ఆ పని అవగానే ఆ వ్యక్తి గంగికి పదివేల రూపాయలు యిచ్చాడు అంత మొత్తం చూడటం గంగి జీవితంలో అదే మొదటిసారి. ఆ తరవాత అలాగే అదే వ్యక్తికి యింకో రెండు మూడు పనులు చేయించిపెట్టింది. అలాగే మరికొందరు.
కారు కొంది.
యెక్కడిదని అడిగాడు. తనవల్ల సహాయం పొందిన ఒకామె ఇచ్చినట్లు చెప్పింది. తిట్టాడు__మళ్ళీ అలా యెప్పుడూ చెయ్యొద్దని. ప్రజాప్రతినిధిగా ప్రజల అవసరాలు చూడటం, న్యాయం జరిగేలా చూడటం తన బాధ్యత, విధి అనీ, దానికి ప్రతిఫలం వేరే యేమీ వుండదు. ఎమ్మెల్యేగా జీతం ఇస్తున్నారు. యితర వసతులు కల్పించారు__అని చెప్పాడు. బుద్ధిగా బుర్ర వూపింది గంగి. "అట్ల తీస్కొన" అంది. యెంతో సంతోషించాడు. ఆ సంతోషంలో ఆమె అడిగిన మరికొన్ని పనులు చేయించిపెట్టాడు. అలా అప్పుడప్పుడు ఆమె అడగటం, కొన్నిసార్లు అతను చేయించటం జరుగుతూ వుంటుంది.
యిటీవలే, సికిందరాబాద్ మిలిటరీ కంట్రోల్ మెంటు ప్రక్కన బోయినపల్లి పరిసరాల్లో స్థలం కొంది.
రాములుతో సంప్రదించితే, "ఇసుమంటి ముచ్చట్లు నాకు చెప్పకు" అన్నాడు. అప్పటికే చాలా కాలంగా అతను చెల్లెలితో సరిగా మాట్లాడటం లేదు. గంగి, ఏమైనా పనులు_ "అట్లని వాండ్లకు చెప్పు. ఆడ వుండమను వాండ్లను రావొద్దని చెప్పు. నేనే ఇన్ఫాం చేస్తానని చెప్పు_" వంటివి చెబితే_ "గవన్నీ నా తాన కాదు మేమ్ సాబ్_నేను కార్కాన్ల పనిచేస్కొనెడి రాముల్ని" అన్నాడు.
అంతకుముందే సూచించింది_ఆ పని మానేసి ఏమైనా కాంట్రాక్టులో వ్యాపారమో ప్రారంభించమని.
"యిన్ని చేస్తున్నదానివి అవి చెయ్యలేకా?" అన్నాడు వెటకారంగా.
కోపమొచ్చి, "ఒక్క తల్లిబిడ్డలం కదా అని అంటి. నువ్వు కూలిపని చేస్కొని బతుకు. నేను ఎమ్మెల్యే భార్యను" అంది.
"ఎమ్మెల్యే భార్యవి. అంత పెద్ద పొజీషన్ ల వున్నామె ప్రవర్తన గూడ అట్లనే వుండాల. భర్తకు చెడ్డపేరు తెచ్చేటట్లు వుండరాదు. రవీసాబేమొ ఈడ పండుకుంటడు. నువ్వేమో యాడుంటవొ, యెట్లెట్ల తిరుగుతుంటవో_ ధూత్ మంది అనుకునెడి మాటలు వినెటందుకె_" అని రాములు అంటూంటే మధ్యలోనే అందుకుని.
"నీకేమిటి?" అంది.
"చెల్లెలివని."
"పెండ్లి అయిన తర్వాత భర్తనె గద అన్నిటికి జుమ్మెదారి! నేనేమి భర్త చాటున చేస్తున్నదేమి లేదు. ఆలుమగల మధ్య ముచ్చట నీకేమిటి?" అంది.
అప్పటి నుంచి అసలే మాట్లాడడు రాములు. రవి వచ్చినప్పుడు, గంగి గురించి గానీ వాళ్ళిద్దరి స్థితిగతుల గురించి గానీ ప్రస్తావించడు రవి యేదైనా ప్రసక్తి తెచ్చినా ఓ చిన్న ముక్క చెప్పీ చెప్పకుండా తప్పుకుంటాడు. రవి రమ్మని ఎన్నిసార్లు అన్నప్పటికీ రాములు ఎమ్మెల్యే క్వార్టర్సుకి సాధారణంగా వెళ్ళాడు. మొదట్లో ప్రతి ఆదివారం వెళ్ళేవాడు. చెల్లెల్ని అసహ్యించుకోవటం మొదలెట్టినప్పటి నుంచి వెళ్ళటం తగ్గించేశాడు. రవి రాంనగర్ వచ్చినప్పుడు అతనికూడా వుంటాడు. ఆ ప్రాంతం మంచిచెడ్డలు వివరిస్తుంటాడు. అయితే యింతవరకు తానుగా యెవరికీ యిది చేసిపెట్టమని అడగలేదు రవిని. వాళ్ళనే వెళ్ళి రవితో మాట్లాడమని చెబుతాడు.
