ప్రొఫెసర్ పార్ధసారధి తన గదిలో రిలాక్సవుతున్నాడు. ఓ క్రిటికల్ ఆపరేషన్ చేసి అప్పడే వచ్చాడు.
సమయం రాత్రి పది అవుతుంది.
సిటీలో పెద్ద పేరున్న సర్జన్ పార్ధసారధి ఇండియాలో అతికొద్దిమంది ఎఫీషియంట్ సర్జన్స్ లో అతనొకడు. ఎప్పుడో బిజీగా వుంటాడు.
అతను ఏ శస్త్ర చికిత్సనైనా చేయగలడు. అతనికెన్ని మాస్టర్ డిగ్రీలున్నాయో...అతనికే తెలియదు. అతని యింట్లో ఓ మూడునాలుగు గదుల నిండా మెడికల్ పుస్తకాలే.
ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా మెడికల్ జర్నల్స్ తిరగేస్తూనో, సెమినార్ కు వెళ్తూనో వుంటాడు. కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేస్తుంటాడు.
స్టేట్స్ నుంచి కూడా అతనికి తరచూ ఆహ్వానాలు అందుతూ వుంటాయి. యాభై సం.ల పార్ధసారధి భార్య దురదృష్ట వశాత్తు క్యాన్సర్ తో మరణించింది.
ఎన్నో క్లిష్టమైన కేసులను తన మేధస్సుతో జయించి ఎందరికో ప్రాణదానం చేసిన ఆ వైద్య మేధావి, తన భార్యకు సోకిన క్యాన్సర్ బూచిని గుర్తించలేకపోయాడు.
భార్యంటే అతనికి అమితమైన ప్రేమ. అందుకే భార్య చనిపోయినా మరో పెళ్లి మాటే తలపెట్టలేదు. పెళ్లయిన చాలారోజులకు తన ప్రేమ గుర్తుగా పుట్టిన కూతురు అపూర్వను గారాబంగా పెంచాడు.
స్టేట్స్ లో కూతుర్ని చదివిస్తున్నాడు. రోజుకోకసారైనా కూతురితో మాట్లాడకపోతే తోచదు. తండ్రి కూతుళ్ల మధ్య అంత ఎఫెక్షన్.
కూతురి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నాడు. సరిగ్గా పదిన్నర అవుతుండగా ఫోన్ మోగింది.
వెంటనే రిసీవర్ ఎత్తాడు.
"హాయ్ బేబి"
"డాడీ...ఫోన్ ఎత్తగానే నా గొంతు ఎలా గుర్తుపడతావు?" అటువైపునుంచి కూతురు అపూర్వ అడిగింది.
"మై స్వీట్ బేబీ...ఈ ఫోన్ నెంబర్ నీకు ఒక్క దానికే తెలుసు. ఎస్పెషల్లీ నీకోసమే ఈఫోన్ పెట్టించాను.సో...నువ్వు రింగ్ చేస్తే తప్ప ఆ ఫోన్ పలకదు. ఈ ఫోన్ పలికితే తప్ప ఈ డాడీ గొంతులోకి ముద్ద దిగదు"
"డాడీ ..."అటువైపు నుంచి అపూర్వ గొంతు గాద్గికమైంది.
"బేబీ...ఫీలవుతున్నావా? హార్ట్ చేసానా? సారీ బేబీ" పార్ధసారధి నొచ్చుకుంటూ అన్నాడు.
"లేదు డాడీ ... హేపీగా ఫీలవుతున్నాను. నీలాంటి డాడీని యిచ్చినందుకు ఆ దేవుడికి లాట్ ఆఫ్ ధాంక్స్ చెప్పుకోవాలి"
"బేబీ..ఏం లాభం...నీకు తండ్రి ప్రేమనే తప్ప అమ్మ ప్రేమను అందించలేకపోయను".
"నో డాడీ...అమ్మ ప్రేమ, నీ అనురాగం రెండూ నీ గొంతులోనేవున్నాయి. అమ్మ లేదనే ఫీలింగ్
నాక్కలగడంలేదు".
"థాంక్యూ బేబీ...హెల్తా ఎలా వుందీ?""పైన్ డాడీ...అయినా నా తండ్రి పెద్ద డాక్టర్...నాకేమవుతుంది?"
