Previous Page Next Page 
ప్లే పేజి 4


    గట్స్ లేనివాడు పత్రికా ప్రపంచంలోకి అడుగు పెట్టకూడదయ్యా-అడుగు పెట్టక పోరాటమే ధ్యేయం కావాలి.
    
    నా ప్రాణం కన్నా - ప్రజలకు చెందాల్సిన ఆ నాలుగు వందల కోట్ల ఖరీదు చేసే స్థలమే అతి విలువైంది-

    ఈ పోరాటంలో పోతే నా ఒక్కడి ప్రాణాలే-నా పోరాటం వెలుగుచూస్తే ఆ నాలుగు వందల ఎకరాల్లో నలభై వేలమంది పేద ప్రజలకు గూడు లభిస్తుంది- లేదా ప్రజలకు - భావితరాలకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించే అందమైన పూలతోటలు-పార్కులు-అర్చెన్ ఫారెస్ట్ లు చోటు చేసుకొంటాయి. కాదంటావా?
    
    కనీసం ఒక్క శాతమైనా దేశభక్తిలేని వెధవలు ఈ గడ్డపై మన గూడదయ్యా" ఎంతో ఆవేశంగా, ఉద్వేగంగా అంటున్న జగన్నాయకుల వేపు ఈనాడు రిపోర్టర్ ఎంతో గౌరవ భావంతో చూసాడు.
    
    జగన్నాయకుల ఆర్గ్యుమెంట్ నీ - ఆవేశాన్ని, ఎమోషనల్ ఇంటెన్సిటీని, నీతి నిజాయితీల్ని, దేశభక్తిని ఎలా కొట్టి పారేయగలడు...?
    
    "నా పట్ల మీకున్న ప్రేమాభిమానాలకి నా కృతజ్ఞతలు, మీ కోసమైనా, కొన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటాను. డోంట్ వర్రీ..." అన్నాడు జగన్నాయకులు గ్లాస్ ఎత్తి రమ్ ని గొంతులోకి వంపుకుంటూ.

    నిట్టూరుస్తూ లేచాడు ఈనాడు రిపోర్టర్.
    
    "యు ఆర్ ఆల్వేస్ రైట్ సర్ - అలా అనుకున్నాను మీరు బ్రతికుంటేనేగదా ఇలాంటి ఎన్నో అన్యాయాల్ని, అక్రమాల్ని వెలికి తీయగలిగేది.... పోనీ అందుకైనా, మీరు మీపట్ల జాగ్రత్తలు తీసుకోవాలి - కనీసం ఒక నెలరోజులైనా - ఇఫ్ యూ డోంట్ మైండ్ - ఐకెన్ ప్రొలైడ్ ది సేఫెస్ట్ ఫర్ యూ.... ప్లీజ్ సర్.... కాదనకండి..." అర్దిస్తున్నట్లుగా అన్నాడా ఈనాడు రిపోర్టర్.
    
    ఎందుకో ఆ అభ్యర్ధనకు కదిలిపోయాడు జగన్నాయకులు -అ దే సమయంలో ముందుకు వస్తున్న ప్రమాదపు సాంద్రతని కూడా అంచనా వేసుకోగలిగాడు.
    
    "అలాగే.... రేపుదయమే నేను మీ ఇంటికి వస్తాను-ఒక నెల రోజులు నన్ను ఎక్కడ దాస్తావో దాయి- కేవలం నెలరోజులే సుమా- నువ్వెక్కడ దాచినా, సాయంత్రానికి నాకు ఈ సరంజామా కావాలి-అండర్ స్టాండ్...!" నవ్వుతూ, ఆప్యాయతను కనబరుస్తూ అన్నాడు జగన్నాయకులు.
    
    ఈనాడు రిపోర్టర్ కళ్ళలో వెలుగు...
    
    ఒక గొప్ప జర్నలిస్ట్ ని కాపాడబోతున్నానన్న సంతృప్తి, ఆనందం అతని కళ్ళలో కనిపించింది-
    
    "ప్రొద్దుటే మీ ఇంటికి వచ్చి, నేనే మిమ్మల్ని తీసుకుపోతాను.... వస్తాను సార్" అని ఈనాడు రిపోర్టర్ రిలాక్స్ గా ఫీలవుతూ వెళ్ళిపోయాడు.
    
    అప్పటి నుంచి ఉదయం వరకు - ఆ రాత్రిలోపు-ఏదైనా జరగవచ్చని అప్పుడే ఊహించి ఉంటే ఈనాడు రిపోర్టర్ జగన్నాయకుల్ని అక్కడే వదిలి వెళ్ళేవాడు కాదేమో...
    
    వదిలి వెళ్ళబట్టే కధ ఒక అనూహ్యమైన మలుపు తిరగబోతోంది.
    
    అతనలా వెళ్ళగానే జగన్నాయకులు ఎందుకో ఒకసారి తన కేబులు తడిమి చూసుకున్నాడు-
    
    ఆపైన లేచి బాత్ రూమ్ కెళ్ళాడు.
    
