మానవుడా!
రాశి చక్రగతులలో
రాత్రిందివాల పరిణామాలలో,
బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో,
కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన
ప్రభవం పొందిన వాడా!
మానవుడా! మానవుడా!
సౌందర్యం ఆరాధించేవాడా!
కవితలో, శిల్పంలో-
పరుగులో, పుష్పంలో-
మెరుపులో, మేఘంలో
సౌందర్యం ఆరాధించే వాడా!
జీవించేవాడా!
సుఖించేవాడా! దుఃఖించేవాడా!
విహ్వలుడా! వీరుడా!
ప్రేమించేవాడా!
వియోగీ! యోగీ! భోగీ! త్యాగీ!
ఆలోచనలు పోయేవాడా!
అనునిత్యం అన్వేషించేవాడా!
చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా
ఆకసంలో, సముద్రంలో
అన్వేషించేవాడా!
అశాంతుడా! పరాజయం ఎరుగనివాడా!
ఊర్ధ్వదృష్టీ! మహామహుడా!
మహాప్రయాణికుడా!
మానవుడా! మానవుడా!
కాట్లాడుకునేవాడా!
ఓర్వలేనివాడా!
సంకుచిత స్వభావుడా!
అయ్యో! మానవుడా!
ఓహో! మానవుడా!
ధర్మస్థాపనకు యుద్ధం చేసేవాడా!
అన్యాయం భరించలేని వాడా!
ఆదర్శజీవీ! మహాత్మా! మానవుడా!
ఆసియా, అమెరికా, యూరప్,
ఆఫ్రికా, ఆస్ట్రేలియాలలో
సముద్ర ద్వీపాలలో,
ధ్రువ ప్రాంతాలలో
పట్టణాలలో, పల్లెలలో,
ధనివో, దరిద్రుడవో,
వృద్ధుడవో, యువకుడవో,
తెల్లని, నల్లని, ఎర్రని, పచ్చని రంగో,
బలవంతుడివో, బలజీనుడివో
బ్రదికేవాడా! పాడేవాడా!
మానవుడా! మానవుడా!
అవిభక్తకుటుంబీ!
ఏక రక్త బంధూ!
మానవుడా! మానవుడా!
అనేక భాషలు మాట్లాడేవాడా!
అనేక స్థలాలలో తిరిగేవాడా!
అనేక కాంతులు వెదజల్లేవాడా
సహృదయా! సదయా! సన్మార్గగామీ!
సముద్రాలు దాటేవాడా
ఎడారులూ, పర్వతాలూ గడచేవాడా!
ఆకాశాలను వెదికే వాడా!
నక్షత్రాలను శోధించే వాడా!
పిపాసీ! తపస్వీ!
వంతెనలు నిర్మించినవాడా!
వైద్యశాలలు, వస్తుప్రదర్శనశాలలు,
గ్రంథాగారాలు, పరుశ్రమాలయాలు,
ధూమశకటాలూ, నౌకలూ, విమానాలూ
నిర్మించినవాడా!
దూరదృష్టి, దూరశ్రవణశక్తులు
సాధించినవాడా!
మానవుడా! మానవుడా!
రసైకజీవీ!
కవీ! నటుడా! శిల్పాచార్యా!
గానకళాకోవిదుడా! వేదాంతీ!
విజ్ఞానధనీ! భావధునీ
దుఃఖమయీ! దయాళూ! పరదుఃఖాసహనశీలీ!
చీమనుకూడ చంపడానికి
చేతులురాని వాడా!
బుద్ధమూర్తీ!
జీసస!
సంఘపశూ! శ్రమైకజీవీ!
శరీర పరీవృతుడా!
ఘర్మవర్ష పయోదుడా!
రక్తకణ సమష్టి కుటుంబీ!
కష్టజీవీ! కార్మికుడా! మానవుడా
కూలీ! కూలీ! రైతూ!
గుడిసెలలో బ్రదికేవాడా!
గంజినీళ్లు తాగి కాలం గడిపేవాడా!
కడుపెడు సంతానం కలిగినవాడా!
ఆకలికన్నూ! మానవుడా!
తిరగబడేవాడా! ప్రశ్నించేవాడా!
అన్యాయాలకు ఆహుతి కావడానికైనా
జంకని వాడా?
ఖైదీ!
రౌడీ!
ఖూనీకోర్!
బేబీ!
మానవుడా! మానవుడా!
- 1938 (?)
* * *
