అతను ఫైల్ తెరిచాడు.
నడివయస్కుడు ఆ రేక్ కి వేలాడుతున్న ఫైబర్ చిప్ కేసి చూశాడు.
దానిమీద 1961 అన్న అక్షరాలు స్పష్టంగా కనిపించాయి. యువకుడు ఆ ఫైల్ లో తనక్కావలసిన పేజీల్ని ట్రేస్ చేసాడు. అందులోని తొమ్మిదవ పేజీ. ఏడవపేజీలోని వివరాల్ని సరిచూసుకున్నాడు.
ఆ యువకుడి కళ్ళు మరోసారి మెరిసాయి.
తను తన అంచనాకు దగ్గరగా, ఊహకు సమీపంగా వెళుతున్నప్పుడు ఒక మనిషికి కలిగే ఆనందమే ఇప్పుడా యువకుడిలో చోటు చేసుకుంది.
నడివయస్కుడు ఆతృతగా యువకుడికేసి చూశాడు.
అతను ఫైల్ ని పరబ్రహ్మానికి అందిస్తూ "ఫిఫ్టీ" అని అన్నాడు మెల్లగా.
నడివయస్కుడిలో ప్రోది చేసుకున్న ఉత్కంఠ రెట్టింపయింది. కనుబొమలు ఆశ్చర్యంతో ఒకింత పైకి లేచాయి.
పరబ్రహ్మం మరికొంచెం ముందుకి కదిలాడు.
క్రితం రోజు ఫోన్ లో ఓ వ్యక్తి అడిగిన వివరాల్ని గుర్తుకు తెచ్చుకుంటూ వెళ్ళి 1963 రేక్ దగ్గర ఆగిపోయాడు. ఇక తను చూడవలసిన ఆఖరి ఫైల్ ఆ రేక్ లోనే ఉండి ఉంటుందని భావించిన ఆ యువకుడిలో రక్త ప్రసరణ వేగాన్ని పుంజుకుంది. తన ఆశలు, ఆశయాలు, కలలు నిజం కావాలంటే ఆ రేక్ లోంచి పికప్ చేయబోయే ఫైల్లోని రెండు పేజీలు ఒకే రకమయిన వివరాల్ని తన కందించగలిగితే చాలు. తన పగ, ప్రతీకారం, జీవితలక్ష్యం అన్నీ నెరవేరిపోతాయి.
1963 రేక్ లోంచి డాక్టర్ పరబ్రహ్మం బ్రౌన్ కలర్ ఫైల్ ని పికప్ చేశాడు. వణుకుతున్న చేతుల్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ ఫైల్ ని అందుకున్నాడు ఆ యువకుడు.
ఒక్కొక్క పేజీని ఆ యువకుడు పరిశీలనగా చూస్తుంటే నడివయస్కుడు టెన్ షన్ గా ఫీలవుతూ ఆ ఫైల్ కేసి చూడసాగాడు.
ఫైల్ ని తిప్పుతున్న యువకుడు సడన్ గా ఓ పేజీ దగ్గర ఆగిపోయాడు. చకచకా ఆ పేజీలోని వివరాల్ని చదివేసి ప్రక్క పేజీలోకి వెళ్ళాడు.
ఆ పేజీలోని మొదటి రెండు కాలమ్స్ లో ఫిల్ చేసిన వివరాల్ని చదువుతూనే అతని కళ్ళు మెరిశాయి. విచిత్రమయిన ఆనందోద్వేగానికి గురయ్యాడు.
కళ్ళ ముందు కావల్సిన వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నా నమ్మలేక పోతున్నాడు.
నిజంగా అలాంటి అద్భుతం ప్రపంచంలో ఎప్పుడయినా, ఎక్కడయినా జరిగి ఉంటుందా? నమ్మలేని నిజమంటే అదేనా? అసలా నిజాన్ని ఎవరికన్నా చెబితే తనను ఒక ఫూల్ ని చూసినట్లు చూస్తారు.
ఇంతవరకు ప్రపంచంలో ఏ క్రిమినల్ బ్రెయిన్ లోనూ రూపుదిద్దుకొని పథకాన్ని తను సిద్దం చేసుకున్నాడు.
అప్పటివరకయితే అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగిపోయింది. ఆ పైన కూడా జరిగితే తనకిక తన ప్రపంచంలో ఎదురుండదు. తనే రాజు తనే మంత్రి.... తనే సేనాధిపతి అవుతాడు.