    రెండు నిమిషాల్లో బాత్ రూమ్ నుంచి తిరిగివచ్చి తన యధాస్థానంలో కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు-ఏదో ఆలోచిస్తూ.
    
    అదే సమయంలో అతని దృష్టి, అప్పుడే లోనికొస్తున్న ఇద్దరు వ్యక్తుల మీద పడింది.
    
    లోనికొచ్చిన వాళ్ళిద్దరూ, అటూ, ఇటూ చూసి, టీ.వీ పక్కన కూర్చున్న జగన్నాయకులు వేపు నడిచారు.
    
    మొదటి వ్యక్తి దృఢంగా, బలంగా, పొట్టిగా ఉన్నాడు. వత్తుమీసాలు తలకి మంకీ టోపీ, బాగీ ఫేంటు, పైన బ్లాక్ కలర్ జర్కిన్ వేసుకొన్నాడు.
    
    అతని పక్కనున్న వ్యక్తి లైట్ బ్లూ కలర్ కుర్తా, పైజామా వేసుకొన్నాడు ఉంగరాల జుత్తు - కళ్ళకు బూతద్దాల కళ్ళజోడు.... చేతిలో గోల్డ్ ప్లేక్ సిగరెట్ ప్యాకెట్.
    
    తన టేబిల్ దగ్గరకొచ్చి, మాట్లాడకుండా నుంచున్న ఆ ఆకారాలవేపు తలెత్తి చూసాడు జగన్నాయకులు.
    
    వాళ్ళని ఎప్పుడూ, ఎక్కడా చూసినట్టు గుర్తులేదు.
    
    "నమస్తే సర్....మీ కోసం.... మీ ఇంటికెళ్ళాం...." మొదటి వ్యక్తి చెప్తూ, కుర్చీని, ముందుకు లాగి కూర్చున్నాడు.
    
    "ఇంటికా... ఈ టైములో నేనింటి దగ్గర ఉండనని....అందరికీ తెల్సు...." జగన్నాయకులు నెమ్మదిగా అన్నాడు.
    
    మొదటి వ్యక్తి - పక్కన నుంచున్న రెండో వ్యక్తి నిశితంగా నాలుగు వేపులా చూసాడు.
    
    గోడ మీదున్న గడియారం అప్పుడే తొమ్మిది గంటలు కొట్టింది.
    
    సినిమా జర్నలిస్టుల్లో, ఒక బ్యాచీ టేబిల్ ముందు నుంచి లేచి బయటకెళ్ళి పోయింది.
    
    బార్ కౌంటర్ లోని వ్యక్తి, ఏదో రాత పనిలో నిమగ్నమై పోయున్నాడు.
    
    "ఎవరు మీరు.... ఏం కావాలి..." జగన్నాయకులు సిగరెట్ తీసుకుని వెలిగిస్తూ అడిగాడు.
    
    మొదటి వ్యక్తి, కళ్ళతోనే నవ్వి, పక్కన నుంచున్న కుర్తా, పైజామా వ్యక్తి కళ్ళవేపు చూసాడు.
    
    ఆ చూపులోని భావాన్ని అర్ధం చేసుకొన్నా కుర్తా, పైజామా వ్యక్తి టీ.వీ వేపు అడుగువేసి టీ వీ వాల్యూమ్ ని పెంచాడు.
    
    మొదటి వ్యక్తి పెదవి విప్పాడు.
    
    "నా పేరు..." టీ.వీ సౌండ్ లో ఆ మాట వినబడలేదు జగన్నాయకులుకి.
    
    సరిగ్గా అదే సమయంలో, బేరర్ అక్కడకు రావడంతో-
    
    "మూడు లార్జ్... చికెన్ పకోడా.... ఇంకేవుంది?" అడిగాడు మొదటి వ్యక్తి.
    
    "ఫిష్ కట్ లెట్..." చెప్పాడు బేరర్.
    
    "మూడు ప్లేట్లు....అర్జంట్....ఇంకేమైనా...చెప్పమంటారా....సార్...." జగన్నాయకులు వేపు చూసాడతను.
    
    చాలామంది డ్రింక్ మధ్యలో రావడం, రెండు పెగ్గులు, తనతో కూర్చుని తాగడం, బిల్లు చెల్లించి వెళ్ళిపోవడం అంతా మామూలే.
    
    జగన్నాయకులు వేపు, వాళ్ళిద్దరి వేపు యధాలాపంగా చూసి, కిచెన్ వేపు నడిచాడు బేరర్.
    
    బయట మంచు దట్టంగా కురుస్తోంది.
    
    ప్రెస్ క్లబ్ బార్లో, తొమ్మిది గంటలకే, జనం అలజడి తగ్గడం, దాదాపు అరుదైన సంఘటన.
    
    రాహ్స్త్రానికి, సెన్సేషనల్ న్యూస్ ని అందించే, జర్నలిస్ట్ ల ప్రెస్ క్లబ్ లో -
    
    అదే సమయంలో -
    
    ఒక సెన్సేషనల్ ఇన్ సిడెంట్ కి, భయంకరమైన రంగం సిద్దమౌతుందన్న విషయం మూడో కంటికి కూడా తెలీదు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS