రావణ వధ
శ్రీరాముడొక బాణముతో అమృతమును తొలగించినాడు. శీర్షముల పునరుద్భవము ఆగినది. రాఘవుడు దశాననుని అదనపు తలలు తొమ్మిదినీ, తొమ్మిది జతల చేతులనూ ఛేదించినాడు. దశ శిరుడు ఏకశిరుడుగను ద్విహస్తుడుగను మిగిలినాడు.

రావణుడు మండోదరిని చేర్చుకొని యోదార్చినాడు. ఆమె దుఃఖము నుండి తేరుకొని "నాథా, నీవు శూర్పనఖ మాట విని ఇడుమల పాలైనావు. ఆ సీతను ఆమె పతి కప్పగించి నీవు నిశ్చింతగా బ్రతుకవచ్చును కదా?" అన్నది. పరధ్యానమున నున్న రావణుడు ఆమెకు జవాబును ఇవ్వలేదు. అతడంగదుని గూర్చి ఆలోచించుచున్నాడు. "ఆ వానరాధముడు అంగదుడు నిన్నేకాదు నన్నూ అవమానించినాడు. 'రణరంగమున శ్రీరాముడు నీకొరకు నిరీక్షించుచుండ నీవీ సొరంగమున దాగియున్నావా?' అని తన తాహతుడు మించి వదరినాడు! నేనిప్పుడు సమరమునకు పోయి రాముని వధించి నా పరాక్రమమును మరియొకసారి ప్రపంచమునకు వెల్లడి చేసెదను".
రావణుడు మండోదరిని ఆమె అంతఃపురమున దిగవిడిచి తన భవనమునకు తిరిగి వచ్చినాడు. నవరత్న ఖచితములగు సువర్ణ కిరీటములను తన పది తలలపైన ధరించినాడు. ఇరువది కర్ణములను కాంచన కుండలములతో అలంకరించుకొన్నాడు. కవచమును తొడిగినాడు. ఇరువది హస్తములందును ఆయుధముల నుంచుకొన్నాడు; ఇరు పార్శ్వములందును పదేసి చక్రములు కల రథమును రప్పించినాడు; స్యందనమును తన శస్త్రాస్త్ర సంపదతో నింపుకొని సారథుని "రణరంగమునకు కొనిపో" అని ఆదేశించినాడు.
సంగ్రామస్థలిని రావణుని రాకకై ఎదురుచూచుచున్న శ్రీరాముని సమక్షమున దివి నుండి భువికి దిగివచ్చిన ఒక కాంచన రథము నిలిచినది. రథసారథి శ్రీరాముని ముందు నిలిచి "శ్రీరామచంద్రా నమస్కారము. నా పేరు 'మాతలి'. ఈ స్యందనమును నీకు దేవేంద్రుడు పంపినాడు. ఇంద్రుడు నీ కొసంగిన విల్లూ, బాణములతో నిండిన తూణీరమూ, ఖడ్గాది ఆయుధ సంచయమూ అభేద్య కవచమూ ఉన్నవి. రావణునితో నేటి యుద్ధమున నేను నీకు సారథ్యమును వహించెదను" అని విన్నవించినాడు.
శ్రీరాముడు మనసులో దేవేంద్రునకు కృతజ్ఞతను తెలుపుకొనుచూ రథమునకు నమస్కరించి ప్రదక్షిణము చేసినాడు. మున్ను విశ్వామిత్రుడిచ్చిన అస్త్రశస్త్రములనూ; పరశురాముని వద్ద నుండి గ్రహించిన విల్లునూ, అగస్త్యుడు ప్రసాదించిన ధనువునూ మహేంద్రుడు పంపిన ఆయుధముల ప్రక్క అరదములో ఉంచినాడు. పిమ్మట స్యందనమున నాసీనుడై రావణుని కొరకు నిరీక్షించినాడు.
రావణుని తేరు రణస్థలిని ప్రవేశించి రాముని రథమునకు అభిముఖముగా నిలిచినది.
రావణుడు: (తనలో) రాజ్యభ్రష్టుడై అడవుల పాలైన ఈ రాముడు రథమునకు నోచుకొనక హనుమంతుని భుజములపై కూర్చొని యుద్ధము చేయవలసివచ్చినది! అట్టి వీనికి ఈనాడు జావానాశ్వ సమేతమై వైభవోపేతమగు ఈ కాంచన రథమెచట నుండి వచ్చినది? అదృష్టము వీనిని తిరిగి వరించుచున్నది... నేనేమి చేపట్టినను భంగమగుచున్నది!
ఉడుకుబోతు తనముతో రావణుడొక నిశిత శిలీముఖమును తీసి రామునిపై ప్రయోగించినాడు. అకస్మాత్తుగా వచ్చి తగులనున్న ఆ శరమును అప్రమత్తుడైయున్న రాముడు తన నారాచముతో ఖండించినాడు; పిమ్మట పుంఖాను పుంఖముగ అస్త్రములను ప్రయోగించి రావణుని గాయపరిచినాడు. దశాననుని మేను రక్తసిక్తమై జేగురు కొండవలె గోచరించినది. దశగ్రీవుడు తన పది జతల చేతులతో శరములను సంధించి రాఘవుని దేహము నుండి రుధిరమును చిమ్మించినాడు. రాముని మేను మోదుగచెట్టు వలె కనుపడినది. వారిరువురు క్షతగాత్రులైనను (గాయపడిన శరీరములు కలవారైనను) పట్టుదలతో సమరమును సాగించినారు. ఆ రామ రావణ యుద్ధము మహాసంగ్రామములకు మారుపేరుగా నిలిచినది...రాక్షస యోధులందరును, అంతకుముందె హతులగుట వలన రావణుని వెంట సైన్యమేదియును లేదు. రామ రావణుల నడుమ జరుగుచున్న ద్వంద యుద్ధమున ఆ వీరద్వయము రణకౌశలమును వీక్షించి ప్రశంసించుచు రాముని వానర యోధులు నిలబడినారు. యక్ష గంధర్వ కిన్నర కింపురుషు లాకసమున బారులుగ నిలిచి తిలకించినారు.
మాతలి "రామచంద్రా దశగ్రీవుని మెడలను నఱికి మస్తకములను నేలపాలు చేయుము" అన్నాడు. శ్రీరాముని శరములచే అసురేంద్రుని శిరములు తెగిపడుచుండగా తామర మొగ్గల వలె క్రొత్త శీర్షములు మొలకెత్తసాగినవి! ఎన్నిసార్లు ఛేదించినను తిరిగి ఉద్భవించుట గమనించి శ్రీరాముడచ్చెరువొంది విభీషణుని రావించినాడు.
విభీషణుడు: రామప్రభూ రాక్షసేంద్రుని నాభి మూలమున అమృతమున్నది. దానిని చెదరగొట్టుము; తలలింక పుట్టవు.
శ్రీరాముడొక బాణముతో అమృతమును తొలగించినాడు. శీర్షముల పునరుద్భవము ఆగినది. రాఘవుడు దశాననుని అదనపు తలలు తొమ్మిదినీ, తొమ్మిది జతల చేతులనూ ఛేదించినాడు. దశ శిరుడు ఏకశిరుడుగను ద్విహస్తుడుగను మిగిలినాడు.
రావణుని యందు అలసట చిహ్నములు కనుపడినవి. రామ బాణమొకటి అతని రథమున మూర్చిల్ల జేసినది. ధర్మపరాయణుడగు రాముడు మూర్చిల్లిన వానిని చంపరాదని బాణ ప్రయోగమును ఆపినాడు. రావణుని సారథి తేరును రణస్థలి నుండి తీసికొని పోయినాడు. రావణుడు తేరుకొని రథ చోదకునితో "నకు ప్రానములపై తీపి పోయినది. రాముని వధించుటయె నా యేకైక లక్ష్యము. నన్ను తిరిగి రణస్థలికి కొనిపొమ్ము" అని ఆదేశించినాడు.
రణభూమిని ప్రవేశించుటతోనె రావణుడు తన దేహబలము నంతను కూడదీసికొని రామునిపై శరములణు సంధించసాగినాడు.
మాతలి: శ్రీరామచంద్రా భానుడు అస్తమించుచున్నాడు. పోరును పొడిగించకుము. శీఘ్రముగ వీని వధించుము.
ఆ క్షణమున అగస్త్యుడు అరదమున శ్రీరామునకు ప్రత్యక్షమైనాడు.
అగస్త్యుడు: రామచంద్రా మాతలి సూచించినట్లు రావణుని సూర్యుడు అస్తమించక పూర్వమే సంహరించుము... నేనిప్పుడు నీకు 'ఆదిత్య హృదయము'ను (సూర్యస్తోత్రమును) వినిపించుటకు వచ్చినాను. నీవు ఏకసంథాగ్రాహిని కనుక వినుట తోడనె నీకది కంఠమగును. ఈ స్తవమును మూడుసార్లు పఠించుము. నీకు యుద్ధమున విజయము చేకూరును.
ఆదిత్య హృదయముణు శ్రీరాముడు ముమ్మాఱు పఠించి సూర్యభగవానుని కృపకు పాత్రుడైనాడు. పిమ్మట అతడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించి క్రూరుడుణు లోకకంటకుడును అధర్మపరుడును అగు రావణుని వధించినాడు.
అమరులు హర్షధ్వానములు చేయుచు పుష్పవర్షము కురిపించినారు. ఋషులూ, మునులూ, సాధువులూ శ్రీరాముని స్తుతించినారు.
తాటకతో ప్రారంభమైన రాక్షస సంహారము రావణ వధతో పూర్తియైనది. రామావతార లక్ష్యము సిద్ధించినది.
* * *
