'హలో శ్రీపతీ.'
'హలో కులశేఖరా!'
_యీ శ్రీపతి మొహం యెప్పటిలాగానే వుంది. వుద్యోగాలు చేస్తున్నవాళ్ళ మొహాలు వుద్యోగపు మొహాలని చూడగానే తెలుస్తుంటయ్_ వీళ్ళ పత్రిక వాయించేసింది_యెవరు మాత్రం వాయించరు_
'హలో నీకోసమే యెదురుచూస్తున్నాం.'
ఖరీదైన హోటలు.
దయానందభారతి వేదపారాయణ నిరంజనరావు. మరికొందరు పది పన్నెండు మంది కూర్చుని వున్నారు.
రకరకాల స్వీట్లు, యితర తినుబండారాలు.
"మాతాజీ, మాతాజీనట!" అన్నాడు వేదపారాయణ.
"అప్పీలుకి వీలు కల్పించారుగా ఈపాటికే సుప్రీం కోర్టుకి వెళ్ళుంటుంది." అన్నాడు కులశేఖరరావు.
"అప్పీలుకి అవకాశం లేకుండా తీర్పు యివ్వాల్సింది." అన్నాడు గౌరీపతి శర్మ.
"హెబయస్ కార్బసో యేదోదారిన సుప్రీంకోర్టుకి పాక్కుపోయేది" అన్నాడు కులశేఖరరావు.
నవ్వులతో అరుపులతో కేకలతో కేరింతలతో అలిసిపోయి రకరకాల పదార్థాలతో బొర్రలు నిండీ__
రెండు గంటలసేపు గడిచింది.
బయటికొచ్చారు, కొందరటూ కొందరిటూ, వొకతను అటూ వొకతను యిటూ విడిపోయారు.
గౌరీపతిశర్మ స్కూటర్ స్టార్ట్ చేశాడు, వెనకసీటు మీద నిరంజనరావు కూర్చున్నాడు.
ముకరంజాహీ రోడ్ లో వెళుతున్నాడు. గాంధీభవన్ ముందు ఓ ఖద్దరు లాల్చి ముఖం ఆముదం తాగినట్లు, వారంరోజుల్నుంచి నీళ్ళ విరోచనాలవుతున్నట్లు ఓ లప్ప కట్నం రాబోతున్న కొడుకు అమాంతం చచ్చిపోయినట్లుగా_పీక్కుపోయి ఒడిలిపోయి కుంచించుకుపోయి_
గౌరీపతిశర్మ స్కూటర్ ఆపి, స్కూటర్ బ్యాగ్ లోంచి కెమెరాతీసి ఆ ముఖానికి గురిపెట్టి క్లిక్ మనిపించాడు. కెమెరా బ్యాగ్ లో భద్రపరిచాడు. స్కూటర్ స్టార్ట్ చేశాడు.
నిరంజనరావు దిగిపోయాడు_ పక్క సందులోంచి సుధాకర్ రావటం చూసి__
"హలో సుధాకర్."
"హలో నిరంజన్ యాడికెళ్ళి?" అని త్రీ ఫైవ్స్ సిగరెట్ పెట్టె తెరిచి అందించాడు ఓ సిగరెట్.
సంతోషపడిపోతూ సిగరెట్ అందుకుని జేబులోంచి అగ్గిపెట్టె తీసి_ ముందు సుధాకర్ సిగరెట్ ముట్టించి, తను సిగరెట్ వెలిగించుకుని ఓ దమ్ము బాగా లాగి తృప్తిగా వదిలాడు పొగ_నిరంజనరావు.
"దయానంద భారతి వాళ్ళూ పార్టీకి రమ్మని బలిమిచేస్తే వెళ్ళినా" అన్నాడు నిరంజనరావు.
'నిన్నెవ్వడు బలిమిజెయ్యక్కర్లె. వెంటబడి పోతవు నీవె.' అని మనసులో అనుకుంటూ, "ఏమిటి ముచ్చట్లు? మజా వుడాయిస్తున్నర్లే! ఒక్క దినంల ఐపోతే_ యే సాలోంకో నంబర్ పె లేగీ ఇందిరాజీ" అన్నాడు సుధాకర్.
"యిల్లు అలకగానే పండుగై తదా?" అన్నాడు నిరంజనరావు.
నడుస్తున్నారు. దారిలో మరొకతను కలిశాడు. కూడా నడుస్తున్నారు.
అంతలో ఓ బంగళాలోకి చొరబడ్డారు.
లోన గోవర్ధన్ రెడ్డి, గంగారాం తదితరులు వున్నారు. కాలేజీ ఎలక్షన్లలో, మొన్నటి తన తొలి ఓటమి తరవాత అంత వుత్సాహంగా వుండటం లేదు గోవర్ధన్ రెడ్డి. కానీ భవిష్యత్తు మీద పూర్తి నమ్మకంతో వున్నాడు. యిప్పుడిది యిలా జరగటం అతనిని నీళ్ళు కార్చినట్లుగా అయింది.
"క్యా దోస్తోం అట్లున్నరు? నథింగ్ విల్ హేపెన్. నేను ఇంతకుముందే పీ.వీ. సాబ్ తోటి మాట్లాడి వస్తున్న. ఇట్ ఈజ్ ఓన్లీ సమ్ డిస్టర్బన్స్. నథింగ్ టు వర్రీ అని ఎక్స్ ప్లేన్ చేసిండు." అన్నాడు సుధాకర్ వుత్సాహంగా.
"ఆ రాజ్ నారాయణ్ ఎలక్షన్లో మస్తు అక్రమాలు చేసి ఓడిపోయిండు. ఇందిరమ్మ వీన్ని మనిషిగా లెక్కపెట్టలేదెన్నడు. తల్చుకుంటే వీని ఈకలు పీకితే వీని ఎలక్షన్ వుల్టా అయ్యేది కోర్టులో. వాడు మంకీ ట్రిక్స్ ఫెలో." అన్నాడు ఒకతను.
గంగారాం చెక్కుచెదరకుండా వున్నాడు మునుపటిలాగానే గోవర్ధన్ రెడ్డి జేబులో డబ్బు వుంటుంది. అతని బులెట్ వెనక సీటుమీద తనకిచోటు వుంటుంది. మొన్నటి గోవర్ధన్ రెడ్డి ఎలక్షనప్పుడు అరిచీ అరిచీ గొంతు బాగా బొంగురు పోయింది_యెంత మంచి తిండి మొక్కుతున్నా. రెండు నెలలకి సరి ఐంది ఓ ఐదువేల రూపాయలు తీసుకున్నాడు.
ఆఫీసు బోయ్ మంచినీళ్ళ గ్లాసులు పెడుతున్నారు. సుధాకర్ టిఫిన్లకీ, టీకీ చెప్పాడు.
ఒక గంటసేపు.
అందరూ బయటికి వచ్చారు. గోవర్ధన్ రెడ్డి బులెట్ స్టార్ట్ చేశాడు. గంగారాం వెనక కూర్చున్నాడు. మిగతా వాళ్ళు సాగిపోయాడు యెవరిదారిన వాళ్ళు.
సుధాకర్ ఖాళీ ఆటో వస్తుంటే ఆపి కూర్చున్నాడు. ఆటో మోతగా వెళ్ళిపోయింది.
నిరంజనరావు నడుస్తున్నాడు. బసంత్ టాకీస్ దగ్గిర ఆగి సినిమా పోస్టర్లు చూస్తున్నాడు. అర్ధనగ్న నర్తకివైపు దీక్షగానూ, ఖరీదైన సూట్ లో వున్న వ్యక్తి వంక చికిలించీ.
సినిమాకి వెళ్ళాలనిపించింది. యింకా బుకింగ్ తెరవలేదు. జేబులో డబ్బులైతే వున్నాయిగానీ, సొంత డబ్బులతో సినిమా చూసే అలవాటు యింతవరకు అవలేదు.
బయటికొచ్చాడు. సుధీర్ అటుగా వెళుతూ కనిపించాడు. ఎగురుకుంటూ పోయి కలుసుకున్నాడు. 'హలో సుధీర్' అంటూ.
బర్కత్ పురా రోడ్డు. అతనికూడా నడుస్తున్నాడు నిరంజనరావు.
విరసం కార్యాలయం.
లోన విరసం సభ్యుల తదభిమానులు కూచుని వున్నారు.
అందరూ వుత్సాహంగా వున్నారుకానీ సంతోషంతో పొంగిపోవటం లేదు విజయ్ కుమార్.
"అది యెంతవరకు శుభవార్తో వెయిట్ చేసి చూస్తేగాని తెల్వదు." అన్నాడు వెంకటేష్.
వెంకటేష్ వంక గుర్రుగా చూశాడు విజయ్ కుమార్. తనెప్పుడు ఏది మాట్లాడబోయినా అడ్డుపడుతుంటాడీ వెధవ__అని అనుకుంటూ.
"సంతొషించ తగిన వార్తేగానీ దానివల్ల ఒరిగేదేఁవిఁటి!" అంది గాయత్రి.
"ఏమో చెప్పలేం. ఆ మధ్య విరసం రచయితలందర్నీ విడుదల చేశారా__బెయిల్ మీదే అనుకోండి_"
"యింకో ప్రక్కన నక్సలైట్ల మీద అన్యాయంగా కిరాతకంగా సాగిస్తున్న మారణహోమం" అంది గాయత్రి.
"ఏదేమైనా యీ రోజు మంచిరోజు. యీ సందర్భంలో నేను పర్సనల్ గా మనందరికీ అల్పాహార విందు చెయ్యదలిచాను. మీకు అభ్యంతరం లేకపోతే" అన్నాడు విజయ్ కుమార్.
"మోస్ట్ వెల్ కమ్. సంతోషం" అన్నాడు యాదగిరి.
"విత్ థాంక్స్" అంది వనజ.
గలగలా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
నిరంజనరావుని యెవరూ సరిగా పట్టించుకోలేదు. పంటి కిందకి కూడా సరిగా దక్కలేదు. నిరుత్సాహంగా బయటికొచ్చి బస్సెక్కబోతూండగా శ్రీపతి కనిపించాడు.
"హీఁహీఁ" అనుకుంటూ "యెట్లా వున్నది మీ పత్రిక వర్క్? యిప్పుడీ న్యూస్ తో సర్క్యులేషన్ బాగా వుండాలి." అన్నాడు నిరంజనరావు.
"ఆ విషయం వెళ్ళి పత్రిక బిజినెస్ మేనేజర్ తో ముచ్చటిస్తే సంతృప్తికరమైన భోగట్టా దొరుకుతుంది నిరంజనం. వూఁ, యెక్కడ? పొద్దుట జనసంఘ్ గుంపుతో పాటు హోటల్లోంచి బయటికి రావటం చూశాను. అప్పటి నుంచి ఎక్కడెక్కడ తిరుగుతున్నావ్?" అన్నాడు శ్రీపతి.
"హీఁహీఁ లేదు. మ్యాట్నీకి పోయిన."
"ఏం సినిమా?"
"సినిమా__ఇంగ్లీష్ సినిమా"
