Previous Page Next Page 
వైరం పేజి 34


    "రానియ్యవే చూద్దాం!" అంది భావన.
    "ఏమిటి చూసేది!" అంటూ విసురుగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది అరుణ.
    "ఇప్పుడే వస్తాను ఆంటీ!" అని శారదతో చెప్పి, అరుణ వెంటే వెళ్ళింది భావన.
    ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఒక స్పెషల్ మెస్సెంజరు కాచుకుని వున్నాడు.
    "చందన మేడమ్ దగ్గర నుంచి అరుణకి ఒక స్పెషల్ గిఫ్టు!" అన్నాడు. కొంతమంది నౌఖర్లు యజమానులకంటే కూడా పొగరుగా ఉంటారు. ఇతను అట్లాంటి రకమేలాగా వున్నాడు.
    "చందన మేడమ్ ఎవరు?" అంది భావన, అరుణ తరపున.
    "చందన మేడమ్ తెలియదా? మిసెస్ ధీరేంద్ర షా...సూరజ్ సారుకి తల్లి" అన్నాడు అతను.
    "ఆమె ఎవరో నాకు తెలియదు. గిఫ్టు అవసరం లేదు" అంది అరుణ.
    "ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి" అన్నాడు అతను చాలా మిస్టీరియస్ గా.
    అరుణ వారించేలోగానే ప్యాకెట్ ని ఓపెన్ చేసింది భావన.
    కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉన్న వజ్రం ఒకటి మెరుస్తూ కనబడింది అందులో.
    ప్యాకెట్ లో వున్న రెండో అరలో ఒక బుల్లెట్!
    "వజ్రం తీసుకుని నా కొడుకు వెంటబడటం మానేస్తావో, బుల్లెట్ తీసుకుని చావు నీ వెంటబడేటట్లుగా చేసుకుంటావో నీ ఇష్టం! అని చెప్పమన్నారు చందనా మేడమ్!" అని ఇంకా అన్నాడు అతను. "ప్రతి ఫైనాన్షియల్ ఎంపైర్ వెనకా ఒక నేరచరిత్ర ఉంటుందని నానుడి వినలేదా? చందనా మేడమ్ వాళ్ళది చాలా పెద్ద ఫైనాన్షియల్ ఎంపైర్! నేరాలూ, ఘోరాలూ చేయడం, చేయించడం వాళ్ళకి కొత్తకాదు."
    "నా గుండె వజ్రం! నా ఒళ్ళు బుల్లెట్ ప్రూఫ్! వెళ్ళి చెప్పు!" అంది అరుణ ఆగ్రహంగా.
    పేపర్లు చదివిన ఆవేశం అంతా ఆగ్రహంగా అలా బయటపడిపోతోంది.
    అతను అరుణ వైపు చులకనగా చూసి, బాక్సు తీసుకుని వెళ్ళిపోయాడు. చటుక్కున భావన వైపు తిరిగింది అరుణ. "మళ్ళీ చెబుతున్నా! నన్ను ఈ రొంపిలోకి లాగింది నువ్వే! నన్ను బయటికి లాగడం నీ బాధ్యతే!" అంది కోపంగా.
    సాలోచనగా అంది భావన.
    "నిజమే. మీ ఇద్దరూ ఒకటైతే బావుంటుందనుకున్నాను గానీ కథ ఇన్ని మలుపులు తిరిగి బాంబ్ బ్లాస్టులూ, బెదిరింపులు దాకా వస్తుందనుకోలేదు అరుణా! ఐ యామ్ సో సారీ!"
    "దేశం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో అని మనం వర్రీ అవుతుంటే, రామాయణంలో పిడకల వేటలా మధ్యలో ఈ ప్రేమాయణం ఏమిటీ?" అంది అరుణ మళ్ళీ. "సరే! నేను చెప్పినట్లు ఒక ఉత్తరం రాయి!" అంది భావన.
    "ప్రేమలేఖా?"
    "కాదులేవే! ఇంక ఈ ఛాప్టరు ఇంతటితో క్లోజ్ చేసేద్దాం!"
    భావన పెన్నూ పేపరూ అందిస్తే, అయిష్టంగానే రాయడం మొదలెట్టింది అరుణ.

