"ఇంగ్లీష్ సినిమాకీ పేరుంటుంది"
"ఏమో ఇంగ్లీష్ ఫిల్మ్ బయట మస్తు బోర్డులున్నవి స్కైలైన్ లో. లోనకి పోయి కూర్చున్న. రెండు మూడు సినిమాల లెక్కన అనిపించింది. నీకు తెలుసుకదా నాకు ఇంగ్లీష్ ఫిలిమ్స్ అర్థంకావని"
"చాలా మందికి అర్థం కావులే. రేగిచెట్టు కింద ముసలమ్మలు_స్టైలిష్ ముసలమ్మలు ముసలబ్బీలు_" అని పక్కకి నడిచాడు శ్రీపతి.
శ్రీపతి నడుస్తూ_
రాత్రి, పగలు_రాత్రి, పగలు, రాత్రి__ శ్రీపతి నడుస్తూ చూస్తూ చూస్తూ నడుస్తూ గమనిస్తూ_
యీ నగరంలో ఆ నగరంలో, యీ పట్టణంలో ఆ పట్టణంలో యీ పల్లెలో ఆ పల్లెలో, ఈ వాడలో ఆ వాడలో, యీ వీధిలో ఆ వీధిలో, వాజ్ పేయీ వాగ్ధాటి.
యీ రైలు కార్మిక వాడలో ఆ ప్యాక్టరీ కార్మిక పేటలో, యీ నగర వుద్యోగ సమాఖ్యలో ఆ నగర శ్రామికుల సమావేశంలో, జార్జిఫెర్నాం డెజ్ గర్జింపు.
యీ వీధిలో ఆ వీధిలో, రాజ్ నారాయణ్ వెకిలికూతలు.
యీ వేదికమీదా ఆ నిలయంలోనూ, మొరార్జీ ములుకు పలుకులు.
యీ బోటు క్లబ్బులో, ఆ నీటు క్లబ్బులో పీలూమోడి తోక చరుపులు.
ఆ సముద్రతీరాన యీ నది ఒడ్డునా లచ్చన్న దూషణ భాషణ.
యీ విశాఖలో ఆ శాఖలో, తెన్నేటి అభిభాషణ బిగింపు.
ఆ మహల్లో యీ భవనంలో ,చరణ్ సింగ్ సకిలింపు. యీ రాళ్ళలో, ఆ నదుల్లో సంజీవరెడ్డి కూరుకూతలు యిటూ అటూ అన్నిచోట్లా, సుందరయ్య మాటల కత్తికోత. ఆ నగరంలో యీ నగరంలో చాలా పరిహాసపు వివరణ తీర్పు.
అజ్ఞాత సమర ప్రాంగణాల నుంచి, చారుమజుందార్ కానూసన్యాల్ పట్నాయక్ సీతారామయ్యల సిగల తుపాకీ గుళ్ళ సైగలు.
అటు వాషింగ్టన్ లో దరహాసం. యిటు పీకింగ్ లో పరిహాసం. అటు లండన్ లో చిరుహాసం. యిటు మాస్కోలో హీనహాసం.
హిమాలయాల లోతుల నుంచి వుత్తర భారతం అంతటా చివరి దక్షిణాదికీ వ్యాపిస్తున్న జయప్రకాష్ వృద్ధ శుద్ధ శక్తి.
జన సమూహాలు :- Peoplescape-turbulent marching peoplescape
యీ సువిశాల భారతావనిలో అడుగడుగుకీ ఒక గొంతు_యేదో ఒకటి పలుకుతున్న కోటానుకోట్ల గొంతులు.
యీ సముద్రాల్లో నీళ్ళింకిపోతాయా, యీ పర్వతాలు భూమిలోకి కుంగిపోతాయా, యీ మహా భవనాల పునాదులు కదులుతాయా, యీ రైళ్ళు యీ విమానాలు యీ బస్సులు యీ కార్లు, అన్ని వాహనాలూ కదలకుండా నిలిచిపోతాయా, యీ కర్మాగారాలు మూతపడతాయా_ అన్నట్లుగా దేశం అంతటా సంచలనమూ అలజడీ ఆందోళనా పెనుగాలీ మహాగ్నీ__
ఒక్క పక్షం రోజులు
సుప్రీంకోర్టు వారిచ్చిన కండిషనల్ స్టేనెత్తి మంచి ఇందిరేయులతో నిండివున్న పార్లమెంటు మద్దతులోంచి_ మంత్రివర్గ సమావేశ మర్యాద కూడా లేకుండా అర్దరాత్రివేళ దేశ రాష్ట్రపతి కలంలోంచి వెలువడిందీ_అంతరంగిక అలజడులు కారణంగా దేశ భద్రతకి ముప్పు వాటిల్లి నందున అత్యవసర పరిస్థితి__ప్రకటన. రోజో రెండు రోజులో నెలో రెండు నెలలో కాదు. ఏకంగా యేడాది పాటు_ యెందుకు యేమిటి అని నోరెత్తి అడిగేందుకు వీల్లేకుండా పెదాలు కుట్టేసుకోమని మీసా కొసమెరుపులతో__రోషాలకీ, మీసాలకి హక్కు లేదంటూ.
