Previous Page Next Page 
వైరం పేజి 35


    అరుణని మర్చిపోవాలి!
    అందుకోసం ఇండియాని వదిలేయాలి. ఆ పిచ్చిలో నుంచి బయట పడడానికి ప్రపంచమంతా పిచ్చెత్తినట్లుగా తిరగాలి! ఎట్లా అయినా సరే తను మళ్ళీ మామూలు మనిషిగా మారాలి.
    '' 'మిస్టరీ పాయింట్' అనేది శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో వున్న ఒక ప్రైవేట్ ఆస్తి. కొండచరియ మీద వున్నట్లుగా ఏటవాలుగా వుండే స్థలం. దాని మధ్యలో ఒక నిర్మాణం. అందులోకి వెళ్ళి చూడడానికి టిక్కెట్టు.
    లోపలికి వెళ్ళీ వెళ్ళగానే, ఇంక కన్ ఫ్యూజన్ మొదలవుతుంది. తల తిరిగిపోతున్నట్లుగా, ఒళ్ళు తూలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అసలు అక్కడి ఫ్లోరింగే ఏటవాలుగా వుంటుంది. అక్కడే, ఒక కిటికీకి ఆనించి, నేలని తాకేలా పెట్టిన ఒక కర్ర.
    ఏటవాలుగా వున్న ఆ కర్రమీద కనక ఒక బంతిని పెడితే -
    అద్భుతం!
    బంతి కిందికి జారకుండా, పైకే వెళ్ళిపోతుంది!
    ఎందుకనీ?
    ఎందుకనో అంతుబట్టని విశేషం అది!
    ఏదో తెలియని మిస్టరీతో బాటుగా, జనాలకి కాస్త భ్రమ కలిగించే ప్రయత్నం కూడా అక్కడ కొంత జరుగుతూనే వుంటుందని అనిపిస్తుంది.
    ఇల్యూషన్!
    కానీ-
    అక్కడ సైన్సుకి సంబంధించిన ఏదో మిస్టరీ ఉండే ఉండాలని అనిపించడం కూడా నిజమే!
    ఏటవాలుగా ఉన్న కర్రమీద బంతి వుంచితే, అది కిందికి జారకుండా పైకి పోవడమా?
    అక్కడి అయస్కాంత క్షేత్రంలో అంతుబట్టని విశేషం వుందనీ, అక్కడి ఆ కాస్తమేర భూమిలో గురుత్వాకర్షణశక్తి సిద్దాంతం తిరగబడి ఉండి వుండాలనీ ఒక వూహ!
    కాసేపటి తర్వాత, తల తిరుగుతున్న ఫీలింగు కొద్దిగా తగ్గింది సూరజ్ కి. పెదాల మీదికి సంతోషంలేని నవ్వు వచ్చింది. చివరికి, భూమికి ఉన్న అయస్కాంత శక్తి కూడా ఒక్కొక్కచోట పనిచేయదన్నమాట!
    కానీ -
    అరుణ తాలూకు ఆకర్షణో?
    అరుణని వదిలి ఇంత దూరానికి వచ్చేసినా కూడా, ఆమె ఆకర్షణ శక్తి ఇంకా ఇంత బలంగా తనమీద పనిచేస్తోందంటే...దూరం పెరిగిన కొద్దీ అరుణ పట్ల ఆకర్షణ కూడా మరింతగా పెరిగిపోతోందా?
    కాలమూ - దూరమూ ప్రేమ తీవ్రతని తగ్గిస్తాయని అరుణ తనతో చెప్పిన మాటలు అసత్యాలే అవుతాయా?
    అందరూ నమ్మిన సిద్ధాంతాలు తన విషయంలో రాద్ధాంతాలుగా మారుతున్నాయా?
    ఇక్కడ, ఈ 'మిస్టరీ పాయింట్' లో సిద్ధాంతాలలాగా?
    ఎంతో అయోమయ స్థితిలో ఆ మిస్టరీ పాయింట్ లోకి అడుగుపెట్టిన సూరజ్ మరింతగా కన్ ఫ్యూజ్ అయిపోయి బయటికి వచ్చాడు.