                                    *    *    *    *

    "అదిగో ద్వారక..." అన్నట్లుగా, అదిగో అక్కడే జూబ్లీహిల్సు! అందులో అరుణ ఇల్లు!
    ఆ ఇంటికి ఇంపైన పేరు. "కళ"
    'కళ' అనే ఆ పేరుని ఎంతో ఇష్టంగా ఇంటికి పెట్టుకున్నాడుట అరుణా వాళ్ళ నాన్న. ఆయన ఎంతో గొప్ప కళాకారుడట. భావన చెప్పింది.
    ఇంటిముందు ఆగి, పేరు రాసి వున్న ఆ ప్లేట్ వైపు చూశాడు సూరజ్.
    తెలుగులో 'కళ' అని రాసి వుంది గానీ, ఇంకోవైపున అదే ఇంగ్లీషు అక్షరాలలో రాసి వున్నది చదివితే 'కెఏ ఎల్ ఏ' కాస్తా 'కల'గా స్ఫురిస్తోంది.
    అచ్చం ఆయన కేసులాగే.
    కళల కోసం కలలన్నీ కల్లలే అయ్యాయట. అలా ఎంతమంది కళాకారులకి కాలేదూ! ఆ విషయం కూడా భావనే చెప్పింది.
    అప్పుడు పడింది అతని చూపు -
    ఆ గేటుకి వేసివున్న బోదురుకప్పు లాంటి తాళం మీద!
    ఈ ఇంటి ఈశాన్యం మూలలో ఉన్న చిన్న కొలనులోని బోదురుకప్ప అతన్ని అపహాస్యం చేస్తున్నట్టుగా బెకబెకలాడింది.
    ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది సూరజ్ ని.
    ఏమన్నాడూ ఆ పారసీక కవి.
    "ఈ ప్రపంచంలోకెల్లా అతి దిగులు కలిగించే ప్రదేశం ఏదీ? ప్రియురాలు కనబడని ప్రియురాలి ఇల్లే" అని కదా!
    వెనకాతల అడుగుల చప్పుడు వినబడితే ఆశతో గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు సూరజ్.
    అక్కడ ఉన్నది అరుణ కాదు.
    భావన!
    ఆమె చేతిలో ఒక కవరు.
    "డాక్టరుగారింటికి వచ్చాను. ఇంతలో నువ్వు ఇక్కడికి రావడం కనబడింది. ఈ ఉత్తరం నీకు ఇవ్వమని అరుణ నాకు ఇచ్చి వెళ్ళింది" అంది భావన. "వెళ్ళిందా? ఎక్కడికి?" అన్నాడు సూరజ్ ఆత్రుతగా.
    తెలియదు. తెలుసుకోవాలనిపించలేదు."
    వణుకుతున్న చేతులతో కవరు చింపి, ఉత్తరం చదివాడు సూరజ్.
    "నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని నాకు తెలుసు. మాట నిలకడ లేని మనుషులకి మంచి చెప్పినా అర్థంకాదు. అందుకని ఈసారి నేనే వెళ్ళిపోతున్నాను. మూడు ముక్కల్లో చెప్పేయాలంటే -
    'దిస్...ఈజ్...ద..ఎండ్!'
    - అరుణ.
    "అరుణ అందులో ఏమి రాసి వుంటుందో నాకు చదవకుండానే తెలుసు సూరజ్! అది ఉత్త మొండి ఘటం! కొరకరాని కొయ్య. నువ్వింక దాన్ని మర్చిపోవడం ఉత్త మోత్తమం సూరజ్" అంది భావన సిన్సియర్ గా.
    నిశ్చేష్టుడయి నిలబడి వున్నాడు సూరజ్.
    మళ్ళీ భావనే చెప్పింది.
    "గుడి రాతితో కట్టింది కావచ్చును. గుళ్ళోని దేవతా మూర్తి రాతి విగ్రహం కావచ్చును. కానీ, ఆ దేవతామూర్తి కూడా రాతిదే అయితే ఇంక చెప్పేది ఏముంది సూరజ్? అరుణ కరగదు. నువ్వు అమెరికా వెళ్ళి బాగుపడడమే నా కోరిక! నా మాట విను సూరజ్!" అంది ఎంతో అభ్యర్థనా పూర్వకంగా.