తన ప్రత్యర్ధులు ఎట్టి పరిస్థితుల్లోనూ, తను పన్నే వలలోంచి బయట పడలేరు. పైగా తను వలపన్నినట్లు స్కాట్ లాండ్ యార్డు గూఢచారులు కూడా పసిగట్టలేరు. అంతసేపు ఆ యువకుడు ఫైల్ ని చూస్తుండటాన్ని బట్టే నడి వయస్కుడు విషయాన్ని అర్ధం చేసుకున్నాడు.
మరికొద్ది క్షణాలకు యువకుడు ఆ ఫైల్ ని మూసి నడివయస్కుడికి అందించాడు.
అతనా ఫైల్ ని తీసి, తమకు అవసరమయిన పేజీల్ని తీసి, ఒకటికి పదిసార్లు వాటిల్లోని వివరాల్ని తన జ్ఞాపకాల అరల్లో నిక్షిప్తం చేసుకొని చటుక్కున కోటు జేబులోంచి ఓ మినీ కెమెరాని బయటకు తీశాడు.
ఆపైన చటుక్కున ఫ్లోర్ మీద కూర్చున్నాడు. ఫైల్ ని ఓపెన్ చేసి ఒక్కొక్క పేజీని కెమెరాలోకి ఎక్స్ పోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు.
ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ యువకుడు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూండి పోయాడు.
డాక్టర్ పరబ్రహ్మం అప్పటికే ఓసారి డోర్ దగ్గరకు వెళ్ళి గ్లాస్ లోంచి లాబీని పరిశీలించి వచ్చాడు.
* * * * *
సరిగ్గా రాత్రి రెండుగంటలకు వాళ్ళకు కావల్సిన వివరాల్ని మైక్రోఫిల్మ్ లో భద్రపరుచుకొని రికార్డు రూమ్ నుంచి లాబీలోకి వచ్చారు.
చివరగా రికార్డు రూమ్ కి తాళం వేసి వచ్చిన డాక్టర్ పరబ్రహ్మానికి ఆ యువకుడి సూచన మేరకు నడివయస్కుడు అరచేతిలో ఇమిడేంత చిన్న బాక్స్ ని అందించాడు. "లిఫ్ట్ ద్వారా కాక, వేరే మార్గం ద్వారా మేం బయటకు వెళ్ళాలి. అలాంటి దారేదయినా ఉందా?" యువకుడు ఎటో చూస్తూ పరబ్రహ్మాన్ని ఉద్దేశించి ప్రశ్నించాడు.
"ఉంది సార్ అయితే ఇరుకయిన మెట్లగుండా క్రిందకు దిగవలసి వస్తుంది. కాని మీరు?"
"నో ప్రాబ్లమ్.. అంటే పదండి" అన్నాడు యువకుడు. పరబ్రహ్మం ఆ బిల్డింగ్ కి వెనుకవైపున సముద్రపు దిశగా వున్న స్టెప్స్ కేసి దారి తీశాడు.
* * * * *
"నువ్వు ఖచ్చితంగా చూశావా?"
హాస్పిటల్లో బిల్డింగ్ కి వందడుగుల దూరంలో ఓ ఇంటి టెర్రస్ మీద, చీకట్లో నుంచుని వున్న ఇద్దరు వ్యక్తుల్లోని ఒక వ్యక్తి అడిగాడు.
"సందేహం లేదు" రెండో వ్యక్తి స్థిరంగా అన్నాడు.
"ఇక్కడేం పని?"
"తెలీదు కాని పని పూర్తి చేశాను."
"ఎలా?"
"గేటు ముందున్న ఆ వ్యాన్ ని అందుకు ఎన్నుకున్నాను."
"శెభాష్, బట్.... అతన్ని అంత తక్కువగా అంచనా వేయటం మన అవివేకాన్ని సూచిస్తుంది."
"అతనెలాంటివాడో, ఎంతటి సమర్థుడో నాకు తెలీకుండా ఎలా ఉంటుంది? తెలియబట్టే ఇంత షార్ప్ గా రియాక్టు అయ్యాను."
"ఈ అపరాత్రివేళ అంతటి సహసమెలా చేశాడు?"
"సాహసవంతుడు సాహసాలు చేయక మరేం చేస్తాడు?"
"మనం అనుక్షణం పొంచి ఉంటామని తెలుసుగదా?"