గంగికి సాయంగా వుంటున్నాడు సాయిలు. గంగి పురమాయించే పనులకి రాత్రులేకాక నెలకి పదిరోజులైనా పనిలోకి వెళ్ళటానికి వీలుపడటం లేదు. చాలా కాలంగా అనారోగ్యంగా వుంటున్న అతని తండ్రీ, ఆ తరవాత తల్లీ చనిపోయారు. యిప్పుడు భార్యా పిల్లలు. అప్పుడప్పుడు వచ్చి వుంటే చెల్లెళ్ళు.
నెలకి రెండు మూడు వందలకి తగ్గకుండా యిస్తోంది గంగి సాయిలుకి.
ఆ కార్కాన నౌకిరి యేమి చేస్తవు? ఈడ్నే వుండరాదు? మన పనులే మస్తున్నవి" అంది గంగి ఒకసారి మాటవరసకి అన్నట్టుగా.
"అంత అక్కెరొస్తే వుండక యాడికి పోత! నువ్వు జెప్తే కాదంటనా!" అన్నాడు సాయిలు.
"నువ్వే మేలన్నా సొంత అన్నకంటె" అంది ఒకసారి.
"రాములన్న పిచ్చోడు. కోపం చెయ్యకు" అన్నాడు సాయిలు.
రాములు తన పనులకు సహకరించక పోయినా, కనీసం అడ్డురానందుకు సంతోషించింది గంగి. అడ్డొస్తే మనిషిని విసిరికోత్తగలదని రాములు గ్రహించే మిన్నకుండిపోయాడు.
గంగి, యింట్లో వంటమనిషిని పెట్టుకుంది. యిద్దరు పనిపిల్లలు. అప్పుడప్పుడు తల్లిదండ్రుల్ని తీసికెడుతుంది. ఓ వారం రోజులుండి వస్తుంటారు. ఆమె తండ్రి కొమరయ్య రోజూ ఓ సీసా సారా పుచ్చుకుంటున్నాడు. అదివరకు పండగకో పబ్బానికో తప్పతాగేవాడు కాదు.
91
మోహన్ రెడ్డి గాయత్రీ, గుమ్మం బయటికొచ్చి తాళం వేస్తుండగా; సుధీర్, సుదతి వచ్చారు.
"సారీ, యాడికొ బయల్దేరినట్లున్నరు?" అంది సుదతి.
గడియ తీసి తలుపులు తెరుస్తూ, "ఫిలిమ్ కి" అన్నాడు మోహన్ రెడ్డి.
"వూర్కెనె వొచ్చినమ్ పదండి. దారిలో మాట్లాడుకుంటపోదం ఆడిదంక." అన్నాడు సుధీర్.
"డోంట్ బి సిల్లీ." అన్నాడు మోహన్ రెడ్డి.
"యే ఫిల్మ్?" అంది సుదతి.
"తపప్యా." అన్నాడు మోహన్ రెడ్డి.
సుదతి, వెడ్డింగ్ కార్డ్ తీసి యిస్తుంటే_ "నెక్ట్స్ వీక్ సుదతి పెండ్లి" అన్నాడు సుధీర్.
"శుభలేఖతో వచ్చి వూరికే వచ్చాం అంటారేమిటి" అని అందుకుని తీసి చూసింది గాయత్రి.
మదతిరవంత సిగ్గుపడినట్లుగా నవ్వింది. అసలే నాగలిదుంపలా వుండే ముఖం, పరీక్షల చదువు వల్ల పీక్కుపోయి మరింత సాగదీసిన త్రిభుజాకారంగా వుంది.
ఇంజనీరుగారి భార్యవన్నమాట. శుభం" అంది గాయత్రి. సుదతి తండ్రి సిరిసిల్ల భోజ్ రెడ్డి ఇండియన్ బ్యాంకు ఏజెంటు. అరవయ్ వేల రూపాయల కట్నం. కోడలు లా ప్రాక్టీసు చెయ్యటం యిష్టం లేనందున, ఇంజనీర్లకి యెప్పుడూ ట్రాన్స్ ఫర్లుంటాయి. అందువల్ల లా ప్రాక్టీసు ఆలోచన సాగే పని కాదనీ యిల్లు చూసుకుంటే చాలునని సూచించారు వాళ్ళు. సుదతి తండ్రికి అది సంతోషంగానే అనిపించింది. ఉద్యమాలంటూ అటూ యిటూ తిరగటమే యిష్టంగా వుండేదికాదు అతనికి. పెళ్ళి సిటీలోనే, సొంత యింట్లో.