                                     *    *    *    *

    "పాపం! అతనికి నువ్వంటే చాలా ఇష్టంగానే ఉన్నట్లుందే అరుణా!" అంది ఆమె తల్లి జాహ్నవి.
    సూరజ్ ఆ ఉత్తరం చదువుతున్న టైంలో తల్లీ కూతుళ్ళు ఇద్దరూ పక్కనే వున్న డాక్టర్ వెంకయ్యగారి ఇంటి కిటికీలో నుంచి అతన్ని చూస్తున్నారు.
    "అతనికిష్టం కావచ్చుగానీ నాకు కష్టం!" అంది అరుణ ఖండితంగా.
    ఇంకేమీ మాట్లాడలేదు జాహ్నవి.

                                     *    *    *    *

    మిస్టరీ పాయింట్ :
    శాన్ ఫ్రాన్సిస్కో నగరం :
    అమెరికా :
    అక్కడ నిలబడి ఉంటే తల తిరిగిపోతున్నట్లుగా అనిపిస్తోంది సూరజ్ కి.
    నిజంగానే!
    అమెరికాలో ఉన్న అతిపెద్ద నగరాలలో శాన్ ఫ్రాన్సిస్కో ఒకటి. పశ్చిమతీరాన వుంటుంది.
    అనేకానేకమైన మహా నగరాలు ఉన్న అమెరికా దేశం ఎంత పెద్దదంటే, దేశపు తూర్పుతీరాన ఉన్న న్యూయార్క్, బోస్టన్ లాంటి సిటీలనుంచి పశ్చిమతీరాన ఉన్న షాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజలిస్ లాంటి నగరాలకు రావాలంటే ఎనిమిది తొమ్మిది గంటల ప్రయాణం -
    విమానంలో వస్తే!
    హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎయిర్ జర్నీ దాదాపు రెండుగంటలు పడుతుందనుకుంటే, ఇంక ఈ దూరాన్ని ఊహించుకోవచ్చును.
    పోతే- అమెరికా దేశపు వైశాల్యం ఇండియా కంటే, కొన్ని రెట్లు ఎక్కువ!
    జనాభానేమో కొన్ని రెట్లు తక్కువ! మన హైదరాబాద్ నగరపు జనాభా ఏ డెబ్బయ్ లక్షల్లో ఉంటే, అక్కడి మాసాఛూసెట్స్ లాంటి రాష్ట్రపు మొత్తం జనాభానే అరవై లక్షలు! అంతే!
    అందుకే అందరికీ అంత చక్కటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కాబోలు!
    ఆ రోజున అరుణ, తనతో 'దిస్ ఈజ్ ద ఎండ్!' అని ఖండితంగా చెప్పేసి, తన ప్రేమని సజీవ సమాధి చేసేశాక, ఇంక ఆ తర్వాత తను ఇండియాలోని హైదరాబాద్ నుంచి అమెరికాలోని తూర్పుతీరానికి ఎలా చేరుకున్నాడో, అక్కడ నుంచి ఎట్లా ఈ పశ్చిమతీరాన ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి వచ్చిపడ్డాడో, తనకే తెలియని స్థితిలో వున్నాడు సూరజ్.
    తను అసలు ఈ 'మిస్టరీ పాయింట్' కి ఎందుకు వచ్చాడూ? ఎలా వచ్చాడూ?
    ఎలా వచ్చాడో అతనికే గుర్తులేదుగానీ, ఎందుకు వచ్చాడన్నదానికి మాత్రం అసమగ్రమైన సమాధానం ఒకటి వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS