సీ. పూయగంధము లేదు భూతి పూతే కాని
యోక్క గుఱ్ఱము లేదు యేద్దే కాని
త్రాగఁ గంచము లేదు తలపుర్రేయే కాని
మణులసొమ్ములు లేవు ఫణులే కాని
కొండ మీఁదనె కాని యుండఁ జోటే లేదు
తలను బూవులు లేవు జడలే గాని
గజచర్మమే కాని కట్ట వస్త్రము లేదు
జోగిరూపే కాని సొగసు లేదు.
గీ. ఇట్టి నిరుపేదవౌట ని న్నేఱిఁగి యేఱిఁగి
భ్రాంతి పడి యెట్లు పెండ్లాడేఁ బార్వతమ్మ
యైన నీ భాగ్య మేమని యనఁగవచ్చు
భక్తజనసంగ మగితేల ముక్తిలింగ.
సీ. బుడుతకల్వల విందుఁ బోలు నెన్నోసలిపై
చెలువంపురావ్రేక చిందులాడ
మొలఁ బట్టుదట్టిపై నలువందు గంటల
బంగారు మొలత్రాడు రంగు లీన
ఎదఁ గ్రోత్తపులిగోళ్లు పొదివిన పతకంబు
బలు ముత్తియపుసరంబులును బొదువ
చేతుల రతనంపుఁ జిల్లుటుంగరములు
మురువులు నేనలేని ముఱువు చూప
గీ. మెట్టిదంబున నందియల్ బిట్టు మొరయ
దిట్టతనమునఁ జెలరేఁగి పట్టపగలే
నెట్టుకొని యెల్ల వ్రేఁతల నట్టులందు
గుట్టు లరయుచు మేలఁగునప్పట్టి మెఱయు.
సీ. విశ్వంబు నీవయై విశ్వంబు చూచుచు
విశ్వంబు చేయుచు విశ్వములకు
నినుఁడవై పంచభూతెంద్రి యహంకార
ములకు మనఃప్రాణబుద్ది చిత్త
ముల కెల్లనాత్మమై మొనసి గుణంబుల
కావృతమగు నిజాంశాంశ భూత
మగు నాత్మచయమున కనుభూతి సేయుచు
మూఁడహంకృతులచే మునుఁగువడక
గీ. నేఱి ననంతుఁడవై దర్శనీయరుచువి
గాక సూక్ష్మండవై దర్శనీయరుచివి
దనరి కూటస్థుఁడన సమస్తంబు నెఱుఁగు
నీకు మ్రొక్కెద నాలింపు నిర్మలాత్మ.
సీ. మిన్నేటి పెన్నీటీ మిక్కుటం బగునిట్ట
పాఁప నెట్టేపుఁజుట్ట పై ఁధేరల్ప
పొలుచు కెందామర పుప్పొడి తెట్టువ
జడలసం దొయ్యన సడలి తొరుగ
నలికంబు పైఁ గపాలాపలి తూఁటుల
నొండొండ తెలినీరు నిండఁబడఁగ
తల లెత్తి నిక్కిన వెలిదమ్మి మొగడలఁ
లోనఁ దేఁటుల తేనె లాని యులియ
గీ. మస్తకము వంచి సౌభాగ్యమహిమ మించి
గౌరీపదపల్లవంబులు గారవించి
తియ్యఁబలుకుల నలుకలుదీర్చు శివుఁడు
మనలఁ గరుణా విధేయుఁడై మనుచుఁ గాత.
సీ. శ్రీ పద్మవాసినీ పృధుతర కుదశాత
కుంభకుంభ విలిప్తమునుముమాయ
మానచందన మృగ మద సంకుమదకుంకు
మాగరు పంక సమన్వితోరు
బాహాంతరాళ విభ్రాజమానామూల్య
కౌస్తుభమణి ఘ్రుణికలిత లలిత
మౌక్తికహార శుంభదుదర భరితలో
కనికరుండవు నీవు కనికరంబు
గీ. మీఱ భక్త జనాళి కమేయదివ్య
భాస్వదనపాయ సకలసంపద లొసంగి
సాకికొనుమయ్య నిరంతంబు సరసముగను
మదనగోపాల! గోపికాహృదయలోల!
క. శారదనీరదవర్ణా
సార సభవ చక్రపాణి శంకరవినుతా
కీరమనోహర హస్తా
భారతి! నీ పాద పద్మ భజన మొనర్తున్
సీ. పాలించవే నన్నుఁ బద్మసంభవురాణి
బహుశాస్త్ర పుస్తక పాణి వాణి!
కరుణించవె నన్నుఁ గలహంస గామినీ
కోరి మ్రొక్కెద నీకుఁ గీరవాణి
రక్షించవే నన్ను రాజబింబాననా!
దయఁ గావవే సర్వధవళవర్ణ!
మన్నించి నీవు నా మదిలోన నుండవే
మాధవుకోడలా మదనువదినే
గీ. నిన్ను నెప్పుడు సేవింతు నీలవేణి
నన్నుఁ గృపజూడు మెప్పుడు నళిననేత్రి
భారతీదేవి నా జిహ్వఁ బాయకుండు
శరణు లోకైక వినుతాంబ శారదాంబ.
శా. వీణాపుస్తకపాణివై హరిశిలావేదీభవద్వేణివై
మాణిక్యోన్నత పుంజరంజితలసన్మంజు ప్రభాశ్రోణివై
స్థాణు బ్రహ్మహరీంద్ర ముఖ్యహృదయంతర్వాణివై వాణి క
ళ్యాణి నా రసనాగ్రమందు నిలుమీ వ్యాఖ్యానకాలంబునన్.
సీ. కదిసి యెక్కేడు గిబ్బ బెదరించు పొడలపెన్
దుప్పటంబును మీఁదఁ గప్పుకొన్న
ఉడివోని కడివోని కడవోని వింతల
ముడువని వేలిపువ్వు ముడుచుకొన్న
నూఱు నిన్నూఱు మున్నాఱు నన్నూఱు నౌ
రెట్ట నాగుల పేరు పెట్టుకొన్న
ఎడవంక (సుగతితోఁ) గడుబింకముగ జింక
పఱచూదాఁటుల పిల్లఁ బట్టుకొన్న
గీ. వానిఁ దనుముట్టఁ గొలిచినవానివాని
మగువయును దాను నొక్కటై మన్నవాని
మహిత వృషరాజు నెక్కినమహిమవాని
మృడునిఁ గలఁగంటి నంతలో మేలుకొంటి.
సీ. చుక్కలకడఁ బోవు నొక్కటెక్కె మువాని
యానంబు సుతుని మేనల్లునన్న
కొడుకు తమ్ముని మేనగోడలి పెదబావ
తండ్రితండ్రి తనూజధవుని మామ
మనమున నేడింట మలయు నాతని తల్లి
సవతి తమ్మునిరొమ్ము సఱచు వాని
జనకుని యిల్లాలి తనయులతో ఁ బెద్ద
మొదలు ప్రసిద్ది పెంపోదవువాని