    ఎలా? ఎలా? ఎలా?
    ఎక్కడికి వెళ్తే, ఏం చేస్తే, తనకి మనశ్శాంతి దొరుకుతుందీ?
    ఏం కొంటే? ఏం తింటే? ఏం తాగితే?
    దేవదాసులా లిక్కర్?
    పాప్ సింగర్స్ లా డ్రగ్స్?
    ఎక్కడుంది సుఖం?
    అరుణ జ్ఞాపకాలని మరిపించేటంత సౌఖ్యం?
    తన తండ్రి ధీరేంద్రషా 'ది గ్రేట్' కి డబ్బులోనే సుఖం కనబడుతుంది.
    పైసాలోనే పరమాత్మ ప్రత్యక్షమవుతాడు!
    డబ్బు ఇచ్చే కిక్కు ఈ లోకంలో ఇంకేదీ ఇవ్వలేదని ఆయన వాక్కు!
    ఆ కిక్కేమిటో తెలుసుకోవడానికన్నా తను ఓ ప్రయత్నం చేసి చూడకూడదూ?
    అది మొదలు!
    ఇంక ఆనకట్టకు గండి పడినట్లుగా అడ్డూ అదుపూ లేకుండా డబ్బు విచ్చలవిడిగా ఖర్చుచేయడం మొదలెట్టాడు సూరజ్.
    తండ్రి గడించిన, గడిస్తున్న కోటానుకోట్లు వున్నాయి. తను అవి ఖర్చుపెట్టుకుంటూ ఉంటేనే గదా ఆయనకు గొప్ప!
    కంటికి కనబడ్డవల్లా కొనడం మొదలెట్టాడు సూరజ్.
    అవసరం కోసం కాదు -
    జస్ట్ ఫర్ కిక్స్! థ్రిల్లు కోసం! డబ్బు తగలెయ్యాలి!
    అంతే!
    ఖరీదైన కార్లు కొన్నాడు. ఒకటీ రెండూ కార్లు కాదు - గేర్లు మార్చినట్లు కార్లని మార్చాడు.
    రెండుకోట్లు పెట్టి ఆర్నేజ్.టీ-
    మూడున్నర కోట్లు పెట్టి బుగాట్టీ వేరాన్ -
    నాలుగుకోట్లు పెట్టి రోల్స్ రాయిస్ వారి బెంట్లే -
    బుగాట్టీ కారు స్పీడు గంటకి ఐదొందల కిలోమీటర్లు!
    హైవే మీద హయ్యస్ట్ స్పీడ్ తో వెళ్ళినా 'కిక్' రాలేదు.
    ఇంకా స్పీడు కావాలి! అరుణ జ్ఞాపకాలకి దూరంగా వెళ్ళిపోగలిగినంత స్పీడు!
    ముప్ఫయ్ లక్షలు పెట్టి ఒక పాతికగంటల పాటు తను ఒక్కడే పాసెంజర్ గా - ఒక ప్రైవేట్ జెట్ లో ప్రయాణం చేశాడు. కిక్ రాలేదు.
    ముప్ఫయ్ లక్షలు పెట్టి 'జెనిత్ క్రోనోమాస్టర్ ఎక్స్ ఎక్స్ టి టౌర్ బిల్లాన్' వాచ్ కొన్నాడు.
    ఆ వాఛీ భూమ్యాకర్షణశక్తిని కౌంటర్ బాలెన్స్ చేస్తూ చాలా కరెక్టు టైము చూపిస్తుందిట!
    కానీ - అది అరుణ ఆకర్షణ శక్తిని ఎదుర్కోగలదా? నో వే!
    సరే - ఐదు లక్షలు పెట్టి మౌంట్ బ్లాంక్ పెన్ను, ముప్ఫయ్ వేలు పెట్టి హ్యూగోబాస్ షూస్ -
    కనీసం ఈ ఖరీదయిన షూస్ అన్నా తనని సరైన దారిలో నడిపిస్తాయా?
    అతను నడిచిన దారి పక్క రాష్ట్రం పట్టింది.
    అక్కడే వుంది 'లాస్ వేగాస్' నగరం.
    ఒకే ఒక్క గంటలో కోటీశ్వరులని కూటికి లేనివాళ్ళుగా, బిక్షాధికారులని లక్షాధికారులుగా మార్చేయగల మహిమ ఉన్న మహా మాయా నగరం!
    లాస్ వేగాస్!
    వేగంగా డబ్బు లాస్ అయిపోయే నగరం! లాస్ వేగాస్!
    జూదరులకి జన్మభూమి లాంటిది!
    అట్లాంటి లాస్ వేగాస్ లో వున్న ప్రపంచ ప్రసిద్ధి పొందిన 'సీజర్స్ పాలెస్' హోటల్లోకి తన కారు పోనిచ్చాడు సూరజ్!
    మూడున్నర కోట్లు ఖరీదు చేసే బుగాట్టి వెరాన్ కారులో నుంచి, మూడున్నర లక్షల విలువ చేసే ఎర్ మెజిలో జెగ్ నా సూటు వేసుకుని దిగుతున్న సూరజ్ ని చూసి, అల్లంత దూరం నుంచే డబ్బు 'వాసన' పసిగట్టాడు - ఆ హోటల్ వెయిటర్ లలో పెద్ద అయిన 'కేప్టెన్' అనబడే వాంగ్.
    'ఇతను రోజుకి రెండున్నర లక్షల రెంటు వుండే రూములో ఉండబోయేటట్లే వున్నాడు' అనుకున్నాడు వాంగ్.
    వెంటనే పరుగులాంటి నడకలో కారు దగ్గరికి వచ్చేసి, అతి మర్యాదగా అభివాదం చేసి, అడుగడుగునా స్వాగతం పలుకుతున్నట్లుగా సాదరంగా లోపలికి తీసుకెళ్ళాడు.
    సూరజ్ కోసం ఒక మంచి సీటు చూపించాడు కేప్టెన్ వాంగ్. అతను చిటికెలు వేయగానే, చిటికెలో ఒక మద్యం సీసా తెచ్చిపెట్టాడు ఒక వెయిటరు.
    వందరకాల పాత బ్రాందీలు కలిపి చేసిన ఆ మహత్తరమైన మద్యం పేరు 'హోన్నెస్సీ ఎక్స్ ఓ కోనక్'. ఖరీదు తొమ్మిదివేలు!
    "విత్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఆఫ్ ద హవుస్ సర్!" అన్నాడు కేప్టెన్ వాంగ్.
    కోట్లు ఖర్చుపెట్టేరకంలాగా వున్నాడు ఈ కుర్రాడు. ఇతని మెప్పుకోసం ఖరీదయిన సారా సీసాను ఉచితంగా ఇవ్వడం ఉచితమైన పనే! వాళ్ళకి ఓ లెఖ్ఖలోనిది కాదు.
    పొరబాటు!
    ఇదీ లెఖ్ఖ వేసుకుని చేస్తున్న తంతే! పెట్టిన ఖర్చుని లాభంగా మార్చుకోవచ్చు.
    "ఇంకేమి కావాలి సర్?" అని అడిగాడు కెప్టెన్ వాంగ్ - వినమ్రంగా.
    "నాకు అరుణ కావాలి!" అంటూ చటుక్కున తన టేబుల్ కి ఆనించి వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టాడు సూరజ్.  
    చూస్తూ వుండిపోయాడు వాంగ్.
    అట్లాంటి సీన్లు చూడడం అతనికి అలవాటే!
    ఎవరి కష్టాలు వాళ్ళవీ!
    డబ్బు లేని వాళ్ళ కష్టాలు ఒకరకం!
    డబ్బున్నవాళ్ళ కష్టాలు ఇంకోరకం!
    ఒక విధంగా చూస్తే, డబ్బులేని వాళ్ళ కష్టాలే సింపుల్ గా వుంటాయేమో!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS