అమ్మ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కాని ఇద్దరం.... ఒకరికొకరు ధైర్యం చెప్పుకునే స్థితిలో లేము. నాన్నగారు కోమాలో ఉన్నారు. డాక్టర్లు, మెదడులో రక్తనాళాలు చిట్లి పోయి బ్రెయిన్ లోపల రక్తస్రావం జరుగుతోందన్నారు.
ఎక్కువసేపు ఆయన ముఖంలోకి చూస్తూ నిశ్చలంగా కూర్చుండేదాన్ని. అందమైన ఆ చిన్న పెదవులు నవ్వుతూన్న భంగిమను ప్రదర్శిస్తూ ఉండేవి. ఆయనది ఎంత చక్కని చిరునవ్వు!
ఎలాంటి పరిస్థితిలోనూ ఆ చిరునవ్వు పెదవుల మీద నుంచి చెరిగేది కాదు.
ఎంత కష్టంలోనైనా "ఏం పర్లేదు" అంటూ నిర్మలంగా హసించే పెదాలవి.
ఒకసారి నూట నాలుగు డిగ్రీల జ్వరంలో ఉండి, ఎందుకో మంచం మీద నుంచి లేచి నిలబడి, కళ్ళు తిరిగి ఫెయింటయి క్రింద పడిపోయారు.
అమ్మా నేనూ కంగారుగా పరుగెత్తుకెళ్ళాం.
నేను ఆదుర్దాగా "నాన్నగారూ! నాన్నగారూ" అని పిలుస్తున్నాను.
ఒకటి రెండు నిమిషాలకు ఆయన కళ్ళు విప్పారు.
అదే చిరునవ్వు.
"మరేం ఫర్లేదు" అంటూ ఏమీ జరగనట్లు లేచి కూర్చున్నారు. ఆ దృశ్యమే కళ్ళముందు కదలాడుతోంది. ఆ మాటలే వీనుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
నాలుగో రోజు ఉదయానికి నాన్నగారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు.
3
'యజమాని' అనేది బూర్జువా పదం కాదు. ఆ పదానికి అత్యంత విలువ, ప్రాముఖ్యత ఉన్నాయి.
ఓ రాజ్యాంగం, ఓ సంస్థ, క్రీడలకు సంబంధించిన ఓ గొప్ప టీమ్, ఎంతో సంతోషంగా ముందుకు సాగిపోతూన్న ఓ కుటుంబం.... యజమానిని హఠాత్తుగా కోల్పోతే కకావికలమై పోతుంది.
ఉన్నట్లుండి అదో లోకానికి పడిపోతుంది.
మా విషయంలోనూ అంతే జరిగింది.
అంత వరకూ డబ్బు గురించిన ఆలోచన మాకు తెలీదు. ఎక్కడ ఏం తిప్పలు పడేవారో, ఏ అవసరమూ తీరలేదనే భావన మాకు కలగకుండా అన్నీ తెచ్చి పడేస్తూ ఉండేవారు. తాను కష్టపడుతూ మాకే కష్టం తెలీకుండా మసలుకునేవారు.
"ఆశ్చర్యం!
ఒక్కసారిగా ఎంత మార్పు!
ఇంట్లో తినే పదార్థాలన్నీ ఒకటొకటిగా అన్నీ అయిపోయినాయి. చుట్టాలంతా ఏమయిపోయారో కంటికి కనిపించటం మానేశారు. డబ్బుల్లేవు. ప్రతిదానికి తడుముకున్నట్లుగా ఉంటోంది. వెచ్చాల కొట్లో ఒకటి రెండుసార్లు అప్పిచ్చి తర్వాత ఇవ్వడం మానేశాడు. ఫీజు కట్టలేక స్కూలుకెళ్ళటం మానేశాను.
జీవితం దుర్భరంగా మారిపోయింది.
ఏ మాటకామాట..... నాన్నగారి స్నేహితుల్లో కొందరు కొంతవరకూ సాయం చేశారు .... కాని రాను రానూ తను పరిస్థితులు కూడా అంతంత మాత్రంగా ఉండటం వల్లో లేక ఇంట్లో పెళ్ళాల వ్యతిరేకత తట్టుకోలేకో మొహాలు చాటు చేసేశారు.
ఒక్క నవనీతరావు అనే స్నేహితుడు మాత్రం ఎంతో దయగా స్నేహభావంతో వస్తూ ఉండేవాడు.
దయ, స్నేహభావం అనే పదాలు నాకు నవ్వు తెప్పిస్తాయి.
మనిషిలో మనుషులుండటం నూటికి నూరుశాతంతో జరుగుతూ ఉంటుంది. ఇందులో అబద్ధం లేదు. చాలామందికి మనస్తాపం కలిగించే పచ్చి నిజం. ఎవ్వరికీ అర్థంకాని సహజమైన విషయం కూడా.
కాని, మనిషిలో వేరొక మనిషి మాత్రమే కాదు. ఎన్నో రకాల మనుషులుంటారు. దయ వెనకే కాఠిన్యం. మంచితనం వెనకే శాడిజం, అమాయకత్వం చాయన గడుసుతనం. తెలివి లోపల మూర్ఖత్వం. విజ్ఞానం ముసుగులో ఎన్నో రకాల చాదస్తాలు.
అబ్బ! ఎన్ని రకాల మనస్తత్వాలు! ఏ గొప్ప కవీ, మహా రచయితా వీటిని తరుచుకుంటూ పోయి, ఆ లోతుల్ని వెతుక్కుంటూ, మధిస్తూ.... ఈ భయంకరమైన సత్యాలను శోధించలేక పోయాడేం? నేనిలా రాస్తోంటే మహా రచయితలం అనుకునే వాళ్ళకి కోపమొస్తోందా? ఏం చెయ్యను? నా భావాలను నిష్కర్షగా చెప్పక తప్పటం లేదు.
అసలు.... నిష్కర్షగా చెప్పటానికే నేనిది రాయటం మొదలుపెట్టింది.
నా గురించి నేనేం దాచుకోదల్చుకోలేదు.
ముందు ముందు మీకే తెలుస్తుంది.
మొదట ఏ జీవితమైనా సామాన్యంగానే కనబడుతుంది. అంతకంటే మరో మార్గం లేదు గనుక.
ఎక్కణ్ణుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? నవనీతరావుని గురించి కదూ చెబుతున్నాను.
* * *
అప్పటికి నవనీతరావుకు ముప్ఫయి అయిదు, ముప్ఫయి ఆరేళ్ళుంటాయి. గిరిజాల జుట్టు, బంగారు రంగు కళ్ళజోడు , పైజమా లాల్చీలతో మనిషి సుకుమారంగా అందంగా కనిపించేవాడు.
నాన్నగారుండగా తరుచు వచ్చేవారిలో అతనొకడు. ముగ్గురు పిల్లలున్నారు.
ఒకవైపు అప్పులవాళ్ళు జలగల్లా పీల్చేస్తున్నారు. వాళ్ళు పెట్టే అరుపులతో, చేసే అవమానాలతో ఇరుగుపొరుగు ముందు తలెత్తుకోలేకపోతున్నాం. మరోవైపు చిత్ర విచిత్రమైన శాడిజంతో మనుషులు చిత్రవధ చేసేస్తున్నారు.
అమ్మ వంటిమీది బంగారమంతా క్రమంగా హరించుకుపోయింది. ఇంట్లోని వస్తువులన్నీ అమ్ముడైపోతూ, తగ్గిపోతున్నాయి.
