Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 40


    అసెంబ్లీ బయట _ యెప్పుడూ యేవో గొడవలే __ బైఠాయింపో ఉపన్యాసమో యేదో అలజడి_ రకరకాల వృత్తులలో వాళ్ళ రకరకాల సమస్యలు.
    రెండో నెలలో అరెస్టు చేశారు. అతనితోపాటు నలుగురు కార్మికుల్ని ఆ తరవాత__అరెస్టు అవటం పరిపాటి అయిపోయింది.
    అదే సమస్యల గురించో, యితర విషయాల గురించో ప్రభుత్వాధికారులతో గొడవలు. అధికారులకి_నువ్వెవడివి అడగటానికి రాయటానికి__అని అనటం అంత సుళువు కాదిప్పుడు_ఎమ్మెల్యేవి ప్రజాప్రతినిధిగా నా బాధ్యత హక్కు_అంటూ దబాయిస్తారు.
    వీటితోపాటు అటు మంత్రులు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వోన్నత్యోద్యోగులు కాంట్రాక్టర్లు వంటి వాళ్ళ బతుకు జాతకాలు తెలుసుకోవటం బాగా అలవాటైంది. కష్టపడి, దెబ్బలాడి పనులు చేయించి పెడతాడనే పేరు వచ్చింది. దాంతో, యెప్పుడూ యెవరొకరు, కార్మికుల దగ్గిర్నుంచి కూలి నాలి జనం దగ్గిర్నుంచి వుద్యోగుల వరకు యెందరో తమకు జరిగిన అన్యాయాల గురించో జరగాల్సిన పనుల గురించో అతనికి చెప్పుకోవటం అధికం అయింది.
    యేడాదులుగా అసెంబ్లీలో అనామకులుగా వున్నవాళ్ళు అలాగే వుండగా, రవి కొత్తగా అసెంబ్లీ సభ్యుడయ్యి అందరికంటే ప్రసిద్ధుడయ్యాడు. మంత్రులను ప్రశ్నలతో తికమక పెట్టటం అతని నేర్పరితనాలలో వొకటి.
    అంతలో ఎమర్జన్సీ వచ్చింది. ఎమర్జన్సీలో మొదటి విడత అరెస్టయిన వాళ్ళలో అతనూ వున్నాడు. ఎమర్జన్సీ అన్ని రాష్ట్రాలలోనూ పెట్టటం అన్యాయం అక్రమం అనవసరం. అంత అవసరంగా అనిపిస్తే వుత్తరాదిలోని కొన్ని రాష్ట్రాలలో చాలు అనీ, ఎమర్జన్సీ వున్నా, అత్యవసర ప్రజాసమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి వుంటుందనీ ప్రభుత్వం కళ్ళుమూసుకుని కూచునివుంటే యితర వర్గాల ద్వారా ప్రభుత్వానికి తెలిసొచ్చేలా చెయ్యాల్సి వుంటుందని ప్రారంభించాడు.
    రవి, నిజాయితీగా నిస్వార్థంగా ప్రజల అవసరాల గురించే శ్రమిస్తున్నాడనీ మంచి చురుకైన వాడనీ గ్రహించిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అతనిని గుర్తించారు. ఆమాటే అన్నారు. అందునా అతను జనసంఘ్. కమ్యూనిస్టు తదితర ఏ పార్టీలకీ చెందనివాడవటం వల్లనో యేమో, మొత్తానికి రెండు నెలలకే విడుదల చేశారు. మధ్యలో వొకటి రెండుసార్లు పోలీసు అధికారులు అతనిని ప్రత్యేకం పిలిపించి అది కూడని సమయం అని వివరించి, ఏమైనా జరగాల్సిన పనులుంటే ప్రభుత్వాధికారులతో పేచీ పెట్టుకు కూచోమని సలహా యిచ్చారు. ప్రభుత్వోద్యోగులలో యిప్పటికే అతని సంగతి బాగా తెలిసి, సాధ్యమైనంత వరకు పనులు చేసి పెడుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అని. అయితే ఎమర్జన్సీ ప్రవేశపెట్టే నాటికే అతనికి ప్రభుత్వాధికారులలో చాలామందితో అవగాహన లాంటి పరిచయం ఏర్పడటం వల్ల అంత సమస్యగా అవకుండా గడిచిపోయింది.
    అసెంబ్లీలో యిటు అధికార పక్షానికీ, అటు ప్రతిపక్షాలకీ వ్యతిరేకి. వీళ్ళూ వాళ్ళూ అని లేకుండా__అన్యాయం, అక్రమం, అసమంజసం, అనిపించినపుడు బట్టబయలు చేయటంవల్ల అందరికీ యిబ్బందిగా వున్నా__ ప్రతిపక్షాల పక్షం కాదనీ అధికార పక్షం కొంత సంతోషించింది. వీడెవడు మహా గట్టిపిండంలా వున్నాడే__అని గుర్తించారు. కొద్ది నెలలలోనే అనుకోకుండా ఇండిపెండెంటు సభ్యుల వర్గానికి అవధికార నాయకుడయ్యాడు.
    తను అడగదలిచినప్పుడు చెప్పదలిచినప్పుడు వ్యవధి లభించటం. అతని మాట నలుగురూ ఆలకించటం స్థాయికి వచ్చేశాడు. అతి కొద్ది నెలలలో.
    అందరి అన్నిపనులతోపాటు ప్రత్యేకించి తన నియోజకవర్గం ప్రజల సమస్యలను పట్టించుకుంటూ వుంటాడు. వీళ్ళూ వాళ్ళూ అని తేడాలేకుండా, వాళ్ళు ఆర్థికంగా ఏ వర్గానికి చెందినా, రాజకీయంగా ఏ పార్టీకి చెందినా న్యాయం జరగాల్సి వున్నచోట పట్టుదలగా శ్రమపడి పనిజరిగేలా చూస్తుంటాడు. ఎన్నిక అయిపోయాక చుక్కల్లోకి చూడకుండా యెప్పటిలాగా తరచూ కనిపిస్తూ మంచిచెడ్డలు చూడటం వల్లా__ఇంతకుముందు అతను తెలియనివాళ్ళకి కూడా సహాయపడటం వల్లా__యెవరి ప్రాముఖ్యతా అంతగా వుందని రోజుల్లో కూడా పలుకుబడి పెరిగింది. రాజకీయంగా గుర్తింపు వచ్చింది. వ్యక్తిగతంగా విలువ వచ్చింది.