"మై స్వీట్ బేబీ"
"భోం చేయండి డాడీ...ఆలస్యంగా తినొద్దని ఎన్నిసార్లు చెప్పాను"
"ఓ.కే...బేబీ నీ గొంతు విన్నానుగా.....తినేస్తాను."
"తినేయండి.....అతే....ఒక్కరౌండు, రెండు పెగ్గులు అంటూ మందు ముందు కూచోవద్దు" భార్యను మరచిపోయే ప్రయత్నంలో తన తండ్రి మందును ఆశ్రయిస్తాడని తెలుసు అపూర్వకు. అదీ రాత్రిళ్లు మాత్రమే.
తండ్రి బాధ తెలిసిన అపూర్వ తండ్రిని వారించే ప్రయత్నం చేయలేదు.
"ఓ.కే...బేబీ...ఓన్లీ సింగిల్ రౌండ్" అన్నాడు.
"దట్స్ గుడ్" అంది కూతురు.
"బై బేబీ"
"బై డాడీ"
రిసీవర్ పెట్టేసి,అప్పుడు రిలక్సయ్యాడు. పార్ధసారధి. కూతురితో మాట్లాడితే తప్ప. రిలాక్సింగ్ గా అనిపించదు.
ఇరాని హొటల్ రద్దీగా వుంది.
రకరకాల జనం అక్కడ కూచుని కబుర్లు చెప్పకుంటాన్నారు. ఇరానీ సంస్కృతి పట్టణాల్లోకి పాకింది. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఈ సంస్కృతి విశ్వరూపం కనిపిస్తుంది.
ఎక్కడ చూసినా ఇరానీ హొటళ్లే దర్శనమిస్తాయి.
"దో బాయ్" ఓ కాలేజీ కుర్రాడు ఆర్దరేసాడు. అతని చుట్టూ ముగ్గురు ఫ్రెండ్స్ వున్నారు.
"సమోస తిని ఛాయ్ తాగితే బావుంటుందేమో" మరో ఫ్రెండ్ అడిగాడు.
"డబ్బులుంటే బాగానే వుంటుంది" అన్నాడు మొదట ఛాయ్ ఆర్డర్ చేసిన వ్యక్తి.
పేపర్ తిరగేస్తున్నారు.
"కాలేజీ చదువులు పూర్తయి, ఉద్యోగం దొరికేసరికి మనకు తెల్ల వెంట్రుకలు వస్తాయేమో" అన్నాడతను.
"గ్యారంటీ...కాకపోతే తెల్ల వెంట్రుకలు వచ్చేవరకైనా ఉద్యగం వస్తుందా అనే డౌట్"
"డబ్బులు సంపాదించే సుళువైన మార్గాలుంటే బావుండు"
"గుర్రప్పందేలకు వెళ్తేసరి"
"ఆం...దానికి డబ్బులు వుండాలి...లక్కు వుండాలి"
"పోనీ లాటరీ తగిలితే?"
"తగలకపోతే?" ఎదురు ప్రశ్న.
"మంచి ఆంటీని చూసి లైన్ లో పెట్టేయాలి"
సినిమా పరిజ్ఞానమూ ఫ్లస్ నవలల్లో చదివిన తెలివితేటలు మిక్స్ చేస్తూ మరొకతను అన్నాడు.
"అవన్నీ వర్కవుట్ అయ్యే నులు కావులే" అంటూ పేపర్ తిరగేస్తూ ఓ చోట...ఆగి...యిదిగో ఈ ప్రకటనలు చూడు...వాళ్లలో ఏ ఒక్కరు దొరికినా డబ్బులు దొరకుతాయి...నలుగురు కుర్రాళ్ళలో ఓ కుర్రాడు అన్నాడు.
మిగతా ముగ్గురు ఆసక్తిగా చూసారు.
"కనబడుటలేదు, మిస్సింగ్. ఆచూకీ తెలియజేసినవారికి బహుమతి" లాంటి ప్రకటనలున్నాయి.
"రోజూ పేపర్ తిరగేస్తే యిలాంటి ప్రకటనలు బోల్డు కనిపిస్తాయి. కాని...వాళ్లు మనకు దొరకొద్దు"
"అంత ఈజీగా దొరికితే వాళ్లు అంతేసి
అమౌంట్స్ బహుమతిగా ఎందుకు ప్రకటిస్తారు. వాళ్లు వెతికి వెతికి విసిగి చివరి ప్రయత్నంగా ప్రకటిస్తారు" అన్నాడు మరొకతను.
వాళ్ల మాటలన్నీ ఓ బురఖా స్త్రీ వింటూ వుంది.
ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూచుని టీ తాగుతోంది. ఆమె పెదవులు తప్ప మరే భాగమూ కనిపించడంలేదు. బురఖా వుండడంవల్ల.
"మనకు వాళ్లు ఏ ఒక్కరు దొరికినా బావుండు" నలుగురు కుర్రాళ్ల కామెంట్స్ అలా జరుగుతూనే వున్నాయి.
రెండు ఛాయ్ రాగానే, టు బై ఫోర్ చేస్కొని తాగారు.
వాళ్లు బయటకు వెళ్తుండగా, ఆ బురఖా అమ్మాయి కొద్దిగా మొహం మీద వున్న బురఖా తొలగించింది.
ఆ కుర్రాళ్లలో ఓ కుర్రాడు క్షణకాలం ఆ ఫేస్ వైపు చూసాడు. చాల అందమైన ఫేస్ ఆమెది. ఒక్కక్షణం ఫ్లాటయిపోయేడు.
ఎంతందం...ఎంతందం...అనుకున్నాడు. నాలుగడుగులు వేసాక, అతనికి అనుమానం వచ్చి, హొటల్లో కి వచ్చి యిందాకటి పేపర్ తీసి చూసాడు.
ఒక్క క్షణం అతని గుండె వేగం పెరిగింది. 'ఐ గాటిట్' అంటూ అరిచాడు.
తన స్నేహితుడి ప్రవర్తన చూసి మిగతా ముగ్గురు విస్తుపోయారు.హొటల్ లోని కస్టమర్లు ఆ వ్యక్తి వంక వింతగా చూస్తుండిపోయారు.
"ఏమైందిరా..." స్నేహితుడ్ని అడిగారు చెబుతానుండు...అంటూ యిందాక బురఖా వేసుకున్న స్త్రీ కూచున్న ప్రదేశానికి వెళ్లి చూసేడు.
ఆ అమ్మాయి కనిపించలేదు. కంగారుగా బయటకు వెళ్లి చూసేడు.
"ఏమైందిరా...టీలో ఏమైనా కలిసిందా?" తన స్నేహితుడ్ని అడిగారు.
"మనం మిస్సయ్యాం... లక్ష రూపాయలు మిస్సయ్యాం" అతడు నిరాశగా అన్నాడు.
"అసలేమైందిరా?"
"యిందాక మనం హొటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఓ బురఖా వేసుకున్న అమ్మాయిని చూసా...ఒక్క క్షణం బురఖా తొలగించింది. ఫేస్ చూస్తే, స్టన్నింగ్ బ్యూటీ అనుకో...
"అయితే ఏంటి" మిగతా ముగ్గురు అసహనంగా అడిగారు.
"ఆ అమ్మాయి ఫోటోని యిందాక పేపర్ లో చూసా...మిస్సింగ్ గర్ల్...ఆ అమ్మాయిని పట్టిస్తే లక్ష రూపాయల బహుమతి ప్రకటించారు.
ఒక్క క్షణం మిగతా ముగ్గురి గుండెలు కొట్టుకోవడం మానేసాయి.
"నిజమా"
"ప్రామిస్"
నలుగురూ...చుట్టూ గాలించి నిరాశగా బస్ స్టాపుకు వస్తుండగా ఇందాక హొటల్ లో ఆ అమ్మాయిని చూసిన వ్యక్తి అరిచాడు. "అదిగో అమ్మాయి"అంటూ.
బురఖా వేసుకొన్న ఓ స్త్రీ ఆటోలో ఎక్కింది. ఆటో ముందుకి కదిలింది.
"మనం ఆ ఆటోని ఫాలో అవుదాం" అన్నాడతను.
"మన దగ్గర డబ్బుల్లేవ్" రెండో స్నేహితుడు అనడంతో.
"నా దగ్గర వాచీ వుంది ఫర్లేదు" అంటూ ఓ ఆటోని పిలిచి ముందుగా వెళ్తున్న ఆటోని ఫాలో చేయమనిచెప్పారు.