వెనువెంటనే జైళ్ళపాలవుతున్న మహామహులే కాక యెందరెందరో ప్రజలు.
వానొచ్చి వెలిసినట్లుగా, అగ్ని కురిసి చల్లారినట్లుగా_ ఎమర్జన్సీ ఇనప గంప కింద కోటానుకోట్ల కోళ్ళు. కోళ్ళా మనుషులా?
వుంటుందో ఒరిగిపోతుందో ననుకున్న రధం, యిరవై సూత్రాల గుర్రాలతో కదులుతూంది.
యీ రధచక్రాల కింద యీ రధ గర్భం లోపల యీ రధం మట్టున యీ రథంపైన....యేమేం జరుగుతున్నదీ_
యీ గాంధీగారి దేశంలో, గాంధారి కొడుకులు పరిపాలించినా, పై గాంధీపతి చెరసాలించినా_ గాంధీగారి సూక్తి_ మూడు కోతుల సూక్తి పాటించకపోతే, పాపమో పుణ్యమో తెలియదుగానీ ఇప్పుడైతే ముప్పు. చెడు కనొద్దు. చెడు వినొద్దు. చెడు అనొద్దు అంటే, చెడు వుందని తాత్పర్యమే అయినా, ఆ మాటా కూడదు యిప్పుడైతే ముప్పు. చూస్తూ చూస్తూ పీకలమీదకి తెచ్చుకోరు బతకాల్సిన వాళ్ళు.
అందుకే__
ఆరెస్సెస్ తో పాటు యిరవై సంస్థల నిషేధం. జైళ్ళలోని వాళ్ళని కుళ్ళబొడుసున్నారో కర్పూర హారతులిస్తున్నారో తెలుసుకోవటానికీ. తెలిసున్నా అవటానికి లేని స్థితి. అరెస్టయ్యి విడిది విహారాలు చేస్తున్న స్మగ్లర్లు. నక్సలిట్ల వదల పోలీసు కథలు. నక్సలైట్ ఆయుధాల సాహిత్య కైవశం, ప్రభుత్వాధికారుల మహదవకాశపు ఆగడాలు, నడుస్తున్న రైళ్ళు బస్సులు విమానాలు. తెరుచుకున్న బళ్ళు, పెళ్ళిళ్ళు శోభనాలు విందులు వినోదాలు క్లబ్బులు వింతలు విలాసాలు విహారాలు మానభంగాలు ప్రాణభంగాలు__
ఖేల్ ఖేల్ మేలు, చీకటి వెలుగులు, ముత్యాల ముగ్గులు, ఆక్రమణలు, జేబుదొంగలు, అమానుష్ లు, లక్ష్మణరేఖలు__
యీ పందొమ్మిది వందల డెబ్బయ్ ఐదు ఆగష్టు ఏడున ఇందిరా పార్లమెంటు, నభూతో న భవిష్యతి లాంటి యెన్నికల సవరణల నొకదాన్ని ప్రవేశపెట్టి సాధించిన పరమార్థం. ప్రధాని పదవీ ఎన్నికా, మురికి కోర్టులు తాకరానంత పవిత్రమైందీ అతీతమైందీ అని. యీ పుణ్యమా అని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి స్పీకర్ లకి కూడా ఆ మహాభోగం లభించింది.
జాతీయ గీతం, జాతీయ జెండా, జాతీయ పక్షి, జాతీయ మృగం, జాతీయ చవట, జాతీయ మాత, జాతీయ వేశ్య_
యీ మహేంద్ర గీచిన లక్ష్మణరేఖ దాటిన మీసా సీత గతి అధోగతేనని__
ప్రపంచంలోని యీ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని, అతిపెద్ద న్యాయాలయం, ఇందిరా ప్రియదర్శినీ నెహ్రూగాంధీగారి రాయ్ బరేలీ నియోజకవర్గ ఎన్నిక సక్రమమైనదేనన్న ప్రత్యేకపు పై తీర్పు వార్త మోసుకొచ్చిన యీ పందొమ్మిది వందల డబ్బయ్ ఐదు నవంబర్ యెనిమిదో తేదీ నుంచి;
ప్రశాంతంగా ప్రమోదంగా సాఫీగా సుభిక్షంగా సాగుతూంటే__ "నీ మొహం నీకేం తెలుసోయ్ శ్రీపతీ_అని అనుకుంటూ పత్రికాఫీసులోకి చొరబడ్డాడు శ్రీపతి.
