Previous Page Next Page 
కొత్తనీరు పేజి 3


    మొత్తంమీద పెళ్ళికూతుర్ని. పెళ్ళి ఏర్పాటులని, మర్యాద లని, వారిచ్చిన కట్నం కానుకలని అన్నింటిని చూశాక అందరూ సంతృప్తిపడి మీనాక్షి అరవ అమ్మాయన్న సంగతి మరచిపోయారు ఏదో భాష విషయం వచ్చినపుడు తప్ప.
    మీనాక్షి తండ్రి మద్రాసులో పేరు మోసిన లాయరు. రెండు చేతులా ఆర్జించాడు. ఇద్దరు కొడుకులు. ఒక్కకూతురు. కొడుకు శ్రీనివాసన్ రామం క్లాసుమేటు! మీనాక్షి ఒక్కర్తే కూతురవడంచేత విచ్చలవిడిగా ఖర్చుపెట్టి కూతురి పెళ్ళి ఘనంగా చేశారు.
    మీనాక్షి క్వీన్ మేరీస్ లో బి.ఏ. ప్యాసయింది. సంగీతం నేర్చుకుంది.
    స్నేహితునికోసం వాళ్ళ యింటికి వెళ్ళే రామం దృష్టిని మీనాక్షి ఆకట్టుకుంది. ముఖపరిచయం అల్లా ఆరు నెలలకి ప్రణయంగా మారింది.
    నిజంగ మీనాక్షి పేరుకి తగ్గట్టు పెద్దపెద్ద కళ్ళతో. నల్లటి బారు జడతో చాలా అందంగానే కనిపించింది రామానికి. వాళ్ళ స్నేహాన్ని, వాళ్ళ ప్రణయాన్ని యింట్లో వాళ్ళు అడ్డుపెట్టలేదు. అసలు చెప్పాలంటే మీనాక్షి అన్న శ్రీనివాసన్ ప్రోత్సహించాడు కూడా!
    మీనాక్షి తల్లిదండ్రులు కూడా ముందర తెలుగు సంబంధం చేయడానికి యిష్టపడలేదు. చాలా సందేహించారు. కాని అన్న చెల్లెలి పట్టుదల మీద ఆఖరికి ఒప్పుకున్నారు. కుర్రవాడు బుద్దిమంతుడు. చదువుకున్నవాడు, స్థితిమంతుడు అని తెలిసి అట్టే అభ్యంతరం చూపలేదు వాళ్ళు.
    తక్కిన విషయాలు ఎలా వున్నా భాషవిషయంలో పార్వతమ్మకి కోడలుతో నెగ్గుకురావడం కాస్త కష్టంగానే వుండేది. మామ గారితో. ఆడపడుచులూ, మరదలతో ఇంగ్లీషులో మాట్లాడేది మీనాక్షి. రామానికి తమిళం బాగా రావడంవల్ల సమస్యే లేదు. ఎటొచ్చీ అత్తా కోడళ్ళు మాట్లాడుకోవాలంటే మధ్యవర్తీ. సంజ్ఞలు ఆధారం కావలసివచ్చేది యిద్దరికీ.
    పార్వతమ్మకి కొత్త కోడలితో ముచ్చట్లు ఆడాలని, ఏదో కబుర్లు చెప్పాలని వున్నా సాధ్యమయ్యేది కాదు. కోడలికి ఏదన్నా చెప్పాలన్నా, అడగాలన్నా, ఏమైనా పని చేయించాలన్నా సంజ్ఞలే గతి అయ్యేవి. ఆడపడుచుల దగ్గిర కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుని వచ్చీరాని తెలుగు మాటలు ఏసగా మాట్లాడే మీనాక్షిని చూసి అందరూ నవ్వేవారు. ఏదో వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళడం తప్ప అత్తవారింట్లో ఎక్కువ వుండవలసిన అవసరం లేకపోబట్టి మీనాక్షికి తెలుగు అంత త్వరగా పట్టుబడలేదు. కోడలున్న నాలుగురోజులయినా మాట్లాడడానికి లేకపోతూందని పార్వతమ్మకి దిగులుగా వుండేది.
    మొత్తం మీద మీనాక్షి అరవ అమ్మాయన్న మాట మరచి తమ కోడలన్న మాట ఒక్కటే గుర్తుంచుకోడానికి అట్టే రోజులు పట్టలేదు జగన్నాధంగారికి, పార్వతమ్మకి.
    కాని పిల్లలు పుట్టాక వాళ్ళూ తెలుగు మాట్లాడుకుండా అరవంమాట్లాడడం కొంచెం కష్టం అనిపించింది పార్వతమ్మకి, మద్రాసులో వుండడం, తల్లి తమిళం మాట్లాడడంవల్ల పిల్లలకి తెలుగు పట్టుబడలేదు. రామానికి కూడా చదువుకునే రోజులనుంచీ కూడా మద్రాసులో వుండిపోవడం, భార్య తమిళురాలు అవడంవల్ల ఇంట్లో తెలుగు మాట్లాడే అవకాశమే వుండేది కాదు.
    కొడుకు పిల్లలు యింటికి వచ్చినపుడు మనవలని ముద్దులాడాలన్నా, వాళ్ళని పలుకరించాలన్నా వీలవక పార్వతమ్మ మనసు చివుక్కు మనేది. జగన్నాధంగారికి కూడా వీడేమిటి బొత్తిగా తెలుగువాడినని కూడా మరిచిపోతున్నాడు అని కష్టం తోచేది. కూతుళ్ళ పిల్లలు ఆడుకుంటూంటే రామం పిల్ల లిద్దరూ అలా దూరంగా నిల్చుని బిడియంగా చూసేవారు భాషరాక. ఓరోజు వుండబట్టక పార్వతమ్మ అడిగేసింది.
    "అదేమిటిరా పిల్లలకి బొత్తిగా తెలుగు మాట్లాడడం రాదు. ఇంట్లో 'మన తెలుగు మాట్లాడవేమిటి వాళ్ళతో!" మన తెలుగు అన్నచోట కాస్త ఒత్తి పలికింది. రామం కాస్త తత్తరపడి భార్యవైపు చూశాడు.
    "ఏమిటోనమ్మా! అక్కడ పనివాళ్ళు. వాళ్ళ అమ్మ అందరూ అరవం మాట్లాడతారు కదా. అంచేత తెలుగు పట్టుబడలేదు వాళ్ళకి." అని గొణిగాడు రామం.
    "అదేమిటి. అన్నయ్యా! వదినకి రాకపోయినా నీకు రాదేమిటి తెలుగు? నువ్వెందుకు నేర్పలేదువాళ్ళకి?...... అసలు నీకు నేర్పాలని వుంటే వదినకి మాత్రం రాదేమిటి? యిన్నాళ్ళయింది పెళ్ళయి. ఎంతయినా మాతృభాష మరచిపోవడం ఏమిటి?" రెండో చెల్లెలు పూర్ణ అనేసింది కాస్త నిష్ఠూరంగా.
    "ఏమిటో నేనా విషయం అంత పట్టించుకోలేదు. చూద్దాంలే....నేర్పుతానులే...." అన్నాడు రామం.
    "జననీ, జన్మభూమీ' అన్నారు. కనిపెంచిన తల్లిని, పుట్టి పెరిగిన దేశాన్ని మరచిపోవడం క్షంతవ్యం కాదురా....మనం ఎన్ని చదువులు చదివినా, ఎన్ని చేసినా, ఎక్కడున్నా మాతృభూమిని. మాతృభాషని మరిచిపోతే ఎలా నాయనా? తెలుగు గడ్డమీద పుట్టి తెలుగు వాడినని మరచిపోతే ఎలాగోయ్?" ప్రక్కనే పడక కుర్చీలో పడుకుని అంతా వింటున్న జగన్నాథంగారు కాస్త ఎత్తిపొడుపుగా అన్నాడు.
    పెళ్ళి అయిన దగ్గిరనించి రామం పూర్తిగా మారిపోయి తెలుగువాడి నన్నమాట మరచినట్లు ప్రవర్తించడం ఆయన చాలసార్లు గమనించారు. అంతవరకు సెలవలకి యింటికి వచ్చినప్పుడల్లా హాస్టలు భోజనంతో నోరు చచ్చిపోయింది. ఆ సాంబారు, కొబ్బరి కూరలు తిని తిని మన భోజనం కోసం మొహం వాచినట్టుంది అని ఆ వున్నన్నాళ్ళు కాస్త కరం అది దిట్టంగా వేయించుకుని తినేవాడు రామం. అలాంటిది పెళ్ళయ్యాక యింటికి వచ్చినప్పుడల్లా తల్లి మీద క్రోధం మొదలుపెట్టాడు.
    "ఏమిటమ్మా యీ గొడ్డుకారాలు! అబ్బబ్బ! ఎలా తినడం? మనవాళ్ళ కారాలు నలుగురోజులు తింటే, నలభైరోజులు బాధ పడాలి." అంటూ భోజనం చేస్తున్నంతసేపూ సాధిస్తూనే ఉండేవాడు.   


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS