును కలిగించినావు. నా కృతజ్ఞతను తెలుపుకొనుచూ నిన్ను సత్కరించెదను. నీకు పక్ష పాడి గోవులనూ సస్య సమృద్ధములగు వేయి గ్రామములనూ సర్వలక్షణ సంపన్నలగు పదహారుగురు కన్యలనూ ఇచ్చెదను' స్వీకరించుము.
