కట్టుకొన్న సతిని నట్టేటిలో ముంచి
కన్నవారి నోట గడ్డకొట్టి
సభల కెక్కువాడు చచ్చు పెద్దమ్మరా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 72
బోసితాత శాంతి, బోసు వీరుని క్రాంతి,
త్యాగధనుల శోణిత స్రవంతి,
భరతమాత దాస్యబంధాలు బాపెరా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 73
నదులయందు గంగ, ననలందు సంపెంగ
సతుల సీత, గ్రంథతతుల గీత,
కవులయందు గొప్ప కాళిదాసుండురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 74
ధనము గలుగుచోట ధర్మంబు కానరాదు;
ధర్మ మున్నచోట ధనము లేదు;
ధనము ధర్మ మున్న మనుజుండె ఘనుడురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 75
ధనము గలిగి దాన ధర్మాలు చేయని
నరుడు ధరణి కెంతొ బరువు చేటు;
సాగరములు గావు శైలంబులును గావు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 76
ప్రాకిప్రాకి చీమ బహుయోజనము లేగు;
ఎగురకున్న గ్రద్ద యెచటి కేగు?
సాధనమున కార్యసాఫల్య మొనగూడు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 77
మంచిచెడ్డ లేదు, మర్యాద కనరాదు,
దేవులాట కడుపు తిండి కొఱకు,
పశువు, పురుషపశువు ప్రాణబంధువులురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 78
విశ్వమందు గలుగు విషరాజములయందు
అతిభయంకరంబు హాలహలము
ఘోర మంతకంటె క్రూరుని చిత్తమ్ము
లలిత సుగుణజాల! తెలుగుబాల! 79
మెదడు పాడుచేయు, మేనెల్ల చెడగొట్టు,
కీర్తి నపహరించు, నార్తి పెంచు,
క్రూరజనుల మైత్రి కుష్ఠురోగమ్మురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 80
తక్షకునకు విషము దంష్ట్రాగ్రమున నుండు;
మక్షికమున కుండు మస్తకమున;
నీచునకు విషంబు నిలువెల్ల నుండురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 81
సత్ప్రవర్తనంబు, సౌఖ్యంబు, మర్యాద,
మంచివారి పొందు మనకు నిచ్చు;
కలుషమతుల పొందు కలహాలు గొనితెచ్చు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 82
తరువులకు తుపాను, గిరులకు వజ్రమ్ము,
పద్మములకు హిమము భయము గొల్పు;
సజ్జనులకు దుష్టసంగంబు భయమురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 83
సమయ మెపుడు గడచు సన్మార్గులకు శాస్త్ర
చర్చలందు బుధసమర్చలందు;
ఖలుల కాల మేగు కలహాల జూదాల
లలిత సుగుణజాల! తెలుగుబాల! 84
మనసు, మాట, క్రియ సమైక్యమ్ములగు శిష్ట
మానవులకు, దుష్ట మానవులకు
తలపు వేఱు, భాషితము వేఱు, క్రియ వేఱు,
లలిత సుగుణజాల! తెలుగుబాల! 85
మాంద్య మెల్ల దీర్చు, మంచి పేరు వెలార్చు,
మనసు కలక దేర్చు, ఘనత కూర్చు,
సాధుమైత్రి సకల సౌభాగ్య సందాత్రి
లలిత సుగుణజాల! తెలుగుబాల! 86
నష్ట మధికమైన, కష్టాలు కలిగిన,
సిరి తొలంగి చనిన, మరణమైన,
ధర్మపథ మొకింత తప్ప రుత్తమజనుల్
లలిత సుగుణజాల! తెలుగుబాల! 87
మదముచేత వెలుగు మత్తేభరాజంబు;
జవముచేత వెలుగు సైంధవంబు;
వినయగుణముచేత విద్యార్థి వెలుగురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 88
అంతరిక్షమునకు అర్కుండు రత్నంబు;
భవనమునకు ముద్దు బాలకుండు;
చదువుకొన్నవాడు సభకు రత్నంబురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 89
ప్రభువు పూజలందు పట్టణమ్మందున;
రాజు పూజలందు రాజ్యమందు;
చదువుకొన్న వాని జగమెల్ల పూజించు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 90
దొరలు దోచలేరు, దొంగ లెత్తుకపోరు,
భ్రాతృజనము వచ్చి పంచుకోరు;
విశ్వవర్ధనంబు విద్యాధనంబురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 91
తల్లివోలె పెంచు, తండ్రి కైవడి గాంచు,
కాంత కరణి మిగుల గారవించు;
ఖ్యాతి మించు విద్య కల్పవృక్షంబురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 92
నలువ కాగ్రహంబు గలిగిన వెలివేయు
హంస నబ్జవన విహారమునకు;
క్షీరనీరభేద శేముషిం జెరచునా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 93
పరులకొఱకె నదులు ప్రవహించు, గోవులు
పాలు పిండు, చెట్లు ఫలము లిచ్చు,
పరహితమ్ముకంటె పరమార్థ మున్నదా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 94
కోరబోకు మెపుడు మేరమీరిన కోర్కె;
చేరబోకు మెపుడు క్రూరజనుల;
మీరబోకు పెద్దవారు చెప్పినమాట;
లలిత సుగుణజాల! తెలుగుబాల! 95
ప్రార్థనముల, పుణ్యతీర్థంబులందున,
గురులయందు, వైద్య వరులయందు,
భావమెట్టి దట్టి ఫలితంబు ప్రాప్తించు,
లలిత సుగుణజాల! తెలుగుబాల! 96
ఆకసమున మిత్రు డరుదెంచి నంతనే
సరసిలోని నళిని శిరసు నెత్తు;
అమలమైన మైత్రి కవరోధములు లేవు
లలిత సుగుణజాల! తెలుగుబాల! 97
సాధుజనుల మానసము నారికేళంబు
పైన మిగుల గట్టి; లోన మృదువు;
బాలిశుల మనమ్ము బదరీ ఫలమ్మురా
లలిత సుగుణజాల! తెలుగుబాల! 98
మనసు, మధుకరంబు, మద్యంబు, మత్స్యంబు,
మదము, మర్కటంబు, మారుతంబు,
చంచలంబు లివ్వి, సప్తమకారముల్
లలిత సుగుణజాల! తెలుగుబాల! 99
జనని, జన్మభూమి, జనకుండు, జాతీయ
కేతనంబు, జాహ్నవీతటంబు;
పరమపావనములు పంచ జకారముల్
లలిత సుగుణజాల! తెలుగుబాల! 100
* * * *