కాని అప్పటికే ఆ ఆటో వాళ్ల కనుచూపు మేర దాటిపోయింది.
నలుగురూ ఉసూరుమంటూ నిట్టూర్చారు. ఎలాగైనా ఆ అమ్మాయి పట్టుకోవాలనే పట్టుదల వచ్చింది.
ఆ పట్టుదల పర్యవసానం వాళ్లకి ఆ క్షణంలో తెలియదు.
* * *
గోడ గడియారం పన్నెండు గంటలు కొట్టింది. బద్ధకంగా కళ్లుతెరిచాడు పార్ధసారధి. ఎవరో తలుపు తడుతున్న శబ్దం. డోర్ బెల్ ఆగకుండా మోగుతోంది. విసుగ్గా గోడ గడియారం వైపు చూసేడు. పన్నెండు...
ఇంత అర్దరాత్రి వేళ వచ్చేదెవరు?
మెల్లగా లేచి నైట్ గౌన్ సరిచేసుకుని తలుపు తీసాడు. ఎదురుగా ఓ ఆడ పిల్ల ఇరవై,ఇరవై ఐదు మధ్య వుంటుంది వయసు. చాలా అందంగా వుంది.
ఆమె మొహంలో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది. ఆశ్చర్యంగా చూశాడు పార్ధసారధి.
'మీరు' "ముందు నన్ను లోపలికి రానివ్వండి"అంటూ అతని అంగీకారం కోసం ఎదురు చూడకుండానే లోపలికి నడించిదా అమ్మాయి.
పార్ధసారధి తలుపువేసి వచ్చాడు.
ఆ అమ్మాయి సోఫోలో కూచుని తలని రెండు చేతుల్లో పెట్టుకుని ఏడవ సాగింది.
పార్ధసారధి కిచెన్ రూములోకి వెళ్లి రెండు కప్పులో టీ తెచ్చి ఆమెకో కప్పు యిచ్చి 'తీసుకోండి...ముందు రిలాక్సవ్వండి' అన్నాడు.
ఆ అమ్మాయి మౌనంగా టీ సిప్ చేస్తోంది. ఆమె చేతుల్లో వణుకు సృష్టంగా కనిపిస్తోంది. తెల్లటి చాయ్ ఆమెది.తీర్చిదిద్దినట్లు వుందామె ఫిజిక్.
టీకప్ టీపాయ్ మీద పెట్టి పార్ధసారధి వైపు చూసింది.
పార్ధసారధి తను తాగిన టీకప్పను టీపాయ్ మీద పెట్టి "ఇప్పుడు చెప్పండి నాపేరు పార్ధసారధి...సర్జన్ ని...మీకొచ్చిన భయం ఏమిలేదు"అంటూ అడిగాడు.
"నా పేరు చాందిని. యింట్లో నుంచి పారిపోయి వచ్చాను"మెల్లిగా చెప్పిందా అమ్మాయి.
"ఎవరినైనా ప్రేమించారా?" అడిగాడు పార్ధసారధి అనుమానంగా. సాధారణంగా అలాంటి పరిస్దితుల్లోనే యింట్లో చెప్పకుండా బయటకు వచ్చేస్తారని అతని నమ్మకం.
"కాదు...మా అంకుల్ నన్ను చంపేస్తాడని భయమేసి"
"మీ అంకుల్ మిమ్మల్నేందుకు చంపుతాడు? మీకు పేరెంట్స్ లేరా?"
"ఊహూ" తల అడ్డంగా అప్పచెప్పింది. "మా మమ్మీ డాడి యాక్సిడెంటులో చాలాకాలం క్రిందటే చనిపోయారు. మా అంకుల్ నా బాధ్యత తీసుకున్నారు. నేను మేజర్ ని అవుతాను వచ్చే నెలలో...అందుకని నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు" చెప్పింది చాందిని.
"నాకు తెలిసినా పోలీసాఫీసర్ వున్నాడు. అతని దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను"ధైర్యం చెప్పాడు పార్ధసారధి.
"వద్దొద్దు...అంత పని చేయొద్దు మా అంకుల్ కు చాలా మంది పోలీసాఫీ సర్లతో పరిచయం వుంది"ఆమె భయంతో అంది.