                                 90

    రవి ఎమ్మెల్యే అయిన రెండు మూడు నెలలకే గంగి రాంనగర్ రావటం తగ్గించింది. ఆమెకి వచ్చేటంత వ్యవధి వుండటం లేదు. యెవరో ఒకరు వచ్చి ఆమెని కలుసుకుంటూనే వుంటారు. టెలిఫోను పెట్టించింది.
    ఒకసారి ఒక వ్యక్తి వచ్చి__ఒక పని అవ్వాల్సి వుంది. రవిగారు చెప్తే అవుతుంది. మీరు చేయించిపెడితే _ అని ప్రారంభించాడు గంగితో. అప్పటికి గంగికి పొగడ్తల వరకే తెలుసుగాని వ్యవహారాలూ తెలియవు.
    "మీరే అడగొచ్చుగా" అంది.
    అతను చాలా సాఫీగా దాపరికం లేకుండా వివరించాడు. "నేను అడిగితే వారు నన్ను తీసుకెళ్ళి ఆ అధికారితో విషయం తెలుసుకుని అడుగుతారు. అది అధికారి చెయ్యదలిచినా రవిగారికి యిష్టంవుండదు. చెయ్యకూడని పనీ కాదు, చట్టవ్యతిరేకమైనదీ కాదు. కాగా చేసేది తాను కాదు. మీరు వారి ధర్మపత్ని. అర్ధాంగిగా మీరు కొన్ని కోరుకుంటూ వుండొచ్చు. మీకు తెలిసినవాళ్ళకో, స్నేహితులకో, బంధువులకో అని అడగవచ్చు. ఆ అధికారి రవిగారి మాట కాదనడు. సింపుల్ విషయం. ప్రయారిటీని లక్ష్యపెట్టకుండా మంజూరు చెయ్యటం అట్లాంటివి సర్వసాధారణమైన విషయాలండీ ప్రభుత్వంలో. అది మంజూర్ ఐతే మాకు కొంత లాభం వస్తుంది. అది యింకొకరికి మంజూర్ అయితే ఆ లాభం వాళ్ళకి వస్తుంది. మీరు రవిగారితో ఆ అధికారికి ఒక్క ఫోన్ కాల్ చేయించి చెప్పిస్తే చాలు. మీ మేలు మర్చిపోం."
    గంగి, రెండురోజులు వరసగా రవితో రాంనగర్ వెళ్ళి, ఆ మరసటిరోజున అడిగింది.
    "నీకెందుకీ విషయాలు?" అన్నాడు రవి.
    "అవ్. అడిగిన అందరకి చేసిపెడతవ్. నాకు మాత్రం అడిగే అర్హత లేదన్నమాట! మా చుట్టాల కోసమని అడిగిన. చెయ్యగూడని పనేమి కాదు. బరంత ఫోన్ ల ఒక్కమాట జెప్తే చాలు." "అడగక అడగక ఒక్కపాలి అడిగితే కాదంటున్నవ్ లే? అవ్ నువ్ గొప్పోనివి__నేను కానొస్తనా" అని ప్రారంభించి ఫోను చేయించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS