'ఎలా' అని అడగలేదు ప్రబంధ. అంతే ఆసక్తిగా చూస్తూంది.
"ఏ విషయాన్నైనా సాధించాలీ అంటే నాలుగు పద్దతులున్నాయి." సామదాన భేద దండోపాయాలు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆదిత్య ఏదో ఓ పద్దతిలో నీకు దక్కకుండా పోడు. అయితే ఒక విషయం..."
"చెప్పండి ఆంటీ?"
"ఈ రహస్యం కేవలం మనిద్దరి మధ్యనే వుండాలి. ఎందుకంటే మీ అన్నకు కాని. మీ నాన్నకు కానీ ఇది తెలిస్తే..." తనకి ప్రమాదం అనలేదు సౌదామిని. "ఆదిత్యని ప్రాణాలతో విడిచిపెట్టరు కాబట్టి."
"కాని ఆదిత్య అప్పటికీ నన్ను పట్టించుకోకపోతే?" ఉక్రోషంగా అడిగింది ప్రణయ గుర్తుకొస్తుంటే.
"నువ్వింకా చిన్నపిల్లవి ప్రబంధా! ఆదిత్య తెలివైన అబ్బాయి. కాబట్టే నీ దృష్టిలోకి రావాలని బహుశా ప్రణయతో ఇంత బాహాటంగా పరిచయాన్ని నటిస్తున్నాడు."
ఈ థియరీ చాలా నచ్చింది ప్రబంధకి. మనసు అట్టడుగు పొరల్లో అస్పష్టంగా ఉన్న ఆదిత్య రూపం ఇప్పుడు క్రమంగా అన్ని పొరల్నీ దాటి ఆమె మేధని కలవరపెడుతుంటే ఉద్విగ్నంగా కాదు, ఉక్రోషంగా అతడిని తన పక్కకు లాక్కోవాలనుకుంది.
నిజానికి అది ప్రేమకూడా కాదేమో! అందరికన్నా తానే మిన్న అనే భావాన్ని అందరికీ తెలియజెప్పాలన్న ఆలోచన.
"ఎలా ప్రొసీడ్ కావాలి?"
"ముందు పద్దతి 'సామం' ప్రబంధా! అంటే మంచి పిల్లవనిపించుకునే ప్రయోగాలు మొదలుపెట్టాలి. అలా అతడు నిన్ను గుర్తించేలా చేయాలి. అందుచేత నువ్వు అర్జెంట్ గా ఏం చేయాలీ అంటే..." ఆగింది క్షణంపాటు.
"చెప్పండి ఆంటీ?"
"వీరోచితంగా పోరాడి గెలవటమే అలవాటైన నువ్వు, క్విజ్ పోటీలో అతడిమీద నెగ్గింది ప్రొఫెసర్ రాధాకృష్ణ మీ అన్నతో పడిన లాలూచీ మూలంగానేగా? అందుకని ఆ పోటీ చెల్లదని వైస్ ఛాన్సలర్ కి చెప్పి, అది కాన్సిల్ చేయించాలి నువ్వే. అలా అయితే ఒక్క ఆదిత్యమీదే కాదు, మొత్తం యూనివర్శిటీ విద్యార్ధులమీద నైతికంగా గెలుపు సాధిస్తావు."
"ఓ.కె.!" దృఢంగా అంది ప్రబంధ.
సౌదామిని చదరంగంలో మొదటి ఎత్తు వేసింది జయప్రదంగా.
* * *
అక్కడ ప్రణయ ఇంట్లో... ఆమెకు అభిముఖంగా కూర్చున్న ఆదిత్య తన ప్రేమని నిరూపించుకునే ప్రయత్నంలో ఒక్కో ప్రశ్నకి జవాబులు చెప్పటానికి ఉద్యుక్తుడయ్యాడు.
నోట్ బుక్ లోకి చూస్తూ మొదటి ప్రశ్న అడిగింది ప్రణయ. "పసితనం నుంచి కొద్దిపాటి ఎత్తునుంచి నేలని చూసి భయపడే గమ్మత్తుగల ఓ వ్యక్తి 1927లో తొలిసారి న్యూయార్క్ నుంచి పారిస్ దాకా ఒంటరిగా విమానం నడిపాడు.... అతడి పేరు?"
"అమెరికాకి చెందిన ఫైలట్ చార్లెస్ విండ్ బర్గ్ అతడు నడిపిన ఒకే ఇంజన్ గల మోనోప్లేన్ పేరు స్పిరిటాఫ్ సెంట్ వాయీస్" అవసరానికి మించినంత జవాబు చెప్పాడు.
"ప్రపంచంలో మొట్టమొదటిసారి రైలు ప్రమాదంలో మరణించిన వ్యక్తి ఎవరు? ఎప్పుడు? ఎలా? ఏ సందర్భంలో జరిగింది?"
నిశ్శబ్దంగా వుండిపోయాడు ఆదిత్య.
ఒకటి... రెండు... మూడు...
అయిదు నిమిషాలు గడిచాయి.
ఆమె మరో ప్రశ్నకి సిద్దపడుతుంటే...
"ఆగు ప్రణయా!" అన్నాడు ఆదిత్య "అది రైలు ప్రమాదం కాదు. రైలు కిందపడి ఓ ప్రముఖుడు మరణించడం మాత్రమే అనుకుంటాను."
నోట్ బుక్కులో మరెక్కడో వున్న జవాబు కోసం ఆమె పేజీల్ని తిప్పుతూంది ఆత్రంగా.
"ఒకవేళ జవాబు విలియం హకిసన్ దే అయితే అది రైలుకి జరిగిన ప్రమాదంలో మరణించడం కాదు ప్రణయా! రైలుకింద పడి ప్రమాదవశాత్తూ చనిపోవడమే!" చెప్పాడు ఆదిత్య.
"యూ ఆర్ రైట్ ఆదిత్యా!" పుస్తకంలో నుంచి తలపైకెత్తి చెప్పింది ప్రణయ "ప్రశ్న విలియమ్ హకిసన్ కి చెందిందే."
"అయితే ముందు ప్రశ్న కరెక్ట్ చేసుకోవాలి" సాలోచనగా చెప్పుకు పోయాడు. "క్రీస్తుశకం 1830లో ప్రపంచంలో మొదటి పాసింజర్ రైల్వే సర్వీస్ బ్రిటన్ లో ప్రారంభమైంది. అదే మొదటి రిలే డెత్ కీ కారణమైంది. జార్జి స్టిఫెన్ సన్, అతని కొడుకు రాబర్ట్ డిజైన్ చేసిన రాకెట్ లోకోమోటివ్ ప్రయోగాత్మకంగా నడిపించినప్పుడు ట్రేడ్ బోర్డ్ ప్రెసిడెంట్ అయిన హకిసన్ అతిథిగా ఆహ్వానించబడ్డాడు. నిజానికి ఈ ప్రయోగాన్ని చాలామంది ప్రతిఘటించినా స్టిఫెన్ సన్ ప్రయోగాన్ని బలపరిచింది హకిసన్. లీవర్ ఫూల్ నుంచి మాంచెస్టర్ దాకా నడిచిన ఈ ట్రైన్ లో బ్రిటన్ ప్రధాని బ్యూకాఫ్ వెల్లింగటన్ లాంటి డిగ్నటరీస్ ప్రయాణం చేశారు. దురదృష్టవశాత్తు రైలు ట్రాక్ మధ్య నిలబడి ఎదురుగా వస్తున్న రైలువేగాన్ని జడ్జి చేయడంలో పొరపాటు చేసిన ముఖ్య అతిథి రెప్పపాటులో పక్కకి జరగాబోతూ ఆ ట్రైన్ కిందే పడి మరణించాడు."
"స్పెండ్లిడ్ ఆదిత్యా! నేను చెప్పలేకపోయిన జవాబుల్లో ఇదొకటి." అభినందించింది ప్రణయ.
"కాలవలకు లాకులు ఏర్పాటుచేయడం మొదలు ఎప్పుడు ప్రారంభమైనాగాని, మోడరన్ మీటర్ లాక్ గేట్స్ ను క్రీస్తుశకం 1497లో డిజైన్ చేశారు. అవి తయారుచేసింది ఓ ప్రముఖ చిత్రకారుడు.... అతని పేరు..."
"లియొనార్డో డివెన్సీ ఇటలీకి చెందిన ఈ వ్యక్తి ఇప్పటికీ ప్రపంచ పెయింటింగ్స్ లో ప్రముఖ స్థానం వహించిన 'మోనాలిసా' చిత్రాన్ని గీసిన చిత్రకారుడు మాత్రమే కాదు, ఇంజనీరు కూడా..."
"మేగ్నానిమస్...!" ప్రణయ గొంతులో ద్విగుణీకృతమయిన ఉత్సాహం "పజిల్డ్ జీనియస్ అని పేరుపొందిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడెవరు? ఎందుకా పేరు వచ్చింది?"
"అమెరికన్ శాస్త్రజ్ఞుడు టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ ని పజిల్డ్ జీనియస్ అనేవారు. కారణం ప్రపంచానికి అతి విలువయిన టెలిఫోన్ అందించిన గ్రాహంబెల్ మాటల ప్రకారం ప్రిన్సిపుల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అతనికి పూర్తిగా అవగాహన కాని విషయంగానే మిగిలిపోయిందట. టెలిఫోన్ చాలా ప్రాచుర్యం పొందేక కూడా గ్రాహంబెల్ అనేవాడట. 'వాషింగ్టన్ నుంచి పారిస్ ఫోన్ లో మాట్లాడే మనిషి గొంతు వినిపిస్తుంటే చిత్రంగా, తొట్రుపాటుగా వుంటుందని' అందుకే చరిత్రలో అతడు పజిల్డ్ జీనియస్ గా మిగిలిపోయాడు."
